close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
షారూఖ్‌ అభిమానులా మజాకానా!

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కి భారత్‌లో బోలెడంత మంది అభిమానులని తెలిసిందే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే కింగ్‌ ఖాన్‌కి ఇండోనేషియాలోనూ వీరాభిమానులున్నారట. వారి అభిమానం ఏ స్థాయిలో ఉందంటే 90ల్లో షారూఖ్‌ తీసిన సినిమాల్లోలా కాస్ట్యూమ్స్‌ వేసుకుని అందులోని పాటలకు తగ్గట్లూ స్టెప్పులు వేసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. అలా ఫతాన్‌ డసొపంగ్‌ అనే ఇండోనేషియా యూట్యూబర్‌ నటించిన వీడియోలు ఈమధ్య చాలా వైరల్‌ అయ్యాయి. ఇతగాడు షారూఖ్‌లా నటిస్తూ ‘కుఛ్‌ కుఛ్‌ హోతా హై, మొహబ్బతీన్‌’... లాంటి సినిమాల సీన్లనూ పాటలనూ స్పూఫ్‌ వీడియోలుగా మార్చి యూట్యూబ్‌లో పెడుతుంటాడు. ఈ వీడియోల్లో హీరో హీరోయిన్‌లు షారూఖ్‌, ఐశ్వర్య, కాజోల్‌లా కనిపించేందుకు ప్రయత్నించడంతోపాటు హావభావాలనూ అలాగే పలికిస్తుండటంతో ఇవి బాగా వైరల్‌ అయ్యి వార్తల్లోకెక్కేశాయి.


అక్కడ ఆడపడుచులే తాళి కడతారు

పెళ్లంటే ఎక్కడైనా పీటలమీద వధూవరులు కూర్చుంటారు. కానీ గుజరాత్‌లోని సుర్ఖెదా, సనాదా, అంబల్‌ గ్రామాల్లో మాత్రం పెళ్లికొడుకు మండపంలోకే రాడు. పెళ్లి దుస్తులు ధరించి ఇంట్లో ఉండిపోతాడు. బదులుగా పెళ్లికాని అతడి అక్కకానీ చెల్లెలు కానీ వెళ్లి వధువు పక్కన పీటల మీద కూర్చుంటుంది. అంటే ఆడపడుచులే వరుడిలా పెళ్లి తంతులో పాల్గొంటారన్నమాట. ఆఖరికి తాళి కట్టేది కూడా వాళ్లే. ఈ ఊళ్లలో వెలసిన మగ దేవుళ్లందరూ బ్రహ్మచారులేనట. అందుకే, ఆ దైవాలను గౌరవిస్తూ ఇక్కడి అబ్బాయిలు పెళ్లి తంతులో పాల్గొనరు. కాదని ఎవరైనా అబ్బాయిలు అందుకు విరుద్ధంగా చేస్తే వారికి చెడు జరుగుతుందనేది స్థానికుల నమ్మకం.


తినడానికే ఈ విమానం ఎక్కుతారు!

రియాణాలోని అంబాలా నేషనల్‌ హైవే పక్కన నిలిపి ఉంచిన ఆ విమానం ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతుంది. కానీ అది మాత్రం ఎక్కడికీ కదలదు. మరి జనం ఎందుకు వస్తారంటే... భోజనం చెయ్యడానికి. అవును, ఈ విమానం ఓ హోటల్‌. విమానం ఎక్కాలన్న మధ్యతరగతి ప్రజల కోరికనే వ్యాపారంగా చేసుకుని ఓ తండ్రీకొడుకులు ఎయిర్‌బస్‌ ఏ320 విమానాన్ని ఇలా హోటల్‌గా మార్చేశారు. రన్‌వే1 పేరుతో నడిచే ఈ హోటల్‌ విమానం ఎక్కాలంటే ఎయిర్‌పోర్టులో తీసుకున్నట్లు బోర్డింగ్‌ పాస్‌ తీసుకోవాల్సిందే. ఇక, దీనిలోపలికి అడుగుపెడితే అటు విమానం ఎక్కిన అనుభూతీ కలుగుతుంది. ఇటు సోఫాలూ టేబుళ్లతో మామూలు హోటల్లోలా ఏర్పాట్లూ ఉంటాయి. కాబట్టి, నచ్చిన పదార్థాలు ఆర్డరిచ్చి ఎంచక్కా తినేసి రావొచ్చు. విమానం పక్కన నిల్చొని సెల్ఫీలూ దిగొచ్చు.


భర్త ఆఖరి కోరిక తీర్చేందుకు...

ఫొటోలో కనిపిస్తున్న ఆమె ఆస్ట్రేలియాకు చెందిన మిషెల్‌ బొర్క్‌. ఆ పక్కనే ఉన్నది ఆమె భర్త పాల్‌ నిలువెత్తు కార్డ్‌బోర్డు. దాన్ని వెంట తీసుకుని గతకొంతకాలంగా ప్రపంచయాత్రలు చేస్తోంది మిషెల్‌. ఎవరైనా మనిషిని తోడుగా తీసుకుని టూర్‌కి వెళ్తారు. ఈమేంటీ ఇలా... అనిపిస్తోంది కదూ. అసలు విషయం ఏంటంటే పాతికేళ్లపాటు అన్యోన్యంగా కలిసి బతికిన ఆ ఇద్దరూ కొన్నాళ్ల కిందట ప్రపంచయాత్రకు వెళ్దామనుకున్నారట. కానీ అంతలోనే పాల్‌ క్యాన్సర్‌తో ప్రాణాలొదిలాడు. అయితే, చివరిరోజుల్లో అతడు ‘నేను చనిపోయాక ఎలా ఉంటావు...’ అని మిషెల్‌ని అడిగాడట. అందుకు ఆమె ‘ప్రపంచం అంతా చుట్టి రావాలన్నది మనిద్దరి కోరిక. నువ్వు లేకపోయినా నీ కోరికను తీరుస్తాను. నీ నిలువెత్తు ఫొటోని వెంట తీసుకెళ్లి దాంతో ఫొటోలు దిగుతాను’ అని చెప్పిందట. అన్నట్లుగానే పాల్‌ చనిపోయిన ఏడాదికి అతడి పెళ్లినాటి ఫొటోను కార్డుబోర్డుగా చేయించుకుని ప్రయాణం మొదలుపెట్టింది.
మడతపెట్టే వీలున్న ఈ కార్డుబోర్డుని మామూలుగా బ్యాగ్‌లో పెడుతుంది. పర్యటక ప్రాంతాలకు వెళ్లినపుడు బయటికి తీసి ఫొటోలు దిగుతుంది. అలా ఇప్పటికే అతడికిష్టమైన గ్రాండ్‌ కాన్యన్‌, ఈఫిల్‌ టవర్‌, బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌, స్టోన్‌హెంజ్‌... లాంటి పర్యటక ప్రదేశాలను చుట్టేసింది మిషెల్‌. ప్రేమంటే ఇదేనేమో!

(9  జూన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.