close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అభీష్ట వరదుడు మృత్యుంజయేశ్వరుడు!

త్రిమూర్తుల్లో శివుడు లయకారకుడు. ఆయువు తీరిన వారిని తనలో ఐక్యం చేసుకోవడమే ఆయన విధి. కానీ, చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిలో కొలువైన పరమశివుడు తనను దర్శించిన భక్తులకు అపమృత్యుభయాలను పోగొడుతూ, నమ్మి కొలిచిన వారి అభీష్టాలను నెరవేరుస్తూ అభీష్టదా మృత్యుంజయేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.

‘శం’ అంటే శాశ్వతానందం, ఈకారం పురుష బోధకం, వకారం శక్తి అమృతత్వ సూచికం... ఈ మూడింటి సమ్మేళనమే శివుడు అనేది పురాణోక్తి. ఇలాంటి పరమేశ్వరుడు చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిలో అభీష్టదా మృత్యుంజయేశ్వరుడిగా నెలకొన్నాడు. బోళా శంకరుడిగా కోరిన కోర్కెలు తక్షణం తీర్చడంతోపాటు ఆకాలమృత్యువు సంభవించకుండా భక్తులకు కొండంత అండగా ఉండటంతో శివయ్యకు ఆ పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. మృత్యుంజయాయ, త్రిపురాంతకాయ... అంటూ పండితులు స్తుతించే వేదమంత్రాలతోపాటు ద్వాదశ అఖండ దీపాలు నిత్యం ప్రకాశిస్తుండటం ఈ ఆలయం ప్రత్యేకత.

ఇదీ కథ 
పుంగనూరు జమీందారు రాజా ఇమ్మడి చిక్కరాయలు చౌడేపల్లికి సమీపంలోని ఆవులపల్లెలో విడిది చేస్తుండేవాడు. ఓసారి శివపార్వతులు రాయలకు కలలో కనిపించి, సమీపంలోని కొలనులో తమ విగ్రహాలు ఉన్నాయనీ, బయటకు తీసి వాటిని ప్రతిష్ఠించమనీ ఆనతిచ్చారు. సూర్యోదయం కాగానే రాయలు తన పరివారంతో కొలను దగ్గరకు వెళ్లి వెతికించగా, అక్కడ పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు దొరికాయి. దీంతో రాయలు సంతోషించి తన స్వస్థలం పుంగనూరులో ఆలయం నిర్మించాలనుకున్నాడు. విగ్రహాలను తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో చీకటి పడింది. దీంతో రాయలు ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలోనే ఆ రాత్రి బస చేశాడు. బసచేసిన ఆ ప్రాంతంలోనే తమకు ఆలయాన్ని నిర్మించమని శివుడు స్వప్నంలో కనిపించి చెప్పగా, దాని ప్రకారమే వేలాదిమంది శిల్పులను అక్కడికే రప్పించి గొప్ప ఆలయం నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు రాయలు. నిర్మాణపనులు కొనసాగుతున్న సమయంలోనే రాయలు అంతుపట్టని వ్యాధితో మంచం పట్టాడు. వైద్యులు మరణం తప్పదని చెప్పడంతో, దుఃఖితుడై ‘శివా నీ ఆలయ నిర్మాణం పూర్తిచేసే వరకైనా నా ప్రాణాలు నిలుపు’అని ప్రార్థించాడు. నాటి రాత్రే శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై ‘నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు మాత్రమే కాదు ఇకమీద... ఈ క్షేత్రానికి చేరుకుని, నన్ను సేవించిన వారికి ఎలాంటి ప్రాణగండాలూ ఉండవు. అందుచేతనే నేను ఈ క్షేత్రంలో మృత్యుంజయుడన్న పేరుతో పూజలందుకుంటాను’ అని అభయాన్ని ఇస్తాడు. దీంతో రాయలు కోలుకోవడమే కాకుండా ఆలయనిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తిచేశాడు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు 
నిరంతరాయంగా వెలిగే ద్వాదశ జ్యోతులతోపాటు శివలింగానికి అమర్చే కవచం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గర్భాలయంలో లింగానికి శివముఖాకృతిని జోడించిన ఓ విశిష్ట కవచాన్ని అమర్చుతారు. ఆ తర్వాత రంగురంగుల పుష్పాలతో స్వామివారికి వివిధ అలంకారాలు చేస్తారు. ఏటా ఈ ఆలయంలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వీటిలో పాల్గొని, మనోహరమైన శివలింగాన్ని మనసులో ప్రతిష్ఠించుకునేందుకు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, బెంగుళూరుల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. 
ఈ ఆలయప్రాంగణంలోనే జగన్మాత ప్రసన్నపార్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడే సుబ్రమణ్యస్వామి ఆలయం కూడా ఉంది. సంతానంలేని దంపతులు షణ్ముఖుని ఆలయంలో విశేష పూజలు చేస్తారు. వీటితోపాటు వీరభద్రస్వామి, భద్రకాళి, నవగ్రహాలు, దుర్గ, గణపతి, నాగదేవతలు, మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ, చండీశ్వరుని విగ్రహాలూ ఈ క్షేత్రంలోనే దర్శనమివ్వడం విశేషం.

ఇలా చేరుకోవాలి 
అభీష్టద మృత్యుంజయేశ్వరుడి ఆలయానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు జిల్లా కేంద్రంనుంచి చౌడేపల్లి 69 కీ.మీ. దూరంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచీ చిత్తూరుకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పలమనేరు, డౌడేపల్లి మీదుగా చౌడేపల్లి చేరుకోవచ్చు. రైల్లో వచ్చే భక్తులు...చిత్తూరు, తిరుపతి స్టేషన్లలో దిగి, అనంతపురం తిరుపతి హైవే మీదుగా ప్రయాణించి శివయ్యను దర్శించుకోవచ్చు.

- ఉప్పాల రాజా పృథ్వి, ఈనాడు జర్నలిజం స్కూల్‌ 
చిత్రాలు: చోప్పా సుబ్రహ్మణ్యం

(2 జాన్‌ 2019) 

 


ఆలయాలు కొండమీదే ఎందుకు?

దేవుళ్లలో ఏమీ తేడా ఉండదు. ఎక్కడున్నా దేవుడు దేవుడే. నేలమీద ఉన్నా కొండపైన ఉన్నా భగవంతుడు అందర్నీ సమానదృష్టితోనే చూస్తాడు. కరుణా కటాక్షాలను అందిస్తాడు. అయితే మనం ఎంత కష్టానికి ఓర్చి దైవ దర్శనం చేసుకోగలమో మనకు దేవుడిమీద ఎంత భక్తివిశ్వాసాలు ఉన్నాయో పరీక్షించడానికే దేవుళ్లు కొండలమీదా, గుట్టలమీదా వెలశారని పెద్దలు చెబుతారు. అంతేకాదు, ప్రకృతి అంటే ఆ దేవదేవుడికి ఎనలేని ప్రేమ. సర్వప్రాణులతో సమానంగా కొండలూ కోనలనూ ఉద్ధరించాలన్నది ఆయన అభిమతం కూడా. అందుకే వాటిమీదే నివాసముంటాడు. తన పాదస్పర్శతో కొండలు తరిస్తాయి. సెలయేళ్లూ, ఫలపుష్పాలు భక్తులను సేదతీరుస్తాయి. దీనికోసమే రుషులు కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. భద్రగిరి, యాదగిరి, వేదగిరి వీరంతా రుషులే. తపస్సు చేసి తమపై కొలువుండాలని కోరుకుని మరీ స్వామిని పిలుచుకుని కొండలుగా మారారు.

                                                                                         (2 జాన్‌ 2019)
Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు