close
బొకే 

- కోటమర్తి రాధా హిమబిందు

‘‘గుడ్‌ మార్నింగ్‌ సార్‌.’’ 
‘‘మీరా... రండి, రండి...’’ ఆశ్చర్యపోయి లోపలికి రమ్మన్నాను మాధవరావుగారిని. 
‘‘ఏంటి, రావట్లేదా మీరు..? రండి సార్‌, మీకోసం చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ అంతా వెయిటింగ్‌.’’ 
‘‘అదీ...’’ 
‘‘మరీ అంత మొహమాటం ఏంటి సార్‌... అమ్మా, వందనా...’’ అంటూ లోపలికి చూస్తూ కేకేశారు మాధవరావుగారు. కిచెన్‌ నుండి బయటకు వచ్చింది వందన. 
‘‘ఈరోజు సరదాగా కలిసి ఉందాం, అటే రమ్మన్నాంగా... ఏంటి ఆలస్యం? కాసేపట్లో వ్రతం ప్రారంభం అవుతుంది. ఈలోగా మీరంతా టిఫిన్స్‌ ముగించుకుంటే సరిపోతుంది’’ అన్నారు మాధవరావుగారు. 
‘‘అన్నయ్యగారూ... రాత్రి గృహప్రవేశానికి వచ్చాంగా, మళ్ళీ ఇప్పుడు...’’ అంది వందన మొహమాటంగా. 
‘‘ఏంటమ్మా అలా అంటావు? రాత్రి అందరం మరీమరీ చెప్పాంగా- ఈరోజు రావాల్సిందే అని.’’ 
‘‘చెప్పారు కానీ...’’ 
‘‘కానీ లేదు... ఏం లేదు. రెడీ అయి పది నిమిషాల్లో రండి. మరోసారి చెబుతున్నాను... మీ భోజనం మా ఇంట్లోనే’’ చిరునవ్వుతో మా ఇద్దర్నీ చూసి తలూపి వెళ్ళిపోయారు. 
‘‘ఎంత మంచివాళ్ళండీ వీళ్ళు..?’’ 
మాట్లాడలేదు నేను. పక్కింటికి వెళ్ళేందుకు రెడీ అయ్యాం ఇద్దరం.

* * * * *

రాత్రి పక్కింట్లో గృహప్రవేశం. నాలుగు వందల గజాల్లో ఇల్లు... త్రిబుల్‌ బెడ్‌రూమ్‌. హాలూ కిచెనూ చాలా విశాలంగా కట్టారు. పక్క ఇల్లే మాది కాబట్టి చంటిపిల్ల పెరగటం చూస్తున్నట్లుగా ఇంటి కట్టుబడి అంతా గమనిస్తూనే ఉన్నాను. ఇల్లు కట్టుబడిని కాంట్రాక్ట్‌కివ్వటంతో అసలువాళ్ళు ఎవరూ కన్పించేవారు కాదు. ఎప్పుడో రెండు మూడుసార్లు మాధవరావుగారిని చూశాను. నేను పరిచయం చేసుకోలేదూ పలకరించనూ లేదు. ఆదివారాలు నాకెవరూ కన్పించలేదు. వాళ్ళవాళ్ళు ఎవరన్నా వచ్చి వెళ్ళేవారేమో నాకు తెలియదు. 
మేం వెళ్ళేసరికి అందరిలో చలనం వచ్చినట్లు గబగబా లేచారు. టిఫిన్స్‌ పెట్టడం ప్రారంభించారు. మాధవరావుగారూ అతని భార్యా వ్రతం చేసుకుంటాంగాబట్టి తినమని చెప్పారు. అంతా జోక్స్‌ వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టిఫిన్లు ముగించారు. మాధవరావుగారు వాళ్ళు- మొత్తం ఏడుగురు... అన్నదమ్ములు ముగ్గురూ అక్కచెల్లెళ్ళు నలుగురు. మరదళ్ళూ భార్యా బావగార్లూ ఏడుగురు... వాళ్ళు పద్నాలుగుమంది, మేం ఇద్దరం మొత్తం పదహారు- అంతే! 
వ్రతం ప్రారంభం అయింది. అంతా శ్రద్ధగా విన్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనాలు ముగిశాయి. ‘‘భోజనాలు ఎలా ఉన్నాయి సార్‌?’’ అడిగారు మాధవరావుగారు. 
‘‘చాలా బాగున్నాయి’’ ఇబ్బందిగా కదులుతూ చెప్పాను. వందన అందరితో చేరి ఉత్సాహంగా మాట్లాడుతోంది. 
‘‘మీ ఫ్యామిలీస్‌ వరకే వచ్చారు... మీ పిల్లలూ..?’’ 
‘‘అందరి పిల్లలూ అమెరికా, ఆస్ట్రేలియా అలా ఉన్నారు. ఢిల్లీ, బెంగుళూరులో ఉన్న పిల్లలకు వీలవలేదు, రాలేదు. అందరికీ వీలైనప్పుడు మరోసారి ఈ ఇంట్లో గెట్‌ టు గెదర్‌ పెట్టుకుంటాం... కలుస్తాం.’’ 
ఇంకేం మాట్లాడాలో తోచలేదు నాకు. 
‘‘మీరు ఎంతమంది?’’ మాధవరావుగారే చొరవగా అడిగారు. 
‘‘ఇద్దరు అన్నయ్యలు, అక్కయ్య, చెల్లెలు’’ చెప్పాను. 
‘‘అంతా కలిసిమెలిసి ఉంటారా?’’ 
‘‘ఆ...’’ 
‘‘ఇంకెన్ని సంవత్సరాలుంది మీ సర్వీసు?’’ 
‘‘వచ్చే సంవత్సరం రిటైరవుతాను. అమ్మాయికి మ్యారేజీ అయింది, బాబుకి కావాలి. ఇద్దరూ యూఎస్‌లో ఉన్నారు.’’ 
‘‘అమ్మా నాన్నగారూ ఉన్నారా?’’ 
‘‘లేరండీ.’’ 
‘‘మాకూ అదే బాధ. మేం అందరం పెరిగి ప్రయోజకులం అయ్యాం... కానీ అమ్మా నాన్నగారూ మా అభివృద్ధిని చూడకుండానే వెళ్ళిపోయారు. మాది చాలా సాధారణ కుటుంబం. ప్చ్‌... మా అమ్మా నాన్నగారూ చాలా కష్టాలు పడ్డారు. అవేమీ తెలియనీయకుండా మమ్మల్ని పెంచారు. ఇంతమంది చదువులు ఎలా జరిగాయో అన్పిస్తుంది. మా అమ్మ అన్నపూర్ణ తల్లి. వచ్చేపోయే జనం... వాళ్ళకు వంట చేయటం, వడ్డించటం... ఎప్పుడూ ఇదే పని. నాన్నగారు నీతీ నిజాయతీ కలిగిన మనిషి. అప్పట్లో మా ఊరికి కరణంగా చేసేవారు. పట్వారీ అంటారు కూడా.’’ 
‘‘అవును, మా నాన్నగారు కూడా మా ఊరికి కరణంగారేనండీ.’’ 
‘‘మన ఇళ్ళల్లో అంతా అలాగే ఉండేదిలెండి. ఆ తరం దాటిపోయింది. ఈతరంలో మేము బాగానే ఉన్నాం. మా పిల్లల్ని బాగా చదివించుకున్నాం. వాళ్ళూ మంచి స్థాయిలోనే ఉన్నారు. ఏ లోటూ లేదు, అంతా సంతృప్తిగానే ఉందండీ. ముఖ్యంగా నన్ను నా చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ఎంతో గౌరవిస్తారు. ఆ పెద్దరికాన్ని నేనూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. వీలైనంత వరకూ వాళ్ళ సమస్యల్నీ విషయాల్నీ వాళ్ళవైపు నుండి ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. అందుకే వాళ్ళూ నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఏది చెప్పినా కాదనరు. మా బావగార్లు చాలా మంచి మనసున్న వ్యక్తులు. అలాగే నా భార్యా నా మరదళ్ళూ కూడా చాలా మంచివాళ్ళు. మాకెవ్వరికీ ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. దేవుడి దయవల్ల ఆర్థిక ఇబ్బందులూ లేవు. కాకపోతే ఒకరు కాస్త ఎక్కువగా ఒకరు కాస్త మామూలుగా ఉండవచ్చు. కానీ, ఆ భేదం మామధ్య లేదు. అందరం ఒకటే అన్నట్లుగా ఉంటాం. చాలా కలివిడిగా ఉంటాం. నేను పల్లెలో ఉంటాను. మిగతా ఆరుగురూ ఇక్కడే ఉంటారు. నన్ను హైద్రాబాద్‌ రమ్మని ఒకటే గొడవ. ఎప్పుడో తమ్ముళ్ళతోపాటు ఈ స్థలం తీసుకున్నాను. ఇదిగో, ఇన్నాళ్ళకు ఇల్లు కట్టాను. అంతా కలిసి గడపాలన్నదే మా అందరి ఉద్దేశ్యం. పల్లెకు ఈ ఆరుగురూ వస్తుంటారు. ఇకనుండి అప్పుడప్పుడు నేనూ నా భార్యా ఇక్కడకు వస్తుంటాం’’ 
చిరునవ్వుతో చెప్పారు మాధవరావుగారు. 
అందరూ అలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను. వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు మననం చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే నేనూ నా చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని చెప్పాను. 
‘‘ఏదైనా డబ్బు దగ్గరే వస్తుంది సార్‌. నిజానికి మా కుటుంబాల మధ్య డబ్బు విషయం ఎన్నడూ రాలేదు. డబ్బు పరంగా ఒకర్ని మరొకరం ఆదుకునేంత శక్తిపరులం కాదు. అందరం చాలా ఇబ్బందులుపడ్డాం. ఎవరి బాధలు వాళ్ళమే పడ్డాం. డబ్బు అవసరంపడితే బయట ఎక్కడోగానీ స్నేహితుల్నిగానీ అడిగి తీసుకున్నాంగానీ మామధ్య ఆర్థిక సంబంధాలు లేవు... ఓన్లీ రక్తసంబంధమే. అయితే, ఈమధ్య అదీ కాస్త మారింది. రెండో చెల్లెలు కూతురు ఇల్లు కట్టుకుంటోంది. నేనో మూడు లక్షలూ తమ్ముడో అయిదు లక్షలూ ఆ చెల్లెలు ఓ రెండు లక్షలూ ఇచ్చాం. నా మేనకోడలికి ఆత్మాభిమానం ఎక్కువ. మళ్ళీ తీసుకోవాలన్న కండిషన్‌ మీద తీసుకుంది. అలా చిన్నాచితకా సర్దుబాట్లు 
జరుగుతూనే ఉన్నాయి. 
ఏమైనా, మనం కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే ఏం పోతుంది? మనవాళ్ళు బాగుపడితే మంచిదే గదా. డబ్బు సమృద్ధిగా ఉంటే ఏదో కొద్దో గొప్పో సహాయపడవచ్చు గదా. మనం ఇంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడు అంటారు. నిజమో కాదో మనకు తెలియదు. కానీ కరెక్టేనేమో అని నాకన్పిస్తుంది. మా ఫ్యామిలీ అంతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చిన వాళ్లమే. కష్టం అనేది ఎలా ఉంటుందో మా అందరికీ తెల్సు. సుఖం రుచి ఇప్పుడు చూడగలుగుతున్నాం. అమ్మా నాన్నా మన చిన్నతనంలో అందరినీ సమానంగానే పెంచారు. ప్రాణప్రదంగానే చూసుకున్నారు. చిన్నప్పుడు స్కూళ్ళకు వెళ్ళే రోజుల్లోగానీ ప్రయాణాల్లోగానీ చెల్లెళ్ళనీ తమ్ముళ్ళనీ అతి జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. పెద్దయిన తర్వాత దూరాలు పెరుగుతాయెందుకు? 

దగ్గరగా ఉంటే మన డబ్బు అడుగుతారనా... ఏమైనా సహాయం కోరతారనా... మన విషయాలు అన్నీ తెలుస్తాయనా... ఇలాంటి భయాలేగా అన్నీ. ముందు మనం పద్ధతిగా ఉంటే ఎదుటివాళ్ళు ఎందుకు ఉండరు? ఉండలేదే అనుకోండి... మనం ప్రేమగా నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళల్లో మార్పు తేవచ్చుగా. తప్పేముంది అందులో... మనమే కదా! రక్త సంబంధం చాలా గొప్పది సార్‌. చిన్నతనంలో అమ్మా నాన్నా సంరక్షణలో ఓ ఇంట్లో కలిసిమెలిసి ఉండటం కాదు... పెళ్ళళ్ళయి ఎవరి జీవితాలు వాళ్ళవి అయిన తర్వాత కూడా ఆ క్లోజ్‌నెస్‌ ఉండాలి. కానీ, చాలా కుటుంబాలలో అలా ఉండరు. ఎక్కడో ఉద్యోగాలు... ఎన్నెన్నో మార్పులు. ఏవో మనసులో పెట్టుకుని దూరాలు... ఏవో కోపాలూ స్వార్థాలూ చిరాకులూ... అవన్నీ సృష్టించుకునేది మనమే కదా. కాస్త పెద్దమనసు చేసుకుని ఆత్మీయంగా దృష్టిపెడితే ఎంతగా కలిసిమెలిసి ఉండవచ్చు. 
చివరికి ఏముంది సార్‌... ఆరడుగుల నేలా, బూడిదా తప్ప. కష్టపడి సంపాదించినదంతా వెంట తీసుకెళ్తామా? ఇక్కడే వదిలి బంధాలన్నీ తెంచుకుని ఒంటరిగా వెళ్ళిపోవలసిందే కదా. మరి ఎందుకీ ఆరాటం. నాదీ నేనూ అనే కుత్సితపు భావాలు ఎందుకు?’’ ఆవేదనగా అన్నారు మాధవరావుగారు. 
‘‘చక్కగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుని వ్రతం ముగించుకుని ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకులే అన్నయ్యా. ఒకటి మాత్రం నిజం సార్‌, మా అన్నయ్యలాంటి అన్నయ్య చాలా అరుదుగా ఉంటారేమో అని మాకు అనిపిస్తుంది. మేమంతా చాలా అదృష్టవంతులం. ఏ కష్టం వచ్చినా మా అందరికీ ఎంత ధైర్యం చెప్తాడో! మేం ఇలా ఉన్నామంటే కారణం... మా అన్నయ్యే. మా అమ్మగారు కూడా అలాగే ఉండేవారు. పల్లెకు వెళ్తే పండుగ వాతావరణం ఉంటుంది. నిజానికి మేం అందరం ఎప్పుడు కలిసినా ఓ పండుగే’’ మాధవరావుగారి పెద్ద తమ్ముడు అన్నాడు. 
‘‘అవును సార్‌, మేం అంతా ఓ బొకేలా ఉంటాం. ఎక్కడ బొకే చూసినా మాకు మా కుటుంబం గుర్తొస్తుంది. అంత దగ్గరగా ఉంటాం’’ చిరునవ్వుతో అన్నాడు మాధవరావుగారి చిన్న తమ్ముడు. 
అందరితోపాటు మాకూ బట్టలు పెట్టారు. వద్దంటే వద్దన్నాం మేము. 
‘‘ఇంటికి ఆహ్వానించిన ఆడపిల్లనూ బావగార్నీ మర్యాదగా గౌరవంగా పంపించాలి కదా. మాకు ఇంకో చెల్లెలు ఈ గృహప్రవేశం సందర్భంగా దొరికింది’’ అంటుంటే మౌనంగా ఉండిపోయాం. 
‘‘రాత్రి మీరు ఇచ్చిన గిఫ్ట్‌ చూడండి’’ అంటూ కప్‌బోర్డ్‌ వైపు చూపించారు మాధవరావుగారు. కప్‌బోర్డ్‌లో పైన వినాయకుడు ఆశీర్వదిస్తూ కనిపించాడు. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించుకున్నాను. 
ఇంటికి రావటమే ఆలస్యం- వందన ఆనందంగా ఆరాటంగా చెప్పింది... మాధవరావుగారి రెండో తమ్ముడికి కూతురు ఉందనీ ఫొటో చూశాననీ జాబ్‌ చేస్తోందనీ... వివరంగా వివరాలు చెబుతుంటే నా మనసు ఇంకేదో ఆలోచిస్తోంది. 
‘‘ఏమండీ, వింటున్నారా?’’ భుజం తట్టింది వందన. 
‘‘వింటున్నాను వందనా. మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడగాలంటే ముందు నేను మారాల్సింది చాలా ఉంది.’’ 
‘‘ఏంటండీ’’ 
‘‘నేను చాలా చెడ్డవాణ్ణి వందనా. నీకూ ఆ విషయం తెలుసు. నా తీరు నచ్చకపోయినా నా అభిమతానికి అనుగుణంగానే నడుచుకున్నావు. వాళ్ళు అంతా కలిసి ఎంత ఆనందంగా ఉన్నారో చూడు... నాకెవరూ లేరు ఒంటరిని. నాకు నేనే ఇలా చేసుకున్నాను. అన్నయ్యలూ అక్కయ్యా చెల్లెలూ అందర్నీ దూరంగా ఉంచాను. మాధవరావుగారు అన్నట్లు- నా డబ్బు అడుగుతారేమో, సహాయం కోరతారేమో... ఇదే కదా నేను ఆలోచించింది? నువ్వు ఎన్నోసార్లు చెప్పావు... మనవాళ్ళంతా మనకుండాలి అని. నిన్ను కోప్పడ్డాను. ప్చ్‌, నా చిన్నతనం అంతా అల్లారుముద్దుగా వాళ్ళమధ్యే గడిచింది. తిరిగి నేను వాళ్ళకు ఇచ్చింది ఏమీలేదు. నిజం చెబుతున్నాను వందనా... నావాళ్ళు చాలా మంచి మనసున్న వ్యక్తులు. ఉన్నత భావాలతో ఆలోచిస్తారు. నేనంటే ఎంతో ప్రేమ. నేనూ వాళ్ళలా ఉంటే ఇంటికి వస్తారు... ఖర్చవుతుంది... అప్పడుగుతారు... ఇలా ఏవేవో చెత్త ఆలోచనలు తప్ప ఆత్మీయంగా అనుకోలేకపోయాను. ఇంత పెద్ద ఇల్లు కట్టాను, స్థలాలు కొన్నాను, పొలం కొన్నాను, తోట కొన్నాను... అయినా తృప్తి లేదు. ఎంతసేపూ ఇంకా ఏం కొనాలి అన్నదే నా ఆలోచన. ఛీ ఛీ... నామీద నాకే అసహ్యం వేస్తోంది. ఏరోజూ నా తోబుట్టువులను నా ఇంటికి పిలవలేదు. తప్పదు కాబట్టి- గృహప్రవేశానికీ వినయ్‌ ఉపనయనానికీ వినీల పెళ్ళికీ పిలిచాను. నా మనస్తత్వం తెలుసుగాబట్టి వచ్చారు, వెళ్ళారు. ఆడపిల్లలకు పుట్టింటికి రావాలని ఉంటుంది. అమ్మా నాన్నగారూ లేరు. అన్నయ్యలు వాళ్ళను పిలుస్తున్నారో లేదో తెలియదు. కాకపోతే, వాళ్ళు నా అంత స్వార్థపరులు కాదని నా నమ్మకం. 
నేను మారాలి... మారతాను వందనా. మనవాళ్ళందరికీ ఫోన్‌ చేసి ఉగాది పండుగకు రమ్మంటాను. నా రక్తసంబంధీకులతో కలిసిమెలిసి ఉంటాను. మీ అన్నయ్యనూ వదిననూ, అత్తగారినీ కూడా రమ్మంటాను. శాశ్వతంగాని జీవితం మీద అత్యాశ ఎందుకు? ఆరడుగుల నేలా, బూడిదా అనుకున్నప్పుడు ఇంత ఆరాటం దేనికి? వద్దు వందనా, నేను ఇంత చెడ్డగా ఉండను. మరో మాధవరావుగారిలా మారటానికి ప్రయత్నిస్తాను. మా ఫ్యామిలీనీ ఓ బొకేలా తయారుచేస్తాను. ఇలాగే ఏదో ఫంక్షన్‌ చేసి నా వాళ్ళంతా ఇంట్లో ఉండగా మాధవరావుగారి ఫ్యామిలీలో అందర్నీ ఆహ్వానించి అప్పుడు మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వమని అడుగుతాను’’ అంటున్న నన్ను కళ్ళార్పకుండా చూడసాగింది వందన.

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.