close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బహుమతి

- కె.వి.ఎస్‌.యోగానంద్‌

దయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను వెంకట్‌ని. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. వెంకట్‌ చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే వెంకట్‌ ఎప్పుడూ దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. వెంకట్‌ చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. వెంకట్‌ స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. వెంకట్‌ తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. వెంకట్‌ చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.
చిరంజీవి వెంకట్‌కి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
దీవెనలతో
శంకరం మాస్టారు
డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే వెంకట్‌ బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది వెంకట్‌ రాసినది.
దైవసమానులైన మాస్టారుగారికి,
నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను. దీని గురించి చర్చించేముందు నాకు మీ గురించి ఉన్న అభిప్రాయాలని తెలియజేయాలని అనుకుంటున్నాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేను చాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. మిమ్మల్ని మరీ విసిగించకుండా ఉదాహరణగా స్కూల్లో జరిగిన ఒకటి రెండు సంఘటనల్ని మీకు గుర్తుచేస్తాను.
ఓరోజు మాకు సోషల్‌ స్టడీస్‌ క్లాసు జరుగుతుండగా మీరు రౌండ్సుకి వచ్చారు.
ఆ సమయంలో మేమంతా సోషల్‌ స్టడీస్‌ మాస్టారు వెంకట్రావుగారు పెట్టిన స్లిప్‌టెస్ట్‌ రాస్తున్నాం. మీరు వచ్చిన సమయానికి వెంకట్రావు మాస్టారు చిన్న కునుకు తీస్తున్నారు. పాపం అంతవరకూ ఆయన మాకు బోధిస్తూనే ఉన్నారు. మీరు క్లాసులోకి వచ్చి మాస్టారుని ‘‘ఏమిటిది మాస్టారూ, క్లాసులో ఇలా నిద్రపోతున్నారు?’’ అని గట్టిగా మందలించారు. పాపం ఆయన సంజాయిషీ ఇవ్వబోతుంటే, ‘వద్దు, తర్వాత వచ్చి కలవమని’ కాస్త కటువుగా చెప్పారు. వెంకట్రావు మాస్టారి ముఖం చిన్నబోయింది. మాకూ కొద్దిగా బాధ అనిపించింది. ఆయన చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు.
ఆ రోజుల్లో ఏ మాస్టారుదైనా పుట్టినరోజైతే, ఆ ఉదయం అసెంబ్లీ సమయంలో మీరు వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించి, వారి గురించి రెండు మంచిమాటలు మాట్లాడేవారు. అది మన స్కూల్లో ఆనవాయితీ. పై సంఘటన జరిగిన మర్నాడు వెంకట్రావు మాస్టారి జన్మదినం. ఆరోజు అసెంబ్లీ సమయంలో మీరు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిన తర్వాత చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
‘వెంకట్రావు మాస్టారు మనకున్న మంచి ఉపాధ్యాయుల్లో ఒకరు. పూర్వవిద్యార్థులెవరైనా నాకు బయట ఎక్కడైనా కనిపిస్తే ముందుగా ఆయన కుశలాన్ని గురించి తప్పక అడుగుతారు. ఇక్కడ నిన్న జరిగిన ఓ సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలి. నేను రౌండ్సులో భాగంగా ఆయన క్లాసుకి వెళ్ళాను. పిల్లలంతా స్లిప్‌టెస్ట్‌ రాస్తున్నారు. మాస్టారు చిన్న కునుకులో ఉన్నారు. నేను ఆయనను మందలించి తర్వాత వచ్చి కలవమన్నాను.
ఆయన నన్ను కలిశాక తెలిసిందేమిటంటే, మొన్న రాత్రి మాస్టారుగారి అమ్మాయికి తీవ్ర అస్వస్థత చేసిందట. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం ఆరుగంటలకికానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మాస్టారికీ ఆయన భార్యకీ రాత్రంతా నిద్రలేదు. ఆవిడని వాళ్ళమ్మాయికి తోడుగా ఆసుపత్రిలో ఉంచి, ఆయనమటుకు మామూలుగానే స్కూలుకి వచ్చేశారు. ఆయనకి సెలవులు చాలా ఉన్నాయి. ‘మాస్టారూ, సెలవు తీసుకోపోయారా’ అని నేనంటే, ఆయన ఏమన్నారో తెలుసా- ‘పిల్లల ఫైనల్‌ పరీక్షలు దగ్గరబడ్డాయి. వాళ్ళని బాగా ప్రిపేర్‌ చేయాలిగదా సార్‌. ఆసుపత్రిలో నేనుండి చేసేపని ఏదీలేదు. మా ఆవిడ చూసుకుంటుంది’ అని. ఎంతమందికి ఇలా పనిమీద భక్తి ఉంటుంది చెప్పండి?
దురదృష్టంకొద్దీ ఆ నిద్రలేమి ప్రభావంఓ క్షణం ఆయన మీద పడింది. కాకతాళీయంగా నేను అదే సమయంలో వెళ్ళాను. అనవసరమైన ఆవేశంతో ఆయన్ని పిల్లలముందు మందలించినందుకు నేను ఆయన్ని మన్నించమని కోరుకుంటున్నాను’
అని ఆయనవైపు చేతులు జోడించారు. వెంకట్రావు మాస్టారు కళ్ళల్లో మెదిలిన చిన్న కన్నీటితెర, మీ తప్పేమీలేదన్నట్లుగా మిమ్మల్ని వారిస్తూ మీకు చేసిన ప్రతి నమస్కారం నేనెప్పటికీ మర్చిపోలేను.
ఆరోజు మీ మాటలు విన్నాక నాకు అర్థమైన విషయమేమిటంటే, మనం తెలిసిచేసినా తెలియకచేసినా తప్పు చేస్తే, అది ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నలుగురిలో మీరు మాస్టారుని మందలించారు కాబట్టి, పదిమందిలో క్షమాపణ కోరారు. ఆ విధంగా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాగే ఎవరైనా మంచిపని చేస్తే వెంటనే మెచ్చుకోవాలి. అది వారికి మరింత స్ఫూర్తినిస్తుంది అని అర్థమయింది. ఆరోజు నేను నేర్చుకున్న ఆ పాఠాలు, ఇవాళ నా వృత్తిలో ఎదగడానికీ నా సహోద్యోగులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి.

స్కూల్లో ఆటలపోటీలు జరిగినప్పుడు గెలుపొందినవారికి కప్పులూ మెడల్సూ ఇచ్చేవారు. అదే క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందినవారికి మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.
ఆ పుస్తకాలు జనరల్‌నాలెడ్జికి సంబంధించినవో మహనీయుల జీవితచరిత్రలూ లేదా ఆత్మకథలో అయి ఉండేవి. ఓ వారం, పదిరోజులయ్యాక మీరు ఆ బహుమతి పొందిన విద్యార్థిని ఆ పుస్తకంలోని విషయాల గురించి అడిగేవారు. ఇచ్చిన పుస్తకం చదివామా లేదా, అందులోని ఏ మంచి విషయాలు మమ్మల్ని ప్రభావితం చేశాయో తెలుసుకోవాలని మీ యోచన. మొదట్లో అది మాకు కొంత ఇబ్బందిగా ఉండేది. బహుమతి ఎందుకు వచ్చిందా అనుకునేవాళ్ళం. కానీ రానురాను దానివల్ల మంచి పుస్తకాలు చదవాలన్న ఆసక్తి మాలో కొంతమందికి కలిగింది. నేను ఇప్పుడు ఉద్యోగరీత్యా చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాను.
ఆ సమయాన్ని నేను మంచి పుస్తకాలు చదవడానికి వెచ్చిస్తాను - ఆ పుస్తకాల ప్రేరణతో నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. అవి నా ఉద్యోగంలోనూ నిత్య జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న ఇంకో విషయం- సమయపాలన. మీరు స్కూలుకి ఎప్పుడూ అందరికంటే ముందు వచ్చేవారు. సాయంత్రం ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడైనా పని ఉండి స్కూలు వదిలిన తర్వాత కూడా ఉండి, పనిచేసుకుంటూ ఉంటే మీకు అవసరం లేకపోయినా ఆయనకి తోడుగా ఉండేవారు. అది మీ సహోద్యోగులకి మీరిచ్చే ఓ భరోసాలా ఉండేది. ఈ విషయంలో కూడా మిమ్మల్ని నేను అనుకరిస్తూనే ఉన్నాను.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, మిమ్మల్ని గమనించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను అనేకంటే, మీరు మీ ప్రవర్తనతో మాటలతో మీకు తెలియకుండానే మాకు ఎన్నో బోధించారు అనడం ఉత్తమం. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా.
బహుమతులు చాలామంది ఇస్తారు. కొద్దిమంది ఆ ఇచ్చిన బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్‌ బ్రదర్‌ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ వెంకట్‌
అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.