close
ఖరీదైన చదువు... ఉచితం!

విద్యా హక్కు చట్టం... భారత విద్యావ్యవస్థలో పెను మార్పులు తెస్తుందని అప్పట్లో జోస్యం చెప్పారంతా. 6-14 మధ్య వయసు పిల్లలు బడికి వెళ్లడం హక్కుగా చెప్పిందీ చట్టం. అలాగే పేదలకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు కేటాయించాలంటోంది. అయితే ప్రచారం జరిగినంతగా ఇది ఆచరణకి నోచుకోలేదు. తల్లిదండ్రుల అవగాహన లేమి, ప్రభుత్వాల అలసత్వం కారణంగా చట్టం ఫలాలు విద్యార్థులకు అందడంలేదు. అందుకే, ఆ చట్టాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ‘ఇండస్‌ యాక్షన్‌’.

పేదరిక నిర్మూలనకూ, పేద పిల్లల విద్యా ప్రమాణాల మెరుగుకూ ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ ఆచరణలోకి రాకుండా ఎన్ని చట్టాలు ఉండి ఏం లాభం! దీనివల్ల పేదలు నష్టపోతుండటాన్ని గమనించిన చెరుకూరి తరుణ్‌... వారికోసం ఉన్న చట్టాల్ని ఆచరణలోకి తేవాలనే లక్ష్యంతో ‘ఇండస్‌ యాక్షన్‌’ని ప్రారంభించాడు. విజయవాడకు చెందిన తరుణ్‌... బిట్స్‌ పిలానీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసి, హిందూస్థాన్‌ యునీలీవర్‌ ఆహారోత్పత్తుల విభాగంలో ఉద్యోగిగా చేరాడు. దాదాపు మూడేళ్లపాటు పనిచేశాక ‘నా చదువు ఐస్‌క్రీమ్‌లూ, జామ్‌ల తయారీకే పరిమితం కాకూడదు, ఏదైనా మార్పు తీసుకురావాలి’ అన్న ఆలోచన మొదలైంది అతడిలో. అప్పుడే ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ ఫెలోషిప్‌ గురించి తెలిసి చేరాడు. బోధనపైన ఆసక్తి ఉండే యువతకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ, చిన్నస్థాయి ప్రైవేటు పాఠశాలల్లో వలంటీర్లుగా నియమించే సంస్థ అది. రెండేళ్లపాటు ఆ సంస్థ తరఫున పుణెలో పనిచేశాడు. తర్వాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఇంటర్నేషనల్‌ డవలెప్‌మెంట్‌) అంశంమీద మాస్టర్స్‌ చేయడానికి స్కాలర్‌షిప్‌ రావడంతో వెళ్లి చేరాడు. అప్పుడే విద్యా హక్కు చట్టం మీద పరిశోధన చేశాడు. అక్కణ్నుంచి వచ్చి ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ దిల్లీ నగర విభాగం బాధ్యతలు తీసుకున్నాడు. అక్కడ పనిచేస్తూనే 2013లో తన సహచరులతో కలిసి ‘ఇండస్‌ యాక్షన్‌’ను ప్రారంభించాడు. 2015 నుంచి ఈ సంస్థ నడపడానికే పూర్తి సమయం కేటాయిస్తున్నాడు.

దిల్లీలో మొదలు...
మొదట 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) మీద పనిచేయడం మొదలుపెట్టింది ఇండస్‌ యాక్షన్‌. ఈ ప్రాజెక్టుకి వారు పెట్టిన పేరు ‘ఏకలవ్య’. 12(1)(సి) ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి ఫీజూ తీసుకోకుండా 25 శాతం సీట్లు ఆర్థికంగా వెనకబాటు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కేటాయించాలి. బదులుగా ప్రభుత్వమే కొంతమేర ఫీజు చెల్లిస్తుంది. ఈ చట్టం చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించదు. ఈ చట్టం అమలు గురించి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో ముందుగా చర్చిస్తారు. దేశ రాజధాని దిల్లీలో దీనిపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ప్రైవేటు బడుల్లో తమ పిల్లల్ని ఉచితంగా చదివించవచ్చన్న విషయం చాలామంది తల్లిదండ్రులకి తెలియదు. దాంతో ‘ఇండస్‌ యాక్షన్‌’ బృందం దిల్లీలోని అంగన్వాడీ కేంద్రాలూ, సామాజిక భవనాలకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేది. అంతేకాదు, గోడలపైన పోస్టర్లు అతికించేది. సందేహాలుంటే తమ నంబరుకి మిస్డ్‌ కాల్‌ ఇవ్వమని చెప్పేవారు. ముందుకొచ్చిన తల్లిదండ్రులకు నిబంధనల్ని వివరించడం దగ్గరుండి వారి తరఫున స్కూళ్లలో దరఖాస్తు చేయించేలా వలంటీర్లను అందుబాటులో ఉంచారు. దిల్లీలోని వివిధ పాఠశాలల్లో సుమారు 50 వేల సీట్లు ఈ కేటగిరీలో ఉంటాయి. ‘ఇండస్‌ యాక్షన్‌’ చొరవతో ఆ సీట్లు క్రమంగా భర్తీ అయ్యాయి. నాలుగో ఏడాది నుంచి సీట్లకి రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.

21 లక్షల సీట్లు!
దిల్లీలో కొంతవరకు విజయవంతమైన తర్వాత రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌... సహా 18 రాష్ట్రాలకు సంస్థ సేవల్ని విస్తరించారు తరుణ్‌. ప్రైవేటు బడుల్లో చేరే పిల్లలు చదువుల్లో వెనకబడిపోకుండా వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు. ఇప్పటివరకూ 90 వేల మంది విద్యార్థుల్ని ఈ విధంగా పాఠశాలల్లో చేర్పించారు. 12(1)(సి) ప్రకారం దేశవ్యాప్తంగా 21 లక్షల సీట్లు ఉచితంగా భర్తీచేయాల్సి ఉంది. కానీ వాటిలో 15 శాతం మాత్రమే నిండుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టం ఉన్నప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలేదు. వాటిలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. ఇలాంటిచోట కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి న్యాయపరంగా ముందుకు వెళ్తున్నారు. ‘ప్రైవేటు విద్యా సంస్థల్లో సదుపాయాలు చాలా మెరుగ్గా ఉంటాయి. వాటిని ఉపయోగించుకునే పేద పిల్లల చదువుల్లో ఎంతో మార్పు వస్తోంది. మున్ముందు మరిన్ని చట్టాలమీదా ఇలా పనిచేస్తాం’ అంటాడు తరుణ్‌. ఇతడి సేవలకుగానూ 2019 ఒబామా ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. అంతకుమించి వేలమంది తల్లిదండ్రుల మన్ననల్నీ పొందాడు.

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.