close
గవ్వలతో ఆటాడుకుందామా?

గవ్వలు అంటే ఈతరానికి తినేవి మాత్రమే గుర్తుకొస్తాయి. పాతతరానికి మాత్రం చాకొలెట్‌ రంగులో తెల్లని చుక్కలతో ఉండే పెద్ద గవ్వలూ చిన్నచిన్న తెల్లని గవ్వలతో నిండిన డబ్బా, గచ్చుమీద మెరిసే పచ్చీస్‌ బోర్డూ కళ్లముందు కదలాడతాయి. భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లే పాత ఆటలూ మళ్లీ బోర్డులెక్కి మరీ వస్తున్నాయి...  వాటితోపాటే గవ్వలూ గలగలలాడుతున్నాయి... అదీ రంగురంగుల్లో. ఆ గవ్వల కథకమామీషు..!

ముప్ఫై, నలభై సంవత్సరాల క్రితం ఊళ్లలోకి వెళితే మధ్యాహ్న సమయంలో ఆడవాళ్లంతా చేరి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అష్టాచెమ్మా, పచ్చీస్‌... వంటి ఇండోర్‌ గేమ్స్‌ ఆడుతూ కనిపించేవారు. సెలవుల్లో అయితే వాళ్లకి పక్కనే పిల్లలు కూడా కూర్చుని సీరియస్‌గా వైకుంఠపాళి ఆడేస్తుండేవారు. అయితే అందరి చేతుల్లోనూ కామన్‌గా కనిపించేవి గలగలలాడే గవ్వలే. పచ్చీస్‌కైనా వైకుంఠపాళికైనా పావులతోబాటు ఆడేందుకు గవ్వలు ఉండాల్సిందే. గవ్వలతో ఆడే ఆటలో, మిగిలినవన్నీ బోర్లాపడి ఒక్క గవ్వే తిరగబడితే ఒకటీ, రెండు తిరగబడితే రెండూ, అన్నీ తిరగబడితే నాలుగూ, అన్నీ బోర్లాపడితే ఎనిమిది చొప్పున లెక్కగట్టేవారు. అలా అప్పట్లో గవ్వలు ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. గవ్వలు నిజానికి మొలస్కన్‌ జీవులు. అంటే సాగర తీరాల్లో కనిపించే నత్తలూ, ఆల్చిప్పల్లాంటి సముద్ర జీవులే. గవ్వలనే కౌరీలనీ పిలుస్తారు. కాకపోతే నత్తలు నీళ్లలోనే కాకుండా ఎక్కువగా సముద్రతీరంలోనూ నివసించడంతో అందులోని జీవులు చనిపోయాక వాటి గుల్లలు ఇసుకలో కనిపిస్తాయి. గవ్వల జీవులు ఎక్కువగా సముద్రగర్భంలోని రాళ్లలోనే జీవిస్తాయి. అవి చనిపోయాక వాటి షెల్స్‌(కవచాలు)ని సేకరిస్తుంటారు. ఇవి ఎక్కువగా హిందూ మహాసముద్రంలోనే పెరుగుతాయి. అందుకే వీటిని మాల్దీవులు, శ్రీలంక, బోర్నియో, ఆఫ్రికన్‌ తీర ప్రాంతాలవాళ్లు ఎక్కువగా సేకరించి మార్కెట్లో విక్రయిస్తుంటారు.

మనకు తెలిసిన గవ్వలు రెండుమూడు రకాలే. కానీ నిజానికి వాటిల్లో బోలెడు రకాలున్నాయి. రంగురంగుల డిజైన్లలో ఉండే వాటిని చూస్తుంటే సృష్టిలోని డిజైన్లన్నీ సముద్రగర్భంలోంచే పుట్టుకొచ్చాయా అనిపించడం సహజం. అందుకే పూర్వకాలంలో వీటిని సేకరించి, అపురూపంగా దాచిపెట్టి మరీ కరెన్సీగా వాడుకునేవారు. గవ్వల్లో సైజులకీ కొదవ లేదు. అందుకే వాటి పరిమాణం, రంగు, లభ్యతని బట్టి వాటిని వెలగట్టేవారు. చాలాచోట్ల రంగురంగుల గవ్వల్నిఆభరణాలుగానూ పెట్టుకునేవారు. హిందూమహాసముద్రంలోని దీవుల్లోనూ ఆఫ్రికన్‌ తీరంలోనూ నివసించే అనేక తెగల్లో వీటిని ఆభరణాలుగా ధరించడం ఇప్పటికీ వాడుకలో ఉంది. బంగారు వర్ణంలో ఉండే గవ్వల్ని ఫిజీ దీవుల్లోని తెగల పెద్దలు మాత్రమే ధరిస్తారు. గృహాలంకరణలోనూ రకరకాల హస్తకళాకృతుల తయారీలోనూ గవ్వలు అందంగా కనువిందు చేస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవికి ప్రతీకగా భావించి పండగ సమయాల్లో వీటిని పూజిస్తుంటారు కూడా. ఇక, అప్పుడైనా ఇప్పుడైనా పచ్చీస్‌, అష్టాచెమ్మా... వంటి బోర్డుగేమ్‌ ఆటల్లోని లెక్కలకోసం గవ్వల్నే గలగలలాడించి వేస్తుంటారు. కావలసిన సంఖ్య వచ్చేలా గవ్వల్ని వేయడంలోనే ఆటాడేవాళ్ల నైపుణ్యం దాగి ఉంటుంది. నేపాల్‌లో అయితే గ్యాంబ్లింగ్‌ ఆటలోనూ గవ్వల్నే వాడతారట. సో, మర్చిపోయిన గవ్వల్ని డబ్బాలోంచి తీసి మనమూ ఓ ఆటాడేద్దామా..!

 

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.