close
కథలు చెప్పే కేకులు...

నిజంకన్నా ఊహ అందంగా ఉంటుంది. అందుకే ఆ ఊహలను కళ్లకు కట్టే కథలంటే మనకు బోలెడు ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకునే కేకులకూ కథల రూపాన్నిస్తున్నారు. అచ్చెరువొందించేలా తయారవుతున్న ఈ ‘ఫెయిరీ టేల్‌ కేకు’లకు పిల్లలేకాదు పెద్దలూ ఫిదా అయిపోతున్నారు.

నసును మాయ చేసే స్వభావం ఊహాలోకంలో విహరింపజేసే కథలకుంటుంది. అందుకే వాటిలోని పాత్రలూ, అందులో కనిపించే వాతావరణం అన్నీ మనకు అందంగా జ్ఞాపకముండిపోతాయి. చిన్నా పెద్దా అని తేడాలేకుండా అందరికీ కథలతో ప్రత్యేక అనుబంధం ఉండేందుకు కారణమూ ఇదే. కథల మీద మనకుండే ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకునే వాటిని గుర్తుకు తెచ్చేలా ‘ఫెయిరీ టేల్‌ కేకుల’ను రూపొందిస్తున్నారు సృజనకారులు. కథలకూ అందమైన రూపాన్నిచ్చి కళాకృతుల్లా తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పుడు చదువుకున్న ఆలిస్‌ ఇన్‌ ద వండర్‌ల్యాండ్‌, స్నో వైట్‌, సిండ్రెల్లా, మరుగుజ్జు -ముసలమ్మలాంటి కథలన్నింటికీ ఈ రకం కేకుల్లో ప్రాణం పోస్తున్నారు. ఆయా పాత్రలూ, అందులోని ఇళ్లూ, వాతావరణాన్ని తలపించేలా ఈ కేకుల్ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజులూ, ఎంగేజ్‌మెంట్లూ, వివాహ వార్షికోత్సవాలూ, సక్సెస్‌ మీట్‌లూ ఇలా... రకరకాల వేడుకల కోసం ఫొటోకేకులూ, డ్రెస్‌ మ్యాచింగ్‌ కేకులూ, థీమ్డ్‌కేకులూ అంటూ పర్సనలైజ్డ్‌ కేకుల్ని తయారు చేయించుకుంటున్నట్టే వీటినీ మనకు నచ్చినట్లు చేయించుకోవచ్చు. ఒక్క కథలనే కాదు అందమైన ఊహలకు ప్రాణం పోసే కేకులన్నింటినీ ఈ కోవలోకే చేర్చవచ్చు. కథల్లో కనిపించే రెక్కలుండే దేవదూతలూ, వింతైన కోటలూ... ఇలా బోలెడు చిత్రాలు వీటిలో కనిపిస్తున్నాయి. మనం కావాలనుకున్న ప్లేవర్‌లో ఈ ఫెయిరీ టేల్‌ కేకుల్ని చేయించుకోవచ్చు. మొత్తంగా చూడగానే ఇది నిజంగా కేకేనా అనిపించేలా ఒక అందమైన కళాకృతిలా కనిపించేలా వీటిని ముస్తాబు చేస్తున్నారు. అయితే తయారీలో వాడే పదార్థాలన్నీ తినగలిగినవే కాబట్టి బొమ్మలా కనిపిస్తున్నా కేకు మొత్తాన్నీ ఎంచక్కా చప్పరించేయొచ్చు. ఇష్టమైన వారి కళ్లలో మెరుపు చూడాలనుకుంటే ఈ తరహా కేకు ఆర్డరిస్తే సరి! ఇక వేడుకల్లోనూ ఇలాంటి కేకు కనిపించిందంటే మన అభిరుచిని అభినందించకుండా ఎవరూ ఉండలేరు మరి!

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.