close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీరామ దూతం శిరసానమామి!

హైందవులకు పరమ పూజ్యనీయుడు హనుమంతుడు. నమ్మకం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్చాతుర్యం మొదలైన సలక్షణాల సమ్మేళనంగా ఆయన్ను ప్రస్తుతిస్తారు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని ఒక నమ్మకం. హనుమజ్జయంతి (మే 29) సందర్భంగా ఆ భక్తాగ్రజుడి విశేషాలను మరోసారి మననం చేసుకుందాం.

వైశాఖమాసం... కృష్ణపక్షం దశమీ శనివారం పూర్వాభాద్ర నక్షత్రాన శివాంశ సంభూతుడిగా అంజనీదేవి, వానర రాజైన కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. అంజనీదేవి గర్భాన జన్మించినందువల్ల ఆంజనేయుడనీ, వాయుదేవుడి అనుగ్రహం వల్ల పుట్టాడు కాబట్టి వాయునందనుడనే పేర్లు వచ్చాయి. అయితే ఆంజనేయుడికి హనుమంతుడనే పేరు రావడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. దైవాంశతో జన్మించిన కేసరినందనుడు పుట్టుకతోనే అమితబలశాలి. చిన్నతనంలో ఆకలిగా ఉందని ఏదైనా తినడానికి పెట్టమని అంజనీదేవిని అడగగా, ఆమె బాగా ఎర్రగా పండిన ఏ పండునైనా తినమని చెబుతుంది. సూర్యోదయవేళ ఉదయించే భానుడినే మధురఫలమని భావించి దాన్ని తినడానికి బయలుదేరుతాడు వానరవీరుడు. ఆరోజు సూర్యగ్రహణం కారణంగా సూర్యుడిని మింగడానికి రాహువు అక్కడికి చేరుకుంటాడు. తనకంటే ముందే మరొకరు సూర్యుడిని తినాలని భావిస్తుండటంతో కోపం తెచ్చుకున్న రాహువు దేవతలకు రాజైన ఇంద్రుడిని శరణువేడుతాడు. 
ఆ క్రమంలో ఇంద్రుడు ఆంజనేయుడిని తన వజ్రాయుధంతో గాయపరుస్తాడు. వజ్రాయుధం దెబ్బకు ఆంజనేయుడి దవడ వాచిపోతుంది. వాచిన హనుమలు (దవడలు) కలవాడు కాబట్టే ఆంజనేయుడికి హనుమంతుడనే పేరు వచ్చిందని పరాశర సంహిత తెలియజేస్తోంది.

పెళ్లయిన బ్రహ్మచారి... 
హనుమంతుడు బ్రహ్మచారిగానే అందరికీ తెలుసు. దీనికి భిన్నంగా సువర్చలాసమేత ఆంజనేయస్వామి ఆలయాలు కనిపిస్తాయి. అంతేకాదు హనుమజ్జయంతి రోజున ఆంజనేయుడికీ సువర్చలకూ కల్యాణాన్ని జరిపిస్తారు కూడా. సువర్చల సూర్యుడి కుమార్తె. హనుమంతుడికి విద్యలు నేర్పగల గురువు సూర్యభగవానుడు ఒక్కరే అని తెలుసుకున్న హనుమ సూర్యుడికి ఎదురెళ్లి చదువుచెప్పమని వేడుకుంటాడు. అప్పుడు సూర్యుడు... నిరంతరం తిరుగుతూ ఉంటాను కాబట్టి తనకి చదువుచెప్పడం కుదరదని చెబుతాడు. ఆయన గమనానికి ఏమాత్రం అవరోధం కలిగించకుండా సూర్యుడికి అభిముఖంగా భ్రమణం చెందుతూనే సకలవిద్యలనూ నేర్చుకుంటాడు హనుమంతుడు. అతడి బుద్ధి కుశలతకూ, జ్ఞానానికీ, పరాక్రమానికీ మెచ్చిన సూర్యభగవానుడు గురుదక్షిణగా తన కుమార్తె అయిన సువర్చలను పెళ్లిచేసుకోమని కోరగా ఆజన్మ బ్రహ్మచారి అయిన తనెలా పెళ్లిచేసుకోగలనని అడిగాడట. తన బ్రహ్మచర్య వ్రతానికి ఏవిధమైన ఆటంకం రాదని సూర్యుడు చెప్పడంతో సువర్చలను వివాహం చేసుకున్నాడు. ఈ ఘట్టం చోటుచేసుకున్నది కూడా హనుమజ్జయంతి రోజునే. దీనికి ప్రతీకగానే ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో హనుమజ్జయంతినాడు ఈ దంపతులకు కల్యాణం జరిపిస్తారు.

సుందరకాండకు నాయకుడు 
రామ నామ స్మరణలేకుండా హనుమంతుడిని పరిపూర్ణంగా వర్ణించలేం. అలాగే హనుమంతుడు లేని రామకథను ఊహించనూ లేం. రామాయణం కాకుండా భగవంతుడూ భక్తుడూ ఒక్కరేనేమో అన్నంతగా మమేకమైన మరో కథ మన పురాణాల్లో 
కనిపించదంటే అతిశయోక్తి కాదేమో. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణంలో కిష్కింధకాండతో హనుమంతుడి కథ ప్రారంభమవుతుంది. అగ్ని సాక్షిగా సుగ్రీవుడికీ రాముడికీ మైత్రి కుర్చినప్పుడు, వాలి మరణానంతరం తారతో సుగ్రీవుడే వానరులకు రాజని చెప్పించినప్పుడూ, నూరు యోజనాల సముద్రాన్ని దాటినప్పుడూ, రామదూతగా సీతమ్మకి ధైర్యం చెప్పినప్పుడూ, లంకాదహనం చేసి శత్రువుల బలాబలాలు అంచనా వేసినప్పుడూ, శ్రీరామ పట్టాభిషేకం సమయంలో ఉచిత ఆసనాన్ని కాదని రాముడి పాదాలచెంత చేరినప్పుడూ... ఇలా హనుమంతుడు కనిపించిన ప్రతి ఘట్టంలోనూ ఆయన స్వరూప స్వభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఆయన గొప్పతాన్ని చాటిచెబుతూనే ఉంటాయి. ఈ కారణం చేతనే రామాయణంలోని అన్ని కాండలకూ నాయకుడు రాముడే అయినా సుందరకాండకు మాత్రం హనుమంతుడే నాయకుడు. సకలగుణ సంపన్నుడైన హనుమంతుడి వైభవాన్ని వివరిస్తుంది కనుకనే సుందరకాండ స్వయం ప్రతిపత్తికలిగిన నిత్యపారాయణ గ్రంథంగా అలరారుతోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.