close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రతి పనికీ ఓ రోబో..!

మనిషి తనకు సాయంగా యంత్రాలనే కాదు అచ్చం తనలాగే ఉండే యంత్రుడినీ తయారుచేసుకున్నాడు. రోబోలు ఇప్పుడు ఇళ్లలో వండి పెడుతున్నాయి. హోటల్‌కి వెళ్తే వడ్డిస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నాయి. అవి లేని రంగం లేదు, అయినా మనిషి ఆశ తీరలేదు. ఇంకా తాను చేయలేని పనులెన్నింటినో రోబో చేత చేయించాలనుకుంటున్నాడు. అందుకని, వాటికి కృత్రిమ మేధను జోడించాడు. పక్షులూ జంతువుల కదలికలు నేర్పాడు. ఎక్కడికక్కడ అవసరానికి తగిన ఆకారాన్నిచ్చాడు. ఇప్పుడిక ఈ రోబోలు తుది దశ ప్రయోగాలనీ విజయవంతంగా పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో సేవలందించడానికి ముస్తాబై మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి.

గ్రామాలకు రోబో డాక్టర్‌! 

డాక్టరొక చోట.పేషెంట్‌ మరో చోట... అయితేనేం? ఆపరేషన్‌ అయిపోయింది. పేషెంట్‌ కోలుకుని ఇంటికి వెళ్లిపోయింది. అదెలా సాధ్యం? ఏ ఫోనులోనో, వీడియో కాల్‌లోనో రోగి లక్షణాలను చూసి ఫలానా మందులు వేసుకోమని చెప్పొచ్చు కానీ దూరంగా ఉండి ఆపరేషన్‌ ఎలా చేస్తారూ అంటే- రోబో సాయంతో చేసి చూపించారు గుజరాత్‌లోని గాంధీనగర్‌కి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్‌ తేజస్‌ పటేల్‌. గతేడాది డిసెంబరులో జరిగిన ఈ శస్త్రచికిత్స ప్రపంచంలోనే ఈ విధానంలో జరిగిన తొలి శస్త్రచికిత్స. ఒక మహిళకి గుండె ధమని 90 శాతం పూడుకుపోయింది. దాంతో వెంటనే ఆపరేషన్‌కి ఏర్పాటుచేశారు. ఎపెక్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఆపరేషన్‌ థియేటర్‌లో ఏర్పాటుచేసిన రోబోటిక్‌ వ్యవస్థని హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సాయంతో పనిచేయిస్తూ అదే హాస్పిటల్‌కి చెందిన డాక్టర్‌ తేజస్‌ పటేల్‌ ఆస్పత్రికి 30కి.మీ. దూరంలో ఉండి శస్త్రచికిత్సను పూర్తిచేశారు. రోబో చేస్తున్న శస్త్రచికిత్సను పర్యవేక్షించడానికీ, ఒకవేళ అవసరమైతే పరిస్థితిని తమ అదుపులోకి తీసుకోవడానికీ ఆపరేషన్‌ థియేటర్‌లో డాక్టర్‌ సంజయ్‌ షా, మరో టెక్నీషియన్‌ సిద్ధంగా ఉన్నారు కానీ వారి అవసరం రాలేదు. అమెరికాకి చెందిన కొరిండస్‌ వాస్క్యులర్‌ రోబోటిక్స్‌ కంపెనీ రూపొందించిన కోర్‌పాత్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ప్లాట్‌ఫామ్‌ని ప్రయోగాత్మకంగా ఉపయోగించి పెర్‌క్యుటేనియస్‌ కరొనరీ ఇంటర్‌వెన్షన్‌ (ఆంజియోప్లాస్టీ విత్‌ స్టెంట్‌) అనే ఈ శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. 10నిమిషాల్లోనే పూడుకుపోయిన రక్తనాళాన్ని శుభ్రం చేసి స్టెంట్‌ వేశారు. గుండెజబ్బులకూ రక్తనాళాల్లో పూడికల్లాంటి సమస్యలకీ స్పెషలిస్టు వైద్యం పెద్ద నగరాలకే తప్ప మారుమూల పల్లెలకు అందుబాటులో లేదు. ఇలాంటి రోబో వ్యవస్థ వల్ల ఆ ప్రాంతాలకు కూడా నిపుణులైన వైద్యుల సేవల్ని విస్తరించవచ్చంటారు డాక్టర్‌ తేజస్‌ పటేల్‌.

ఈ నర్స్‌ ఉంటే పిల్లలు ఖుష్‌!

దొక పిల్లల ఆస్పత్రి. డ్యూటీలో ఉన్న నర్సులతో కలిసి చకచకా తిరుగుతూ పేషెంట్లకు మందులూ ఇతర వస్తువులూ సరఫరా చేస్తోంది మోక్సి. ఉదయం రాగానే మోక్సి చెయ్యాల్సిన పనులన్నీ ఫీడ్‌ చేయడం ఒక నర్సు బాధ్యత. మోక్సి ఒక రోబో మరి. అది వచ్చాక తమ పని సులువయిందంటారు నర్సులు. ఇక పేషెంట్ల సంగతి చెప్పనక్కర లేదు. అది పిల్లల ఆస్పత్రి కావటంతో ఇంజెక్షన్‌ చేయించుకోవాలన్నా టాబ్లెట్లు మింగాలన్నా పిల్లలు చేసే గొడవ ఇంతా అంతా కాదు. వారిని మరిపించి, ఏడుపు మాన్పించి, మందులు మింగించడానికి తల్లిదండ్రులతో పాటు నర్సులూ చాలా కష్టపడాల్సి వచ్చేది. మోక్సి వచ్చాక వారికా బాధ తప్పింది. తమ దగ్గరకు నడిచి వస్తున్న మోక్సిని ఆశ్చర్యంగా చూస్తూ అది ఇచ్చిన మందును మారాం చేయకుండా వేసుకుంటున్నారట పిల్లలు. ఎప్పుడెప్పుడు అది తమ గదికి వస్తుందా అని ఎదురుచూస్తూ అమ్మానాన్నా చెప్పినట్లు వింటున్నారట. మోక్సి రేకెత్తిస్తున్న కుతూహలం వారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తోంది. కొద్ది వారాల్లోనే మోక్సి వల్ల ఆస్పత్రిలో వచ్చిన మార్పులు చూసిన ఆ ఆస్పత్రి అధినేత క్రిస్టోఫర్‌ బార్న్‌ ప్రతి అంతస్తులోనూ ఒక మోక్సిని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. ఇంతకీ ఎవరీ మోక్సి అంటే... అమెరికాలోని ఆస్టిన్‌ నగరంలో ఉన్న డిలిజెంట్‌ రోబోటిక్స్‌ అనే సంస్థ రూపొందించిన రోబో. దానిని ప్రయోగాత్మకంగా పరీక్షించమని డెల్‌ పిల్లల ఆస్పత్రికి ఇచ్చింది. ఆస్పత్రుల్లో వివిధ పనులకు రోబోలను వాడుతున్నారు కానీ ఇలా నర్సులకు సహాయంగా వారి ఆధ్వర్యంలో అవసరమైన పనులు చేసేలా వాడడం ఇదే మొదటిసారి. దీని వల్ల నర్సులకు పనిభారం తగ్గుతుందనీ, రోగికి అందించే సేవల్లో మానవీయ స్పర్శ అవసరమైన చోట వారు మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టొచ్చనీ భావిస్తున్న తయారీదారులు ఈ ఏడాది చివరికల్లా మోక్సి రోబోలను మార్కెట్లో  విక్రయించే ఆలోచనలో ఉన్నారు.

పక్షిలా ఎగిరిపోతుంది!

గిరే పక్షుల స్ఫూర్తితో డ్రోన్లను తయారుచేసి పలురకాలుగా ఉపయోగించడం మనకు తెలుసు. అయితే వాటి సైజూ శబ్దమూ పలుచోట్ల అవరోధంగా మారుతున్నాయి. దాంతో పాటు మరికొన్ని లోపాలను అధిగమిస్తూ ఓ రోబోను తయారుచేశారు. హమ్మింగ్‌ బర్డ్‌ అనే చిన్న పక్షిలా ఉండే ఈ రోబో అచ్చం ఆ పక్షిలాగే చాలా వేగంగా 180 డిగ్రీల్లో రెక్కల్ని తిప్పగలదు. వేగంగా ఎగరగలగడమూ, కీటకంలాగా ఒకేచోట గాలిలో ఆగి చాలాసేపు ఉండడమూ దీని ప్రత్యేకతలు. చాలా తక్కువ బరువుంటుంది. చిన్నగా ఉంటుంది కాబట్టి ఇరుకుగా ఉండే చోట్లలోకీ చీకట్లోకీ చొచ్చుకుపోతుంది. కూలిపోయిన భవనం శిథిలాలకిందికీ, గనుల్లోకీ దీనిని పంపడం సులువు. దీనికున్న కృత్రిమ మేధ సాయంతో అక్కడ ఇరుక్కుని ఉన్నవారిని గుర్తిస్తుంది. జరిగిన నష్టాన్ని అంచనావేస్తుంది. అక్కడి సమాచారాన్ని ఉన్నదున్నట్లుగా చేరవేస్తుంది. దాంతో సహాయచర్యలు చేపట్టడం తేలికవుతుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఈ రోబో తట్టుకుంటుంది. ఇటీవల కెనడాలో జరిగిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ రోబోటిక్‌్్స అండ్‌ ఆటోమేషన్‌లో పర్‌ద్యూ యూనివర్శిటీ పరిశోధకులు ఈ హమ్మింగ్‌బర్డ్‌ రోబోని ప్రదర్శించారు. అచ్చం ఇలాంటివే కేవలం ఒకే ఒక్క గ్రాము బరువున్న బుల్లి రోబోనీ, 12గ్రాముల బరువున్న మరో రోబోనీ కూడా ఈ పరిశోధకులు తయారుచేశారు. ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ నాణ్యమైన సేవలు అందించేలా వీటిని రూపొందించడం విశేషం.

ప్రవచనాలు చెప్పే రోబో!

ప్రవచనాలు వినడం మనకే కాదు, జపాను వాళ్లకీ ఇష్టమే. కాకపోతే వాళ్లు రోబో చేత ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు. బక్కపలచని మనిషిలా ఆరడుగుల పైన ఎత్తుండి చేతులు రెండూ జోడించి ఆ రోబో ప్రవచనాలు చెబుతోంటే క్యోటోలోని కొడైజీ గుడి ఆవరణలో భక్తులు మైమరిచి వింటుంటారు. కనురెప్పలు ఆర్పుతూ, మాట్లాడేటప్పుడు సాధారణంగా మనిషి శరీరం కదిలినట్లే కదిలేలా బౌద్ధుల కరుణ దేవత ‘కానన్‌ బోధిసత్వ’ రూపంలో తయారుచేసిన ఈ రోబో దాదాపు అరగంట సేపు స్థానిక భాషలో ధర్మాన్ని వివరించి చెబుతుంది. బౌద్ధం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసమూ, సంప్రదాయాన్ని మర్చిపోతున్న యువతరాన్ని ఆకట్టుకోవడం కోసమూ...  కొడైజీ దేవాలయ పెద్దలు ఓ రోబోటిక్‌ సంస్థతో దీన్ని తయారుచేయించారు. వారు ఊహించినట్లే ఈ రోబో భక్తులను ఆకర్షిస్తోంది. దాని కళ్లలో ఏర్పాటుచేసిన కెమెరాల వల్ల ఎదురుగా ఉన్నవారు రోబో తన వంకే చూసి మాట్లాడుతోందన్న అనుభూతికి లోనవుతారు. ‘మిండార్‌’ అనే ఈ రోబోని టోక్యోకి చెందిన ‘ఏ ల్యాబ్స్‌’   తయారుచేసింది. శరీరాన్ని అల్యూమినియంతో రూపొందించి, ముఖమూ చేతులూ మనిషిలా కన్పించేలా సిలికాన్‌ వాడడంతో చూడడానికి కూడా ఈ రోబో కొంత మనిషిలా, కొంత మనిషిని మించిన శక్తి మరేదో ఉన్నదన్నట్లుగా కన్పిస్తోంది.

పెద్దలకే ‘పెద్ద’ దిక్కు! 

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంట్లో పెద్ద వాళ్లుంటే వాళ్లని ఎవరు చూసుకుంటారు? వారు ఆరోగ్యంగా ఉండి తమ పనులు తాము చేసుకుంటే సమస్యే లేదు. కానీ ఒంటరితనంతోనూ మతిమరుపు లాంటి సమస్యలతోనూ బాధపడుతున్నప్పుడు కుటుంబసభ్యులకు వారిని కంటికి రెప్పలా కాచుకుని ఉండక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో వృద్ధుల సేవకు రోబోలను వినియోగించే ప్రయత్నం చాలాకాలంగా జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ ఆస్పత్రిలో ఉన్నవారికి కాలక్షేపానికి కథలు చదివి విన్పించడం, బంధువులకు ఫోన్‌ కలిపి మాట్లాడించడం... లాంటి చిన్న చిన్న పనుల్ని వేర్వేరు రోబోలు చేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు ‘రోబో యాక్టివిటీ సపోర్ట్‌ సిస్టమ్‌-రాస్‌’ని అభివృద్ధిపరిచారు. ‘మొబైల్‌ రోబోటిక్‌ టెలిప్రెజెన్స్‌’ విధానంలో పనిచేసే ఈ రోబో చక్రాల మీద తిరిగే వీడియో తెరలాగా ఉంటుంది. పెద్దవాళ్లు దీనితో ఏ పనైనా చెప్పి చేయించుకోవచ్చు. ఒకవేళ వాళ్లు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే స్మార్ట్‌ ఫోన్‌ ఆప్‌తో ఎవరైనా దీన్ని ఎక్కడినుంచైనా ఆపరేట్‌ చేయొచ్చు. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల అవసరాలను అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తుంది. వారితో మాట్లాడుతుంది. వాళ్లు నడిచే దారిలో ఏవీ అడ్డు రాకుండాచూడడం, కావలసినవి అందించడం, సమయానికి మందులు ఇవ్వడం, మతిమరుపు రాకుండా తరచూ వారిచేత పజిల్స్‌ చేయించడం వంటి ఎన్నో పనులు ఒక్క రోబోనే చేస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితిలో ఏదన్నా తేడా కనిపెడితే స్వయంగా ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేస్తుంది. ఈ రోబో సహాయంతో ఒంటరిగా ఉండే వృద్ధులూ, చక్రాలకుర్చీకి పరిమితమైన దివ్యాంగులూ ఇంకెవరి మీదా ఆధారపడకుండా స్వతంత్ర జీవనం గడపొచ్చు. జపాన్‌, చైనా లాంటి దేశాలు 2020కల్లా వృద్ధుల సంరక్షణకు చాలావరకూ రోబోలనే వినియోగించాలనే లక్ష్యంతో ఉన్నాయి.

రైతు‘మిత్ర’ రోబోలు!

యనో మోతుబరి రైతు. పొలంలో కొత్తగా చేరిన కూలీ పనిని చూస్తూ ఈ కొత్త కూలీ వల్లనైనా దిగుబడి రెండింతలవుతుందేమోనని ఆశపడుతున్నాడు. కూలీ మాత్రం మాటామంతీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు... కాదు, చేసుకుపోతోంది. ఆ కూలీ మనిషి కాదు ఒక రోబో మరి. జేమీ బట్లర్‌కి 150 ఎకరాల పొలం ఉంది. ఈతరం రైతుల్లాగే అతడూ పలు ఒత్తిళ్లకు గురవుతున్నాడు. వాతావరణానికి హాని జరగకుండా సాగుచేయాలి. తక్కువ ధరకి అమ్మినా గిట్టుబాటు కావాలి. అందుకే అతడు ‘టామ్‌’ని తెచ్చుకున్నాడు. నాలుగు చక్రాలమీద పొలంలో తిరుగుతూ పనిచేసే ఈ రోబో పంటలోని ఒక్కో మొక్కనీ పరిశీలించి చీడపీడల ప్రభావాన్ని అంచనా వేస్తుంది. ఫొటోలు తీస్తుంది. దానిలోని మరో విభాగం వాటిని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల్ని తక్షణమే తీసుకుంటుంది. అంత పనిని పనివాళ్లతో చేయిస్తే ఖర్చూ సమయమూ కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. ఇంగ్లాండ్‌లోని స్మాల్‌ రోబో కంపెనీ ఆఫ్‌ పోర్ట్స్‌మౌత్‌ దీన్ని తయారుచేసింది. ప్రస్తుతం పొలాల్లో వాడి చూడడం ద్వారా చివరి దశ పరీక్షలు నిర్వహిస్తున్న కంపెనీ టామ్‌తో కలిసి పనిచేయడానికి మరో రెండు రోబోలనూ తయారుచేస్తోంది. అవి విత్తనాలు నాటడం దగ్గర్నుంచీ నీళ్లు పెట్టడం, కలుపు తీయడం వరకూ అన్ని పనుల్నీ ఎప్పుడేం చేయాలో నిర్ణయించుకుని చేసేస్తాయి. పరీక్ష దశలన్నీ విజయవంతంగా దాటితే 2021 కల్లా వీటిని మార్కెట్లోకి తేవాలని ప్రయత్నిస్తోంది కంపెనీ. కాలిఫోర్నియాలోని ఐరన్‌ ఆక్స్‌ అనే సంస్థ హైడ్రోపోనిక్‌ విధానంలో అచ్చంగా రోబోలతో పండించిన కూరగాయల్ని ఇటీవలే అమ్మడం ప్రారంభించింది. పంట నాటేటప్పుడు మాత్రమే మనుషుల సాయం తీసుకున్నామనీ ఆ తర్వాత పంట కోసి ప్యాకింగ్‌ చేయడం వరకూ అన్ని పనులూ రోబోలే చేశాయనీ ఆ సంస్థ ప్రకటించింది. కెనడాలో రైతులు మరొకడుగు ముందుకేశారు. తండ్రి చనిపోవటంతో ఉద్యోగం మానేసి పొలం బాధ్యత తీసుకున్న కైలర్‌ లెయిర్డ్‌కి గంటల తరబడి ట్రాక్టర్‌ నడపడం విసుగొచ్చేది. తనకు తెలిసిన కోడింగ్‌ నైపుణ్యాలతో మెల్లగా ఆటోమేషన్‌ మొదలెట్టాడు. తొలి ప్రయత్నంలోనే అతడి ట్రాక్టోబోట్‌ ఇంటి నుంచి వెళ్లి 50 ఎకరాల్లో మొక్కజొన్న నాటేసి విజయవంతంగా తిరిగొచ్చింది. కైలర్‌ని చూసి సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానమూ ఆసక్తీ ఉన్న పలువురు రైతులు ఓపెన్‌ సోర్స్‌ సాంకేతికతతో ఎవరి అవసరాలకు తగినట్లు వారు సొంతంగా తాము వాడే పనిముట్లను రోబోలుగా మార్చుకుంటున్నారు.

కదలిక... వీటి బలం!

వును, ఏ ప్రాణి అయినా సరే ఇప్పుడు రోబోకి ఆదర్శమే. వాటి స్ఫూర్తితో తయారైన రోబోలూ త్వరలోనే మనముందుకు రానున్నాయి. మనం ఉండే అపార్ట్‌మెంట్‌ అయితే నాలుగైదంతస్తులే ఉంటాయి కాబట్టి ఒక వాచ్‌మన్‌ని పెడితే భవన నిర్వహణ పనులన్నీ చేస్తాడు. కానీ పెద్ద పెద్ద నగరాల్లో భవనాలన్నీ పది, పాతిక, యాభై, వంద....ఇలా బహుళ అంతస్తులవే అయివుంటాయి. వాటి నిర్వహణ మామూలు విషయం కాదు. అంత ఎత్తైన భవనాలకు మధ్యలో ఎక్కడో ఏదో తేడా వస్తే కనిపెట్టడం ఎలా? సరిచేయడం ఎలా? భవనం కట్టగా లేనిది మరమ్మతులు చేయలేరా అనుకోవచ్చు. చేయొచ్చు కానీ సమస్య ఎక్కడా అన్నది కనిపెట్టి సరంజామా అంతా సిద్ధం చేసుకుని పరిష్కరించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని ప్రమాదకరమైన సందర్భాల్లో అంత సమయం మనకుండదు. అటువంటప్పుడు ఆదుకునే ఒక రోబోను తయారుచేశారు జపాన్‌, ఇంగ్లాండ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు. అచ్చం జలగలాగా పాకే ఈ రోబో నున్నగా ఉండే గోడమీద ఎటు పక్కకంటే అటు పక్కకి తేలిగ్గా పాకగలదు. ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగున సాగగలదు. ఈ లక్షణాల వలన భవన నిర్మాణ, నిర్వహణలకు సంబంధించిన పనులెన్నో చేయగలదు. ప్రమాదాలు సంభవించినప్పుడు మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు దీన్ని పంపి పలు రకాలుగా ఉపయోగించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఏ ఆధారమూ అక్కర్లేకుండా తేలికగా కదులుతూ ఎటు కావాలంటే అటు వంగుతూ చకచకా సాగిపోయే ఇలాంటి రోబోను తయారుచేయడం ఇదే ప్రథమం. మరో పక్క ఎంఐటీ పరిశోధకులు తయారుచేసిన ‘చీతా రోబో’ అచ్చం పులిలా లంఘిస్తుంది. భవన నిర్మాణాల్లోనూ సైన్యానికీ ఈ రోబోలు ఉపయోగపడతాయట. ఏ ఆనవాళ్లూ ఉండని ఎడారుల్లో చీమలు కేవలం కాంతి సహాయంతో తమ దారిని తెలుసుకుంటాయి. వాటి ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు తయారుచేసిందే ‘యాంట్‌బోట్‌’ అనే రోబో. జీపీఎస్‌ అవసరం లేకుండా తాను వెళ్లాల్సిన మార్గం తెలుసుకునే ఈ రోబో డ్రైవరు లేని వాహనాల తయారీలో కీలక పాత్ర పోషించబోతోంది.

‘ఇనుములో హృదయం మొలిచెనే...’ అంటూ సాగుతుంది రోబో సినిమాలో ఓ పాట. ఈ రోబోలకు అలాంటి హృదయం ఒక్కటే లేదు కానీ, అవసరానికి తగినట్లు స్పందించే మేధస్సు ఉంది. మనిషి అదుపులోనే ఉంటూ అతడు చేయలేని పనులెన్నో సునాయాసంగా చేయగల శక్తి ఉంది. అందుకే... మరో బ్రహ్మై మనిషి సృష్టించిన ఈ యంత్రుడే ఎన్నో రంగాల్లో ఇప్పుడు మనిషికి అండా దండా..!

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.