close
వాటర్‌ బాటిళ్లతో లెగ్గింగ్‌లు!

నీళ్ల బాటిళ్లు కొనుక్కోవడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అదే ప్రకృతి పాలిటా మన పాలిటా శాపం కూడా అవుతోంది. అవునుమరి, ప్లాస్టిక్‌ వాడకం పెరిగిపోయి నేలా నీరూ ఆ వ్యర్థాలతో నిండిపోతోంది. అవేమో వందల సంవత్సరాల వరకూ భూమిలో కరగవు. దాంతో విపరీతమైన కాలుష్యం. మరోవైపు లెగ్గింగ్‌లు ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవిలేని అమ్మాయిల వార్డ్‌రోబ్‌లు దాదాపు ఉండవేమో. అందుకే, గర్ల్‌ఫ్రెండ్‌ కలెక్టివ్‌, టీకి, యోగాడెమొక్రసీ...లాంటి కొన్ని కంపెనీలు వాడేసిన నీళ్ల బాటిళ్లను సేకరించి రీసైకిల్‌ చేసి లెగ్గింగ్‌లను తయారుచేస్తున్నాయి. గర్ల్‌ఫ్రెండ్‌ కలెక్టివ్‌ లెగ్గింగ్‌లు ఒక్కోటి తయారుచెయ్యడానికి సుమారు 25 వాటర్‌ బాటిళ్లు పడుతున్నాయట. ఇలా పర్యావరణానికి మేలు చెయ్యడంతో పాటు  సౌకర్యంగానూ ఫ్యాషన్‌బుల్‌గానూ రూపొందిస్తున్న లెగ్గింగ్‌లు యువత మనసునూ దోచేస్తున్నాయి. ప్లాస్టిక్‌తో లెగ్గింగ్‌లంటే ఆశ్చర్యంగా ఉంది కదూ...

రూ.9 కోట్ల పరిమళం!

మనిషంత సెంటు బాటిల్‌ అది. స్వర్ణ మణిమయ కాంతులు వెదజల్లే దాని ఎదురుగా నిలబడి రిమోట్‌ బటన్‌ నొక్కితే చాలు, సెంటు స్ప్రే అయిపోతుంది. అంతేకాదు, బాటిల్‌ని బంగారంతో చేసి, 3,571 వజ్రాలనూ టోపాజ్‌, ముత్యాల్లాంటి రాళ్లనూ పొదిగిన ఈ ‘షుముఖ్‌’ పెర్‌ఫ్యూమ్‌ ఖరీదు అక్షరాలా తొమ్మిది కోట్ల రూపాయలు. 1.97 మీటర్ల ఎత్తుండే ఈ పెర్‌ఫ్యూమ్‌ని తయారు చేయడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన నబీల్‌ పెర్‌ఫ్యూమ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి మూడేళ్లకు పైగా సమయం పట్టిందట. ఇక, గంధం, కస్తూరి, అగరు చెక్కలతో పాటు పాచౌలి, టర్కిష్‌ రోజ్‌... లాంటి ఎన్నో సువాసన భరితమైన మొక్కల ఉత్పత్తుల నుంచి తయారుచేసిన ఈ పెర్‌ఫ్యూమ్‌ పరిమళం ముక్కులకు తాకితే పరవశమేనట. అన్నట్లూ షుముఖ్‌ ‘ఎక్కువ వజ్రాలు పొదిగిన పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌’ గానూ ‘పొడవైన రిమోట్‌ కంట్రోల్‌ సెంటు బాటిల్‌’ గానూ రెండు గిన్నిస్‌ రికార్డుల్ని నెలకొల్పింది.

అభిమానం తలకెక్కింది!


 

హీరోలమీద ఇష్టంతో అభిమానులు వారిని అనుకరించడం, విగ్రహాలు ఏర్పాటు చెయ్యడం... ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌కు వీరాభిమానులైన రజ్విందర్‌, గుర్విందర్‌లు మాత్రం మరో అడుగు ముందుకేశారు. పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ జిల్లాలో హెయిర్‌ సెలూన్‌ నడిపే ఈ అన్నదమ్ముల్లో గుర్విందర్‌ చాలా ప్రయత్నాలు చేసి అజయ్‌ దేవ్‌గణ్‌ ముఖాన్ని తలపించేలా జుట్టుని కత్తిరించడం నేర్చుకున్నాడు. తర్వాత సెలెబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ను కలిసి ఆయన ముందు రజ్విందర్‌ జుట్టుని అచ్చు గుద్దినట్లు అజయ్‌ దేవ్‌గణ్‌ ముఖంలా కత్తిరించాడట. ఆ ఫొటోలు కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న అజయ్‌ దేవ్‌గణ్‌ ఈ అన్నదమ్ముల్ని పిలిచి అభినందించాడట కూడా.

అందాల అట్ట ఇళ్లు!

ఈ ఫొటోల్లోని ఇళ్లను చూస్తే నిజమైన ఇళ్లకు ఏమాత్రం తీసిపోనట్లున్నాయి కదూ... ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... ఇవన్నీ అట్టముక్కలతో చేసినవి. అదీ ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ల కిందట. 1993లో ఆస్ట్రియాలోని వియన్నాకు చెందిన కళాకారుడు ఆలివర్‌ క్రొయ్‌ స్థానికంగా ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే పాత సామాను దుకాణం బయట నాలుగు వందలకుపైగా ఈ బొమ్మలు పడేసి ఉన్నాయట. రకరకాల భవంతులూ ప్రభుత్వ కార్యాలయాలూ చర్చిలూ ఇళ్ల నమూనాలను అట్ట ముక్కలతో ఇంత బాగా చేసిన ఆ కళను చూసి మనసు పారేసుకున్న ఆలివర్‌ వాటిని తనతో తెచ్చుకున్నాడు. పాతికేళ్ల తర్వాత వాటిని ఇపుడు వియన్నాలోని వియన్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు. నిజానికి ఈ అట్ట ఇళ్లను స్థానిక ఇన్సూరెన్స్‌ కంపెనీలో క్లర్క్‌గా పనిచేసే పీటర్‌ ఫ్రిట్జ్‌ 1950-60ల మధ్య తయారుచేశాడట. ఎందుకు చేశాడో తెలియదు కానీ ఈ భవనాలన్నీ ఆరోజుల్లో జరిగిన ఇళ్ల నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా ఉండి ప్రస్తుతం సందర్శకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.