close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడగకుండానే ఆకలి తీరుస్తారు!

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. వీళ్లు మాత్రం ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళతారు. అడగకుండానే అన్నం పెట్టి ఆకలి తీరుస్తారు. అలా అని ఎక్కడో మిగిలిపోయిన ఆహారం తీసుకొచ్చి పెడతారేమో అనుకునేరు... శుచిగా వండి వారుస్తారు. ఆకలి తీరిన వారి కళ్లలో ఆనందం చూసి తమ కడుపు నిండినట్టు భావిస్తారు. ఇంతకీ వాళ్లెవరంటే...

కదిలించిన పెద్దాయన

హైదరాబాద్‌కి చెందిన అమూల్య కాస్మెటాలజిస్టు. సొంతంగా హాస్పిటల్‌ ఉంది. ఒక రోజు కారులో ఆసుపత్రి నుంచి ఇంటికెళుతుంటే రోడ్డు పక్కన ఓ పెద్దాయన కళ్ళనీళ్ళతో కనిపించాడు. అమూల్య వెంటనే కారు ఆపి అతని వద్దకు వెళితే ‘ఆకలేస్తుందమ్మా...’ అంటూ బావురుమన్నాడు. నీరసంతో తూలుతున్న ఆ వృద్ధుడి ఆకలి తీర్చడమే కాకుండా అతన్ని ఇంటి వద్ద దింపి కొంత డబ్బు ఇచ్చింది. ఆ సమయంలో అమూల్యకి కలిగిన సంతృప్తి అంతా ఇంతా కాదు. ఆ స్ఫూర్తితోనే కొందరు స్నేహితురాళ్ల సాయంతో ‘సీడ్స్‌ ఆఫ్‌ హోప్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం ప్యాకెట్లు రోజూ ఇచ్చేలా ఓ హోటల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సామాజిక సేవ కావడంతో హోటల్‌ వాళ్లూ సగం ధరకే ఆహారం అందిస్తున్నారు. ప్రతిరోజూ ఆహారం ప్యాకెట్లు తీసుకొని ఓ వాహనం గాంధీ, ఉస్మానియా, బసవతారకం, ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రులతోపాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ తదితర రద్దీ ప్రాంతాలకు వెళ్లి వాటిని అందిస్తుంది. రోజుకు వెయ్యి మంది ఆకలి తీరుస్తుందీ వాహనం. అమూల్య చేస్తున్న మంచి పని గురించి తెలిసిన వారు ఆర్థిక సాయం చేయడమే కాక కొందరు తామే స్వయంగా ఆహారం తయారు చేసి వాహనంలో అందిస్తున్నారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లోని పేద చేనేత కార్మికుల్ని గుర్తించి వారికి నెలకు సరిపడా నిత్యావసరాలూ ఇస్తోంది. వారంతా అమూల్యని ‘అన్నపూర్ణ’ అని ముద్దుగా పిలుస్తారు.

అన్నార్తులకు వేడి వేడి రోటీలు

చాలామంది విందుల్లో, రెస్టారంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం చూశాడు వికాస్‌ అగర్వాల్‌. ఆ ఆహారం శుభ్రంగా, పాడవ్వకుండా ఉందన్న గ్యారంటీ లేదు కదా అనిపించింది అతనికి. తనే పేదలకి వేడి వేడి ఆహారం ఎందుకు పంచకూడదు అనుకున్నాడు. అలా మొదలైందే అప్నీ రోటీ వ్యాన్‌. గతేడాది ఆగస్టులో అప్నీరోటీ సేవలు మొదలయ్యాయి. కోల్‌కతాకు చెందిన ఇరవై ఆరేళ్ల వికాస్‌ వ్యాపారవేత్త. ఇరవై లక్షల రూపాయలతో ఓ వ్యాన్‌ను తయారు చేయించి అందులోనే ఆటోమేటిక్‌ రోటీమేకర్‌ను ఏర్పాటు చేయించాడు. ఈ రోటీ మేకర్‌ గంటకు వెయ్యి రోటీలు చేస్తుంది. వికాస్‌ తన వంటింట్లోనే రోటీలోకి ఓ కూరా, స్వీటూ తయారు చేయించి వ్యానులో పంపుతాడు. అప్నీరోటీ వ్యాను కోల్‌కతా నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలూ తిరుగుతుంది. ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడున్నర వరకూ ఈ వ్యాన్‌ రెండు వేల మంది ఆకలి తీరుస్తుంది. ఇందుకోసం వికాస్‌ నలుగురు వలంటీర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరే అందుకు కావల్సిన సామగ్రి తీసుకురావడం, వ్యాన్‌ను పేదల వద్దకు తీసుకెళ్లి వడ్డించడం చేస్తున్నారు. వికాస్‌ చేస్తున్న మంచి పని గురించి సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న దాతలూ స్పందించి ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రస్తుతం వికాస్‌ అప్నీ రోటీ సేవల్ని బిహార్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాలకూ విస్తరించే పనిలో ఉన్నాడు.

వార్త చదివి స్ఫూర్తి పొంది...

పేదల ఆకలి తీరుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ గురించి చదివి స్ఫూర్తి పొందిన మహ్మద్‌ అజీజ్‌ తనూ అదేవిధంగా చేయాలనుకున్నాడు. అలా మూడున్నరేళ్ల క్రితం భాగ్యనగరంలో అజీజ్‌ చేతుల్లో పురుడు పోసుకుంది ‘ఫుడ్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌’. ముప్ఫై ఏళ్ల అజీజ్‌ కార్పొరేట్‌ ఉద్యోగి. స్నేహితులతో కలిసి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాడు. మొదట్లో ఆదివారం మాత్రమే ఫుడ్‌ డ్రైవ్‌ నిర్వహించేవాడు. క్రమంగా వలంటీర్లు చేరడం, దాతలూ ముందుకు రావడంతో వారంలో ఐదు రోజులు ఆహారం పంచుతున్నాడు. అజీజ్‌ తల్లి ప్రతి ఆదివారం వంద ప్యాకెట్ల జీరా రైస్‌, టొమాటో రైస్‌, పులిహోర, పెరుగన్నం తయారుచేస్తుంది. మిగతా రోజుల్లో పాతిక కేజీల అన్నం, రెండు కూరలూ చేస్తుంది. అజీజ్‌తోపాటు వలంటీర్లు ఇంట్లో ఆహారం చేసి తీసుకొస్తారు. అలా బుధవారం నుంచి ఆదివారం వరకూ ‘ఫుడ్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌’ బృందం నగరంలో పలు చోట్ల ఆహారం పంచుతుంటుంది. అజీజ్‌కి ఎవరైనా ఆర్థిక సాయం చేస్తానంటే ఒప్పుకోడు. ఆహారం లేదా సరకుల రూపంలోనే తీసుకుంటాడు. దేశవిదేశాల నుంచి దాతలు సరకులు అందించి ప్రోత్సహిస్తున్నారు. ఈ సేవల్ని చూసి నిజామాబాద్‌లో కొందరు యువకులు ఈ మధ్య ‘ఫుడ్‌ బ్యాంక్‌ నిజామాబాద్‌’ ఏర్పాటు చేసి అక్కడా నిత్యం అన్నదానం చేస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.