close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వయసు ముదిరితే..!

వయసు ముదిరితే..!

‘బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ఒకటే’ అనడం వింటుంటాం. కానీ సంతానం విషయంలో మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే సంతానోత్పత్తికి స్త్రీల వయసు మాత్రమే కీలకం అనుకుంటారు. అందుకే 35 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టడం కష్టమనీ, పుట్టినా వాళ్ల ఆరోగ్యంమీద ప్రభావం కనబరుస్తుందన్న కారణంతో అమ్మాయిల్ని పెళ్లికి తొందరపెడుతుంటారు. కానీ ఈ సూత్రం నూటికి నూరుశాతం పురుషులకీ వర్తిస్తుందని అమెరికాలో చేసిన అధ్యయనాల్లో స్పష్టమైంది. సంతాన సాఫల్యకేంద్రాలను ఆశ్రయించేవారిలో 35- 40 ఏళ్లలోపు పురుషులే ఎక్కువట. అంతేకాదు, 45 దాటిన పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గడంతోబాటు గర్భధారణ సమయంలో తల్లికీ పుట్టబోయే బిడ్డకీ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. గర్భిణుల్లో మధుమేహం రావడం, నెలలు నిండకుండానే ప్రసవించడం సంభవిస్తుంటే, బరువు తక్కువగా ఉండటం, గుండెల్లో రంధ్రాలు ఏర్పడటం, మూర్ఛవ్యాధులు సోకడం, మానసిక లోపాలు తలెత్తడం.. వంటి సమస్యలు పుట్టే పిల్లల్లో కనిపిస్తున్నాయట. వయసు పెరిగేకొద్దీ టెస్టొస్టెరాన్‌ శాతం తగ్గడంతో శుక్రకణాల నాణ్యత బాగా తగ్గిపోతుందనీ ఆ ప్రభావం పుట్టే బిడ్డ డీఎన్‌ఏ మీదా పడటంవల్లే పిల్లల్లో రకరకాల లోపాలు తలెత్తుతున్నాయనీ హెచ్చరిస్తున్నారు సదరు పరిశోధకులు.


వేసవిదాహానికి చక్కని పరిష్కారం కొబ్బరినీళ్లు అని తెలిసిందే. అందులో ఎలక్ట్రోలైట్లూ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా లభిస్తాయి. దాంతో చెమట రూపంలో పోయే లవణాలన్నీ కొబ్బరినీళ్ల ద్వారా అందుతాయి. అందుకే వ్యాయామం చేసేవాళ్లకీ ఆటలు ఆడేవాళ్లకీ ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎండకి మూత్రం సరిగ్గా రాక ఇబ్బందిపడేవాళ్లు కూడా ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పార్శ్వపునొప్పితో బాధపడేవాళ్లు రోజూ మూడుసార్లు కొబ్బరినీళ్లు తాగితే నొప్పి తగ్గిపోతుంది. పోతపాలు పట్టించే పిల్లలకు ఆ పాలల్లో కాసిని కొబ్బరినీళ్లు కలపడం వల్ల తల్లిపాలల్లా పనిచేస్తాయట. తాజా కొబ్బరినీళ్లలో యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉండటం వల్ల అనేక వ్యాధుల్ని నిరోధిస్తాయి. అందుకే కొబ్బరినీళ్లు వాటికవే సాటి. 


శాకాహారమే ఉత్తమం!

ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి కారణం శాకాహారంతో పోలిస్తే మాంసాహార వాడకం ఎక్కువ కావడమే అంటున్నారు మేయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు దాదాపు 150 మందిని ఎంపికచేసి వాళ్లను పది సంవత్సరాలపాటు నిశితంగా గమనించారట. అందులో మాంసాహారం ఎక్కువగా తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా చేరడం, ఊబకాయం రావడంతోబాటు హృద్రోగాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందట. అంతేకాదు, వాళ్లలో హార్ట్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారట. అదే కూరగాయలూ పండ్లూ ఎక్కువగా తీసుకునేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉండటంతోబాటు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 90 శాతం తక్కువని గుర్తించారట. అంటే, ఎవరైనా సరే శాకాహారం తీసుకోవడమే ఉత్తమం అన్నమాట!


నిద్రతోనే జ్ఞాపకం!

జ్ఞాపకశక్తికీ నిద్రకీ విడదీయలేని సంబంధం ఉందన్న విషయాన్ని పరిశోధకులు ఏనాడో గుర్తించారు. అది ఎలా నిక్షిప్తం అవుతుందన్నదే ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారు. నిద్రపోయినప్పుడు మెదడు భాగం నుంచి కొన్ని తరంగాలు విడుదలవుతాయనీ, అవి కొత్తగా నేర్చుకున్న లేదా తెలుసుకున్న విషయాలను జ్ఞాపకాల రూపంలో భద్రపరుస్తాయనీ పేర్కొంటున్నారు కంకార్డియా యూనివర్సిటీ పరిశోధకులు. నిద్రలో మొదటి దశని దాటి రెండో దశకుచేరుకున్నప్పుడు- అంటే, గాఢ నిద్రలోకి వెళ్లే స్థితిలో న్యూరాన్ల నుంచి కొన్ని విద్యుదయస్కాంత తరంగాలు వెలువడతాయి. వీటినే స్లీప్‌ స్పిండల్స్‌ అంటారు. ఇవి నిద్రకు ఉపక్రమించే ముందు వరకూ హిప్పోక్యాంపస్‌ సేకరించిన సమాచారాన్ని నియో-కార్టెక్స్‌ భాగానికి మారుస్తాయి. ఈ విషయాన్ని విద్యార్థుల్లో తీసిన ఈఈజీ, ఎఫ్‌ఎమ్మారై వంటి వాటి ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా నిద్రలో హిప్పోక్యాంపస్‌ చురుకుగా పనిచేయడాన్నీ గుర్తించారు. సో, నేర్చుకున్న, చదివిన లేదా చూసిన విషయమేదయినా సరే జ్ఞాపకంగా మారాలంటే నిద్ర చాలా అవసరమన్నమాట!

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.