close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ సోదరులు... పేదల సేవకులు!

కడపలోని కృష్ణా థియేటర్‌ ప్రాంతం... వందలమంది మహిళలు అక్కడికి చేరుకుని ఉన్నారు. వాళ్లంతా నెలవారీ నిత్యావసర సరుకుల్ని తీసుకోవడానికి అక్కడికి వచ్చారు. అది ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ కాదు, నిరుపేదల ఆకలి తీర్చాలన్న పెద్ద మనసుతో ఇద్దరు అన్నదమ్ములు అందిస్తోన్న సాయం.

పేదల్లో నిరుపేదలు వేరు... వాళ్లకి బతుకంటే దిన దిన గండం. విద్య, వైద్యం మాట దేవుడెరుగు... మూడు పూటలా అయిదువేళ్లూ నోట్లోకి వెళ్లడమూ కష్టమే. ‘పాపం... ఎందుకు వీళ్లకీ శాపం’ అనిపిస్తుంది వాళ్లని చూడగానే. కడపకు చెందిన మహబూబ్‌బాషా, జిలానీబాషాలకూ అలానే అనిపించింది. టైర్ల వ్యాపారం చేసే వీళ్లు నిత్యం జిల్లా వ్యాప్తంగా తిరుగుతుంటారు. అలాంటపుడు ఎందరో నిరుపేదల్ని చూసేవారు. అక్కణ్నుంచి వెళ్లిపోయాక కూడా వారి జాలి గుండెకు ఆ అన్నార్తుల ముఖాలు పదే పదే గుర్తొచ్చేవి. అప్పుడే ఎలాగైనా ఆ పేదలకు తమవంతు సాయం చేయాలి అనుకున్నారు. అలాగని వీరేమీ స్థితిమంతులు కాదు. కానీ ఉన్నదాంట్లోనే కొంత ఇవ్వాలనుకున్నారు. దాంతో బయటకు వెళ్లినపుడు తమతోపాటు బియ్యం, పప్పులూ, నూనెని ఒక సంచీలో తీసుకెళ్లి అవసరమైన వాళ్లకి ఇచ్చేవారు. కొందరు ఆత్మాభిమానంతో తీసుకునేవారు కాదు. కొందరైతే వాటిని కళ్లకు అద్దుకుని మరీ తీసుకునేవారు. అలా కొన్నాళ్లు పేదలకు అందించాక వారి ఆకలి కష్టాలు ఒక పూట, ఒక రోజుతో పోయేవి కాదని భావించి నెలవారీగా సరుకులు అందించాలనుకున్నారు. 2013లో ‘అర్రహ్మాన్‌ ఇందాద్‌ సంక్షేమ సంఘం’ ఏర్పాటుచేసి దానిద్వారా నిరుపేద కుటుంబాలకు కడప నగరంలోని కృష్ణా థియేటర్‌ ప్రాంతంలో సంస్థ కార్యాలయం దగ్గర ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా మొదటి ఆదివారం ఎంపిక చేసిన కుటుంబాలకు ఏడు కిలోల సన్న బియ్యం, అరకిలో కంది పప్పు, అర కిలో వేరుశెనగలు, లీటరు నూనె, కిలో చింత పండు, ఇంకా... ఉప్పు, కారం, పసుపు, దనియాల ప్యాకెట్లను అందిస్తారు. నాణ్యమైన సరుకులనే ఇస్తారు. ఒక్కో కుటుంబానికి అందించే సరుకుల విలువ రూ.800 నుంచి వెయ్యిదాకా ఉంటుంది. ఆకలికి మతంతో సంబంధం ఏం ఉంటుంది, అందుకే లబ్ధిదారుల్లో ముస్లింలతోపాటు ఇతర మతాలవారూ ఉంటారు.

విరాళాల సాయంతోనే... 
పూర్తిగా అర్హులైన వారికే సంస్థ సేవలు అందాలన్న ఉద్దేశంతో లబ్ధిదారుల్ని బాషా సోదరులే స్వయంగా ఎంపికచేస్తారు. కడప నగరంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు స్థానికంగా పర్యటించి నిరుపేదల్ని గుర్తిస్తారు. ఎవరైనా తాముగా సాయం కోరి వస్తే వారి చిరునామా తీసుకుని వీళ్లే స్వయంగా వెళ్లి వాళ్ల ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. టీవీ, ఫ్రిజ్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలూ లేనివారినీ, ఇంటి అద్దె రూ.1500 లోపు చెల్లిస్తున్నవారినీ ఎంపికచేస్తారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి లేనపుడూ వీరే చేయూతనిస్తారు. అర్హుల్ని గుర్తించిన తర్వాత వారికి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ప్రతి నెలా గుర్తింపు కార్డు తీసుకొస్తే ఉచితంగా నిత్యావసరాలు అందిస్తారు. రంజాన్‌ పండగ సందర్భంగా ప్రతి నెలా ఇచ్చే వస్తువులకు అదనంగా 300 గ్రా. పొట్టేలు మాంసం, సేమియా, చక్కెర, నెయ్యి ప్యాకెట్లను అందిస్తారు. నాలుగు కుటుంబాలతో ప్రారంభమైన ఈ సంస్థ సేవలు ప్రస్తుతం 400 కుటుంబాలకు అందుతున్నాయి. సరకులకు నెలకు రూ.3.5 లక్షల దాకా ఖర్చవుతుంది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అవసరమయ్యే డబ్బుని కడపలోని వివిధ మసీదుల దగ్గర జోలె పట్టుకుని సేకరిస్తుంటారు. ఈ సంస్థ సేవల్ని మెచ్చి జాఫర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి నిర్వాహకులకు ప్రతి నెలా రెండు లక్షల రూపాయల్ని విరాళంగా ఇస్తున్నారు.

అంబులెన్స్‌ సేవలూ... 

నిత్యావసర వస్తువులే కాదు, పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైతే కుట్టుమిషన్లనీ ఇస్తారు. ఉచిత వైద్య శిబిరాల్నీ నిర్వహిస్తుంటారు. పేదలకు ఉచిత అంబులెన్స్‌ సేవల్నీ అందిస్తున్నారు. అంబులెన్స్‌ సేవలు కడప నగర పరిధి వరకూ అయితే ఉచితం, ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఇంధనం, డ్రైవర్‌ ఖర్చుల్ని ఇవ్వాలి. 24 గంటలూ అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ‘మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలు మొదలు పెట్టాం. మా ప్రయత్నంవల్ల ఎందరో కడుపునిండా అన్నం తినగలుగుతున్నారు. వందలమంది పెద్ద మనసు చేసుకుని నెలా నెలా కొంత మొత్తాన్ని ఇస్తుంటారు. ఈ సేవల్ని మరింత మందికి విస్తరించాలని ఉంది. దీంతోపాటు పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం’ అంటారు సంఘం అధ్యక్షుడు మహబూబ్‌ బాషా (ఫోన్‌: 9441930986). వీరిని చూస్తుంటే ‘మాయమైపోలేదింకా మనిషన్నవాడు’ అనిపిస్తోంది కదా!

- జాలా సుందర్‌రావు, న్యూస్‌టుడే, కడప

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.