close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సర్వేజనా సుఖినోభవంతు 

- లావణ్య కళత్తూరు

మరుసటి రోజు కల్యాణానికి తీసుకువెళ్లాల్సిన వస్తువులూ పూలదండలూ ముత్యాలూ తాను కట్టుకోవాల్సిన చీరా నగలూ అన్నీ సర్ది ఒకచోట పెట్టింది సుజాతమ్మ. పొద్దున్నే త్వరగా నిద్రలేవాలి కనుక, తొమ్మిది గంటలకే పడుకుంది.పెట్టుకున్న అలారం కొట్టకముందే, ఉదయం నాలుగవుతుందనగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. గటగటా ఒక గ్లాసు నీళ్లు తాగేసి నిరామయంగా కూర్చుండిపోయింది. కాసేపటికి లేచి కాలకృత్యాలు ముగించుకుని బస్టాప్‌కి బయలుదేరింది. పది నిమిషాలలో వాళ్ళ ఊరు వెళ్లే బస్సు రావడం, ఎక్కడం జరిగిపోయాయి. ఊరు ఇంకొక పది నిమిషాల్లో చేరుతామనగా... తన కొడుకు కిరణ్‌కి బస్టాప్‌కి రమ్మని ఫోన్‌ చేసింది. కిరణ్‌కి ఒక్కసారి ఏమి వింటున్నాడో అర్థంకాకపోయినా, తన భార్య చైతన్యకి అమ్మ వస్తున్న సంగతి చెప్పి, వెంటనే కారు తీసుకుని బస్టాండ్‌కి వెళ్ళాడు. ఆ విషయం విన్న వెంటనే చైతన్యకు కూడా సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఒక్కసారి గత రెండు రోజులుగా ఇంట్లో జరిగిన విషయాలన్నీ తన కళ్ళ ముందు మెదిలాయి.

                         *

‘‘సర్వేజనా సుఖినోభవంతు, ఓం శాంతిః శాంతిః శాంతిః’’ అంటూ హారతి గంటతోపాటు అత్తగారి గొంతు వినిపిస్తోంది పూజ గదినుండి. చైతన్య తనకు ఆఫీసు టైము కావటంతో దేవుడికి ఒక నమస్కారం పెట్టి బయలుదేరింది. చైతన్య ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చేసి ఆంధ్రా యూనివర్సిటీలో లెక్చరర్‌గా చేస్తోంది. చైతన్య భర్త కిరణ్‌ కుమార్‌ ఒక ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగి.

ఆ రోజు యూనివర్సిటీలో పని ఎక్కువ ఉండటంతో అలసిపోయి ఇంటికి వచ్చింది చైతన్య. కిరణ్‌ ఇంకా ఇంటికి రాలేదు. గుడిలో బ్రహ్మోత్సవాలు కావటంతో అత్తగారూ మామగారూ పిల్లలూ గుడికి వెళ్లి ఉన్నారు. వాళ్లంతా గుడిలోనే మహాప్రసాదం తినేస్తారు కనుక, తనకి, కిరణ్‌కి మాత్రమే ఒక గ్లాస్‌ అన్నం పెట్టేసింది- ఉదయాన వండిన పప్పుతో తినేయచ్చనుకుంటూ. కాసేపటికి అందరూ ఇంటికి వచ్చారు. భోజనాలు చేసి ఉండటంతో త్వరగానే పడుకున్నారు. వాళ్ళ అత్తగారు సణుక్కుంటూ పడుకోవటం తను గమనించకపోలేదు.

తర్వాతి రోజు ఇన్విజిలేషన్‌ వేరే ఊర్లో ఉండటంతో, రోజూకంటే ముందుగానే తయారవుతోంది చైతన్య. ఇంతలో, పూజగదిలోంచి వాళ్ళ అత్తగారు గట్టిగా మాట్లాడటం వినిపిస్తోంది. ‘‘ఇదెక్కడి పద్ధతమ్మా, కనీ వినీ ఎరగలేదు! ఎప్పుడూ ఉద్యోగమూ, వంటా వార్పూ, సినిమాలూ షాపింగులూ! ఇవన్నీ ఇచ్చిన దేవుడు మాత్రం గుర్తుకురాడు. ఒకపూట అయినా గుడికి వెళదాం, ఓ వ్రతం చేద్దాం అని లేదు. పూజా పునస్కారాలు లేని ఇల్లు ఒక ఇల్లేనా... ఆ ఇల్లాలు ఇల్లాలేనా?’’ ...ఇలా సాగుతోంది అత్తగారి అసంతృప్తి పర్వం.

అత్తగారు ఈ పూజలూ వ్రతాల విషయంలో చాలాసార్లు తనని దెప్పినా పెద్దగా పట్టించుకోలేదు- పెద్దావిడ కదా అని. కానీ ఈసారి మాట్లాడాలని అనుకుంది. ‘‘అదేంటి అత్తయ్యా, అలా అంటారు? ఉద్యోగం, ఇంటిపనీ పిల్లల చదువులూ ఒకేసారి చూసుకోవటం నాకు మాత్రం అంత ఇష్టం, సులభం అనుకుంటున్నారా? మీ అబ్బాయి సంగతి తెలిసిందేగా, ఎప్పుడు వెళతారో, ఏ చీకటిపడ్డాక ఇంటికి వస్తారో తెలియనిదా మీకు. ఒకరి ఉద్యోగంతో ఇల్లు గడిచే రోజులా ఇవి. పిల్లలకి మంచి భవిష్యత్తూ మనకు ఇంత చక్కని క్వార్టర్సూ ఆహ్లాదకరమైన వాతావరణమూ హాస్పిటల్‌ సౌకర్యమూ... అన్నీ ఉన్నది ఇంత మంచి ఉద్యోగం వల్లనే కదా! పిల్లల సరదాలకు సినిమాలూ, అవసరాలకి షాపింగులూ చేయటం కూడా తప్పంటే ఎలా? ఇక గుడికంటారా... వెళుతూనే ఉన్నాం కదా- ప్రతి పండుగకీ. పిల్లలు ప్రతివారం మీతో వస్తూనే వున్నారు. పూజా పునస్కారాలు లేని ఇల్లు ఎందుకవుతుంది అత్తయ్యా, మీరు నిత్య పూజలు చేస్తున్నారు కదా. అయినా మీరు చేసే పూజలూ వ్రతాల ఫలితం మాకు రాదూ’’ అంది చైతన్య నొచ్చుకుంటూ.

‘‘బాగానే చెప్తున్నావమ్మా. నేను తింటే మీరు తిన్నట్టా... కాదు కదా, పూజలూ అంతే. ఎవరి పూజలు వాళ్ళవి. ఎవరి ఫలం వారికి. నీకే ఏ పూజలూ సంప్రదాయాలూ పట్టకుండా ఉంటే, ఇక పిల్లలకి ఏమి నేర్పను? అసలే ఇద్దరూ కూతుళ్లు. కొన్నైనా నేర్పుతావా ఆచారాలూ సంప్రదాయాలూ... లేదంటే మనల్ని అంటారు అందరూ. నాతోనే పోవాల్సిందేనేమో ఇవన్నీ! మా అమ్మ చెప్పినవన్నీ తు.చ. తప్పకుండా నేర్చుకున్నాను. మా అత్తగారివైపు పెద్ద పట్టింపులు లేకున్నా, ఏ ఒక్క పద్దతీ ఆచారమూ కూడా వదల్లేదు. కానీ ఆఖరికి నా ఇంట్లోనే ఇలా అవుతుందని అనుకోలేదు. నిన్న పొద్దున్న ఆ పక్కింటి విజయగారు, ఆంజనేయస్వామికి సహస్రవడమాల సమర్పించారు. అందరి కళ్ళూ ఆవిడవైపే! నాకు ఈ ఇంట్లో ఏమాత్రం సాయం ఉందా ఇలాంటి వాటికి? నా ఇంట్లో ఉన్నవాళ్లకి భక్తి ఉందా అలా సంకల్పించుకోవటానికి?’’ అని నిష్ఠురపోయింది సుజాతమ్మ.

‘‘భక్తి అనేది భావం అత్తయ్యా. మనసులో ఉండాలి, ఆర్భాటం కాదు- బాహాటంగా చూపటానికి. అయినా గూఢభక్తీ గుప్తదానమూ అన్నారు కానీ, ఇలా ఆర్భాటాలు చేయమనీ దానిని మైకులో చెప్పించుకోమనీ అన్నారా? పోనీ మీరు ఇలా అని చెప్పి ఉంటే నేను సాయం చేయకపోదునా మీ తృప్తి కోసం’’ అంది చైతన్య.‘‘నా తృప్తి కోసం ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు. మీకోసం మీ పుణ్యం కోసం చేసుకోండి’’ అని సుజాతమ్మ విసవిసా వెళ్ళిపోయింది.

అత్తగారు బాగా వేడి మీద ఉన్నారు, ఇక ఇప్పుడు మాట్లాడినా ఏమీ ప్రయోజనం ఉండదు అనుకుని, త్వరగా వెళ్లాల్సిన సంగతి గుర్తుకువచ్చి చకచకా తయారై బయల్దేరింది చైతన్య. బస్సు ఎక్కిందన్న మాటేకానీ, ఇంట్లో జరిగిన సంభాషణే గుర్తుకువస్తోంది. రోజూ పద్దెనిమిది గంటలు కష్టపడుతూ అత్తగారికీ పిల్లలకీ భర్తకీ అన్ని అమరుస్తూ ఉన్నా కూడా అత్తగారికి ఇంకా తన విషయంలో సంతృప్తి లేనందుకు బాధపడింది. తను ఎవర్నీ నొప్పించదు, అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేస్తుంది, తనకున్న దాంట్లో కొంత దానధర్మాలు చేస్తుంటుంది, ఇంట్లో అందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. తన దృష్టిలో ఇవే పూజలూ నోములూ వ్రతాలూ. అందరి సంతోషం, ఆరోగ్యమే పూజాఫలాలు. కానీ ఇవేవి అత్తగారికి అర్థంకావు.

‘‘రెండు రోజుల్లో పెద్దదాని పుట్టినరోజు వస్తోంది కదా. చాకొలెట్లూ, కేకులూ అంటూ డబ్బులు తగలెయ్యక, మన గుడిలో స్వామికి తైలాభిషేకం చేయించి, దాని పేరుమీద అర్చన చేయించి, ఆ పంతులుకి ఓ వెయ్యి నూటపదహార్లూ, స్వయంపాకం ఇప్పించండి, చక్కగా దీవిస్తాడు. అతను ఏమి అంటే అవి జరుగుతాయటనే’’ అంది.

నిజంగా పూజలు చేస్తేనే- పుణ్యం వస్తుందీ ఏ కష్టమూ రాదు అనుకుంటే, గుళ్లో నిత్య పూజలుచేసే పూజార్లకి అసలు ఏ బాధలూ ఉండకూడదుగా! కానీ వారికీ ఆర్థిక భాధలూ అనారోగ్యాలూ అకాల మరణాలూ ఉన్నాయే! మన జన్మలన్నీ కర్మఫలానుసారం అంటారు కదా, మరి పూజ ఒక్కటేనా చేయవల్సిన కర్మ? చేసే ప్రతి కర్మనీ ఒక పూజలా భావించి, చెడుతలపు లేకుండా, ఫలాపేక్ష చింతనలేకుండా చేయమని కదా శ్రీకృష్ణులవారు గీతలో ఉపదేశించింది. ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి’ అని సెలవిచ్చారుగానీ, భక్తి లేకుండా చేసే ఆర్భాటాలు ఆయనకు ప్రీతి పాత్రాలా? నవవిధ భక్తిమార్గాల్లో ఇలాంటి వాటి ప్రస్తావనే లేదే? నిత్యమూ హనుమాన్‌ చాలీసా, విష్ణు సహస్రం, లలితా సహస్రం, గీతా పారాయణం చేసే తన అత్తగారు ఇలాంటివి ఎప్పుడూ ఆలోచించలేదా? అనుకుంటూ తన స్టాప్‌ రావటంతో ఆలోచనలకి కామా పెట్టి బస్సు దిగింది చైతన్య.

సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి వాతావరణం మామూలుగానే ఉంది. పిల్లలు హోమ్‌వర్క్‌ చేసుకుంటున్నారు. మరుసటిరోజు శ్రీరామనవమి కావటంతో అత్తగారు టౌన్‌షిప్‌లో దొరికే రకరకాల పువ్వులు తెచ్చి దండలు గుచ్చుతూ ఉన్నారు. ఇక స్నానంచేసి వంట ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఉండగా ఫోన్‌ మోగింది. ఊరు నుంచి చిన్న మావయ్యగారు చేశారు, వాళ్ళ అమ్మకి- అనగా- తన అత్తగారి అత్తకి చాలా సుస్తీగా ఉందనీ ఈ పూట గడవటం కూడా చాలా కష్టమనీ మనవలని చూడాలనంటోందనీ వెంటనే బయలుదేరి రమ్మనీ సారాంశం. ఈ విషయాన్ని అత్తగారికీ మామగారికీ చెప్పింది. కిరణ్‌కు ఫోన్‌చేసి వెంటనే రమ్మంది ఊరు బయలుదేరటానికి. ముసలావిడకి బాలేదని చెప్పినప్పటి నుంచీ అత్తగారి ముఖం 
కళావిహీనంగా ఉంది.

చైతన్య వాళ్ళ టౌన్‌షిప్‌ నుండి ఊరు ఎంతో దూరం కాదు, కారులో వెళితే మూడు గంటల్లో చేరుకోవచ్చు. కిరణ్‌వాళ్ళ నానమ్మ ఊర్లో తన చిన్నకొడుకు దగ్గరే ఉంటోంది. తన పెళ్లి అయినప్పటి నుండి ఎప్పుడూ ఆవిడ వచ్చి ఒక పదిరోజులు ఉండటం తాను చూడలేదు. ఎందుకని అడిగితే, ఊర్లోనే ఆవిడకు సౌకర్యంగానూ సందడిగానూ ఉంటుందనీ ఇక్కడకు వచ్చినా ఇమడలేదనీ అత్తగారు చెప్పినట్లు గుర్తు.

పోయిన పండుగకు ఊరు వెళ్ళినపుడు ఆ ముసలావిడ పిల్లల్ని ఎంతగా గారం చేసిందో! వాళ్ళతోపాటే ఆవిడను టౌన్‌షిప్‌కి రమ్మంటే, వెంటనే అత్తగారు తనవైపు తీక్షణంగా చూడటమూ ఆ ముసలావిడ నిట్టూర్చటమూ కంట్లోతడీ తనకి ఇంకా గుర్తే. ఇదే విషయాన్ని కిరణ్‌తో అంటే, ‘అమ్మకు పూజలకే టైము సరిపోదు, ఇక నాన్నమ్మ వస్తే తన బాగోగులు ఎవరు చూసుకుంటారు? అయినా వాళ్ళిద్దరికీ పడదులే. నానమ్మకేమో మనుషులూ బంధాలూ వాళ్లకి కావాల్సినవి చేసిపెట్టి తృప్తిగా ఉంచడమూ వాళ్ళ సంతోషమే తన సంతోషం అనుకోవడమూ ముఖ్యం. అమ్మకేమో పూజలూ వ్రతాలూ నోములే ముఖ్యం. రాకరాక వచ్చే మానవజన్మ అనీ, వీలైనన్ని పూజలు చేసి మోక్షం సంపాదించాలనీ అమ్మ తాపత్రయం. ఎవర్నీ తప్పుపట్టలేము కదా, అందుకే ఎక్కువ ఆలోచించక వాళ్ళ మానాన వాళ్ళని వదిలెయ్యి’ అన్నాడు. తనూ తర్వాత ఆ విషయమై పెద్దగా ఆలోచించలేదు.

పిల్లలకు తినిపించేసి, తాను ఏదో తిన్నాననిపించి కిరణ్‌ కోసం వేచిచూస్తూ ఉంది. గదిలో బట్టలు సర్దుతుండగా కిరణ్‌ వచ్చాడు. ‘‘చైతూ, అమ్మా... మీరు రెడీయా, చిన్నాన్న ఎక్కడిదాకా వచ్చామంటూ మళ్ళీ ఫోన్‌ చేశారు. ఇంకొక అరగంటలో బయల్దేరదాం’’ అని స్నానానికి వెళ్ళిపోయాడు.

‘‘రేపు శ్రీరామనవమి, గుళ్లో కల్యాణం ఉంది, అది చూసుకుని రేపు సాయంత్రం బయలుదేరతామని ఫోన్‌ చేసి చెప్పండి మీ తమ్ముడికి. అంతగా ఏదైనా జరిగితే, మూడు గంటల్లో వెళ్లిపోవచ్చును కదా’’ అంది సుజాతమ్మ భర్తతో.

‘‘తమ్ముడు ఇప్పటికే చాలాసార్లు చేశాడు. వాడు ఊరకనే మనల్ని ఇబ్బందిపెట్టడని నీకు తెలుసుగా. కల్యాణం ప్రతీ సంవత్సరం వచ్చేదే. నిజంగా ఏదైనా జరగరానిది జరిగితే అమ్మని చివరిసారి ఊపిరితో చూసే అవకాశం పోతుంది. దానికి అసలే మనవలంటే విపరీతమైన ఇష్టం’’ అన్నాడు భర్త నాగేశ్వరరావు.

నాకైతే ససేమిరా ఇష్టంలేదు కల్యాణం మానుకుని రావడం. ప్రతీ సంవత్సరం వచ్చే కల్యాణం అయినా... గడిచిన కాలం, వదులుకున్న పుణ్యం తిరిగి వస్తాయా? ‘‘ఒక పని చేస్తాను... నేను రేపు కల్యాణం అయ్యాక బస్సులో వస్తాను, మీరంతా ఇప్పుడు వెళ్ళండి’’ స్థిరంగా అంది సుజాతమ్మ.

‘‘ఎంతో పుణ్యాత్మురాలే మా అమ్మ. ఏనాడూ చీమకైనా హాని తలపెట్టలేదు. తనని చూస్తే, ఆమెకి కాస్త సేవ చేస్తే, ఆ రాములవారి కల్యాణం కంటే ఎక్కువ ఫలమే దక్కుతుందే, పద’’ అన్నాడు నాగేశ్వరరావు.

‘‘పుణ్యాత్మురాలా... ఏ రోజు ఏమి పూజలు చేసిందని? చీమలకి ఏమీ హాని చేయలేదేమో కానీ, నన్ను మాత్రం చాలా ఇబ్బంది పెట్టేది. వచ్చిన నాలుగు రోజులు కూడా నా పూజలకు ఆటంకమయ్యేది, పోతూ కూడా అడ్డుతగిలే పోయేలా ఉంది. నేను ఎంతలా పూజలూ నోములూ చేయాలనీ చేయించాలనీ తలపెడతానో అప్పుడు ఏదో ఒక ఉపద్రవం వచ్చిపడుతూ ఉంటుంది. అంతా నా ఖర్మ’’ అంది సుజాతమ్మ.

ఆ మాటలకి అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు, అలా కూడా ఎవరైనా ఆలోచించగలరా అని. అప్పుడుకానీ అర్థంకాలేదు, అత్తగారి ముఖం కళావిహీనంగా ఎందుకు ఉన్నదీ.

నాగేశ్వరరావు భార్య మాటలకి నొచ్చుకున్నా, ఆవిడ పంతం తెలిసినవాడు కావడంతో మారుమాట్లాడలేదు. అత్తగారు కల్యాణం కోసం, ఆఖరి క్షణాల్లో ఉన్న తన అత్తగారిని చూడటానికి నిరాకరించటం చైతన్యకు అంతగా నచ్చలేదు. రేపు తన అత్తతో తను ఇలా ప్రవర్తిస్తే ఆవిడ తట్టుకుంటుందా? మరి ఇప్పుడు ఆవిడ- తనకు, పిల్లలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు.

‘‘ఏవి బ్యాగులు... ఇవేనా... పదండి కారు తీస్తాను’’ అంటూ కిరణ్‌ రావటంతో చేసేది ఏమీలేక అత్తగారిని వదిలే బయల్దేరారు. సుజాతమ్మ  హనుమాన్‌ చాలీసా చదవటం మొదలెట్టింది. ఊరు చేరుకునేసరికి పది గంటలు దాటింది. ముసలావిడ నిద్రలో కలవరిస్తూ ఉంది. కిరణ్‌ ‘నాన్నమ్మా, నాన్నమ్మా!’ అని పిలవగా కాస్త స్పృహలోకి వచ్చింది. ‘వచ్చారా’ అంటూ అందర్నీ ఒకసారి పరికించి చూసింది. ఆమె కళ్ళు ఎవర్నో వెతుకుతున్నాయి. కాసేపటికి అలా రెప్పలు వాల్చింది, ధారగా నీళ్లు కారుతున్నాయి కంటినుండి. చిన్నకోడలు మంచం దగ్గరే కూర్చుంది. చైతన్య కూడా పక్కనే కూర్చుంది. అంత చీకటివేళ అయినా ఊరంతా వచ్చి చూసిపోతున్నారు. ‘మంచిమనిషి, అందరికీ పెట్టే చెయ్యి, అందరికీ పెద్దదిక్కులా ఉండేది, పుణ్యాత్మురాలు, ఏ బాధా లేకుండా హాయిగా బతికింది, ఎవ్వర్నీ ఏ ఇబ్బందీ పెట్టకుండా పోబోతోంది స్వర్గానికి...’ ఇలా అందరూ తలా  ఒక మాట అంటున్నారు. ‘పెద్దకోడలు రాలేదా, ఏమోలే...’ అని గొణగడం చైతన్య చెవిన పడకపోలేదు. కాసేపటికి అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు.

‘‘ఏ బాధా లేకపోవడమేంటి... ముసల్దానికి పెద్దకొడుకు మీద మనసు మళ్లినప్పుడల్లా, ముద్ద తినేదికాదు. బెంగెట్టుకుని పడుకునేది. ‘నీకెందుకే ముసలీ ఇంకా తాపత్రయం’ అంటే, ‘కొడుకు మీద కలవరం కూడా తప్పేనా’ అనేది. పెద్దకొడుకు దగ్గర నాలుగు రోజులు గడపాలన్నా కుదరకపోయే. కాసిని కాఫీనీళ్లు పోసిందా కోడలు టయానికి, కూకుని రెండుమాటలు చెప్పిందా పొద్దుపోటానికి. ఆయమ్మకి దేవుళ్ళూ గుళ్ళూ ఎక్కువాయె! ఇంట్లో పెద్దమనిషికి చేసే సేవకన్నా గొప్పదా, దేవుడికి చేసే పూజ? సాటిమనిషికి చేసే సాయంకంటే గొప్పదా గుడికెళ్లటం? పోవాల, గుడికి పోవాల! కానీ ఇంట్లో ఉన్న ఒక్క పెద్దమనిషినీ ఒగ్గేసి కాదు. నోములు చెయ్యాల, కానీ అత్తగారికి జెల్లకొట్టి కాదు. పోనీ ఆయమ్మ ఏవైనా అందరత్తల్లా ఆర్చిందా, నూర్చిందా..? కన్నబిడ్డల్లే చూసిందే... అయినా బంధనమైపోయిందే మూడుపూట్ల ముద్ద పెట్టడం. సరేలే, ఆ దేవుడే చూసుకుంటాడు ఆ లెక్కా, ఈ లెక్కా’’ అంది చైతన్య చిన్నత్త గద్గదమైన గొంతుతో. తన అత్తగారిని చిన్నత్త అలా అనటం నచ్చకపోయినా, ఆమె మాటలు అక్షరసత్యాలు కావటంతో ఊరుకుంది. అవును నిజమే, తన మామగారు షుగర్‌ పేషెంట్‌ అయినా కూడా పూజా, పారాయణం అంతా ముగించుకొచ్చాక కానీ ఆయనకి టిఫిను పెట్టేవారు కాదు. చాలాసార్లు చూశాక, ఇక లాభం లేదనుకుని ఆఫీసుకి లేటు అవుతున్నా సరే, తనే పెట్టి వెళ్ళేది. మామయ్యగారు మాత్రం ‘ఎందుకమ్మా, అది వచ్చి పెడుతుంది కదా’ అనేవారు మొహమాటంగా.

తానూ నిత్యపూజ చేస్తుంది, కానీ అత్తగారికి అది సరిపోదు. రోజూ గుడికి వెళ్లాలనేది. సరే అని ఒకవారం అలాగే చేసి చూసింది. అదీ తన అత్తగారికి తృప్తినివ్వలేదు. వారంలో దొరికే ఒక్క ఆదివారం సెలవునాడు కూడా, దగ్గర్లో ఉన్న ఆశ్రమంలో హోమానికి వెళదామనేది. ఆ విషయానికి మాత్రం తాను ససేమిరా ఒప్పుకోలేదు. పూజలు చేయటం, గుడికి వెళ్ళటం తనకూ ఇష్టం, ఎంతో మానసిక ప్రశాంతతని కూడా ఇస్తాయి. కానీ పక్కనవాళ్ళ ప్రశాంతతని పోగొట్టేంతగా చేసే పూజలూ పాటించే ఆచారాలూ పెట్టే నియమాలూ మాత్రం ఎవరికీ మేలు చేయవని తన నమ్మకం. దేవుడ్ని చేరటమే అందరి పరమావధి. కానీ దానికి పూజలూ నోములే కాకుండా ఎన్నో మార్గాలున్నాయే!

పూజలూ పునస్కారాల పేరుతో, ఆచారాలూ సంప్రదాయాల పేరుతో తన కూతుళ్ళని మరో ఇద్దరు సుజాతమ్మల్లా తయారు చేయకూడదు అనుకుంది. ‘తన పిల్లలకు మనిషిలో దేవుడిని చూడగలగటం నేర్పాలనీ మానవసేవే మాధవసేవని చెప్పాలనీ బంధాలు నిలుపుకునే పద్ధతులే పూజలని తెలియచేయాలనీ ఎవ్వర్నీ నొప్పించక పోవటమే పెద్ద వ్రతమాచరించటమనీ... ఆనందంగా ఉండటం, ఆనందంగా ఉంచటమే అసలైన మోక్ష మార్గాలనీ... ఇవన్నీ నేర్చుకుంటేనే, వంటపట్టించుకుంటేనే సర్వేజనా సుఖినోభవంతు’ అని ప్రార్థనచేసే అర్హత వస్తుందనీ చెప్పాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.

                         *

వచ్చినప్పటినుండీ సుజాతమ్మ తన అత్తగారి దగ్గరే కూర్చుంది. శారీరక అనారోగ్యంకంటే, మానసిక అనారోగ్యమే మనిషిని ఎక్కువ కుంగదీస్తుందేమో... మనవడినీ పిల్లల్నీ చూసినందుకేమో, ఉదయానికి ముసలావిడ కాస్త తేరుకుంది. సుజాతమ్మ రెండు ఇడ్లీలు ప్లేటులో వేసుకుని వచ్చి అత్తకి ఇచ్చింది. ‘‘కాఫీ తాగుతారా, టీ తాగుతారా?’’ అని అడుగుతోంది. పెద్దకోడలు కూడా వచ్చేసరికి ముసలావిడ ఆనందానికి అవధులు లేవు. మామ్మగారైతే బానే ఉన్నారుకానీ, నిన్న తమ ఇంట్లో సుజాతమ్మ అన్న మాటలకీ ఈరోజు ఇక్కడ చూస్తున్న దృశ్యాలకీ ఏమీ పొంతన లేకపోవటంతో, చైతన్య, కిరణ్‌, నాగేశ్వరరావు మాత్రం తెల్లమొహాలు వేసుకుని కలా నిజమా అన్నట్లు ఒకరిని ఒకరు చూసుకున్నారు.

అందరూ రెండు రోజులు ఉండి, ముసలావిడ ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి ఇంటికి బయలుదేరారు. ‘‘ఇప్పుడే మిమ్మల్ని మాతో తీసుకుని వెళ్లాలని ఉంది అత్తయ్యా, కానీ మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా. అటూ ఇటూ తిప్పటం ఎందుకు? పూర్తిగా కోలుకున్నాక కబురుచేస్తే నేనూ కిరణ్‌ వచ్చి తీసుకువెళ్తాం’’ అంది సుజాతమ్మ.

సుజాతమ్మలో వచ్చిన మార్పుకు అందరూ సంబరపడినా, ‘అసలు ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుందబ్బా’ అనుకున్నారంతా. ‘కారణం తెలుసుకోవటం అవసరమా?’ అని అంతర్వాణి హెచ్చరించినట్లు అన్పించటంతో, ఆ విషయం వదిలేసి సంతోషంగా తిరిగి బయలుదేరారు.

కారులో తిరిగివస్తూ అలా కళ్ళు మూసుకుంది సుజాతమ్మ. రాములవారు నవ్వుతూ, చల్లని చూపులు చూస్తున్నట్లు అన్పించింది. ‘రామా! ఇంత సమయం ఎందుకు తీసుకున్నావయ్యా... ఎప్పుడో దండించాల్సింది కదా నన్ను’ అనుకుంటూ తెల్లవారుజామున వచ్చిన కలను మరోసారి గుర్తు చేసుకుంది.

                         *

గుడిలో సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లూ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఉన్నారేమో, మండపం అంతా కిక్కిరిసిపోయి ఉంది. గుడిలో ఎప్పుడూ అన్ని కార్యక్రమాలకీ ముందు ఉంటుంది కనుక, తనకి మొదటి వరుసలోనే చోటు ఉంచుతున్నారు. అంత దగ్గరగా కూర్చుని కల్యాణం చూసే అవకాశం రావడంతో సుజాతమ్మ ఆనందానికి అవధులు లేవు. కల్యాణం మొదలైంది. కల్యాణ మహోత్సవంలో భాగంగా పంతులుగారు మంగళసూత్రాలని అందరి దగ్గరికి తీసుకువస్తున్నారు. సూత్రాలని కళ్ళకద్దుకుందామని సుజాతమ్మ ఎంత ప్రయత్నించినా చేతులు కదలటం లేదు. ఇంతలో పంతులుగారు తను కూర్చున్న వరసదాటి వెళ్లిపోయారు. కాసేపటికి మంగళహారతి ఇచ్చారు, అది కళ్ళకద్దుకుందామన్నా అదే పరిస్థితి. తలంబ్రాలు పోసిన అక్షతలు పంచుతున్నారు, కంకణాలు ఇస్తున్నారు. ఏవీ తనదాకా రావటంలేదు, వచ్చినా ఏవీ స్వీకరించలేని స్థితి కలుగుతోంది. తీర్థ ప్రసాదాలు తీసుకోటానికి వెళ్లి క్యూ కడుతున్నారు. తానుమాత్రం ఉన్నచోటు నుండి అంగుళం కూడా కదల్లేకపోతోంది. చుట్టూ ఏమి జరుగుతుందో అర్థమవుతూనే ఉంది, కానీ తనకు ఏమి జరుగుతోందో తెలియటం లేదు. ‘తనకేమైనా పక్షవాతం వచ్చిందా, మంచానికే పరిమితం కాబోతుందా’ అని సందేహం మొదలయింది. అసలే తన కోడలు ఉద్యోగస్తురాలు, ఇరవైనాలుగు గంటలూ సపర్యలు చేయగలదా? ఉద్యోగస్తురాలు కాకపోయినా చూడాలని రూలేమీ లేదుగా. ఇకముందు తన పరిస్థితి ఏంటో అర్థంకావటం లేదు!

పంతులుగారు ప్రవచనం మొదలుపెట్టారు. ఆది కావ్యమైన రామాయణం- మానవాళికి ఎంత బృహత్తరమైన సందేశాన్నిస్తుందో తెలియచేస్తున్నారు. ‘‘రాముని పితృవాక్య పరిపాలనా విధేయతా స్నేహశీలతా కరుణా పరిపాలనా దక్షతా... ఇలా ఏ గుణం తీసుకున్నా అది ముడిపడి ఉన్నది బంధాలతోనే. పితృవాక్య పరిపాలన తండ్రితో ఉన్న బంధాన్ని తెలియచేస్తే, ఏకపత్నీవ్రతం సీతమ్మవారిపట్ల ఉన్న ప్రేమను తెలియచేస్తుంది. సుగ్రీవునితో స్నేహబంధమూ హనుమంతుని పట్ల భక్తవాత్సల్యమూ శబరిపట్ల చూపిన కరుణా ప్రజల సుఖసంతోషాలకోసం రామ రాజ్యమూ... ఇలా ఏ సుగుణం తీసుకున్నా అది తెలిపేది మనిషికీ మనిషికీ ఉన్న, ఉండాల్సిన బంధాల గురించే. ఈ సుగుణాలన్నీ మానవజన్మలో మాత్రమే అలవరచుకోగలం కనుకనే, అన్ని జన్మలకన్నా మనుష జన్మ ఉత్తమమైందనీ, మోక్షానికి మార్గదాయకమనీ అంటుంటారు. అదే రామావతార సారాంశం. అది తెలుసుకోక ధర్మబద్దమైన బంధాల్నీ వాటితో ముడిపడి ఉన్న బాధ్యతల్నీ విస్మరిస్తే ఎన్ని పూజలు చేసినా ఫలం దక్కదు’’ అని సుజాతమ్మవైపు ఒకసారి చూసి పంతులుగారు ప్రవచనం ముగించారు. ఎందుకో చెంపఛెళ్ళున చరచినట్లు అనిపించింది.

తన ప్రస్తుత పరిస్థితికి కారణం కొంచెం కొంచెం అవగతమవుతోంది. రామాయణ సారాంశాన్ని వంటపట్టించుకోక, కల్యాణాలు కోలాటాలు అంటూ తిరుగుతూ చావుబ్రతుకుల మధ్య ఉన్న తన అత్తగారిని అంత తృణీకారభావంతో చూడటం ఎంత అజ్ఞానంతో కూడుకున్న అహంకారమో అర్థమవుతోంది. పూజా పునస్కారాల పేరుతో తన అత్తగారిపట్ల చూపిన నిర్లక్ష్యధోరణిని గుర్తుచేయటానికీ, మాతృ సమానురాలైన అత్తగారిపట్ల ఉన్న బాధ్యతని విస్మరించినందుకూ... ‘నాకు కనువిప్పు కలిగించటానికే కదా రామయ్యా, నాకీ దుస్థితి కలిగించావు. నా అజ్ఞానాన్ని మన్నించు రామా! నన్ను క్షమించు తండ్రీ! క్షమించు! క్షమించు! క్షమించు!’ అంటూ రెండు చేతులూ జోడించి  నమస్కరించింది. ‘ఆ! నా కాళ్ళూ చేతులూ కదులుతున్నాయి’ అనుకుని, లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా మెలకువ వచ్చింది.

                         *

కిరణ్‌ వేసిన సడన్‌ బ్రేక్‌తో మరలా ఈ లోకంలోకి వచ్చింది. ‘‘ఒరేయ్‌ కిరణ్‌, ఆ స్వాతి బేకరీ వచ్చినపుడు ఆపురా, రేపు పెద్దదాని పుట్టినరోజు కదా... చాకొలెట్లూ కేకూ కొందాం’’ అంది. మరోసారి ఆశ్చర్యపోవటం అందరి వంతయింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.