close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరోగ్యానికో నేరేడు!

వేసవి చివర్లో వచ్చే నేరేడు ఆరోగ్యానికి చాలా మంచిదనీ, ముఖ్యంగా మధుమేహులకి ఎంతో మేలనీ అందరికీ తెలిసిందే. దేవుడి పండుగానూ పిలిచే నేరేడు, కాలం మారుతోన్న సమయంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేస్తుందట. తీపీ వగరూ ఒకలాంటి ఘాటూ కలగలిసిన రుచితో కూడిన నేరేడులో ప్రొటీన్లూ విటమిన్లూ యాంటీఆక్సిడెంట్లూ ఖనిజాలూ అన్నీ పుష్కలంగానే ఉంటాయి. ఇవన్నీ రకరకాల ఇన్ఫెక్షన్లూ కాలేయ సమస్యలూ తలెత్తకుండా కాపాడతాయి. క్యాన్సర్లు రాకుండానూ అడ్డుకుంటాయి.
నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌. చిగుళ్ల వ్యాధులనీ నివారిస్తుంది. ఇందులో సహజంగా ఉండే ఆమ్లాలు జీర్ణక్రియకి తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఈ పండ్ల వల్ల దగ్గూ జలుబూ రాకుండా ఉంటాయి. వానాకాలంలో ఎక్కువగా వచ్చే అతిసారం, కలరా వ్యాధుల్నీ ఈ పండ్లు అరికడతాయట. ఈ పండ్లలోని సి-విటమిన్‌ చర్మానికీ మంచిదే. వీటిల్లో సమృద్ధిగా ఉండే కాల్షియం నాడీవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తుంది.
పండ్లే కాదు, నేరేడు ఆకులూ బెరడూ గింజలూ అన్నీ కూడా మధుమేహానికి చక్కని మందులా పనిచేస్తాయి. వీటిని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఓ టీస్పూను చొప్పున తేనెతో కలిపి తీసుకుంటే అందరికీ మేలే. ఆ పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది. కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకోండి.


గర్భిణుల్లో కుంగుబాటు?

ర్భం దాల్చినపుడు మహిళల శరీరంలో అనేక మార్పులు రావడం సహజం. అయితే వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటే, భవిష్యత్తులో డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడూ, పిల్లలు పుట్టిన తర్వాతా తామెలా ఉంటామోనన్న ఆందోళన మహిళలకు ఉంటుంది. కానీ ఆ సమయంలో తల్లి మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ఆమె శారీరక ఆరోగ్యమూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యమూ రెండూ బాగుంటాయి. దీన్నిబట్టే దీర్ఘకాలంలో వాళ్లెలా ప్రవర్తిస్తారన్నది ఆధారపడి ఉంటుంది. దాదాపు 600 మందికి పైగా గర్భిణుల మీద పరిశోధనలు చేసి ఈ విషయాలను గుర్తించారు. గర్భం దాల్చిన సమయంలో తమ శరీరంలో చోటుచేసుకునే మార్పుల పట్ల సానుకూలంగా ఉన్న మహిళలకు ఆ తర్వాతి కాలంలో కుంగుబాటు, ఒత్తిడి లాంటి సమస్యలు దరిచేరవు సరికదా, పిల్లలతో కూడా మంచి అనుబంధం కలిగి ఉంటారట. అదే తమ ఆకారం మారిపోయిందని పదే పదే బాధపడేవాళ్లకు పిల్లలు పుట్టిన తర్వాత కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువట. 


ఒత్తిడినీ కొలిచేయొచ్చు!

బీపీ ఎంతుందో పరికరంతో తెలుసుకోగలం. రక్తంలో చక్కెర శాతాన్నీ లెక్కిస్తున్నారు. కానీ, మానసిక ఒత్తిడి ఎంత ఉందో ఎలా తెలుస్తుంది? అందుకే ఓ పరికరాన్ని కనిపెట్టారు యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటీ పరిశోధకులు. చెమట, రక్తం, మూత్రం లేదా లాలాజలాన్ని ఉపయోగించి శరీరంలో ఒత్తిడిని కలగజేసే హార్మోన్ల స్థాయిని ఈ సరికొత్త పరికరం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు సదరు నిపుణులు. అతినీలలోహిత కాంతితో పనిచేసే ఈ మెషీన్‌, ల్యాబ్‌లో చేసే పరీక్షలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాకపోయినా మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో ఉందీ వైద్యుడి దగ్గరకు వెళ్లాలా అక్కర్లేదా అన్న విషయాన్ని మాత్రం తెలియజేస్తుందట. 


కాఫీ తాగితే కదలికలు

ఉదయం లేవగానే ఒక గ్లాసు కాఫీ పడకపోతే చాలామందికి కడుపు కదలదు. ఇదేదో మానసిక భావన కాదు. శాస్త్రీయంగా కూడా ఈ విషయం రుజువైంది. కాఫీ తాగడం వల్ల కడుపులోని పేగుల ముడుచుకునే సామర్థ్యం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇందుకోసం ముందుగా ఎలుకలపై ప్రయోగాలు చేశారు. కాఫీలో కెఫీన్‌ మోతాదు ఎంత ఉందన్నదాంతో సంబంధం లేకుండా వాటి కండరాల కదలికలు పెరిగినట్లు గుర్తించారు. మూడురోజుల పాటు ఎలుకలకు కాఫీ తాగించగా, వాటి చిన్న పేగుల్లోని కండరాలు ముడుచుకోవడం పెరిగిన విషయం గాల్వెస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ మెడికల్‌ బ్రాంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జువాన్‌ జెంగ్‌ షి పరిశోధనలో తేలింది. మామూలు కాఫీ అయినా కెఫీన్‌ లేని కాఫీ అయినా ఒకే లాంటి ఫలితాలు వస్తున్నాయట. కాఫీ తాగడం వల్ల కడుపు కదులుతుందని తెలిసినా, దానికి ఇన్నాళ్లూ శాస్త్రీయ ఆధారాలు లేవు. కెఫీన్‌ లేని కాఫీతో ప్రయోగాలు చేసినా ఇదే తరహా ఫలితాలు కనిపించాయట. దాంతో శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత సాధారణంగా ఉండే మలబద్ధకాన్ని తగ్గించడానికి రోగులకు కాఫీ తాగించడం మంచి పద్ధతి అంటున్నారు శాస్త్రవేత్తలు.

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.