close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అభి వెడ్స్‌

- శశిధర్‌ పింగళి

‘‘అభీ పెళ్ళి నిశ్చయమైందిరా ఆనంద్‌- నువ్వూ మరదలూ వెంటనే రావాలి. అన్నట్టు... వాట్సాప్‌లో రెండు కార్డ్స్‌ పంపాను. ఏ మోడల్‌ బాగుందో కాస్త చూసి చెప్పు’’ అంటూ ఆనందమూ హడావుడీ హైరానా కలగలసిన గొంతుతో చెప్పింది అక్కయ్య ఫోనులో.
ఫోను పెట్టేసి వాట్సాప్‌లో వచ్చిన శుభలేఖ ఓపెన్‌ చేశాను. ‘అభి వెడ్స్‌ స్నిగ్ధ’ ముచ్చటైన అక్షరాలు మెరుస్తూ కనిపించాయి.
‘‘అమ్మాయిది మన ప్రాంతం కానట్టుందే’’ కాఫీ చేతికిస్తూ నవ్వుతూ అడిగింది పూర్ణ.
అప్పుడు దృష్టి పెట్టి చూశాను...
‘చెన్నై వాస్తవ్యులు శ్రీమతి సుమతి,  శ్రీనివాసన్‌ గార్ల ఏకైక పుత్రిక’ అని ఉంది. ‘‘ఏమోలే, మా అక్కయ్యతో వియ్యమందాలంటే పెట్టి పుట్టాలి, అదృష్టవంతులు’’ అంటూ ఆలోచనల్లో పడిపోయాను.
అక్కయ్యంటే పెదతాతగారి మనుమరాలు. నాకంటే అయిదేళ్ళు పెద్దది. ఇద్దరివీ పక్కపక్క ఇళ్ళే కావటంతో ఒకే కుటుంబంలా ఉండేవాళ్ళం. పెదనాన్నకి మగ సంతానం లేదు. నాన్నకి ఆడ సంతానం లేదు. అంచేత ఒక తల్లిబిడ్డల్లాగే ఉండేవాళ్ళం. ఏ పండగ వచ్చినా పండగంతా మాదే అన్నట్లుండేది. అక్కయ్యకి బంధుప్రీతి ఎక్కువ. ఒట్టి బోళామనిషి. ప్రేమానురాగాలు గుమ్మరించి పోస్తుంది. నేనంటే వల్లమాలిన అభిమానం. పూర్ణతో నా పెళ్ళి విషయంలో అన్నీ తానే అయి చేసింది. పూర్ణకి అన్ని విషయాలూ చెప్పి నేర్పించింది. కన్నకూతురికంటే ఎక్కువగా చూసుకునేది. పూర్ణకీ అక్కయ్యంటే అంతే ప్రేమా, గౌరవం.
‘ఒరే ఆనంద్‌, నువ్వు ఆడపిల్లని కంటే అభిగాడికి చేసుకుని నీతో వియ్యమందుతాన్రా’ అనేది. మొదటి కాన్పులో అబ్బాయి పుడితే ‘నీకు మాత్రం వంశం
పెరగొద్దా ఏమిటీ, ఇంకో కాన్పులో చూద్దాంలే’ అంది. రెండోసారీ అబ్బాయే పుట్టేసరికి కొంచెం బాధపడ్డా నీతో నేను వియ్యమందటం దేవుడికి ఇష్టంలేదో ఏమో’ అని సర్ది చెప్పుకుంది.
‘నేను కడగవలసిన కాళ్ళు ఎవరో కడుగుతున్నారు, అదృష్టవంతులు’ అనుకున్నాను.
అభి పెళ్ళి విషయంలో అక్కయ్యపడ్డ దిగులూ భయమూ ఇంతా అంతా కాదు. ‘ఆడపిల్ల పెళ్ళి చేయడమే తేలికరా’ అంటూ ఉండేది.
ఇప్పటి ఆడపిల్లలకు చదువులూ ఉద్యోగాలతోపాటు తల్లిదండ్రుల నిర్లిప్తత కూడా తోడై వాళ్ళ విచక్షణకి పరీక్షగా మారుతోంది. సంప్రదాయబద్ధమైన పెళ్ళిచూపులకు ఇష్టపడటం లేదు. ఏ పార్కుల్లోనో కాఫీ క్లబ్బుల్లోనో ఒంటరిగా కలుసుకుంటున్నారు.
‘పెళ్ళయ్యాక కూడా పేరెంట్స్‌తోనే ఉంటావా’ అని మొహంమీదే అడిగేస్తున్నారు. ఇలాంటి కొన్ని అనుభవాలు చవిచూశాక అభి పెళ్ళి విషయంలో అక్కయ్య బాగా కంగారుపడింది. ఇన్నాళ్ళకి మంచి సంబంధం
దొరికినట్లుంది, అందుకే గొంతులో ఆ ఆనందం, హడావుడీనూ.
ప్రయాణం చేసి వాకిట్లోకి రాగానే చాటంత మొహంతో పరిగెత్తుకొచ్చింది ఆప్యాయంగా పలకరిస్తూ. క్షణకాలం అలాగే చూసుకుంటూ ఉండిపోయామిద్దరం. అక్కయ్య ముఖం మీద నవ్వూ కళ్ళల్లో ప్రేమా ఏమాత్రం
వన్నె తగ్గలేదు.
అందుకే ఇంత చలాకీగా కనపడుతుంది అనుకున్నాను.
‘‘ఏళ్ళు పైబడుతుంటే వయసు తగ్గుతోంది మా అక్కయ్యకు’’ అన్నాను నవ్వుతూ.
‘‘వదినగారికి అత్తగారవుతున్న ఆనందం ఓ పక్కా కోడలు వస్తున్న సంతోషం మరోపక్కా రెక్కలు మొలిపిస్తున్నాయండీ’’ అంటూ పూర్ణ కూడా గొంతు కలిపింది.
‘‘చాల్లేరా మీ కబుర్లు...

మీరొచ్చారుగా, మీరే నా చెరో రెక్కా. ఇప్పటిదాకా పనులు ఎట్లా అవుతాయా- అని ఒక్కదాన్నే కుదేలయిపోతున్నా’’ అంటూ పూర్ణని పొదువుకుని లోపలికి దారితీసింది.
‘‘బావగారూ...’’ అంటూ చుట్టూ చూస్తుంటే-‘‘మీ బావగారి సంగతి తెలిసిందేగా, చిద్విలాసులూ స్థితప్రజ్ఞులూ’’ అంది నవ్వుతూ. భోజనాలయ్యాక పిలువవలసిన అతిథుల జాబితా పూర్ణ సరిచూస్తుంటే, చేయవలసిన పనుల జాబితా నేనూ అక్కయ్యా చూస్తున్నాం.
‘‘ఏమిటి, పెళ్ళివారి విశేషాలు...
ఎవరూ ఎలా వచ్చిందీ సంబంధమూ’’ అంటూ అడిగాను.
చెప్పటం మొదలుపెట్టింది...
ఆమధ్య అభి ఆఫీసువాళ్ళు ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌ ఏర్పాటుచేస్తే వెళ్ళాం. ‘అమ్మా, తన పేరు స్నిగ్ధ, నాతోపాటే పనిచేస్తోంది’ అంటూ ఓ అమ్మాయిని పరిచయం చేశాడు. చక్కటి ముఖం, అందమైన నవ్వు, చూసినకొద్దీ చూడాలనిపించే రూపం. ‘నమస్తే ఆంటీ’ అంటూ నమస్కరించింది. చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాను. కాసేపు మాట్లాడుకున్నాం అంతే. కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు అభి వచ్చి ‘స్నిగ్ధకు వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మాట్లాడమని’ అడిగాడు. ఎందుకో మొదటిచూపులోనే నాకూ నచ్చింది ఆ అమ్మాయి. వాళ్ళమ్మగారితో ఫోన్‌లో మాట్లాడి పెళ్ళిచూపులకు చెన్నై వెళ్ళాం అందరం. తీరా ఆవిడను చూశాక గుండె గతుక్కుమంది, భయం కూడా వేసింది.
నా భయాలు నాకుంటాయిగా మరి. కానీ, ఆవిడ నాతో విడిగా మాట్లాడి నా సంశయాలన్నీ పోగొట్టింది. నాకూ దేవుడి మీద నమ్మకమొచ్చింది’’ అంటూ ముగించింది.
ఆ వారంరోజులూ నేనూ పూర్ణా పనులన్నీ పూర్తిచేసేశాం. ముహూర్తానికి ముందురోజు సాయంత్రం రైలెక్కి చెన్నైకి ప్రయాణమయ్యాం. సామానంతా సర్దేసి కిటికీ పక్క కూర్చున్నాను. అక్కయ్య వచ్చి దగ్గర కూర్చుంది చిన్ననాటి కబుర్లు చెప్తూ.
‘‘వసుమతి గుర్తుందిరా?’’ అడిగింది మధ్యలో. కనుబొమలు ముడివేసి చూశాను. నా చేతిని తన చేతిలోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ అవునన్నట్లు తలూపింది.
కళ్ళల్లో సుడులు తిరిగిన నీళ్ళతోపాటు గతం కూడా గిర్రున తిరిగింది- పాతికేళ్ళ వెనక్కి.

* * * * *

నాన్నకి తెలిసినవారెవరో సంబంధం ఉందని చెబితే వసుమతిని చూడటానికి వెళ్ళాం. చక్కని ముఖమూ అందమైన నవ్వూ చూసినకొద్దీ చూడాలనిపించే రూపమూ... అందరికీ నచ్చింది. మూడు నెలల్లో ముహూర్తం పెట్టుకున్నాం. ఆ మూడు నెలలు వసుమతితో నా జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో కలలు కన్నాను. ఎన్నెన్నో ఆశల సౌధాలు కట్టుకున్నాను. పెళ్ళయింది. మూడు రాత్రులూ మురిపెంగా జరిగిపోయాయి అక్కయ్య సాక్షిగా.
అమ్మాయిని పంపే విషయంలో ఎందుకోగానీ తాత్సారం జరుగుతోంది. నేనే ఒకటి రెండుసార్లు వెళ్ళివస్తుండేవాణ్ణి. వసుమతిలో కూడా ఉత్సాహం తగ్గటం అప్పుడే గమనించాను. వసుమతి వాళ్ళమ్మ అక్కయ్యతో చెప్పిందట- ఉమ్మడి కాపురంలోకి అమ్మాయిని పంపమనీ వేరే ఇల్లు తీసుకుని ఉంటే పంపుతామనీ. పెద్దవాళ్ళు ఎంత నచ్చచెప్పబోయినా వినలేదు.
వసుమతితో మాట్లాడదామని వెళ్ళాను.
కలవనివ్వలేదు. అవమానంగా మాట్లాడి పంపేశారు. నా కలల సౌధాలన్నీ కూలిపోయాయి. కొన్నాళ్ళకు విడాకుల కోసం లాయరు నోటీసు వచ్చింది. సంధి ప్రయత్నాలు ఫలించలేదు.
విడాకులు వచ్చాయి. దిగులుతో నాన్న వెళ్ళిపోయారు. నేను డిప్రెషన్‌లో పడిపోయా. అక్కయ్యే తన మాటలతో నన్ను మామూలువాణ్ణి చేసింది. మూడేళ్ళ తర్వాత తనకి బాగా తెలిసిన పూర్ణకి అన్నీ చెప్పి పెళ్ళి చేసింది. పూర్ణ సాహచర్యంతో మళ్ళీ మనిషినవ్వగలిగాను, నవ్వగలిగాను.
అక్కయ్య భుజం తట్టడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చాను. తడిబారిన కళ్ళతో తదేకంగా నన్నే చూస్తోంది. కొన్ని క్షణాలాగి, ‘‘తన గురించి ఏమైనా తెలిసిందా ఆ తరవాత?’’ అడిగాను.
‘‘లేదురా, ఊరు వదిలి వెళ్ళారని మాత్రమే తెలిసింది అప్పట్లో, అంతే’’ అంది. కదులుతున్న రైలులాగే మా గుండెలూ వేగంగా కొట్టుకుంటున్నాయి.
‘‘ఈమధ్యనే తెలిసింది- వాళ్ళు చెన్నై వెళ్ళిపోయారనీ కూతురు పుట్టిందనీ... అమ్మా నాన్నా పోయాక- కూతురుకి పదేళ్ళ వయసులో ఒక తమిళతన్ని పెళ్ళి చేసుకుందనీ’’ అంది. అక్కయ్య ఇంకా ఏదో చెబుతోందిగానీ మనసెందుకో కలతబారడంతో, బాధ పైకి తెలీకుండా కళ్ళు మూసుకున్నాను.

తెల్లవారింది. విడిది ఇంటికి చేరుకున్నాం. మర్యాదలన్నీ తెలుగు, తమిళ మిశ్రమ సంప్రదాయంలో జరుగుతున్నాయి. నవ్వుకున్నాను. ఎదురుకోలు కార్యక్రమానికి ఇరువర్గాలూ సిద్ధమవుతున్నాయి. అభితోపాటు మేమంతా ముందు వరసలో కూర్చున్నాం. వధువు తల్లీ తండ్రీ బంధువులూ ఎదురుగా ఉన్నారు. పెళ్ళికూతురుని చూద్దామని తలెత్తాను. కుందనపు బొమ్మలా ఉంది అనుకుంటూ పక్కనే వసుమతిని చూసి నిశ్చేష్టుడనైపోయాను. తను నన్నే చూస్తోంది- కళ్ళతోనే నమస్కరిస్తున్నట్లూ క్షమాపణ వేడుతున్నట్లూ. రాత్రి రైల్లో అక్కయ్య సంభాషణ గుర్తొచ్చింది. అంత హఠాత్తుగా వసుమతి ప్రస్తావన ఎందుకు తెచ్చిందో మెల్లగా అర్థమవుతోంది. అక్కయ్య వంక చూశాను. ‘నువ్వు నిద్రపోయావు, నేనేం చేయను’ అన్నట్లు నవ్వుతూ భుజాలెగరేసింది. వసుమతిని చూశాను ప్రశ్నార్థకంగా. కళ్ళతో స్నిగ్ధని చూపిస్తూ ‘అవును’ అన్నట్లు తలూపింది. మనసెందుకో బరువెక్కిపోయింది. ఒక రకమైన ఉన్మత్తావస్థలోకి చేరుకుంది. తరవాత జరిగిన కార్యక్రమాలేవీ మనసుకెక్కలేదు. కళ్ళు చూస్తున్నాయంతే.
పెళ్ళి అయిపోయింది. వధూవరులిద్దరూ పెద్దవాళ్ళందరికీ నమస్కరిస్తూ నా దగ్గరకీ వచ్చారు. అభి నన్ను పరిచయం చేస్తూ   ‘‘మా మామయ్య- అంటే నీకు తండ్రి  వరస’’ అంటూ వంగి కాళ్ళకి నమస్కరించబోయారు. నేను అప్రయత్నంగా అమ్మాయి భుజాలు పట్టుకుని లేపి దగ్గరకు తీసుకున్నాను. తలపైన ముద్దు పెట్టాను. ‘నాన్నా’ అని పిలిచినట్లనిపించింది. అప్పటిదాకా ఉద్విగ్నభరితమైన హృదయం కళ్ళలోంచి వర్షించటం మొదలుపెట్టింది.
అక్కయ్యా, పూర్ణా ఇద్దరూ చెరో భుజం మీదా చేయి వేశారు సాంత్వనగా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.