close
బరువు తూగు... బరువు తగ్గు!

కొంతమంది బరువు పెరిగిపోతున్నాం... అంటుంటారు. తగ్గించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు కానీ పెద్దగా ఫలితం కనిపించదు. కానీ ఓ చిన్న చిట్కా ద్వారా పెరుగుతోన్న బరువును నియంత్రించుకోవచ్చు, తగ్గనూ వచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకి చెందిన పరిశోధకులు. సాధారణంగా ఎవరైనాగానీ ఏడాదికి అరకిలో నుంచి కిలో వరకూ పెరుగుతుంటారట. కానీ ఊబకాయం వచ్చేవాళ్లలో మాత్రం ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకే సదరు పరిశోధకులు 18-65 ఏళ్ల వయసులోపు వందమంది వ్యక్తుల్ని ఎంపికచేసి మూడు విభాగాలుగా చేసి, మీకిష్టమైన పద్ధతుల్ని అవలంబించండి. కానీ మూడునెలల్లో బరువు తగ్గాలి అన్న షరతు విధించారట. నెలకోసారి మాత్రం వాళ్లేం పద్ధతులు అవలంబిస్తున్నారో ఎంత తగ్గారో చూసి వెళ్లేవారట. చిట్టచివరగా అందరినీ పరిశీలించగా- వాళ్లలో ప్రతిరోజూ బరువు చూసుకునేవాళ్లలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించిందట. అంటే- బరువు చూసుకోవడంవల్ల వాళ్లు ఆ మర్నాడు తక్కువ తినడం లేదా ఎక్కువ వ్యాయామం చేయడం వంటివి చేశారని అర్థమవుతోంది. దీన్నిబట్టి ఏ రోజుకారోజు మనకు మనమే బరువు చూసుకోవడం వల్ల ఎంత పెరిగాం, ఎంత తగ్గాం అన్నదానితోబాటు మన శరీరానికి ఏ పద్ధతులయితే సరిపోతాయి అనేదానిమీద చక్కని అవగాహన ఏర్పడటం ద్వారా బరువుని నియంత్రించుకోవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


పిల్లలు ఆరోగ్యంగా తినాలంటే!

పిల్లలు అన్నం తిననని మారాం చేస్తుంటే... మా బుజ్జివి కదూ మా బంగారం కదూ... అంటూ గారం చేసేవాళ్లు కొందరయితే, తినకపోతే బూచెత్తుకుపోతుంది అని భయపెట్టేవాళ్లు మరికొందరు. ఈ రెండూ కాకుండా త్వరగా తినేస్తే నీకు బోలెడు బలం వస్తుందంటూ ఓపిగ్గా చెప్పి తినిపిస్తుంటారు కొందరు తల్లులు. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అలా ఓపికగా చెప్పడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. సాధారణంగా పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. పప్పుకూరలూ పండ్లూ కూరగాయల్లాంటివి పెట్టి తిను తిను అని పదే పదే అనడం కన్నా, వాటిల్లోని పోషకాల గురించి చెబుతూ అవి తింటే త్వరగా పెద్దవుతావు, బాగా పరిగెడతావు, అంతెత్తునుంచి కూడా దూకగలవు, ఆటలు బాగా ఆడగలవు... అంటూ చెప్పడంవల్ల వాళ్లు వాటిని ఇష్టంగా తింటారట. ఈ విషయాన్ని 3-5 ఏళ్లలోపు 90 మంది పిల్లల్ని ఎంపిక చేసి పరిశీలించగా- ఏమీ చెప్పకుండా పెట్టే పిల్లలతో పోలిస్తే అలా చెప్పిన పిల్లలు పోషకాహారాన్ని బుద్ధిగా తిన్నారట.


చింతచిగురుతో లాభాలెన్నో!

చింతచెట్టు ఇంట్లో ఉంటే మంచిది కాదు అంటారు కానీ దాని కాయలూ పండ్లూ చిగుళ్లూ అన్నీ ఆరోగ్యకరమే. అందులోనూ వేసవి గాలివానలకు చిగురించిన చింతాకులో పోషకాలూ ఔషధాలూ పుష్కలంగా ఉంటాయి. పైగా ఇది ఎందులో వేసినా రుచిగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో వచ్చే చింతచిగురును అన్ని కూరల్లోనూ వేస్తుంటారు. అయితే ఇది గృహవైద్యంలో అనేక వ్యాధులకి ఔషధంగా పనిచేస్తుందట. అదెలా అంటే...
* చింతచిగురుతో మరిగించిన కషాయం లేదా టీలో కాస్త తేనె వేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కామెర్లకీ మందులా పనిచేస్తుంది. ఈ కషాయం గొంతునొప్పినీ మంటనీ తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్‌-సి నోటిపుండ్లనీ చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. జ్వరానికీ గ్యాస్‌ సంబంధిత సమస్యలకీ కూడా మందులా పనిచేస్తుంది.
* ఫోలిక్‌ ఆమ్లం, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌... వంటి విటమిన్ల కారణంగా చింతచిగురు జీవక్రియని పెంపొందిస్తుంది.
* చింతచిగురు నూరి ముద్దలా చేసి పుండ్లమీద పెడితే, అందులోని యాంటీసెప్టిక్‌ గుణాలవల్ల అవి త్వరగా తగ్గుతాయి.
* చింతచిగురు కషాయం వల్ల బాలింతలకి పాలు పడతాయి.
* చింతచిగురులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని అడ్డుకుంటాయి. తద్వారా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అదేసమయంలో చింతాకు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుందట. రక్తాన్నీ శుద్ధి చేస్తుందట.
కీళ్లనొప్పులకీ మంచిదేనట.
* నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింతచిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.


కోపంకన్నా విచారమే మేలు!

వృద్ధాప్యంలో విచారంగా ఉండటం కన్నా కోపమే ఎక్కువ హాని కలిగిస్తుందని కంకార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే విచారంగానో దుఃఖంతోనో గడిపే వృద్ధుల్లో ఆలోచనాశక్తి మాత్రమే తగ్గుతుంది. కానీ కోపం వల్ల పొట్టలో మంట పెరుగుతుంది. దాంతో ఆర్ధ్రైటిస్‌, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువని వాళ్ల పరిశీలనలో తేలింది. ఇందుకోసం వీళ్లు 59-93 సంవత్సరాల వయసున్న 250 మంది వృద్ధుల్ని పరిశీలించగా- విచారంగా ఉండేవాళ్లలో మెదడు పనితీరు మాత్రమే తగ్గింది తప్ప ఇతరత్రా సమస్యలు పెద్దగా తలెత్తలేదట. అదే కోపంగా ఉండే వృద్ధుల పొట్టలో మంట పెరిగినట్లు గుర్తించారు. ఫలితంగా వాళ్లలో రోగనిరోధకశక్తి తగ్గిపోయి, ఇతరత్రా సమస్యలు ఎక్కువైనట్లు గుర్తించారు.

(9  జూన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.