close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్నకు జేజే!

నవమాసాలు మోసేది అమ్మయితే జీవితకాలం మోస్తాడు నాన్న.దెబ్బ తగిలితే ఓదార్చేది అమ్మయితే ఆ దెబ్బకు మందు వేయించేది నాన్న. భూదేవంత ఓర్పూసహనం అమ్మదైతే ఆకాశమంత అండాదండా నాన్న. ప్రేమను దాచుకోవడం తెలియని అమ్మముందు ప్రేమను ప్రకటించడం తెలియని నాన్న కాస్త తేలిపోతాడు కానీ నాన్న కూడా అమ్మలాగే ప్రేమకు మారు పేరే..!

చట్టాన్నే మార్పించా..!

‘నా పేరు ఆదిత్య తివారీ. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ని. మాది ఇండోర్‌. ఓసారి మా నాన్న పుట్టినరోజున అనాథాశ్రమంలో మిఠాయిలు పంచుదామని వెళ్లాను. అక్కడో చిట్టితండ్రి నా దృష్టిని ఆకర్షించాడు. ఐదునెలల బిన్నీ డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టాడు. దాని వల్ల తన మానసిక, శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదు. అది చాలదన్నట్లు ఆ చిన్ని గుండెకు రెండు రంధ్రాలున్నాయట. వాడి తప్పేమీ లేకపోయినా కన్నవారే అనాథాశ్రమానికి అప్పజెప్పిన ఆ పసివాడి పరిస్థితికి నా గుండె తరుక్కుపోయింది. బిన్నీని మా ఇంటికి తెచ్చుకోవాలనిపించింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరమ్మాయిల్ని దత్తత తీసుకుని పెంచుతున్న సుస్మితాసేన్‌ అంటే నాకు అభిమానం. నేనూ అలా చేయొచ్చు కదా అనుకున్నాను. వెంటనే ఆశ్రమం వారికి దరఖాస్తు చేశాను. అయితే అవివాహిత పురుషులు దత్తత తీసుకోవడానికి కనీస వయసు 30 ఏళ్లు. నాకు అప్పటికి పాతికేళ్లే. వయసు సరిపోదు కదా అని ఊరుకోలేదు. కేంద్రమంత్రి నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకూ అందరికీ ఉత్తరాలు రాశాను. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాను. ఎలాగైతేనేం, చివరికి చట్టాన్నే మార్పించాను. అదే సమయంలో ఇంట్లో వారితోనూ ఒక స్థాయి యుద్ధమే చేయాల్సివచ్చింది. పెళ్లి కాకుండా ఇలా పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటే నాకు ఎవరూ పిల్లనివ్వరనీ స్వలింగ సంపర్కుడన్న ముద్ర వేస్తారనీ అమ్మ బాధపడింది. నిదానంగా తనకి నచ్చజెప్పా. అయినా మగవాడివి నీకు పసిపిల్లవాడిని- అదీ ఆరోగ్యం బాగాలేనివాడిని పెంచడం చేతకాదు, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకుంటున్నావని హెచ్చరించింది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నేనే పెంచుతానని హామీ ఇచ్చాను. నా పట్టుదల చూసి చివరికి అంగీకరించారు. దత్తత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసరికి బిన్నీకి రెండేళ్లు వచ్చాయి. ఇంటికి తీసుకొచ్చి అవనీష్‌ అని పేరు పెట్టుకున్నాం. వాడు ఇంటికొచ్చినప్పటినుంచీ అమ్మానాన్నలకు వాడితోడిదే లోకమైంది. మా ఆఫీసులో దత్తత తీసుకున్న తండ్రులకు రెండేళ్లు పెటర్నిటీ లీవు ఇస్తామన్నారు. అది తీసుకుని హాయిగా బాబుతో గడిపాను. వాడి పనులన్నీ నేను చక్కగా చేయడం చూసి మా అమ్మే ఆశ్చర్యపోయింది. పుష్కలంగా ప్రేమ దొరకడంతో అవనీష్‌ ఆరోగ్యంగా పెరుగుతున్నాడు. గుండెలో ఒక రంధ్రం దానంతటదే పూడుకుంది. దత్తత చట్టాన్ని మార్పించినందుకు నా గురించి పేపర్లో వార్తలొచ్చాయి. అవి చూసి, బాబు సంగతి తెలిసి కూడా లెక్చరరుగా ఉద్యోగం చేస్తున్న అర్పిత నాతో పెళ్లికి అంగీకరించింది. ‘మా నాన్న పెళ్లికి రమ్మ’ంటూ బాబు పేరుతోనే శుభలేఖలు వేయించా. మా పెళ్లి విందులో అతిథులందరూ అనాథలూ దివ్యాంగులే. ఇప్పుడు అవనీష్‌కి అమ్మతో సహా పూర్తి కుటుంబం సమకూరింది. ఇంట్లో అందరికీ వాడంటే అపురూపమే. బాబుతో ఆడుకోవడం వల్ల తన ఆరోగ్యమూ కుదుటపడిందంటాడు మా నాన్న. వాడు గొప్ప చదువులు చదవాలనో ఇంకేదో సాధించాలనో నేను ఆశించడం లేదు. నన్ను నాన్నను చేసిన వాడు ఆరోగ్యంగా ఆనందంగా పెరగాలి. జీవితాన్ని ఆస్వాదించాలి. ఎగిరే పక్షుల్నీ, చిటపటమని సవ్వడి చేసే వానచినుకుల్నీ చూస్తూ వాడు కొట్టే కేరింతలు చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది’.

నాలో నాన్నని తట్టిలేపింది!

‘బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా నేను చాలా బిజీగా ఉన్న రోజులవి. నా భార్య యోగితా కూడా నటే. మాకు ముగ్గురు మగపిల్లలు. ముంబయిలో స్థిరపడినా బెంగాలీ పేపరు తెప్పించుకునేవాళ్లం. ఒకరోజు ఆ పేపర్లో వచ్చిన చిన్న వార్త నన్ను బాగా కదిలించింది. ఎవరో ఓ పసిబిడ్డను చెత్తకుండీ దగ్గర వదిలేశారనీ, రోడ్డున పోయేవారు చూసి పోలీసులకు చెబితే వారు ఆ పాప సంరక్షణ బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారనీ... ఆ వార్తలో రాశారు. మనుషులు ఎందుకింత నిర్దాక్షిణ్యంగా తయారవుతున్నారో అనుకుని బాధపడ్డా. షూటింగ్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నా, మనసులో చెత్తకుండీ పక్కన పసిపాపాయి ఉన్న దృశ్యం కన్పించి కడుపు తరుక్కుపోయింది. వెంటనే నా భార్యకి ఆ వార్త చూపించి పాపను మనం తెచ్చి పెంచుకుందామా అని అడిగాను. ఆమె సరేనంది. ఇద్దరం బయల్దేరి విమానంలో కోల్‌కతా చేరుకున్నాం. ఆ స్వచ్ఛంద సంస్థ ఆఫీసుకి వెళ్లి పాపను దత్తత తీసుకుంటామని చెప్పాం. అప్పటికే సాయంత్రం అయిపోయింది. నటుడిగా నేను మంచి స్థాయిలో ఉండటంతో దత్తతకు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. వెంటనే కాగితాలు సిద్ధం చేయడం మొదలెట్టారు. ‘ఈ పని అవడానికి చాలా సమయం పడుతుంది మీరు రేపు రావచ్చు...’ అని చెప్పారు. కానీ మాకు ఆ పసిబిడ్డను వదిలి అవతలకి వెళ్లాలనిపించలేదు. రాత్రంతా అక్కడే వేచి ఉన్నాం. కాగితాలమీద సంతకాలన్నీ చేసి పాపను తీసుకునే ముంబయి తిరిగొచ్చాం. ‘దిశానీ’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. షూటింగ్‌ కోసం ఎక్కడికెళ్లినా ఫోనులో పాపతో మాట్లాడాకే అన్నం తినేవాణ్ని. ముగ్గురు కొడుకుల్ని ఎలా పెంచానో నాకసలు గుర్తులేదు. కానీ పాప ఇంటికొచ్చిన రోజునుంచీ ఇప్పటివరకూ తనతో గడిపిన ప్రతి క్షణమూ నాకు గుర్తుంది. నన్నో బాధ్యతాయుతమైన తండ్రిని చేసింది తనే. ఇక మా ముగ్గురబ్బాయిలూ తమ ముద్దుల చెల్లెల్ని చేసే గారాబం అంతా ఇంతా కాదు...’ అంటాడు మిథున్‌ చక్రవర్తి. ‘తండ్రీ కొడుకులు కలిసి పిల్లను నేలమీద నడవనివ్వలేదు...’ అంటూ మురిపెంగా చెబుతుంది యోగిత. అసలు దిశానీ మిథున్‌ సొంత కూతురు కాదని ఎవరికీ తెలియదు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలు చూసి మరో వారసురాలు హీరోయిన్‌గా రాబోతోందంటూ సినిమా పత్రికలు రాశాయి. అది చూసి ఆ అమ్మాయి ఫలానా అంటూ మరో పత్రిక పాత వార్తల్ని వెలికితీయడంతో విషయం బయటకు వచ్చింది. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో చదువు పూర్తిచేసి బాలీవుడ్‌లో తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్న కూతుర్ని చూసుకుని మురిసిపోతున్నాడు మిథున్‌ చక్రవర్తి.

వధువు లేకుండా పెళ్లి చేశా!

‘పెళ్లి మేళం వినపడితే చాలు మా అజయ్‌ పరుగుపరుగున వెళ్లి ఆ ఊరేగింపులో కలిసిపోయి డాన్స్‌ చేస్తాడు. బంధువుల ఇళ్లలో ఎవరి పెళ్లయినా సందడంతా వాడిదే. కొత్త బట్టలు వేసుకోవడం, డాన్స్‌ చేయడం, స్వీట్లు తినడం... పుట్టుకతోనే మానసిక వైకల్యం ఉన్న అజయ్‌ దృష్టిలో పెళ్లంటే అదే. పాతికేళ్లు దాటినా ఏమీ తెలియని పసిమనసే. మూణ్ణెల్ల క్రితం మా అన్నయ్య కొడుకు పెళ్లయింది. ఎప్పటిలాగే అజయ్‌ ఆ పెళ్లిని కూడా బాగా ఎంజాయ్‌ చేశాడు. ఈసారి మెడలో పూలదండలు వేసుకుని గుర్రంమీద కూర్చున్న పెళ్లికొడుకు మీద పడింది మా అజయ్‌ దృష్టి. అంతే, హడావుడిగా నా దగ్గరికి వచ్చి ‘నాన్నా నేనూ గుర్రమెక్కుతా...’ అన్నాడు. అప్పటికి తనని మభ్యపెట్టి మరో చోటుకు తీసుకెళ్లినా నా చెవుల్లో అజయ్‌ కోరిక మార్మోగుతూనే ఉంది. బుద్ధిమాంద్యుడికి పెళ్లి ఎలా చేయడం- అన్న ఆలోచన వేధిస్తూనే ఉంది. చిన్నవయసులోనే తల్లిని పోగొట్టుకున్న అజయ్‌కి తల్లీ తండ్రీ నేనే అయ్యాను. అందుకని తన కోరిక తీర్చడానికే సిద్ధమయ్యాను. మా పెద్దబ్బాయికీ దగ్గరి బంధువులకీ చెబితే మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ‘మంచి ఆలోచన’ అన్నారు. అందరం కలిసి ఇంట్లో పెళ్లివేడుకకు శ్రీకారం చుట్టాం. ఒక్క పెళ్లికూతుర్ని తేలేను కానీ మిగిలిన వేడుకలన్నీ జరిపించగలను కదా. అజయ్‌కి కావలసిందీ అవే. శుభలేఖలు వేసి బంధుమిత్రుల్ని పిలవడం దగ్గర్నుంచీ మెహెందీ, సంగీత్‌లాంటి వేడుకలన్నీ నా పెద్ద కొడుకూ కూతురూ కలిసి ఉత్సాహంగా చేశారు. షేర్వాణీ, తలపాగాలతో అజయ్‌ని పెళ్లికొడుకులా ముస్తాబు చేసి గుర్రం మీద ఊరేగించాం. ఆ మోజు తీరగానే కిందికి దిగి అందరితో కలిసి తనివి తీరా నృత్యంచేశాడు. స్నేహితులకు స్వీట్లు తినిపించి తానూ తిన్నాడు. మా ఆహ్వానాన్ని మన్నించి దాదాపు 800 మంది వచ్చారు. విందు భోజనం చేసి మనసారా అజయ్‌ని ఆశీర్వదించి వెళ్లారు. ఆరోజు నా బిడ్డ ముఖంలో కన్పించిన ఆనందం చూస్తే నేను సరైన నిర్ణయమే తీసుకున్నాననిపించింది. ‘అన్నయ్య సంతోషమే మనక్కావాలి, ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు నాన్నా’ అని మా అమ్మాయి ముందుగానే నన్ను మానసికంగా సిద్ధంచేసింది కానీ నిజానికి ఎవరూ ఏమీ అనుకోలేదు. మాకు అభినందనలే అందాయి...’ అని సంతోషంగా చెబుతాడు విష్ణుభాయ్‌. పెళ్లికూతురు లేని ఈ పెళ్లి విశేషాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందరూ ఆ తండ్రిని పొగిడేవాళ్లే. ‘వైకల్యంతో పుట్టడం పిల్లల తప్పు కాదు. వారిని అర్థం చేసుకుని ప్రేమ పంచడమూ వారి కోరిక తీర్చడమూ పెద్దల బాధ్యత’ అంటూ పలువురు ట్వీట్‌ చేశారు. గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాకి చెందిన విష్ణుభాయ్‌ ఆర్టీసీలో కండక్టరు ఉద్యోగం చేస్తున్నాడు.

కన్నకొడుకుని వీధిలో నిలబెట్టాను!

‘ఏటా దీపావళికి కార్మికులకు కార్లూ ఇళ్లూ కానుకలుగా ఇచ్చే వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకియాని నేనే. అవును, సూరత్‌లో మా ఉమ్మడి కుటుంబంలో అందరం కష్టపడతాం. అలా కష్టపడబట్టే పన్నెండేళ్ల వయసులో వజ్రాల ఫ్యాక్టరీలో కూలీగా చేరిన నేను ఇంత పెద్ద వ్యాపారసామ్రాజ్యాన్ని సృష్టించగలిగాను. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నాకు కార్మికుల కష్టసుఖాలు తెలుసు. అయితే మా కుటుంబంలో రెండోతరం- అంటే మా పిల్లలు వ్యాపారబాధ్యతలు అందుకోడానికి సిద్ధమవడంతో నాకో సందేహం వచ్చింది. కోటీశ్వరుడి ఇంట ఏ కష్టమూ తెలియకుండా పెరిగిన పిల్లలు కార్మికుల కష్టసుఖాల్ని అర్థం చేసుకోగలరా, మానవతా విలువలతో వ్యాపారాన్ని నిర్వహించగలరా అన్న ఆలోచన నిద్రపట్టనివ్వలేదు. మా అబ్బాయి ద్రవ్య లంబోర్గిని కారులో తిరిగేవాడు. అమెరికా వెళ్లి ఎంబీఏ చదివి రాగానే వాడికి ఓ ఛాలెంజ్‌ విసిరాను. ‘నువ్వు చేతిలో చిల్లిగవ్వ లేకుండా, నా పేరు వాడుకోకుండా నెల రోజులు సొంతంగా సంపాదించుకుని తింటూ బతకగలవా’ అని. అలా చేసి చూపిస్తేనే నా వారసుడిగా వ్యాపారంలోకి రానిస్తానన్నాను. మా అన్నదమ్ములం అందరం కలిసే కుటుంబవ్యాపారంలోకి వచ్చే మగపిల్లలందరూ ఈ సవాలు స్వీకరించాలని నియమం పెట్టుకున్నాం. దాని ప్రకారమే చేతికి కొంత డబ్బూ రెండు జతల బట్టలూ మామూలు ఫోనూ ఇచ్చి ద్రవ్యను ఇంటినుంచి పంపించాను. ప్రాణాలమీదికి వస్తే తప్ప డబ్బూ ఫోనూ వాడకూడదన్నది షరతు. తను ధైర్యంగానే వెళ్లాడు కానీ నేను చాలా బెంగపెట్టుకున్నాను. అలాగని నేను డీలా పడితే కుటుంబమంతా డీలా పడిపోతుంది. కుటుంబంలో పెద్దవాడిని. నామీద వ్యాపారమే కాదు, వేలాది కార్మికుల కుటుంబాలూ ఆధారపడివున్నాయి. తండ్రిగా బిడ్డ మీద నాకున్న ప్రేమ ఎంత ముఖ్యమో ద్రవ్య సమర్థుడైన వ్యాపారవేత్తగా మారడమూ అంతే ముఖ్యం. అందుకే గుండె దిటవు చేసుకున్నా. నా బిడ్డ నా నమ్మకాన్ని వమ్ము చేయడనీ సవాలు గెలిచి వస్తాడనీ ఊహించుకుంటూ ఆ నెలరోజులూ గడిపాను. నెల తర్వాత ద్రవ్య ఫోను చేసి కేరళలో ఉన్నానన్నాడు. భాష కూడా తెలియని చోట ఎన్నో ఇబ్బందులు పడినా షరతులు తప్పలేదు. పాలరాతి బంగళాలో పెరిగిన బిడ్డ పాతికమంది పనివారితో కలిసి గది పంచుకున్నాడు. ‘అలసటగా ఉండి గబుక్కున చిరునవ్వు నవ్వనందుకు ఒక ఉద్యోగం పోగొట్టుకున్నాను నాన్నా’ అని తను చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది... నా ప్రయత్నం ఫలించిందనీ, తను జీవితంలో ఏనాడూ నేల విడిచి సాము చేయడనీ. మా  పిల్లలందరూ ఈ సవాలు గెలిచాకే వ్యాపారంలోకి వస్తున్నారు. ఇది వారికే కాదు, మాకూ సవాలే! అయినా ఎదుర్కొంటున్నాం... పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమూ తండ్రుల బాధ్యతేగా మరి’!

ఆ పిలుపు కోసం తపించాను!

‘నాన్న... ఈ పిలుపు కోసం మగవాడు ఇన్ని తిప్పలు పడాల్సివస్తుందని అస్సలు ఊహించలేదు. నా పెళ్లి మూడేళ్లకే పెటాకులయ్యింది. ఆ అనుభవంతో మరోసారి పెళ్లి మాటెత్తలేకపోయాను. కానీ నాకో కొడుకో కూతురో ఉంటే బాగుండేదనిపించేది. ఓ పసిబిడ్డ స్పర్శ కోసం మనసూ శరీరమూ తపించేవి. దత్తత తీసుకుందామని అనాథాశ్రమాలకు వెళ్లడం మొదలెట్టాక తెలిసింది అదెంత కష్టమో. ఒంటరి పురుషుడు, విడాకులు పొందినవాడు... ఈ రెండూ నా అనర్హతలయ్యాయి. రెండేళ్లలో ఏకంగా పాతిక సంస్థలు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పాక, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడొచ్చింది ఒక ఫోను. వెంటనే దిల్లీ నుంచి రైలెక్కి ఒడిశా వెళ్లాను. ప్రయాణ బడలికకి తోడు ఇక్కడెలాంటి అనుభవం ఎదురవుతుందోనన్న ఆత్రుతతో తల పట్టుకుని కూర్చున్నాను. అప్పుడు ఆశ్రమానికి చెందిన ఓ ఉద్యోగి చెయ్యిపట్టుకుని రెండున్నరేళ్ల పిల్లవాడు ఆ గదిలోకి వచ్చాడు. ఆ పసివాడు చిరునవ్వుతో నన్ను చూసిన ఆ చూపు... నేనెప్పటికీ మర్చిపోలేను. బాబుకి ఒడియా తప్ప మరో భాష తెలియదు. అయినా ప్రేమపూర్వక స్పర్శను మించిన భాషేముంటుంది. ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫోనులో ఉన్న మా పెంపుడు కుక్క ఫొటోలు చూపించాను. కిలకిలా నవ్వాడు. గత మూడేళ్లలో నా చెవులకు అంత ఇంపుగా విన్పించిన శబ్దం అదేనేమో. దత్తత కార్యక్రమం ముగించి వాడిని ఇంటికి తెచ్చుకున్నాను. అలా జ్యోతి స్వరూప్‌ గుప్తాని కాస్తా ‘అమితేశ్‌ వాళ్ల నాన్న’నయ్యాను. ఇంటికి వచ్చిన రోజు నుంచీ ఇప్పటివరకూ వాడి బాధ్యత నూటికి నూరుపాళ్లూ నాదే. స్కూల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌కీ వెళ్తాను. చిన్నప్పుడు కథలు చదివి విన్పించేవాణ్ని. కృష్ణుడి కథ చెబితే ‘అతడికి ఇద్దరమ్మలు, ఇద్దరు నాన్నలు, మా నాన్న ఒక్కడే అయినా అన్నీ చేస్తాడు నాకు, మా నాన్నే గ్రేట్‌ తెలుసా’ అని వాళ్ల నాన్నమ్మకు చెప్పేవాడట. ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చాడు, చాలా విషయాలను నాతో నిస్సంకోచంగా చర్చిస్తున్నాడు. వాడితో పాటు నాన్నగా నేనూ ఎదుగుతున్నాను. ఏటా ఒకసారి ఒడిశాలో తానున్న ఆశ్రమానికి వెళ్లివస్తాం. వాడో మంచి మనిషిగా ఎదిగితే చాలు. ‘చిన్నప్పుడు మీ నాన్నకి మిమ్మల్ని ఎత్తుకోవడం కూడా వచ్చేది కాదు. అలాంటిది వాడికి అమ్మానాన్నా నువ్వే అయ్యావు. మగవాళ్లలో ఇంత ఓపిక ఉంటుందనీ వాళ్లు పిల్లల్ని ఇంత బాగా పెంచగలరనీ నేనూహించలేదు’ అంటుంది అమ్మ. ‘నాన్న’గా నాకు అంతకు మించిన సర్టిఫికెట్‌ ఇంకేముంటుంది?’
బువ్వ పెట్టి, కథలు చెప్పి, వెచ్చగా పడుకోబెట్టి... అమ్మ ఎన్ని సేవలు చేసినా గుమ్మంలో నాన్న అలికిడి విన్పిస్తే చాలు బుజ్జిగాడి కళ్లు మెరుస్తాయి. అవును మరి, నాన్న భుజాలమీద ఎక్కితే ప్రపంచాన్ని జయించినంత ఆనందం. ఆ బొటనవేలు పట్టుకుంటే ఎంత దూరమైనా నడిచెయ్యగల ఉత్సాహం. తండ్రి సాన్నిహిత్యం పిల్లలకు సంతోషాన్నే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్నీ అందిస్తుందంటున్నారు పరిశోధకులు. ఏడేళ్లలోపు పిల్లల పెంపకంలో తండ్రులు ఎంతగా నిమగ్నమైతే ఆ పిల్లల ఐక్యూ అంతగా పెరుగుతుందని వారు తేల్చిచెబుతున్నారు. కాబట్టి పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలా అని కాదు, ఎంత ఎక్కువ సమయం వారితో గడపడానికి వీలవుతుందా అని తండ్రులు ఆలోచించాలి మరి!

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.