close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘గ్రూపు’లు కడుతున్నారు!

ఒక్కరికైతే కాలక్షేపం. ఇద్దరుంటే కబుర్ల కలబోత. అదే వందమంది చేరితే బహిరంగ సభ నిర్వహించినట్లేనంటున్నారు ఫేస్‌బుక్‌ ప్రేమికులు. గ్రూపులు కట్టి, ఈవెంట్లు పెట్టి, ఈ సామాజిక మాధ్యమాన్ని స్వీయ ప్రయోజనానికీ, వ్యక్తిగత వికాసానికే కాదు, సమాజ సంక్షేమానికీ వారు వాడుకుంటున్న తీరు ఆసక్తికరం.

పెళ్లిరోజని భార్యని హోటల్‌కి తీసుకెళ్లాడు సునీల్‌. ఆమెకు తెలియని కొత్త కొత్త ఆహారపదార్థాలు ఆర్డరిచ్చాడు. వెయిటర్‌ వాటిని వడ్డించగానే ఓ ఫొటో తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి ‘నోరూరుతోంది కదూ! ఎక్కడో, ఏమిటో చెప్పుకోండి’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు సునీల్‌. ఆ తర్వాత ఇద్దరూ భోజనం చేసి ఇంటికి బయల్దేరేటప్పుడు మళ్లీ ఫేస్‌బుక్‌ చూస్తే- గంటన్నా కాలేదు అప్పుడే వందల్లో లైకులూ కామెంట్లూ వచ్చాయి. ఫొటో చూసి ఆ వంటకాల పేర్లు చెప్పే ప్రయత్నం చేశారు చాలామంది. కొందరు కరెక్టుగానే చెప్పారు కూడా. భోజనప్రియుడైన సునీల్‌ ‘ఫుడీస్‌ ఇన్‌ హైదరాబాద్‌’ అనే ఫేస్‌బుక్‌ గ్రూపులో సభ్యుడు. ఇంట్లో భార్య చేసిన రుచికరమైన వంటల్నీ అలాగే ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెడుతుంటాడు. గ్రూపులో స్నేహితులు పోస్టు చేసిన వంటలు నచ్చితే భార్యతో కలిసి సరదాగా వాటిని ప్రయత్నిస్తుంటాడు. ఆదివారాలు ఆ జంటకి చక్కని కాలక్షేపాన్ని ఇస్తోంది ఈ ఫేస్‌బుక్‌ గ్రూప్‌. నిజానికి సునీల్‌ భార్యకి పెళ్లికి ముందు అసలు వంట రాదు. పెళ్లయ్యాక ఆ విషయంలో ఇబ్బంది పడాల్సివస్తుందేమోనని భయపడింది కూడా. కానీ ఆ గ్రూపు పుణ్యమా అని సునీల్‌ సరదాగా తనతో కలిసి వంటచేయటంతో ఆమె భయం పోయి ఆసక్తిగా వంట నేర్చుకుని కొత్త కొత్త ప్రయోగాలూ చేసేస్తోంది.

గ్రూపుల నుంచి ఈవెంట్ల వరకూ... 
ఒక్క వంటలే కాదు... ఫేస్‌బుక్‌లో ఎవరి అభిరుచికి తగిన గ్రూపుని వారు ఎంచుకోవచ్చు. అవసరమనుకుంటే సొంతంగా తామే ఓ గ్రూపు పెట్టే అవకాశమూ ఉంది. సంగీతం, సాహిత్యం, సినిమాలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ లాంటి కళలే కాదు సైన్సు, హేతువాదం, న్యాయశాస్త్రం, వైద్యం, తోటపని, సామాజిక సమస్యలు... ఇలా ఎన్ని రకాల ఆసక్తులున్నవారైనా సరే ఎంచుకోడానికి ఎన్నో గ్రూపులున్నాయి. మనకు నచ్చిన రంగం గురించి ఫేస్‌బుక్‌ వాల్‌మీద ఉన్న సెర్చ్‌లో వెతికితే అందుబాటులో ఉన్న గ్రూపులు కనిపిస్తాయి. చాలావరకూ క్లోజ్‌డ్‌ గ్రూపులుంటాయి. వీటి పోస్టులు సభ్యులకు తప్ప ఇతరులకు కనపడవు. పబ్లిక్‌ గ్రూపులైతే వాటిల్లోని పోస్టులు అందరికీ కన్పిస్తాయి. ఏ గ్రూపులో చేరాలన్నా అడ్మిన్ల అంగీకారం తప్పనిసరి. ఇవి కాకుండా ఎవరికీ కనిపించని సీక్రెట్‌ గ్రూపులుంటాయి. అడ్మిన్లే స్వయంగా తమకు తెలిసినవారిని వీటిల్లో చేర్పించుకుంటారు. ఒకసారి సభ్యులయ్యాక ఎవరైనా గ్రూపు నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌ వేదికగా కలుసుకుంటున్న ఈ గ్రూపుల సభ్యులు ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఈవెంట్స్‌ నిర్వహించడం లేటెస్ట్‌ ట్రెండ్‌.

కొత్త గ్రూపు పెట్టేయొచ్చు! 
ఫేస్‌బుక్‌ గ్రూపులు చాలారకాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఆదిత్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైనా అతడి ప్రవృత్తి చిత్రలేఖనం. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి రిలాక్సవడానికి రోజూ కాసేపు తప్పనిసరిగా బొమ్మలు వేస్తాడు. అయితే అందులో ఎప్పటికప్పుడు కొత్త మెలకువలు నేర్చుకోడానికీ, తోటి చిత్రకారుల్ని కలుసుకోడానికీ అతడికి సమయం సరిపోదు. అందుకని ఆర్టిస్టుల గ్రూపులో చేరాడు. డజనుకు పైగా దేశాలకు చెందిన కళాకారులు అందులో సభ్యులుగా ఉన్నారు. వారంతా తాము వేస్తున్న కొత్త పెయింటింగ్స్‌ గురించీ నేర్చుకున్న అంశాలగురించీ చర్చిస్తుంటారు. ఆ గ్రూపులో చేరిన ఆదిత్య ఉద్యోగం చేసుకుంటూనే కళకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. అతడి కొలీగ్‌ రాహుల్‌ది మరో టైపు. సొంత ఊరూ చిన్ననాటి జ్ఞాపకాలూ స్నేహితులూ అంటే అతడికి వల్లమాలిన ఇష్టం. అందుకని అతడు ‘బాల్య జ్ఞాపకాలు’ అనే గ్రూపు పెట్టి తన చిన్నప్పటి స్కూలుతో మొదలెట్టి యూనివర్శిటీ చదువు అయిపోయేవరకూ గుర్తున్న స్నేహితులందరినీ ఆ గ్రూపులో చేర్చాడు. దేశవిదేశాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్లందరూ తిరిగి ఒక వేదిక మీద కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలనూ అనుభవాలనూ అందులో పోస్టు చేస్తుంటారు. పబ్లిక్‌ గ్రూపుగా ఉన్న దానికి మంచి ఆదరణ లభించడంతో ఆసక్తి చూపిన కొత్తవారినీ చేర్చుకోవడం మొదలెట్టాడు రాహుల్‌. బాల్యం తాలూకు మధురానుభూతుల్ని గుర్తుచేసుకోవాలనుకునేవారికి ఇప్పుడా గ్రూపు ఓ జ్ఞాపకాల పెట్టె. రోజూ ఈ గ్రూపు పోస్టుల్ని చూస్తూ కాసేపు గడపడం ఎంతో రిలాక్సింగ్‌గా, బెంగ తీరినట్లుగా ఉంటుందంటారు అమెరికాలో డాక్టరుగా పనిచేస్తున్న శ్రావ్య.

 

ఫుడీస్‌ది పెద్ద వాటా 
తెలుగువాళ్లు భోజనప్రియులని ఊరికే అనలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ పక్కకి వెళ్లినా అక్కడి ప్రత్యేక వంటకాలు నోరూరిస్తాయి. ఈ సందడే ఫేస్‌బుక్‌లోనూ కన్పిస్తుంది. అక్కడ వంటల గ్రూపులైతే వందల్లోనే ఉన్నాయి. ఒక్కో గ్రూపులోనూ వేలల్లో సభ్యులున్నారు. చాలా గ్రూపుల్లో అన్నిరకాల వంటల గురించీ పోస్టులు పెడతారు. వాసిరెడ్డి వేణుగోపాల్‌ ప్రారంభించిన రోటి పచ్చళ్ల లాంటి కొన్ని గ్రూపులు మాత్రం కొంత భిన్నంగా ఉంటాయి. రోటిపచ్చళ్ల గ్రూపులో దాదాపు 50 వేల మంది సభ్యులు, అందులోనూ సగానికన్నా ఎక్కువ పురుషులే ఉండటం విశేషం. ‘కొత్త కొత్త వంటల గురించి హోటళ్ల వాళ్లు ప్రచారం చేసుకుంటారు. షెఫ్‌లు పేపర్లలో కాలమ్స్‌ రాస్తారు. కానీ నాకు మా అమ్మమ్మో నాన్నమ్మో చేసిపెట్టిన రోటి పచ్చడీ, పప్పూ గోంగూరా ఇష్టం. అవి ఎలా చేయాలో చెప్పేవారెవరూ కనపడలేదు. అందుకే నేను రోటి పచ్చళ్ల ఉద్యమం మొదలెట్టాను’ అంటారు వేణుగోపాల్‌. ఈ గ్రూపు సభ్యులెవరైనా తమకు తెలిసిన పాత, సంప్రదాయ రోటిపచ్చళ్ల తయారీ గురించి ఇక్కడ రాయవచ్చు. పచ్చళ్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, రుచిని పెంచే చిట్కాలూ పంచుకోవచ్చు. ‘మన శాకాహార రుచులు’ గ్రూపులో అచ్చంగా శాకాహార వంటల గురించి పోస్టులు పెడతారు. హైదరాబాద్‌ ఫుడీస్‌, వైజాగ్‌ ఫుడీస్‌ లాంటి వంటల గ్రూపుల్లో అయితే విందులకు కేటరింగ్‌ చేసే సంస్థల సమాచారమూ తెలుసుకోవచ్చు. పెద్ద పెద్ద గ్రూపులు ఈ మధ్య సభ్యులంతా ప్రత్యక్షంగా కలుసుకునే కార్యక్రమాలూ ఏర్పాటుచేస్తున్నాయి. వీటికి పలు సంస్థలు డిస్కౌంట్లూ ఆఫర్లూ ఇస్తుంటాయి.


నచ్చిన పుస్తకమూ సినిమా... 
జ్యోతి పీహెచ్‌డీ చేసి హిందీ లెక్చరరుగా ఉద్యోగం చేస్తోంది. చిన్నప్పటినుంచీ పుస్తకాలు చదవటమంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే కేవలం సాహిత్యం చదవటం ద్వారా తెలుగు, ఇంగ్లిష్‌ భాషల మీద పట్టు సంపాదించింది. ‘నచ్చిన పుస్తకం’ అనే ఫేస్‌బుక్‌ గ్రూపులో ఆమె రాసే పుస్తక సమీక్షల కోసం చదువరులూ రచయితలే కాదు సినిమారంగానికి చెందినవారు కూడా ఎదురుచూస్తుంటారు. రోజూ కచ్చితంగా రాత్రి రెండు గంటలు ఫేస్‌బుక్‌కి కేటాయించే ఆమె కొత్త పుస్తకాల గురించి సభ్యులు పెట్టిన పోస్టులు చూసి కొనుక్కోవాల్సిన పుస్తకాలేమన్నా ఉన్నాయేమో చూసుకుంటుంది. తాను చదివిన పుస్తకానికి రివ్యూ రాసి పెడుతుంది. ‘ఇలా ఫేస్‌బుక్‌లో రాయడం వ్యక్తిగతంగా నాకు ఎంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను. ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఎంతో నేర్చుకున్నాను. మానసికంగా చాలా ఎదిగాను. ఒక్కో పుస్తకం చదవాలంటే వారం పడుతుంది. ఇక్కడ అందరూ పుస్తకాల గురించి రాసే పోస్టులు చదివితే చాలా పుస్తకాల గురించి తెలిసిపోతుంది. అప్పుడు నచ్చిన పుస్తకమే కొనుక్కోవచ్చు. సినిమాలంటే కూడా నాకిష్టమే. వారానికి రెండైనా ఇతర భాషా చిత్రాలు చూస్తాను. వాటి గురించి ‘నచ్చిన సినిమా’ గ్రూపులో రాస్తాను. ఎంతో ఇష్టంతో, నేర్చుకున్నది నలుగురికీ చెప్పాలన్న తపనతో రాస్తాను...’ అంటుంది జ్యోతి. ఈ రెండు గ్రూపుల్లో ఉన్నవాళ్లంతా చాలా నిబద్ధతతో పుస్తకాలూ సినిమాల గురించి రాస్తున్నారు, చదువుతున్నారు. ఇక ‘కథ’ అనే మరో గ్రూపు కథలు రాసేవారి సందేహాలు తీరుస్తుండగా ‘కవి సంగమం’ అనే గ్రూపు అయితే ఏకంగా కవిత్వ పాఠాలు చెబుతూ నవతరం కవులను తీర్చిదిద్దుతోంది.

ఊరూరా కవిసంగమం 
ఒకప్పుడు కవిత్వం అంటే బాగా చదువుకున్నవాళ్లూ పండితులూ మాత్రమే రాసేవారు. ఇప్పుడు సాహిత్యమూ కవిత్వమూ అన్నీ కూడా జీవితంలోనుంచి వస్తున్నాయి. చదువుతో, భాషాపాండిత్యంతో సంబంధం లేకుండా భావప్రాధాన్యంతో చాలామంది రాస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు కవులు వారికి మార్గదర్శకంగా ఉండేలా మొదలుపెట్టిన ‘కవిసంగమం’ ఫేస్‌బుక్‌ గ్రూపు మంచి ఆదరణ పొందుతోంది. కవి యాకూబ్‌ ఆధ్వర్యంలోని ఈ గ్రూపులో కవిత్వం, సాహిత్యం గురించిన పోస్టులతో పాటు రెగ్యులర్‌ శీర్షికలు ఉంటాయి. అనుభవజ్ఞులు రోజుకొకరు చొప్పున రాసే ఈ కాలమ్స్‌ కొత్తవారికి ఉపయోగకరంగా ఉంటున్నాయి. సభ్యులెవరైనా తమ కవితలని పోస్టు చేసి సీనియర్ల సలహాలూ సూచనలూ పొందవచ్చు. విమర్శ అయినా ప్రశంస అయినా అర్థవంతంగా ఉంటాయి. గతంలో హైదరాబాదులో నెలనెలా సమావేశాలు నిర్వహించిన ‘కవిసంగమం’ యువకవులను ప్రోత్సహించడానికి ‘ఊరూరా కవిసంగమం’ పేరుతో జిల్లాల బాట పట్టింది. ఎక్కడికక్కడ సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమాల్ని ఏర్పాటుచేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఔత్సాహిక రచయితల్నీ కళాశాల విద్యార్థుల్నీ ఆహ్వానించి వారు రాసినవి చదవమని ప్రోత్సహిస్తారు. మంచి రచనలకు బహుమతులిస్తారు. సాహిత్యం ద్వారా మనిషిలోని మంచితనాన్ని మేల్కొలిపి సంస్కరణ దిశగా ఆలోచన రేకెత్తించడమే తమ ఆశయమంటారు ఈ గ్రూపు సభ్యులు. గుంటూరులో ఏర్పడిన ‘అమరావతి సాహితీ మిత్రులు’ అనే గ్రూపు కూడా తరచూ గోష్ఠి కార్యక్రమాలు నిర్వహిస్తూ సృజనాత్మక రంగాల్లో కృషిచేస్తున్నవారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

అమ్మలకు అండగా... 
కాబోయే అమ్మలూ, తప్పటడుగులు వేసే పిల్లలున్న అమ్మలూ, బడికెళ్లే పిల్లలున్న అమ్మలూ... ఎదుర్కొనే సవాలక్ష సందేహాలకు సమాధానాలు చెప్పేదెవరు? ఆ కొరత తీరుస్తున్నాయి అమ్మల పేరుతో ఏర్పాటైన పలు గ్రూపులు. గ్రూపులో సభ్యులైన తల్లులు  తమ కష్టసుఖాలు చెప్పుకోవచ్చు, ఇతరులనుంచి అవసరమైన సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు. ‘మావాడికి ఏడాదిన్నర. రాత్రంతా ఒకటే జ్వరం. మేం ఉండేది ఫలానా చోట. ఈ చుట్టుపక్కల ఎవరైనా మంచి పిల్లల డాక్టరు ఉన్నారా’ అంటూ అడుగుతుంది ఓ తల్లి. డాక్టర్ల పేర్లూ చిరునామాలూ తీసుకునే ఫీజులతో సహా అన్ని వివరాలతో ఐదే నిమిషాల్లో పది జవాబులు ఇన్‌బాక్సులో ఆమెకోసం సిద్ధంగా ఉంటాయి. ఏ తల్లికైనా ఇంతకన్నా ఏం కావాలి? ఛాయాశర్మ ‘హైదరాబాద్‌ మామ్స్‌’ గ్రూపు ప్రారంభించడానికి కారణం అదే. ఉద్యోగాల రీత్యా పెద్దలకు దూరంగా నగరంలో ఉంటున్న గర్భిణులూ, పసి పిల్లల తల్లుల్లో తలెత్తే పలు సందేహాలకు సమాధానంగా ఆమె ఈ గ్రూపును ప్రారంభించగా రెండేళ్లలోనే దాదాపు నాలుగువేల మంది సభ్యులయ్యారు. నెలకోసారి ఏదో ఒక పార్కులో జరిగే గ్రూపు సమావేశాలకు తల్లులంతా పిల్లలతో హాజరవుతారు. పిల్లల ముచ్చట్లు పంచుకుంటూ ఆటపాటలతో సరదాగా గడుపుతారు. ఇలాంటి తల్లుల గ్రూపులు దాదాపు ప్రతి నగరంలోనూ ఉన్నాయి.

ఈ గ్రూపులు భలే యాక్టివ్‌! 
‘మ్యూజిక్‌ వరల్డ్‌’లో ప్రవేశించారంటే అక్కడ రోజూ స్వరాభిషేకమే. సంగీతాభిమానులను అలరిస్తూ ఎందరో కొత్త కళాకారులను పరిచయం చేస్తోంది ఈ గ్రూపు. రోజూ ఏదో ఒక పోటీ, గెలిచినవారికి బహుమతులూ ఉంటాయి. వారంలో ఒకరోజు సభ్యులు తాము పాడిన పాటల్ని పోస్టు చేయవచ్చు. మనసులోని భావాల కలబోతకి అందమైన వేదిక ‘భావుక’. పలువురు ప్రముఖ రచయితలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అన్నమయ్య రచనల్ని అందరికీ చేరువ చేస్తున్న ‘ఫేస్‌బుక్‌ అన్నమయ్య’, శాస్త్రీయ సంగీత మెలకువల్ని పంచుకుంటున్న ‘మన శాస్త్రీయ సంగీతం’, సాహితీ ప్రియులను అలరిస్తున్న ‘సాహిత్యం’, పిల్లల్నీ పెద్దల్నీ అలరిస్తున్న ‘10000 తెలుగు పజిల్స్‌’, చక్కని తెలుగు రచనల గురించి చర్చిస్తున్న ‘తెలుగురథం’, పద్యకవితలను చదువుకోవాలనుకునేవారికి ‘ఒక మంచి పద్యం’, పద్యం రాయాలనుకునేవారి కోసం ‘ఛందస్సు’... ఇలా ఎన్నో గ్రూపులు ఆన్‌లైన్‌ పోస్టులతోనూ ఆఫ్‌లైన్‌ ఈవెంట్లతోనూ సందడి చేస్తున్నాయి. మీరో కొత్త వ్యాపారం మొదలెట్టారు. దాని గురించి పది మందికీ తెలియాలనుకుంటారు. ‘స్ప్రెడ్‌ ద వర్డ్‌ హైదరాబాద్‌’ గ్రూపులో ఓ పోస్టు పెడితే చాలు. అమ్మకాలూ కొనుగోళ్లూ జరిపే కేటగిరీ గ్రూపుల్లో దాదాపు ఐదు లక్షల సభ్యులతో దూసుకుపోతోంది ఈ గ్రూపు.

కర్తవ్యం తెలిసి... 
ఫేస్‌బుక్‌ని సామాజిక సమస్యలను పరిష్కరించుకునే వేదికగానూ ఉపయోగిస్తున్నారు పలువురు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కులో చెట్లను కొట్టివేయవద్దని కోరుతూ ‘సిటిజెన్స్‌ ఫర్‌ హైదరాబాద్‌’ అనే గ్రూపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ‘రైట్‌2వాక్‌ ఫౌండేషన్‌’ నగరంలో ఫుట్‌పాత్‌ల ఏర్పాటుకోసం ప్రచారం చేస్తోంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగానూ, నాస్తికత్వం, మానవతావాదం తదితర విషయాల గురించీ చర్చించే ‘బాబు గోగినేని- హ్యూమనిస్ట్స్‌ అండ్‌ రేషనలిస్ట్స్‌ అరేనా’ గ్రూపులో దాదాపు నలభై వేల మంది సభ్యులున్నారు. విందు సాకుగా మద్యపానాన్ని అలవాటు చేసుకుని చివరికి అది వ్యసనంగా మారడంతో ఎంతోమంది తమ ఆరోగ్యాలను బలిచేసుకుంటున్నారని భావించిన ‘జిందగీ ఇమేజెస్‌’ అనే గ్రూపు సభ్యులు ఇటీవల ‘దారూ బినా దావ ‌’ పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించారు. మద్యం లేకుండా కూడా విందులు చేసుకోవచ్చని చెబుతూ వీరు వైద్యనిపుణులతో మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పిస్తున్నారు. ఇక ఫుడీస్‌ ఇన్‌ ఆంధ్రా గ్రూపు సభ్యులైతే మరొకడుగు ముందుకేసి ఏటా తమ గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడివారికి విందుభోజనం పెడుతున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లోనే కాక పక్క రాష్ట్రాలకీ ఈ కార్యక్రమాన్ని విస్తరించి సభ్యులే స్వయంగా వెళ్లి వడ్డిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఫేస్‌బుక్‌ గ్రూపులు ఉన్నాయి. చేయాల్సిందల్లా ఓపిగ్గా వెతికి మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న గ్రూపులో చేరడమే.

** * * *

ఇల్లూ ఉద్యోగమూ అంటూ గిరిగీసుకుని బతుకుతున్న మనిషికి ఇల్లు కదలకుండానే సంఘజీవనాన్ని పరిచయం చేస్తున్నాయి ఈ ఫేస్‌బుక్‌ గ్రూపులు. 
కాలక్షేపానికి ఒకటి... కాసేపు సరదాగా నవ్వుకోడానికి ఒకటి... 
మెదడుకి మేత కావాలనుకుంటే ఒకటి... మేధావులతో చర్చించాలనుకుంటే ఒకటి... 
ఇలా ఎవరికైనా పనికొచ్చే గ్రూపులు ఎన్నో ఉన్నాయి. 
అభిరుచికి తగిన బృందంలో చేరి ఆనందంగా కాలం గడపడానికీ ఆలోచనాపరిధి పెంచుకోడానికీ చక్కటి మాధ్యమం ఇది. 
మరి... మీరే గ్రూపులో చేరుతున్నారు?!

గ్రూపుకీ ఖాతాకీ తేడా ఉంది!

ఫేస్‌బుక్‌ ఖాతాకీ గ్రూపులో సభ్యత్వానికీ తేడా ఉంది. ఫేస్‌బుక్‌ ఖాతాలో ఎవరి వాల్‌ మీద వాళ్లు తమ ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు. అలా కాకుండా ఒక ప్రత్యేక లక్ష్యంతో ఏర్పడే ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో తరచూ పలు అంశాలపై వాడీ, వేడి చర్చలు జరుగుతుంటాయి. పోస్ట్‌ అయినా, కామెంట్‌ అయినా అర్థవంతంగా, సందర్భానికి తగినట్లుగా ఉండాలి. అలా రూల్స్‌కి కట్టుబడి క్రమశిక్షణ పాటిస్తున్న గ్రూపులే రాణిస్తున్నాయి. 
ఫేస్‌బుక్‌ గ్రూపులన్నిట్లోనూ కన్పించే మొదటి నిబంధన-ఇక్కడ రాజకీయాలకూ మతానికీ తావు లేదని! 
కొన్ని గ్రూపుల్లో సెల్ఫీల్నీ, వ్యక్తిగత ఫొటోల్నీ అనుమతించరు. 
భాష విషయంలో మర్యాదలు పాటించాలి. అంశంతో విభేదించవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలకు చోటీయకూడదు. 
సొంత వ్యాపారాల ప్రచారాన్నీ ప్రకటనల్నీ చాలా గ్రూపుల్లో అనుమతించరు. 
చాలా గ్రూపుల్లో రోజుకు ఒక్క పోస్టు పెట్టడానికే అనుమతిస్తారు.

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.