close
అన్నం డబ్బా...అదిరిందబ్బా!

యూనిఫామ్‌ వేసుకుని షూ తొడిగి చక్కగా ముస్తాబైన చంటిగాడూ దువ్విన తలనే దువ్వి, అద్దిన పౌడరే అద్ది, టిప్‌ టాప్‌గా  రెడీ అయ్యి కాలేజీకెళ్లే అమ్మాయిలూ అబ్బాయిలూ ఇన్‌షర్ట్‌ చేసిన షర్టూ పాలిష్‌ వేసిన షూలతో ఆఫీసుకెళ్లే మగమహారాజులూ వారితో పోటీపడే భామామణులూ... ఇలా బడి, కాలేజీ, ఆఫీసు అంటూ వెళ్లే చోటు మారొచ్చు కానీ అందరి చేతిలో టిఫిన్‌, లంచ్‌ బాక్సులు ఉండడం మాత్రం కామనే. అలా అని బాక్సులన్నీ  ఒకేరకంగా  ఉంటున్నాయనుకుంటే పొరపాటే...  ఇపుడు లంచ్‌ బాక్సుల్లో వస్తున్న కొత్త  ఫీచర్లూ ఆకారాలూ అన్నీ ఇన్నీ కావు మరి.

స్టీలు బాక్సులూ టిఫినీలూ క్యారేజీలూ... ఒక్కప్పుడు అన్నం తీసుకెళ్లడానికి అందరూ ఇవే వాడేవారు. తర్వాత్తర్వాత హాట్‌ ప్యాక్‌లూ టప్పర్‌వేర్‌ బాక్సులూ బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఏదైనా అక్కడితో ఆగిపోతే కొత్తదనం ఏముంటుందీ... టీవీని కనిపెట్టేశాం కదా అని ఊరుకుంటే కలర్‌ టీవీలూ వాటి తర్వాత ఎల్‌సీడీలూ ఎల్‌ఈడీలూ స్మార్ట్‌ టీవీలూ వచ్చేవా... అలాగే బాక్సుల్లోనూ మన అలవాట్లూ సౌకర్యాలకు అనుగుణంగా ఎన్నో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. టిఫిన్‌ బాక్సులో శాండ్‌విచ్‌లూ బర్గర్లను పెట్టుకోవడం సాధారణమే. కానీ ఆ బాక్సే శాండ్‌విచ్‌లా బర్గర్‌లా ఉంటే... క్యాంటీన్‌లోకి అన్నం బాక్సు బదులు పుస్తకాన్ని తెచ్చి ఎదురుగా పెట్టుకుని కూర్చుంటే... దాన్ని తెరవగానే ఘుమఘుమలాడే వంటకాలు ప్రత్యక్షమైతే... ఇక, క్యారేజీ చూడచక్కని బొమ్మలానూ, బాక్సు గిటార్‌లానూ హెల్లోకిట్టీ బాల్‌లానూ దర్శనమిస్తే... చూసేవారెవరైనా ఆశ్చర్యపోకుండా ఉండగలరా... ఇలా షోకేసులో బొమ్మలా అనిపించేలా లంచ్‌ బాక్సులు ఎన్నో రకాలుగా ముస్తాబవుతున్నాయి. చేతిలో ఉండే ప్రతి వస్తువూ విభిన్నంగా ఉండాలని కోరుకునే ఈతరం కోసం ప్రత్యేకంగా తయారవుతున్నాయి. పెద్దలకే కాదు, అన్నం వద్దు అంటూ మారాం చేసే పిల్లలకు సైతం ఈ బాక్సులు తెగనచ్చేస్తాయనడంలో సందేహంలేదు. అంతేనా, చిన్నారులు వీటిని చూపించి స్నేహితుల దగ్గర ఫోజు కొట్టేస్తూ మరీ అన్నం తినేస్తారు. బడులు తెరుస్తున్నారుగా, మీ పిల్లలకూ కొనేయండి మరి. హైటెక్‌ ఫీచర్ల విషయానికొస్తే తినే సమయానికి కొంచెంముందు యూఎస్‌బీ ప్లగ్‌ గుచ్చితే భోజనాన్ని వేడెక్కించేవి కొన్నైతే బాక్సులే కుక్కర్లలా మారి తినే సమయానికి అన్నాన్ని వండి ఉంచేవి మరికొన్ని. అలాంటి ప్రత్యేకతలున్న బాక్సులు కొన్ని చూస్తే...


బ్యాగులాంటి బాక్సు!

కాలేజీకీ ఆఫీసుకీ తీసుకెళ్లే అన్నం బాక్సులు వీలైనంత ఫ్యాషన్‌బుల్‌గా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు యువత. అలాంటివారికోసం వస్తున్నవే ‘సకురా ఫుడ్‌ ఏ పోర్టర్‌’ లంచ్‌ బాక్సులు. పైకి చూస్తే చిన్నసైజు హ్యాండ్‌బ్యాగ్‌లా ఉండే ఈ బాక్సు నిజానికి మూడు గిన్నెల క్యారియర్‌. భలే పాష్‌గా ఉంది కదూ...


ఒకే దాన్లో వేడిగా చల్లగా...

న్నం కూరా వేడిగా ఉంటే బాగుంటాయి. పెరుగు చల్లగా ఉంటే తినాలనిపిస్తుంది. పండ్లూ కూరగాయ ముక్కలు కూడా  అంతే, వేడి తగిలితే పాడైపోతాయి. అందుకే, ఒకే క్యారేజీలో ఉన్న మూడు నాలుగు గిన్నెల్లో వేరువేరుగా వీటిని పెట్టినా అన్నం కూరల వేడి పెరుగుకీ పండ్ల ముక్కలకీ తగిలి అవి పాడైపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ఈ ‘ఓమీ బాక్స్‌’. నాలుగు అరలుగా ఉండే ఈ బాక్సుని ప్రత్యేక నిర్మాణంతో తయారుచేయడం వల్ల దీన్లోని ఒక అరలో పెట్టిన పదార్థాల వేడి మరో అరలోకి చొరబడదు. చల్లటి పదార్థాల చల్లదనమూ పక్కవాటికి సోకదు. కాబట్టి, వేరు వేరు డబ్బాలతో పనిలేకుండా ఎంచక్కా ఒకే బాక్సులో వేడివీ చల్లటివీ 
తీసుకెళ్లిపోవచ్చు. 


వేడి చేసేస్తుంది...

లాంటి వంటకాలైనా వేడిగా ఉన్నపుడు ఉన్నంత రుచిగా చల్లారిపోతే ఉండవు. కానీ ఎంత మంచి హాట్‌బాక్సుల్లో పెట్టినా కొన్ని గంటలే వేడిగా ఉంటాయి. మరోపక్కేమో ఆఫీసులు దూరంగా ఉండడమో మరో కారణంతోనో పొద్దుపొద్దున్నే వంట చేసేస్తాం. అవి మనం తినేసరికి చల్లగా అయిపోతుంటాయి. ఆ బాధంతా లేకుండా ఇపుడు ఎలక్ట్రిక్‌ హీటింగ్‌ లంచ్‌ బాక్సులు వస్తున్నాయి. మనం తినే కొద్ది నిమిషాల ముందు వీటి వైరుని ప్లగ్‌లో గుచ్చితే చాలు, పదార్థాలు చక్కగా వేడెక్కుతాయి. ఫోన్‌ ఛార్జర్‌లా వీటి వైరుని కూడా పూర్తిగా తీసేసి బ్యాగులో పెట్టేసుకోవచ్చు. కాబట్టి మిగిలిన సమయాల్లో వైరు అడ్డంగా కూడా ఉండదు. అసలు వైరుతో పని లేకుండా రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే హీట్‌ బాక్స్‌లు కూడా వస్తున్నాయి. ఇవుంటే ఎక్కడైనా ఎప్పుడైనా కరెంటుతో పనిలేకుండా బాక్సుకున్న బటన్‌ నొక్కి భోజనాన్ని వేడిగా చేసుకోవచ్చు. 


క్యాలరీలను లెక్కబెడుతుంది..!


 

రువు తగ్గాలన్నా అదుపులో ఉంచుకోవాలన్నా రోజూ తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలుంటున్నాయో తెలుసుకోవడం అవసరం. కానీ ప్రతిరోజూ అన్నం బాక్సులో తీసుకెళ్లే క్యాలరీలను కొలవడం కష్టం. అదే 
ఈ ‘ప్రెప్డ్‌ ప్యాక్‌’ లంచ్‌ బాక్సు ఉందనుకోండీ అందులో పెట్టిన పదార్థాల్లో ఎన్ని క్యాలరీలు దాగున్నాయో రోజూ ఫోన్‌లోని ఆప్‌కి మెసేజ్‌ వచ్చేస్తుంది. అంతేకాదు, ఆరోగ్యకరంగా క్యాలరీలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, వాటి రెసిపీలను కూడా ప్రెప్డ్‌ప్యాక్‌ ఆప్‌ సూచిస్తుంది. అన్నట్లూ ఈ బాక్సు పలుచగా రెండు పుస్తకాల సైజులో ఉండి ఎక్కడికైనా తీసుకెళ్లేందుకూ సౌకర్యంగా ఉంటుంది. 


బాక్సే కుక్కర్‌!

పొద్దునెప్పుడో వండుకుని బాక్సులో పెట్టుకున్న అన్నం హాట్‌బాక్సులో పెట్టినా మధ్యాహ్నానికి వేడి తగ్గిపోతుంది. ఆమాత్రం దానికి ఉదయాన్నే హడావుడిగా వండుకుని తెచ్చుకోవడం ఎందుకు... బాక్సులో బియ్యం కడిగి పెట్టేసుకుని తినే అరగంట ముందు స్విచ్‌ ఆన్‌ చేస్తే పోలా... ఈ ఆలోచనతో వచ్చినవే ఎలక్ట్రిక్‌ లంచ్‌ బాక్సులు. మినీ కరెంటు కుక్కర్లలా పనిచేసే వీటిలో ఒక్క గిన్నె ఉన్నవీ మూడు గిన్నెలున్న క్యారియర్లు కూడా ఉన్నాయి. అంటే... అన్నంతో పాటు పప్పులాంటి వాటిని కూడా బాక్సులోనే కావాలనుకున్నపుడు వండేసుకోవచ్చన్నమాట. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ మినీ కుక్కర్ల వైరుని కంప్యూటర్‌ లేదా ప్లగ్‌లో గుచ్చేస్తే చాలు. వీటిలో రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసేవీ ఉన్నాయి. ఇక, ఒక్కరిద్దరే ఉండే బ్యాచిలర్లు కుక్కర్లో వండి వాటిని మళ్లీ హాట్‌ బాక్సులో పెట్టుకునే పనిలేకుండా అన్నం కూరలూ కిచిడీలను నేరుగా ఎంత కావాలో అంత ఈ ఎలక్ట్రిక్‌ లంచ్‌ బాక్సుల్లో వండేసుకుని తీసుకెళ్లిపోవచ్చు కూడా. 


తీసుకెళ్లడానికీ తినడానికీ...

లంచ్‌ బాక్సు ఉంటే సరిపోదు, దాన్ని తీసుకెళ్లేందుకు ఓ బ్యాగుని కూడా కొనాలి. ఆ ఇబ్బంది లేకుండా ఈ ‘డైన్‌ ఎవే లంచ్‌బాక్స్‌’ని బ్యాగుతో కలిపే రూపొందించారు. ఇది హ్యాండ్‌బ్యాగ్‌లా చూడ్డానికి అందంగా సౌకర్యంగా ఉండడమే కాదు, భోజనం చేసేటపుడు ఈ బ్యాగుని పూర్తిగా తెరిచి మ్యాట్‌లా వేసుకుని దానిమీదే బాక్సులు పెట్టేసుకుని తినేయొచ్చు. తిన్నాక మళ్లీ బ్యాగులా మార్చేయొచ్చు. ఆలోచన అదిరింది కదూ..!

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.