close
ఇది... హైటెక్‌ లైబ్రరీ!

పాతబడిపోయిన భవనం... దుమ్ము పట్టేసిన పుస్తకాలూ అరకొర వసతులూ... ప్రభుత్వ గ్రంథాలయాలంటే చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ ఆ గ్రంథాలయం మాత్రం అందుకు పూర్తి భిన్నం. దాన్లోకి అడుగుపెడితే కార్పొరేట్‌ ఆఫీసులోకి వెళ్లినట్లే ఉంటుంది. ఇక, ఏసీ, వైఫై, కంప్యూటర్లూ ...ఇలా విశాఖ పౌర గ్రంథాలయం సౌకర్యాల గురించి చెప్పాలంటే అన్నీ ఇన్నీ కావు.

విద్యార్థులూ నిరుద్యోగులూ పుస్తకాభిమానులూ ఇలా... విశాఖ పౌర గ్రంథాలయానికి ప్రతిరోజూ ఎనిమిది వందల మందికి పైగా వస్తుంటారు. ఓ ప్రభుత్వ గ్రంథాలయానికి నిత్యం అంతమంది వస్తున్నారంటే కారణం అక్కడి అధునాతన సౌకర్యాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1999లో అప్పటి మేయర్‌ శంకుస్థాపన చేసిన ఈ గ్రంథాలయం 2003లో ప్రారంభం అయింది. మొదట్లో సాదాసీదాగానే ఉండేది. అయితే, అయిదేళ్ల కిందట ట్రస్టుబోర్డు అధ్యక్షుడు ఎస్‌.విజయకుమార్‌, కార్యదర్శి వర్మ, ఇతర సభ్యులు సూర్యారావు, గుప్తాలు కలసి ఈ గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అంతే... ఒకప్పటి పాత భవనానికి కొత్త రంగులూ హంగులూ అద్దుకోవడం మొదలయ్యాయి. గదులన్నిటికీ ఫాల్స్‌ సీలింగు వేయించారు. పాత ఫర్నిచర్‌ స్థానంలో చదువుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండేలా కొత్త కుర్చీలూ టేబుళ్లూ ఏర్పాటుచేశారు. ఆ అభివృద్ధిని చూసి ఎంతోమంది విరాళాలివ్వడానికి ముందుకొచ్చారు. విశాఖ ఎంపీ రూ.50 లక్షలు, పోర్టు ఛైర్మన్‌ రూ.25లక్షలు, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం రూ.10లక్షలు, హెచ్‌.పి.సి.ఎల్‌. రూ.31లక్షల రూపాయల్నీ విరాళంగా ఇవ్వడంతో గ్రంథాలయం రూపురేఖలు మొత్తంగా మారిపోయాయి.

ఎన్నో సౌకర్యాలు
పురుషులూ స్త్రీలూ కూర్చోవడానికి వేరు వేరుగా ఏసీ గదులతో పాటు, విడిగా ఎనభైమందికి సరిపోయేలా జనరల్‌ సెక్షన్‌ని కూడా ఏర్పాటు చేశారు. గ్రంథాలయం మొత్తం వైఫై సౌకర్యం, 40కి పైగా కంప్యూటర్లూ అందుబాటులోకొచ్చాయి. దాంతో విద్యార్థులు ఇంటర్నెట్‌ ద్వారా అవసరమైన సమాచారం సేకరించి చదువుకునే వీలు కలిగింది. పెద్ద సంఖ్యలో వచ్చే విద్యార్థులూ నిరుద్యోగుల కోసం గ్రూప్‌-1, గ్రూప్‌-2లాంటి అన్నిరకాల పోటీ పరీక్షలకూ అవసరమైన స్టడీ మెటీరియల్‌ని తెచ్చి అరల్లో ఉంచారు. అంతేకాదు, వివిధ పత్రికల్లో ప్రతిరోజూ ప్రచురితమయ్యే పోటీపరీక్షల ప్రత్యేక పేజీల్ని ఫొటోస్టాట్లు తీయించి రోజూ 300 మందికి పంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించే ‘టెడ్‌ టాక్స్‌’ వీడియోలను చూసి స్ఫూర్తి పొందేందుకు పౌర గ్రంథాలయంలో ప్రత్యేకంగా ఒక ప్రొజెక్టర్‌ గది కూడా ఉంది. విద్యార్థులూ నిరుద్యోగులకు ఉపయోగపడేలా ప్రతినెలా ప్రముఖులతో ఉపన్యాసాలిప్పించడం ఈ గ్రంథాలయానికున్న మరో ప్రత్యేకత.

ఈ సమావేశాలు నిర్వహించుకోవడానికి రెండు సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. అధునాతన హంగులూ సౌకర్యాలే కాదండోయ్‌ పర్యావరణ ప్రియమైన కార్యక్రమాల ఏర్పాట్లలోనూ  పౌర గ్రంథాలయం ముందుంది. ఈ భవనం పైన ఏర్పాటుచేసిన సౌర విద్యుత్‌ ప్లాంటు రోజుకి 220 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది మరి.

‘విశాఖ పౌర గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే ఉత్తమమైందిగా తీర్చిదిద్దాలనుకున్నాం. అన్నిరకాల పుస్తకాలతో పాటు యువత కోరుకునే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండాలన్నదే మా ఉద్దేశం. ఈ కారణంతోనే ఇక్కడికి నిత్యం వందలమంది చదువరులు వస్తున్నారు’ అంటారు గ్రంథాలయం కార్యదర్శి డి.ఎస్‌ వర్మ. ఏమైనా ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఇంత బాగా తీర్చిదిద్దడం గొప్ప విషయమే!

- బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం

ఫొటోలు: గోపీకృష్ణ

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.