close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంత్రమేసినట్లు...బొమ్మ మారెనిట్లు..!

రోబో 2.0 సినిమాలో బుజ్జి బుజ్జి రోబోలు ఫోన్లుగా మారడం చూసే ఉంటారు కదూ! మళ్లీ అవే ఫోన్లు రోబోలుగా మారడమూ తెలిసిందే. అచ్చం అలాగే ఇప్పుడు రకరకాల బొమ్మలూ రోబోలుగా మారుతున్నాయి. అటూ ఇటూ నడుస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాగే రోబోలూ రకరకాల బొమ్మలైపోతున్నాయి. టెక్నాలజీ తెచ్చిన మార్పుల ఫలితంగా కొత్తతరం పిల్లల కోసం ఇలాంటి ‘ట్రాన్స్‌ఫార్మబుల్‌ టాయ్స్‌’ని తీసుకువస్తున్నాయి వివిధ బొమ్మల తయారీ సంస్థలు.

మ్యాజిక్‌... ఈ పదం వింటే చాలు పిల్లల కళ్లు ఇంతయిపోతాయి. ఆశ్చర్యంతో వాళ్ల ముఖాలు పువ్వుల్లా విచ్చుకుంటాయి. ఇందులో ఇంద్రజాలికుడు టోపీ చూపించి, దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి మళ్లీ తీస్తే అదో పూల కూజాలానో, తెల్లటి పావురంలానో మారిపోవడం చూస్తే కేరింతలు కొట్టకుండా ఉండలేరు. ఒక వస్తువు మరో దానిలా మారడం నిజంగా అబ్బురపరిచే విషయమే మరి! అదే అంశాన్ని మూలంగా తీసుకుని ట్రాన్స్‌ఫార్మబుల్‌ టాయ్స్‌ను తయారు చేస్తున్నాయి బొమ్మల తయారీ సంస్థలు. ఒక బొమ్మ మరో బొమ్మగా మారడం ఇందులోని ప్రత్యేకత.

భలే వింత! 
చింటూ ఎప్పటినుంచో తనకు కారు బొమ్మ కొనివ్వాలని ఒకటే గోల చేస్తున్నాడు. ‘బడికి సెలవులు ఇచ్చాక కొనిస్తా నాన్నా...’ అంటూ నాన్న దాటేస్తూ వచ్చాడు. చెప్పినట్టే సెలవుల్లో పెద్ద కారు బొమ్మ తెచ్చాడు నాన్న. రిమోట్‌తో నడిచే ఆ కారును తెగ మురిపెంగా చూస్తూ దాంతో బాగా ఆడసాగాడు చింటూ. ముందుకూ వెనకకూ పోనిస్తూ లైట్లు వెలిగేలా చేస్తూ శబ్దాలు తెప్పిస్తూ ఆనందంగా నడుపుతున్నాడు. నాన్న చింటూ దగ్గరికి వచ్చి ‘బాగా నడుస్తోందా నాన్నా... నీకు నచ్చిందా’ అంటూ అడుగుతూ రిమోట్‌ చేతిలోకి తీసుకున్నాడు. అలా అందులోని ఒక బటన్‌ నొక్కాడో లేదో వెంటనే చింటూ కార్‌ లేచి నిలుచుని రోబోలా మారిపోయింది. అలాగే నడుస్తూ చింటూ వైపు వస్తోంది. ‘హా...’ అంటూ నోరు తెరిచి, కళ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోవడం చింటూ వంతైంది. ఇక చింటూ స్నేహితులూ, చుట్టుపక్కల పిల్లలూ అంతా ఒక్కచోట పోగై ఆ బొమ్మను ఆశ్చర్యంతో చూస్తూ ఆడుకోవడం మొదలు పెట్టారు. ఒక్క కార్లే కాదు, హెలీకాప్టర్లూ, షిప్పులూ, యుద్ధట్యాంకర్లూ, ట్రక్కులూ, మోటార్‌ సైకిళ్లూ, రైళ్లూ... ఇలా అన్ని రకాల బొమ్మలూ రోబోల్లా మారిపోతున్నాయి. వాహనాల బొమ్మలతో పాటు డైనోసార్లూ, పులులూ, సింహాలూ, వాచీలు కూడా యంత్రుడిలా మారి మ్యాజిక్‌ చేస్తున్నాయి.

చిత్రంగా మారతాయ్‌... 
ఆమధ్య విదేశాల్లో ఇలా రోబోలా మారిపోయే నిజమైన కారు వీడియో వైరల్‌ అయింది. కారు ఉన్నట్టుండి ఆకాశమెత్తు రోబోలా మారి ముందుకు నడవడం, మళ్లీ అది నేలకు వంగి కారులా అయిపోవడం ఇందులో కనిపిస్తుంది. అదే తరహాలో, ఈ రకం ట్రాన్స్‌ఫార్మబుల్‌ టాయ్స్‌లో కూడా ఏ బొమ్మనయినా రోబోలా మార్చాక మళ్లీ మామూలు బొమ్మలా మార్చుకోవచ్చు. కొన్ని రకాల బొమ్మలు రోబో రూపంలో వచ్చినా తర్వాత ఏ వాహనం బొమ్మలానో, జంతువు బొమ్మలానో మారిపోతున్నాయి. ఇలా ఎన్నిసార్లయినా మన ఇష్టాన్ని బట్టి ఒకదాన్ని మరోదానిలా మార్చి చూసుకోవచ్చు. వీటిలో దాదాపు అన్ని బొమ్మలూ రిమోట్‌తో పనిచేస్తాయి. మామూలు బొమ్మల రిమోట్లలానే ఇందులోనూ ముందుకూ వెనకకూ వెళ్లడానికీ పక్కలకు జరగడానికీ బటన్లు ఉంటాయి. అంటే ఈ తరహా వాటిలో కారు బొమ్మ తీసుకున్నామనుకోండి... అది పక్కా రిమోట్‌ కంట్రోల్‌ కారులా పనిచేస్తుంది. అందులో లైట్లు వెలుగుతాయి, మ్యూజిక్‌ వస్తుంది, ఎటు కావాలంటే దాన్ని అటు నడుపుకోవచ్చన్నమాట. ఇక ట్రాన్స్‌ఫార్మ్‌ బటన్‌ను నొక్కగానే, అది రోబోలా మారిపోయి చిత్రమైన శబ్దాలు చేస్తుంటుంది. చేతిలో తుపాకీ ఉన్నట్టూ, కత్తీ డాలూ పట్టుకున్నట్టూ, బాణం విసురుతున్నట్టూ, పెద్ద పెద్ద గోళ్లుండే చేతులతో యుద్ధానికి వస్తున్నట్టూ... ఇలా ఒక్కో బొమ్మా ఒక్కో రకం రోబోలా మారుతుందన్నమాట. ఇక, రిమోట్‌ సాయంతో రోబో బొమ్మను 360 డిగ్రీల కోణంలో గుండ్రగా తిప్పొచ్చు. అటూ ఇటూ పరిగెత్తించవచ్చు. చిత్రంగా లైట్లు వెలగడంతో పాటు, తుపాకీ చప్పుళ్లూ వినిపిస్తాయప్పుడు. అంటే శత్రువులతో రోబో యుద్ధం చేస్తున్న అనుభూతి కలుగుతుందన్నమాట. మరో బటన్‌ నొక్కితే యుద్ధం గెలిచినట్టుగా రోబో డాన్స్‌ కూడా చేస్తుంది. ఇలా రిమోట్‌ కంట్రోల్‌తో కాకుండా లెగో తరహాలో వచ్చేవీ ఉన్నాయి. ఇందులో రెండు మూడు బొమ్మల్ని కలిపి మనమే ఒక రోబోను తయారు చేయొచ్చు. అయితే రిమోట్‌ సెన్సింగ్‌తో పనిచేసేవే ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో వాటికే ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది. ఎన్నో రంగులూ, బోలెడు డిజైన్లూ, రకరకాల వాహనాలూ, బొమ్మల మోడళ్లలో ఇవి దొరుకుతున్నాయి. ఈ బొమ్మలకు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. బ్యాటరీతోనూ పనిచేస్తాయి. ఇంట్లో పిల్లలకు కొనిచ్చేందుకూ, బహుమతులుగా అందించేందుకూ కూడా ఈ బొమ్మలు ఎంతో బాగుంటాయి. అమెజాన్‌, అలీఎక్స్‌ప్రెస్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా బోలెడు వెబ్‌సైట్లలో ఈ తరహా బొమ్మలు అమ్ముతున్నారు. మరి మీకు ఎలాంటి రోబో కావాలో చూసుకోండి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.