close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లల్ని ఎగరనిద్దాం...ఎదగనిద్దాం!

పెద్దలు చెప్పినట్లు పిల్లలు వినాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా వాళ్లేం చెప్పాలనుకుంటున్నారో- ఆలోచించామా? వాళ్ల చిన్ని బుర్రల్లో ఏం ఆలోచనలున్నాయో, సమాజం కోసం ఏంచేయాలనుకుంటున్నారో- అడిగామా? చిన్నపిల్లలు, వాళ్లకేం తెలుసూ... అనుకున్నాం. మనలాగే చాలామంది తల్లిదండ్రులూ టీచర్లూ అనుకున్నారు. కానీ- ‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ సంస్థ చేపట్టిన ‘ఐ కెన్‌’ ఛాలెంజ్‌లో పాల్గొన్న పిల్లల్నీ వారు సాధించిన విజయాల్నీ చూశాక వారి అభిప్రాయం మారిపోయింది... మనదీ మారుతుంది!

పాపాయి పుట్టినప్పటి నుంచీ మనం నేర్పించడం మొదలెడతాం. నవ్విస్తాం... ఏడ్పిస్తాం... బోర్ల పడితే పాకమని ముందుకు తోస్తాం. పాకుతుంటే లేపి కూర్చోబెడతాం. కూర్చుంటే ఊతమిచ్చి నిలబెడతాం. నిలబడితే వేలందించి నడిపిస్తాం.  నడుస్తుంటే డాన్స్‌ చేయమంటాం. మాటలు చెబుతుంటే పాటలు  పాడమంటాం.  ఈ ముద్దూ ముచ్చట్లతో ఓ మూడేళ్లు ముందుకు తోయడం అయిపోతుంది. ఆ తర్వాత... వెనక్కి లాగడం మొదలెడతాం.  ఇటు రావద్దు, అటు వెళ్లవద్దు, ఇది తీయొద్దు, అది ముట్టుకోవద్దు, అల్లరి చేయొద్దు, పరుగులు పెట్టొద్దు... ఇవేగా మనం మాట్లాడే మాటలు.

తర్వాత... ఇంట్లో అమ్మానాన్నా చెప్పినట్లు వినాలి. బడిలో టీచరు చెప్పినట్లు వినాలి. కూర్చోమంటే కూర్చోవాలి. నుంచోమంటే నుంచోవాలి. చదవమన్నది చదవాలి. రాయమన్నది రాయాలి... ఇది మనం నేర్పే క్రమశిక్షణ. కరిగించిన మైనాన్ని అచ్చులో పోసి కొవ్వొత్తిని తయారుచేసినట్లుగా పిల్లల్నీ మనం క్రమశిక్షణ పేరుతో ఒక మూసలో పెంచుతున్నాం. అన్నీ నేర్చుకుంటూ తమకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోవాల్సిన వయసంతా పిల్లలు ఇలా పెద్దలు కీ ఇచ్చి ఆడించే బొమ్మల్లా ఉంటున్నారు కాబట్టే పెద్దయ్యాక కూడా ఆ పరిధులు దాటి కొత్తగా ఏమీ చేయలేకపోతున్నారు. అందుకనే కోట్లలో పిల్లలున్న మన దేశంలో ఏవైనా అద్భుతాలు సాధించినవారి గురించి చెప్పబోతే పట్టుమని పదిమంది కూడా తేలడం లేదు... ఆ లోటును భర్తీ చేస్తానంటోంది ‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే సంస్థ. మార్పు కోసం ఈ సంస్థ చెబుతున్న మార్గం ఏమిటంటే...

ఆ అవకాశం పిల్లలకిస్తే... 
బ్యాట్‌మ్యాన్‌, స్పైడర్‌మ్యాన్‌ లాంటి సూపర్‌ హీరోలు ఎవరెవరి కష్టాలనో తమ శక్తియుక్తులతో ఇట్టే పరిష్కరించడాన్ని పిల్లలు అబ్బురంగా చూస్తారు. వాళ్లలాగా నటిస్తూ ఆనందిస్తారు. నిజంగా అలాంటి సూపర్‌ హీరోలయ్యే అవకాశం వాళ్లకే ఇస్తే... అదే చేస్తోంది ఈ ‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’. 8-16 మధ్య వయసు పిల్లల్లో కొత్తవి తెలుసుకోవాలన్న కుతూహలమూ ఆలోచనా ఎక్కువగా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను ఒక గాడిలో పెడితే పిల్లలు చాలా పనులు చేయగలరు. ఆ అనుభవంతో చక్కని వ్యక్తిత్వాన్నీ అలవరచుకోగలరు. ఆ ఆశయంతోనే రూపొందించిన ‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమం పూర్తిగా పిల్లల కోసం పిల్లలే చేసేది. వారిలో నిద్రాణంగా ఉన్న ఆలోచనాశక్తికీ సృజన శక్తికీ ఇది పనిపెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని ‘నేను చేయగలనా’ అన్న సంశయం నుంచి ‘చేయగలను’ అని ఆత్మవిశ్వాసంతో జవాబు చెప్పేలా తీర్చిదిద్దుతుంది ఈ విధానం. ఏ అంశానికైనా అన్వయించుకుని చేయడానికి వీలయ్యేలా రూపొందించిన ఈ డిజైన్‌ నాలుగు దశల్లో ఉంటుంది. పిల్లలు ముందుగా ఒక అంశాన్ని ఎంచుకుని- దాని ప్రభావాన్ని తాము అనుభూతి చెందుతారు, పరిష్కరించడానికి ఏం చేయాలో ఆలోచిస్తారు, ఆలోచనని ఆచరణలో పెడతారు, ఫలితాలను నలుగురితో పంచుకుంటారు. ఇంగ్లిషులో ఫీల్‌- ఇమాజిన్‌- డూ- షేర్‌... అనే ఈ నాలుగు దశల్నీ కలిపి ‘ఫిడ్స్‌ ఫర్‌ కిడ్స్‌’ అంటున్నారు. పిల్లల్లో ఉత్సాహాన్ని రేకెత్తించి ఈ విధానానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించడానికి ఏటా ‘ఐ కెన్‌’ ఛాలెంజ్‌ పేరుతో వేసవి సెలవుల్లో పోటీ ప్రకటిస్తారు. స్కూళ్ల తరఫున పిల్లలు బృందాలుగా ఇందులో పాల్గొని తాము తెచ్చిన మార్పు కథలను వ్యాసం, ఫొటోలూ, వీడియోల రూపంలో పంచుకోవచ్చు. గెలిచిన బృందాలను రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి తీసుకెళ్తారు.

పిల్లలు తెచ్చిన మార్పులు! 
పిల్లలు ఎన్ని రకాలుగా ఆలోచించగలరో, వారికి ఎన్ని విషయాలు తెలుసో చెబుతాయి ఈ కథలు. ఉదాహరణకు... 
బడి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పిల్లలు ఆడుతూ రోడ్డుమీదికి వెళ్లిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. గోడ కట్టించేందుకు స్కూలు దగ్గర డబ్బు లేదు. తరుణోపాయం ఏమిటని ఆలోచించిన పిల్లలకు సైన్సు టీచరు చెప్పిన వ్యర్థానికి అర్థం పాఠం గుర్తొచ్చింది. టీచరు సహాయంతోనే యూట్యూబ్‌లో వీడియోలు చూశారు. పారేసిన ప్లాస్టిక్‌ సీసాల్లో ఇసుక నింపి వాటినే ఇటుకలుగా పెట్టి మట్టితో గోడ కట్టొచ్చని తెలుసుకున్నారు. వందలాది సీసాలను సేకరించారు. తమ తల్లిదండ్రుల్లో నిర్మాణపని తెలిసినవారిని బతిమాలి మట్టిగోడ కట్టించుకున్నారు. కాంక్రీటుతో కడితే రూ.60 వేలు ఖర్చయ్యేది. అలాంటిది నామమాత్రపు ఖర్చుతో బడిచుట్టూ చక్కటి గోడ కట్టుకున్న తమిళనాడులోని ఆచిమంగళం అప్పర్‌ ప్రైమరీ స్కూలు పిల్లలు రూ.50వేల బహుమతినీ గెలుచుకున్నారు.

కేరళలోని ఒక చిన్న పల్లెటూళ్లో ఉన్న పాఠశాలకి కరెంటు లేదు. గదుల్లోకి చాలినంత వెలుగు రాదు. మిగతా కాలాల్లో బయట చెట్లకింద కూర్చుని చదువుకున్నా వర్షాకాలం లోపల కూర్చోక తప్పేది కాదు. కాంతి గురించి పాఠం చదువుకున్న ఏడో తరగతి పిల్లలకు ఓ ఆలోచన వచ్చింది. టీచరుకి చెప్పి దాన్ని ఆచరణలో పెట్టారు. భవనం పైకప్పు పెంకులతో ఉండడంతో మధ్య మధ్యలో ఆ పెంకుల్ని తొలగించి ఒక పద్ధతి ప్రకారం అద్దాలు అతికించారు. దాంతో తరగతి గదుల్లోకి చాలినంత వెలుగు వచ్చింది. పిల్లలు చేసిన ఈ పనిని ఓ టీచరు డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌కి పంపగా సృజనాత్మక ఆలోచన అన్న సర్టిఫికెట్‌తో పాటు రూ.20వేల ప్రోత్సాహకమూ లభించింది.

బడిలో మధ్యాహ్నభోజనం తిన్నందుకు ఆ పిల్లలు ఇంటికెళ్లి మళ్లీ అమ్మ చేతిలో దెబ్బలు తినాల్సివచ్చేది. ఎందుకంటే- స్కూల్లో కట్టెలపొయ్యిమీద వండిన అన్నం గిన్నెను గదంతా ఈడుస్తూ పిల్లలకు వడ్డించడం వల్ల నేలంతా మసి అయ్యేది. అదే పిల్లల దుస్తులకూ అంటుకునేది. అలాకాకుండా పాత్రను ఒకచోట ఉంచి పిల్లల్ని వరసగా వచ్చి పళ్లెంలో వడ్డించుకోమంటే ఒకళ్లకు ఒకళ్లు తగిలి ఆహార పదార్థాల్ని దుస్తుల మీద పోసుకునేవారు. అలా దుస్తులకు ఏదో ఒక మరక చేసుకుని వస్తున్న పిల్లల్ని తల్లులేమో కోప్పడేవారు. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలనుకున్న పిల్లలు తమ బుర్రలకు పదునుపెట్టి తక్కువ ఎత్తులో ఓ చక్రాల బండి డిజైన్‌ రూపొందించారు. పెద్దల సాయంతో దాన్ని తయారుచేయించుకున్నారు. అన్నం గిన్నెని దానిమీద పెట్టి తోసుకెళ్తూ వరసగా కూర్చున్న పిల్లలకు తేలిగ్గా వడ్డిస్తున్నారు సిబ్బంది. అటు మసి మరకలూ లేవు, ఇటు ఆహార పదార్థాలు పారబోసుకునే పనీ లేదు. ‘మిడ్‌డే వీల్‌’గా పేరొందిన వీరి ప్రాజెక్టు టాప్‌ 20లో ఎంపికై రూ.20 వేలు గెలుచుకుంది.

కశ్మీర్‌లోని హర్కబహదూర్‌ అనే కొండప్రాంతంలో ఉంది ఓ స్కూలు. దానికి ఒక పక్క కొండ ఉంటే మరో పక్క పల్లపు ప్రాంతం ఉంటుంది. అటువైపు అడ్డు గోడ లేకపోవడంతో పిల్లలు ఆడుకుంటూ ఆ పల్లంలోకి పడిపోయేవారు, లేదంటే పడిపోయిన బంతులూ బ్యాట్ల కోసం వెళ్లి దెబ్బలు తగిలించుకునేవారు. ఆ ప్రాంతంలో అసలు స్కూలు నడపడమే కష్టంగా ఉండడంతో ఇంక గోడ కట్టించమని అడగలేకపోయారు తల్లిదండ్రులు. దాంతో పిల్లలే పూనుకున్నారు. వెదురు బొంగులూ ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలూ సేకరించారు. వెదురు బొంగులతో దడిలాగా కట్టి దానికి సీసాలను వేలాడదీసి వాటికి చక్కగా జెండా రంగులు వేసి గోడలాగా మరుగు ఏర్పాటుచేసుకున్నారు. దాంతో పిల్లలు పడిపోవటం తగ్గింది. 
ఈ ప్రాజెక్టు రూ.50 వేల ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

సిద్ధిపేటలోని మిట్టపల్లి సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈగల బెడద పిల్లల్నీ సిబ్బందినీ ఎంతో చికాకు పెట్టేది. ఆహారపదార్థాల మీద గుంపులుగా వాలే ఈగల వల్ల పిల్లలు తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. దాంతో ఎలాగైనా వాటిని వదిలించుకోవాలనుకున్న పిల్లలు అసలు ఈగలు రావడానికి కారణం సిబ్బంది మిగిలిపోయిన ఆహారపదార్థాలను హాస్టల్‌ వెనకాలే పారేయడమని తెలుసుకుని వారి చేత ఆ అలవాటు మాన్పించారు. దూరంగా ఉన్న ఖాళీ జాగాలో గొయ్యి తవ్వి వ్యర్థాలను అక్కడ వేయించారు. ఎక్కడికక్కడ చెత్తబుట్టలు పెట్టి వాటిని సరిగ్గా వాడేలా చూడటం, వంటగదినీ, భోజనాలగదినీ బోరిక్‌ పౌడర్‌ కలిపిన నీటితో తరచూ శుభ్రం చేయడం, ఆవరణలో పుదీనా మొక్కలు నాటడం... లాంటి పలు చర్యలతో 
వసతిగృహాన్ని శుభ్రంగా తీర్చిదిద్దారు. దాంతో ఈగలు పోయాయి. పిల్లల ఆరోగ్యాలూ కుదుటపడ్డాయి. టాప్‌ 20లో స్థానం పొందిన వీరి ప్రాజెక్టు రూ. 20వేల గ్రాంటును పొందింది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పిల్లలు రకరకాల సమస్యలపై పనిచేశారు. మూఢనమ్మకాలూ బాల్యవివాహాల్లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకూ, బడిలో ఎదుర్కొంటున్న సమస్యల గురించీ, సమాజంలో తాము చూస్తున్న అన్యాయాల గురించీ వారు ఆలోచించారు, పరిష్కారానికి కృషిచేశారు. పిల్లలు ఈ పనులన్నీ చేయడం వల్ల చదువుమీద ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం మీదా నిపుణులు అధ్యయనం చేశారు.

వ్యక్తిత్వమే మారిపోతుంది! 
ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల వ్యక్తిత్వంలో చెప్పుకోదగ్గ మార్పు వస్తోందని నిపుణులు చెబుతున్నారు. 
నిశిత పరిశీలన: చుట్టూ జరుగుతున్న సంఘటనల్నీ, సమాజాన్నీ నిశితంగా పరిశీలించి చూడడమూ, వాటిని తమకు అన్వయించుకోవడమూ తెలుస్తోంది. 
సృజనాత్మక పరిష్కారం: ఆయా విషయాలకు తమదైన పరిష్కారమార్గాన్ని ఆలోచించడం వారి మేధస్సుకూ సృజనశక్తికీ పదునుపెడుతోంది. 
బృందస్ఫూర్తి: కలిసికట్టుగా పనిచేయడం వల్ల బృందస్ఫూర్తి అలవడుతోంది. 
సహానుభూతి: దివ్యాంగులనీ, ఇతరత్రా సమస్యల్లో ఉన్నవారినీ సహానుభూతితో అర్థం చేసుకుని వారినీ తమతో కలుపుకుని ముందుకు సాగుతున్నారు. 
పెరుగుతున్న టీచర్ల బాధ్యత: పిల్లలు చేపట్టే ప్రాజెక్టులకు మార్గదర్శకులుగా పనిచేయడం వల్ల టీచర్లు మరింతగా పిల్లలతో మమేకమవుతున్నారు. 
పెద్దల దృక్పథాల్లో మార్పు: పిల్లల ఆలోచనాపరిధి విస్తృతమవుతూ సామాజిక బాధ్యతలను గుర్తించే స్థాయికి ఎదగడం చూసిన పెద్దల దృక్పథాల్లోనూ మార్పువస్తోంది. మొత్తంగా ఇవన్నీ కలిసి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్నీ, ఈ శతాబ్దపు జీవననైపుణ్యాల్నీ పెంపొందిస్తున్నాయి. వారిని గెలుపు దిశగా నడిపిస్తున్నాయి. ఈ మార్పు వారిని మెరుగైన పౌరులుగా తయారుచేస్తుందన్నది నిస్సందేహం... అంటున్నారు నిపుణులు. 
చదువులోనూ ముందే: పిల్లల్లో ఈ మార్పు చదువు మీద కూడా మంచి ప్రభావమే చూపుతోంది. మొదటినుంచీ ‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ విధానాన్నే అనుసరిస్తున్న అహ్మదాబాద్‌లోని రివర్‌సైడ్‌ స్కూలు పిల్లలు బోర్డు పరీక్షల ఫలితాల్లోనూ దేశంలోని ఉత్తమ పాఠశాలల సరసన నిలుస్తున్నారు.

పోటీ మొదలైంది! 
ఈ ఏడాది ‘ఐ కెన్‌’ ఛాలెంజ్‌ ప్రకటన వెలువడింది. స్కూల్‌ తెరిచినప్పటినుంచి మొదలుపెట్టి దసరా సెలవుల లోపల ప్రాజెక్టు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నాలుగు మొదటి బహుమతులు(రూ.50వేలు), రెండు 
ద్వితీయ బహుమతులు(రూ.25వేలు) కాకుండా టాప్‌ ట్వంటీ ఐడియాలకూ ప్రోత్సాహక బహుమతులు(రూ.20వేలు) ఉంటాయి. designforchangeindia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

                    *

ఒక ఊళ్లో పిల్లలు బడికి వెళ్లే రోడ్డు మీద పెద్ద బండరాయి ఒకటి అడ్డంగా ఉంది. పెద్దలంతా తప్పుకుని పక్కనుంచీ వెళ్లిపోయేవారు కానీ ఆడుతూ పరుగులు తీస్తూ వెళ్లే పిల్లలు మాత్రం ఎదురు దెబ్బలు తగిలించుకునేవారు. అది చూసిన ఒక కుర్రాడు 
ఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. ‘వచ్చాడ్రా  వీరాంజనేయుడు’ అంటూ తోటిపిల్లలంతా నవ్వారు. మర్నాడు ఆ కుర్రాడితో పాటు మరో కుర్రాడూ ఓ చేయి వేశాడు. రాయి కదల్లేదు, కాసేపు ప్రయత్నించి వాళ్లు బడికెళ్లిపోయారు. మూడో రోజు పిల్లలందరూ తలో చేయీ వేశారు. కాస్త కదిలింది. పిల్లల్ని చూసి అటుగా వెళ్తున్న పెద్దలూ వచ్చి చేయికలిపారు. అంతా కలిసి కష్టపడి ఆ పెద్ద బండరాయిని పక్కకు తోసేశారు. దారికి ఇప్పుడు ఏ అడ్డమూ లేదు. బండరాయినికదిలించాలనుకున్న ఆ మొదటి కుర్రాడే ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్‌ పటేల్‌.ఇప్పుడు సమాజానికి కావలసింది మార్పు దిశగా మొదటి అడుగు వేసే అలాంటి కుర్రాళ్లే! వాళ్ల శక్తిసామర్థ్యాల్ని వెలికి తీసే ఇలాంటి పథకాలే!

పిల్లలే ప్రేరణ

ఓరోజు ఆరోతరగతి పిల్లలకు హక్కుల గురించి పాఠం చెప్పడంలో భాగంగా కిరణ్‌ వారిని బాలకార్మికులు పనిచేస్తున్న ఓ అగరుబత్తీల ఫ్యాక్టరీకి తీసుకెళ్లి పనిచేయమంది. రెండు గంటలకే నడుంనొప్పితో విలవిల్లాడిన విద్యార్థులు రోజూ ఎనిమిది గంటలు పనిచేస్తున్న బాలకార్మికుల పరిస్థితికి తల్లడిల్లారు. చదువుకోవాల్సిన పిల్లలు ఎందుకు పనిచేస్తున్నారో, దానికి పరిష్కారమేమిటో ఆలోచించండి- అని కిరణ్‌ యథాలాపంగా తన స్కూలు పిల్లలతో అంటే మర్నాడు వాళ్లు రకరకాల ప్రణాళికలతో ముందుకొచ్చారట. పిల్లల చొరవా ఆలోచనా చూసి ఆశ్చర్యపోయిన కిరణ్‌ వారిని ప్రోత్సహించింది. ఓ టీచర్ని వారికి సాయంగా పంపితే- పిల్లల్ని పనిలో పెట్టుకోవటం నేరమని ఫ్యాక్టరీల వారికీ, బడికి పంపమని తల్లిదండ్రులకీ నచ్చజెప్పి, కొందరు పిల్లల్ని తీసుకెళ్లి వారే బడిలో చేర్పించారట. ఈ విధానాన్నే మరికొన్ని కార్యక్రమాలకూ అనుసరించి చూసిన కిరణ్‌కి ‘ఫిడ్స్‌’ అనే నాలుగంచెల డిజైన్‌ పట్ల స్పష్టత వచ్చింది. దాని ఆధారంగానే ‘ఐ కెన్‌’ ఛాలెంజ్‌ని నిర్వహిస్తోంది. ఏ అంశాన్ని ఎంచుకున్నా దానికి తమదైన శైలిలో పరిష్కారం చూపి నిజంగా పిల్లల్లో ఇంత సామర్థ్యం ఉందా అన్పించేలా ఉండటమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలుచేయడం విశేషం. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాజెక్ట్‌ జీరో పరిశోధక బృందం డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో సహానుభూతి పెరగడాన్నీ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడడాన్నీ గమనించింది. ‘ఫిడ్స్‌’ పద్ధతిని ఏ సందర్భానికైనా ఉపయోగించవచ్చనీ, దీని ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి అది చదువులోనూ రాణించేందుకు తోడ్పడుతుందనీ నిర్ధారించింది.

ఆలోచన కిరణ్‌ది!

‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ని రూపొందించిన కిరణ్‌ బీర్‌ సేఠీ వృత్తిరీత్యా ఇంటీరియర్‌ డిజైనర్‌. ఆరేళ్ల వాళ్లబ్బాయికి స్కూల్లో అయిన అనుభవం ఆమెను విద్యావేత్తను చేసింది. టీచరు చెప్పిన పాఠాన్ని బట్టీ పట్టకుండా సొంతంగా రాసుకెళ్లినందుకు టీచరు ఆ అబ్బాయిని కోప్పడింది. సొంతంగా రాశానన్న ఉత్సాహంతో బడికెళ్లిన పిల్లవాడు డీలా పడిపోయి ఇంటికి రావడంతో టీచరు చర్య ఆ చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీసిందో అర్థం చేసుకున్న కిరణ్‌ పిల్లల వ్యక్తిగత ప్రతిభకీ వారి సృజన శక్తికీ ప్రాధాన్యమిస్తూ కొత్తగా స్కూలు ఎందుకు నడపకూడదనుకుంది. విద్యావేత్తగా మారి అహ్మదాబాద్‌లో ‘రివర్‌సైడ్‌ స్కూల్‌’ని ప్రారంభించింది. భవనంతో మొదలెట్టి బోధనా, పనితీరూ, ఫలితాలవరకూ ఆ స్కూలు ఇతర పాఠశాలలకు భిన్నంగా ఉంటుంది. కొద్దిరోజుల్లోనే మంచి ఆదరణ పొందిన తమ స్కూలు విధానాలను అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్న కిరణ్‌ లాభాపేక్ష లేని సంస్థగా ‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ని ప్రారంభించింది.

(26 మే 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.