close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మధుమేహులకో మొక్కజొన్న!

ఊదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. ఈ రంగుల కార్న్‌ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరైడ్స్‌ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తెలుపుతున్నారు. ఊదారంగు కార్న్‌లో ఉండే సంక్లిష్ట ఫైటో కెమికల్స్‌ మంటని తగ్గించి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచినట్లు గుర్తించారు. అంతేకాదు, ఇందుకోసం వీరు అన్ని రంగుల మొక్కజొన్నల్నీ తీసుకుని వాటిని వర్గాలుగా విభజించిన ఎలుకలకి కొంతకాలం పాటు ఇచ్చారట. అన్ని రకాల మొక్కజొన్నల్లోని ఆంథోసైనిన్ల వల్లా రోగనిరోధకశక్తి పెరిగిందట. క్లోమగ్రంథి పనితీరూ మెరుగైనట్లు గుర్తించారు. కానీ ఊదారంగు మొక్కజొన్నల్ని తిన్నవాళ్లలో అది మరింత ప్రభావశీలంగా పనిచేయడంతో మధుమేహం పూర్తిగా అదుపులో ఉన్నట్లు తేలింది. దాంతో ఆ రంగు మొక్కజొన్నల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని సదరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

అక్రోట్లతో బీపీకి చెక్‌!


 

క్రమం తప్పకుండా అక్రోట్లను తినడం వల్ల హృద్రోగాలతోబాటు బీపీ కూడా తగ్గినట్లు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే వాల్‌నట్స్‌లోని ఒమేగా-3- ప్యాటీ ఆమ్లాలు బీపీని తగ్గిస్తాయి. ఇందుకోసం వీళ్లు బీపీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతోన్న 30-65 వయసు మధ్యలోని 45 మందిని ఎంపికచేసి, మూడు వర్గాలుగా విభజించారు. అందులో ఒక వర్గానికి వాల్‌నట్స్‌తో కూడిన డైట్‌నీ మరో వర్గానికి వాటికి బదులుగా అంతేపాళ్లలో ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్నీ, మూడోవర్గానికి వాల్‌నట్స్‌లో ఉండే ఫ్యాటీ ఆమ్లాల్లో సగం శాతాన్ని ఇతరత్రా ఆహారపదార్థాల నుంచి అందేలా చూశారట. రెండు వారాల తరవాత వాళ్ల గుండె ఆరోగ్యాన్ని పరిశీలించగా- అందరిలోనూ పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. అయితే మిగిలిన రెండు వర్గాలతో పోలిస్తే నేరుగా వాల్‌నట్స్‌ తీసుకున్నవాళ్లలో బీపీ తగ్గడంతోబాటు గుండె పనితీరు కూడా బాగున్నట్లు గుర్తించారు. బహుశా అందులోని పీచూ బయోయాక్టివ్‌ పదార్థాలే ఇందుకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు సదరు నిపుణులు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఆహారంలో భాగంగా రోజూ రెండుమూడు వాల్‌నట్స్‌ అయినా తీసుకోవడం మేలు అంటున్నారు.

స్నేహితులు మరణిస్తే..!

తల్లి, తండ్రి, పిల్లలు లేదా ఇతర కుటుంబసభ్యులు చనిపోయినప్పుడు ‘అయ్యో... వాళ్లకెంత కష్టం వచ్చిందో’ అంటూ మిగిలిన కుటుంబీకులో స్నేహితులో చుట్టుపక్కలవాళ్లో సానుభూతి చూపిస్తూ, వాళ్లు తిరిగి మామూలు మనుషులు అయ్యేవరకూ అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉంటుంటారు. వాళ్ల బాధని అర్థం చేసుకుని వాళ్లు తేరుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది అని సరిపెట్టుకుంటారు. అదే ఎవరికైనా స్నేహితులు మరణిస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి ప్రాణస్నేహితుల మరణాన్ని దిగమింగుకోవడం అనేది చాలా కష్టం అంటున్నారు ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు. సోషల్‌మీడియా స్నేహాల్ని పక్కనబెడితే ప్రాణస్నేహితులకి ఆపద వచ్చినా, ప్రమాదవశాత్తూ మరణించినా ఆ దుఃఖాన్ని తట్టుకోవడం, దాన్నుంచి తేరుకోవడం ఆయా వ్యక్తులకి చాలా కష్టమని వాళ్ల అధ్యయనంలో తేలిందట. నేటితరంలో చాలావరకూ స్నేహ సంబంధాలు వ్యాపారబంధాలుగానే మిగులుతున్నప్పటికీ, దగ్గరి స్నేహితుల మరణం మాత్రం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆ సమయంలో వాళ్లకి కొంత కౌన్సిలింగ్‌ కూడా అవసరమవుతుందనీ వాళ్లు చెబుతున్నారు. కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్లయినా ప్రాణస్నేహితుల్ని కోల్పోయినప్పుడు వాళ్లను అలాగే వదిలేయకుండా ఓదార్పుని అందించాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదేననీ అప్పుడే వాళ్లు తిరిగి మామూలు వ్యక్తులు అవుతారనీ గుర్తించాలి.

వేడిగాలులు పిచ్చెక్కిస్తాయ్‌!

అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ తగిలి మరణించేవారి సంఖ్య పెరగడం తెలిసిందే. అయితే ఈ ఉష్ణోగ్రతలు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి అంటున్నారు అమెరికన్‌ పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిన నగరాల్లోని వ్యక్తుల జీవనాన్ని కూలంకషంగా పరిశీలించగా- వడగాలుల వల్ల మెదడుకీ శరీరానికీ మధ్య సమన్వయం దెబ్బతినడంతో ఒకలాంటి గందరగోళం నెలకొంటుందని తేలింది. మూర్ఛరోగుల్లో మూర్ఛలు వచ్చే శాతం పెరుగుతుంది. అంతేకాదు, వేసవి తాపాన్ని తట్టుకోలేక కొందరిలో కోపం, అసహనం, హింసాత్మక ప్రవృత్తి పెరుగుతాయి. ముఖ్యంగా ఆందోళన, డిప్రెషన్‌, ఒత్తిడి వంటి వాటితోబాటు ఆత్మహత్యలూ పెరుగుతాయట. కొన్నిచోట్ల రోడ్డు ప్రమాదాలూ ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఎందుకంటే వేడి వాతావరణం అనేది మెదడు పనితీరుని దెబ్బతీస్తుంది. దాంతో అధ్యయనం, జ్ఞాపకశక్తి అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేళల్లో వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఎక్కువ నీళ్లు తాగడమే సరైన పరిష్కారం అని చెబుతున్నారు సదరు పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.