close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హనోయ్‌లో హాయిహాయిగా..!

‘చిన్న చిన్న ద్వీపాలూ రంగురంగుల దుకాణాలూ పచ్చని పంటపొలాలూ పొడవాటి నదీపాయలతో సందర్శకులను నిత్యం ఆకర్షించే అందమైన దేశమే వియత్నాం’ అంటూ ఆ విశేషాలను మనతో పంచుకుంటున్నారు విజయవాడకు చెందిన మన్నెం కృష్ణలత.

చెన్నై నుంచి మలేషియా ఎయిర్‌వేస్‌లో కౌలాలంపూర్‌ మీదుగా వియత్నాం రాజధాని నగరం హనోయ్‌కి చేరుకున్నాం. నోయిబాబా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, హనోయ్‌ పాత నగరంలోని శాంతా
బార్బరా హోటల్‌కి చేరుకున్నాం.
వియత్నాం వీసా రెండు విభాగాలుగా ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్‌ పాస్‌పోర్టుతోబాటు అక్కడ మనం దిగే బస వివరాలు తెలిపి మనిషికి ఎనిమిది అమెరికన్‌ డాలర్ల చొప్పున చెల్లిస్తే అనుమతి పత్రం ఇస్తారు. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కొక్కరికి 25 డాలర్లు చెల్లించి నెలరోజుల గరిష్ఠ పర్యటక వీసా తీసుకోవాలి.
ముందుగా పదో శతాబ్దంనాటి లై వంశం నిర్మించిన కోట చూడ్డానికి వెళ్లాం. 46 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన మూడంతస్తుల రాజప్రాకారం చెక్కుచెదరలేదు. దీన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటూ వస్తున్నారట. అప్పట్లో నిర్మించిన ఓ సొరంగ ముఖద్వారాన్ని సైతం  ప్రదర్శిస్తున్నారు. 1954-75 మధ్యకాలంలో వియత్నాం ప్రజాసైన్యానికి ఈ కోట ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఈ ఆవరణలో అమెరికాతో జరిగిన యుద్ధంలో వాడిన సైనిక పరికరాలూ శతఘ్నులూ విమానాలూ ఉన్నాయి.

పురాతన బౌద్ధాలయం!
అక్కడి నుంచి ట్రాస్‌ కియెక్‌ అనే పురాతన బౌద్ధ దేవాలయానికి వెళ్లాం. వియత్నాం కమ్యూనిస్టు దేశం. 80 శాతం ప్రజలు మతాన్ని నమ్మరు. మిగిలినవారిలో సగం బౌద్ధులు కాగా తరవాతి స్థానాల్లో క్రైస్తవులూ ముస్లింలూ అతి తక్కువగా హిందువులూ ఉన్నారు. కానీ  ఈ ఆలయానికి ఆదరణ ఎక్కువ. ఆలయగోడలమీద రాతితో చెక్కిన చిత్రాలు అందంగా కనిపిస్తాయి. ఈ ఆలయానికి వేసిన ఎరుపు రంగును అదృష్టానికి సంకేతంగా భావించి సందర్శకులు స్పృశిస్తుంటారు. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ 1959లో ఈ దేశాన్ని పర్యటించినప్పుడు గయలోని బోధి వృక్షానికి చెందిన కొమ్మను బహుమతిగా ఇచ్చారట. దాన్ని ఈ ఆలయం దగ్గర పాతగా అది మహావృక్షంగా పెరిగింది. ఆలయానికి సమీపంలోనే వియత్నాం జాతీయ పుష్పమైన లేత ఎరుపురంగు కమలం ఆకారంలో ఓ కట్టడం ఉంది. అందం, జ్ఞానం, నిబద్ధత, ఆరోగ్యం, గౌరవాలకు దీన్ని ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా అక్కడున్న సరస్సులోని పడవలో విహరించడం మరపురాని అనుభూతిని అందించింది.

కత్తి సరస్సు!
తరవాత జేడ్‌ ద్వీపాన్ని చూడ్డానికి బయలుదేరాం. హనోయ్‌ విహార ప్రదేశాల్లో హోన్‌ కై సరస్సు(పునరుద్ధరించబడిన కత్తి సరస్సు) ముఖ్యమైనది. 15వ శతాబ్దంలో లై థాయ్‌ టొ అనే చక్రవర్తి, సరస్సులో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు- దేవుడు బంగారు తాబేలు రూపంలో ప్రత్యక్షమై మంత్రశక్తి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చాడట. చైనాతో జరిగిన యుద్ధంలో ఆ కత్తినే ఉపయోగించి విజయుడై వచ్చాక, మళ్లీ దాన్ని దేవుడికి ఇచ్చాడట. అందుకే ఈ సరస్సుకి ఆ పేరు వచ్చిందంటారు.
రఫెటుగ్‌ జాతికి చెందిన బంగారు వర్ణంలోని తాబేళ్లకు ఈ సరస్సు ఆవాసం. అయితే ఈమధ్య అవి కనిపించడం లేదట.

జేడ్‌ దీవి!
ఈ సరస్సుకి ఉత్తరం వైపున జేడ్‌ ద్వీపం ఉంది. అక్కడకు వెళ్లడానికి ఎర్రని చెక్క వంతెనను నిర్మించారు. దీన్ని తొలిసంధ్య కిరణాలకు వారధిగా చెబుతారు. ఈ ద్వీపంలో జోక్‌ సన్‌ ఆలయం సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. ఈ ద్వీపంలోనే తాబేలు ఆలయం కూడా ఉంది. అందులో రంగురంగుల్లో నిర్మించిన విగ్రహాలూ కొయ్య నగిషీలూ చూపరులను ఆకర్షిస్తాయి. మర్నాడు వియత్నాం ఉద్యమ నేత హోచిమిన్‌ మ్యూజియానికి వెళ్లాం. అక్కడకు వచ్చేవాళ్లంతా మోకాళ్ల కిందివరకూ వస్త్రాలను ధరించి ఉండాలి. మ్యూజియం ముందు విశాలమైన ఆకుపచ్చని లాన్‌ ఉంది. వియత్నాం నలుమూలల నుంచీ సేకరించి తీసుకొచ్చిన పూలమొక్కలు పర్యటకులకు కనువిందు చేస్తుంటాయక్కడ. దీనికి దగ్గరలోనే ఉన్న దేశాధ్యక్షుడి భవనాన్నీ చూశాం.
అక్కడినుంచి పరిమళ దేవాలయంగా పిలిచే ఏకస్తూప బౌద్ధాలయం చూడ్డానికి వెళ్లాం. ఇది వియత్నాం దేవాలయాల్లోకెల్లా సుప్రసిద్ధమైనది. పదకొండో శతాబ్దంలో కలువపూల కొలను మధ్యలో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఫ్రెంచ్‌వాళ్లు ధ్వంసం చేసినా తిరిగి పునర్నిర్మించారు. మిశ్రమ లోహాలతో చేసిన ఓ పెద్ద గంట ఇక్కడ ఉండేదట. అయితే ఆ గంటను కరిగించి, తయారుచేసిన ఆయుధాలతో చైనాతో యుద్ధం చేశారట. యుద్ధంలో గెలవడంతో ప్రజలందరూ ఈ దేవాలయాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సన్యాసులంతా  ఏటా ఇక్కడ జరిగే బుద్ధుని స్నాన వేడుకలకు హాజరవుతారట.

సాహిత్య దేవాలయం!
తరవాత పదకొండో శతాబ్దంనాటి సాహిత్య దేవాలయానికి వెళ్లాం. వియత్నామీయుల తొలి విశ్వవిద్యాలయమిది. సంప్రదాయ వాస్తుశైలికి అద్దం పడుతుందీ కోట. ఇందులో అధ్యయనానికీ సమావేశాలకీ విడివిడిగా మందిరాలూ, వాటిల్లో పండితుల విగ్రహాలూ ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచీ తాత్వికులూ పండితులూ విద్యార్థులూ వచ్చేవారట. భవంతి ముఖద్వారంలో పై భాగాన కంచుతో తయారైన ఓ పెద్ద గంట వేలాడదీసి ఉంది. బలానికి ప్రతినిధిగా డ్రాగన్‌, అందానికి ప్రతీకగా ఫీనిక్స్‌ బొమ్మలు ఈ గంటపై నమూనాలుగా ఉన్నాయి. ప్రముఖులు వచ్చినప్పుడు గౌరవసూచకంగా ఈ గంటను మోగిస్తారు. ఇక్కడ రాళ్లతో చేసిన తాబేళ్ల మీద అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్కాలర్ల పేర్లు చెక్కుతుంటారు. మంచి మార్కులకోసం విద్యార్థులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థిస్తుంటారు. వియత్నాం లక్ష డాంగ్‌ బ్యాంకు నోటుమీద ఈ దేవాలయం బొమ్మ ముద్రితమై ఉంది. ఏటా నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారిక్కడ.
నగర కేంద్రానికి 10 కి.మీ. దూరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న వియత్నాం జాతీయ మ్యూజియానికి వెళ్లాం. డోలు ఆకారంలో కంచుతో నిర్మించిన ముఖద్వారం దాటి లోపలకు వెళితే 54 జాతులకి సంబంధించిన 30 వేల కళాఖండాలు అక్కడ ఉన్నాయి. గృహ, ఆయుధ విభాగాలు వేటికవి ఉన్నాయి. వియత్నాం వాసులు జరుపుకునే వేడుకలకీ అమ్మకానికీ అలంకరణకీ సంబంధించిన అనేక వస్తువులను అక్కడ ప్రదర్శిస్తున్నారు. భవంతికి వెలుపల నాటి ఇళ్లనీ ఆనాడు వాళ్లు వాడిన పడవల్నీ ప్రతిబింబించేలా నమూనాలను నిర్మించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే మ్యూజియంలో ప్రదర్శించిన నీళ్ల తోలుబొమ్మలాట మాత్రం అబ్బురపరిచింది. తోలుబొమ్మల్ని చేపలు పట్టే గాలానికి తగిలించి, నీళ్లమీద వాటిని ఆడిస్తున్నారు. దీనికోసం అక్కడ ప్రత్యేకంగా స్విమ్మింగ్‌పూల్‌ని నిర్మించారు. ఆడించేవాళ్లు వెదురుచాపల వెనక నీళ్లలోనే ఉంటారు. ఆ ఆటలో ఎక్కువగా ఓ పెద్ద తాబేలు రాజుకి ఖడ్గాన్ని ఇచ్చే కథనే ప్రదర్శిస్తుంటారు.

రాళ్ల దీవులు!
మర్నాడు హనోయ్‌కి సుమారు 160 కి.మీ. దూరంలో ఉన్న హాలాంగ్‌ బే చూడ్డానికి వెళ్లాం. మార్గమధ్యంలో ట్రాయ్‌ ముత్యాల కేంద్రం దగ్గర ఆగి ముత్యాల్ని పండించే విధానం, వాటిని నగలకోసం తయారుచేసే పద్ధతులూ తెలుసుకున్నాం.
తరవాత హా లాంగ్‌ బేకు వెళ్లే నావ ఎక్కాం. అందులో ఎర్రని రొయ్యలూ ఆల్చిప్పలూ జెల్లీ చేపలూ వేయించిన నీటిపక్షులతో రకరకాల ఆహార పదార్థాలను వండి వడ్డించారు. నావ పైభాగం నుంచి చూస్తుంటే చిన్న చిన్న ద్వీపాలూ రకరకాల ఆకారాల్లో ఏర్పడిన కొండల్లాంటి రాళ్లూ తెల్లని ఇసుక దిబ్బలూ నీలి సముద్రజలాలతో ఎంతో అందంగా కనిపించిందా ప్రాంతం. అక్కడ ఉన్న ఆ పెద్ద కొండ రాళ్లన్నీ సున్నపురాతి ద్వీపాలని చెప్పాడు గైడ్‌. వాటి ఆకారాన్ని బట్టి ఒక్కోదాన్నీ ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. అలా ప్రయాణిస్తూ ఒడ్డున ఉన్న గుహల దగ్గర ఆగింది నావ. వాటిని స్వర్గద్వార గుహలు అంటారట. లోపలకు వెళితే సహజసిద్ధంగా ఏర్పడిన సున్నపురాతి ఆకారాలు చిత్రవిచిత్రంగా కనిపించాయి. అక్కడ ఏర్పాటుచేసిన దీపకాంతుల కారణంగా అవి వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. గుహల నుంచి బయటకు వచ్చాక రాతి శిఖరాల దిగువభాగాన ఆకుపచ్చని నీటిలో వెదురు పడవలో అరగంటసేపు విహరించడం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. హాలాంగ్‌ నుంచి తిరుగు ప్రయాణంలో హ్యాండీక్రాఫ్ట్స్‌ సెంటర్‌ దగ్గర ఆగాం. అక్కడున్న బట్‌ ట్రాంగ్‌ సెరామిక్‌ విలేజ్‌లో ఎన్నో వస్తువులు దొరుకుతాయి. మనకు కావాల్సినవి తయారుచేసుకుని రంగులేసుకునే సౌకర్యం కూడా అక్కడ ఉంది. హనోయ్‌ వెళ్లినవాళ్లు తప్పక చూడాల్సిన వాటిల్లో అక్కడి విమెన్స్‌ మ్యూజియం ఒకటి. చరిత్రలో వియత్నాం మహిళల ప్రాధాన్యం తెలిపేలా నిర్మించిన ఈ మ్యూజియంలో గొప్ప తల్లులూ, వీధి వ్యాపారులూ, వ్యాపారవేత్తలూ విద్యావేత్తలతోబాటు దేశ పోరాటంలో పాలుపంచుకున్న మహిళల విగ్రహాల్ని చూడొచ్చు. తరవాత ఒపెరాహౌస్‌ మీదుగా హోటల్‌కి చేరుకున్నాం.
మన రూపాయికి 340 వియత్నాం డాంగ్‌లు. అందుకే ఇతర దేశాల పర్యటన కన్నా ఇక్కడ ఖర్చు తక్కువ అవుతుంది. స్థానిక ఇండియన్‌ రెస్టరెంట్లలో మన భోజనం దొరుకుతుంది. వీధుల్లో ఎటుచూసినా పండ్ల దుకాణాలూ ఆహార దుకాణాలూ కనిపిస్తూనే ఉంటాయి. వియత్నామీయుల నిజాయతీ, పనిచేసే సామర్థ్యం, మర్యాదలూ మరిచిపోలేనివి. వాటిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ ఆ మర్నాడు ఎర్రని నదినీ ఆ చుట్టుపక్కలున్న పచ్చని పొలాల్నీ దాటి విమానాశ్రయానికి చేరుకున్నాం.

(9  జూన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.