close

ఎస్జీ పాకిస్థాన్‌లో పుట్టింది!

ఎస్జీ... క్రికెట్‌ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. గవాస్కర్‌ టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నపుడు చేతిలో ఉన్నది ఎస్జీ బ్యాటే. అనిల్‌ కుంబ్లే పాకిస్థాన్‌ మీద పది వికెట్లు తీసింది ఎస్జీ బంతితోనే. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ ప్రస్థానాన్ని సంస్థ ఎండీ పారస్‌ ఆనంద్‌ వివరిస్తున్నారిలా...

సేన్‌పెరేల్‌ గ్రీన్‌ల్యాండ్స్‌... క్రీడా ప్రేమికులు ఎస్జీగా పిలుచుకునే మా కంపెనీ పేరు. సేన్‌పెరేల్‌ అంటే ‘సాటిలేనిది’ అని ఫ్రెంచ్‌ అర్థం. పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో మా తాత కేదార్‌నాథ్‌ ఆనంద్‌ 1931లో ఎస్జీని ప్రారంభించారు. టెన్నిస్‌, ఫుట్‌బాల్‌, హాకీకి సంబంధించిన పరికరాల్ని తయారుచేసి విదేశాలకూ ఎగుమతి చేసేవారు. దేశ విభజన సమయంలో మా కుటుంబం మేరఠ్‌ వచ్చి స్థిరపడింది. 1950లో ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభించిన తాతయ్య... క్రికెట్‌ బంతుల తయారీపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు.
ఇప్పటికీ పూర్తిగా చేతులతోనే బంతుల్ని తయారుచేసే సంప్రదాయం మా దగ్గర కొనసాగుతోంది. వాటితోపాటు గ్లవ్స్‌, ప్యాడ్స్‌ తయారుచేసి యూకే, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు ఎగుమతి చేసేవారు. తర్వాత స్వదేశంలోనూ అమ్మకాల్ని ప్రారంభించారు. 1970 ప్రాంతంలో మొదటిసారి క్రికెట్‌ బ్యాట్‌ల తయారీవైపు అడుగులు వేశారు.
* తాత తర్వాత పెదనాన్నలు కరణ్‌బీర్‌, కైలాష్‌... నాన్న త్రిలోక్‌ కంపెనీ నిర్వహణను చూసుకునేవారు. ఎస్జీ బ్రాండ్‌ ప్రాచుర్యం పెంచాలని సునీల్‌ గవాస్కర్‌ని ప్రచారకర్తగా నియమించారు. దాంతో వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. ‘ఎస్జీ’ అంటే సునీల్‌ గవాస్కర్‌ అన్నట్టుగా పేరొచ్చింది. 1982 నుంచి 1987లో రిటైరయ్యేంత వరకూ గవాస్కర్‌ ఎస్జీ ఉత్పత్తులనే వాడేవాడు. మా తయారీ కేంద్రానికి వచ్చి తనకు తగ్గట్టు బ్యాట్‌నీ, ఇతర వస్తువుల్నీ తయారుచేయించుకునేవాడు. విండీస్‌ పేస్‌ బౌలర్ల నుంచి తన చేతివేళ్లను రక్షించుకోవడానికి ప్రత్యేకంగా రెండేసి వేళ్లు కలిసి ఉండేలా, వేళ్లచుట్టూ బలమైన రక్షణ ఉండేలా గ్లవ్స్‌ని డిజైన్‌ చేయించుకున్నాడట. 1987 నాటికి డిమాండ్‌ బాగా పెరగడంతో రెండో యూనిట్‌నీ ప్రారంభించాం. గవాస్కర్‌ తర్వాత అజారుద్దీన్‌ ఎస్జీకి కొన్నాళ్లు ప్రచారకర్తగా ఉన్నాడు. బంతి డిజైన్‌ విషయంలో అప్పట్లో కపిల్‌ కూడా మాకు సలహాదారుగా ఉండేవాడు.

* 2001లో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని నేను తీసుకున్నాను. నాకూ క్రీడలంటే ఇష్టం. మా తాత హయాంనాటి బ్యాట్‌కీ ఇప్పటి బ్యాట్‌లకీ తయారీ పరంగా పెద్దగా మార్పు రాలేదు. కానీ మార్కెట్‌ మారిపోయింది. విరాట్‌ బ్యాట్‌మీద ఎంఆర్‌ఎఫ్‌, రోహిత్‌ బ్యాట్‌మీద సియట్‌...  పేర్లు కనిపిస్తున్నా అసలు ఆ బ్యాట్‌లు తయారయ్యేది మాలాంటి సంస్థల దగ్గరే. కానీ అక్కడ మా పేరు కనిపించదు. అందుకే మా బ్రాండ్‌కు మరింత ప్రచారం అవసరమని భావించాను. ద్రవిడ్‌, సెహ్వాగ్‌ లాంటి ఆటగాళ్లని ప్రచారకర్తలుగా నియమించాం. వాళ్లు మా ఫ్యాక్టరీకి వచ్చి తమకు తగ్గట్టు బ్యాట్‌లు తయారుచేయించుకునేవాళ్లు. ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 సమయానికి నైకీ, అడిడాస్‌, రీబాక్‌ కూడా క్రికెట్‌ పరికరాల తయారీలోకి వచ్చాయి. వాళ్లతో పోలిస్తే మా ఆర్థిక వనరులు చాలా తక్కువ. కానీ నైపుణ్యంలో వాళ్లు మాకు సరితూగరన్న నమ్మకం నాది. పోటీలో నిలబడ్డానికి యువరాజ్‌, సురేష్‌ రైనాల్ని బ్రాండ్‌ అంబాసిడార్లుగా నియమించుకున్నాం. మరోవైపు వర్ధమాన ఆటగాళ్లకీ స్పాన్సర్స్‌గా ఉండేవాళ్లం. వివిధ నగరాల్లోని కోచ్‌లతో టచ్‌లో ఉంటూ వాళ్ల సూచనల మేరకు ఖరీదైన కిట్‌ని యువ క్రికెటర్లకి ఉచితంగా ఇస్తాం. హార్దిక్‌ పాండ్య, పృథ్వీషా, శుభ్‌మన్‌ గిల్‌, దిముత్‌ కరుణరత్నే(శ్రీలంక) ఈవిన్‌ లూయిస్‌(వెస్టిండీస్‌) మా స్పాన్సర్‌షిప్‌ పొందినవాళ్లలో ఉన్నారు. ఛతేశ్వర్‌ పుజారా, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, షకిబ్‌్ అల్‌ హసన్‌, దిముత్‌, కౌశల్‌ సిల్వా, లూయిస్‌, రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం మా ప్రచారకర్తలుగా ఉన్నారు.
* ఆటగాళ్లతో అనుబంధం బ్రాండ్‌ ప్రచారానికే కాదు, ఫీడ్‌బ్యాక్‌కు కూడా పనికొస్తుంది. గవాస్కర్‌ ప్రతి సిరీస్‌కు ముందు రెండు రకాల బ్యాట్లు పట్టుకెళ్లి ముగిశాక ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేవాడు. ద్రవిడ్‌ కోసం మేం ప్రత్యేక బ్యాట్‌ డిజైన్‌ చేశాం. తర్వాత అదే డిజైన్‌తో బ్యాట్లు మార్కెట్‌లోకి విడుదల చేస్తే విజయవంతమయ్యాయి. ఈరోజుకీ ఆ డిజైన్‌ బ్యాట్‌కి డిమాండ్‌ ఉంది.
* ఇతర క్రీడా విభాగాల్లోకీ వెళ్లాలని 2004లో దుస్తులు, 2006లో షూ విభాగాల్ని ప్రారంభించాం. ఐపీఎల్‌ వచ్చాక బ్యాట్‌, బంతులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడటంతో 2008లో మూడో యూనిట్‌ ప్రారంభించాం. 2008 నాటికి ఎస్జీ టర్నోవర్‌ రూ.50 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.200 కోట్లకు దగ్గరగా ఉంది. ఎస్జీ ఖాతాదారుల్లో బీసీసీఐ, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతోపాటు ముంబయి, రాజస్థాన్‌, చెన్నై ఐపీఎల్‌ ఫ్రాంచైజీలున్నాయి. ఇండియాలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ భవిష్యత్తులో క్రికెటేతర విభాగాల్లో మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాం... క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే!

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.