close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోరికలే గుర్రాలయితే 

- ఆదోని బాషా

అర్ధరాత్రి దాటింది సమయం. నగరమంతా నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది. కానీ రాధికకి నిద్రపట్టడం లేదు. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. దానికి కారణం ఆమె కాసేపటి క్రితం ఇంటర్‌నెట్‌లో చూసిన ఓ పోర్న్‌ వీడియో. రాధిక ఎప్పుడూ అలాంటి వీడియోలు చూడలేదు. రాత్రి కాలక్షేపం కోసం ఫోన్‌లో నెట్‌ చూస్తూ పొరపాటున ఓ చోట క్లిక్‌ చేస్తే ఆ వీడియో వచ్చింది. దాన్ని మార్చాలనుకునేలోగా అందులోని దృశ్యాలు ఆసక్తి రేకెత్తించటంతో ఆమె కళ్ళప్పగించి చూస్తూండిపోయింది. ఆ వీడియో ముగిసేలోగా ఆమె శరీరమంతా కోరికలతో బాగా వేడెక్కింది.

తన భర్త మోహన్‌ ఆ వీడియోలో చూపిన మాదిరిగా తనతో ఎప్పుడూ గడపలేదని రాధికకి అనిపించింది. వారానికి ఒకటి రెండుసార్లు మొక్కుబడిగా భార్యతో గడిపి వెంటనే గుర్రుపెట్టి నిద్రపోతాడు మోహన్‌. భార్యకి సంతృప్తి కలిగిందా లేదా అన్న విషయం పట్టించుకోడు. భర్త నిద్రపోయినా రాధికకి నిద్రపట్టదు. చాలాసేపటి వరకూ అసహనంగా మంచంపైన పొర్లుతూ ఉండిపోతుంది. తర్వాత ఏ అర్ధరాత్రికో నిద్రపోతుంది. అది కూడా మగత నిద్రే! 
దాంతో ఉదయం నిద్ర లేచాక ఒళ్ళంతా భారంగా అనిపిస్తుంది. తలపోటు వల్ల ఏ పనీ చేయబుద్ధి కాదు. తిండి సయించదు. దీనికంతటికీ కారణం భర్త వల్ల కలిగిన అసంతృప్తి అని ఆమెకు తెలుసు. అయినా ఆ మాట భర్తకు చెప్పటానికి సంకోచిస్తుంది. తన బాధను మోహనే గ్రహించాలనుకుంటుంది. కానీ ఎప్పుడూ పనిలో బిజీగా ఉండే మోహన్‌ భార్య బాధను ఎప్పుడూ పట్టించుకోలేదు.

మోహన్‌ ఓ రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలో సేల్స్‌ రిప్రెజంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. వివిధ ఊళ్లకు తిరిగి, తెచ్చే ఆర్డర్లమీదే అతని జీతం ఆధారపడి ఉంటుంది. ఆర్డర్ల కోసం అతను సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊళ్లు తిరుగుతుంటాడు. శని, ఆదివారాలు మాత్రమే ఇంట్లో ఉంటాడు. ఆ రెండు రోజుల్లోనూ పగలంతా ఇంటి పనులు చూసుకుంటూ తీరిక లేకుండా గడుపుతాడు. ఇక రాత్రిళ్ళు పడకగదిలో మొక్కుబడిగా భార్యతో గడుపుతాడు.

మోహన్‌, రాధికల పెళ్ళయిన ఏడాది నుంచీ ఇలాగే జరుగుతోంది. పెళ్ళికి ముందు రాధిక తన క్లాస్‌మేట్‌ కిషన్‌ని ప్రేమించింది. చదువు పూర్తయ్యాక ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కానీ కోటీశ్వరుడైన కిషన్‌ తండ్రి ఈ పెళ్ళి జరగాలంటే పది లక్షలు కట్నం ఇవ్వాలన్నాడు. ప్రైవేట్‌ స్కూలు టీచరైన రాధిక తండ్రి అంత కట్నం ఇవ్వలేనన్నాడు. కిషన్‌ తండ్రి వెనక్కి తగ్గలేదు. కిషన్‌ కూడా తండ్రికి అడ్డుచెప్పలేదు. దాంతో కిషన్‌, రాధికల పెళ్ళి జరగలేదు. 
తర్వాత రాధిక తల్లిదండ్రులు తమ కూతురికి వేరే సంబంధాలు చూడసాగారు. రాధిక మంచి అందగత్తె కావటంతో ఆమెను చేసుకోవటానికి చాలామంది ఎగబడ్డారు కానీ, కట్నం విషయంలో ఎవరూ రాజీపడలేదు. చివరికి మోహన్‌ రాధికను కట్నం లేకుండా పెళ్ళి చేసుకోవటానికి ముందుకొచ్చాడు. మృదుస్వభావి అయిన మోహన్‌ని చేసుకుంటే తమ కూతురు సుఖపడుతుందని రాధిక తల్లిదండ్రులు కూతురికి నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించారు.

ఓ శుభ ముహూర్తాన రాధికా మోహన్‌ల పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. 
రాధిక మోహన్‌ని పెళ్ళి చేసుకున్నా తన పాత ప్రియుడు కిషన్‌ని మర్చిపోలేకపోయింది. అప్పుడప్పుడూ ఆమె తన ప్రమేయం లేకుండానే మోహన్‌ని కిషన్‌తో పోల్చుకునేది. కిషన్‌ ఒంటి రంగు తెలుపు. మోహన్‌ చామనఛాయ. కిషన్‌కన్నా మోహన్‌ ఎత్తు తక్కువ. ఇద్దరి స్వభావంలోనూ తేడా ఉంది. కిషన్‌ది ఎప్పుడూ గలగలా మాట్లాడే తత్వమైతే, మోహన్‌ మితభాషి. ఒకరు ఉరకలెత్తే జలపాతమైతే మరొకరు నింపాదిగా సాగే సెలయేరు. రాధిక తన భర్త పడకగదిలో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా తనను చుట్టుముట్టి కౌగిలింతలూ ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చెయ్యాలని కోరుకునేది. కానీ మోహన్‌ ముట్టుకుంటే కందిపోయే పువ్వులా భార్యను చూసుకునేవాడు. భర్త ధోరణి రాధికకు నచ్చేదికాదు. అందుకే తరచుగా ఆమెకు కిషన్‌ గుర్తొచ్చేవాడు. కిషన్‌ గడగడా మాట్లాడుతూ ప్రతిక్షణం ఆమెని నవ్వించటానికి ప్రయత్నించేవాడు. ఆమెను పార్కులకీ షాపింగులకీ తీసుకెళ్ళి విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేవాడు. ‘పెళ్ళికాకముందే అంతగా తనని ప్రేమించినవాడు పెళ్ళయ్యాక ఇంకెంత ప్రేమించేవాడో! కిషన్‌తో తన పెళ్ళి జరిగి ఉంటే ఎంత బాగుండేది’ ...ఇలా సాగేవి రాధిక ఆలోచనలు. కానీ, అంతలోనే ‘పెళ్ళయిన భారతీయ స్త్రీ పరాయి మగాడి గురించి ఆలోచించటం తప్పు’ అని అంతరాత్మ మందలించేది. దాంతో రాధిక కిషన్‌ని మర్చిపోవటానికి విశ్వప్రయత్నం చేసేది. పత్రికలు చదువుతూ లేదా టీవీ చూస్తూ కాలక్షేపం చేసేది. కానీ ఒక్కోసారి టీవీలో అందమైన యువకుడు కనిపించగానే ఆమెకు మళ్ళీ కిషన్‌ గుర్తొచ్చేవాడు. వెంటనే టీవీ కట్టేసి వేరే పనులు చేసుకుంటూ ఎలాగోలా కిషన్‌ని మర్చిపోవటానికి ప్రయత్నించేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె ప్రయత్నం ఫలించింది. కిషన్‌ని దాదాపు మర్చిపోయి, పరిస్థితులతో రాజీపడి జీవించసాగింది.

కానీ, కొద్దిరోజుల క్రితం జరిగిన సంఘటన ఆమెను మళ్ళీ కిషన్‌ గురించి ఆలోచించేలా చేసింది. ప్రతి సోమవారం ఉదయం మోహన్‌ టూర్‌కి బయల్దేరేటప్పుడు రాధిక సరదాగా భర్త వెంట రైల్వేస్టేషన్‌ వరకూ వెళుతుంది. మోహన్‌ ట్రెయిన్‌ ఎక్కి వెళ్ళిపోయాక ఇంటికి తిరిగొస్తుంది. ఈ సోమవారం కూడా ఆమె స్టేషన్‌కి వెళ్ళింది. మోహన్‌ వెళ్ళిపోయాక స్టేషన్‌లోంచి బయటికొచ్చింది. ఆటోస్టాండ్‌ వైపు నడుస్తుంటే ఆ పక్కనే ఆమె కోసం ఓ వ్యక్తి ఎదురుచూస్తూ కనిపించాడు. అతనెవరో కాదు... కిషన్‌! 
చాలాకాలం తర్వాత కిషన్‌ని చూసిన రాధిక తుళ్ళిపడింది. వెంటనే మొహం పక్కకి తిప్పుకుని వెళ్ళబోయింది. కానీ, కిషన్‌ ఆమె దారికి అడ్డుగా నిలుచుని పలకరించాడు. 
‘‘హలో రాధికా, ఎలా ఉన్నావ్‌?’’ అనడిగాడు.

 *  *  *

రాధిక అతనివైపు అసహనంగా చూసింది. ‘‘నేనెలాగుంటే నీకెందుకు? ఇప్పుడు నీకూ నాకూ సంబంధమేమిటి?’’ అంది చిరాగ్గా. 
‘‘మన బంధం తెగేది కాదు రాధికా, మనది జన్మజన్మల బంధం... రాధాకృష్ణుల బంధం. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. అందుకే ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు’’ ఉద్వేగంగా చెప్పాడు కిషన్‌. 
‘‘నీ పెళ్ళి ఎలా జరుగుతుంది? మీ నాన్న అడిగినంత కట్నం ఎవరిస్తారు?’’ ఎగతాళిగా అంది రాధిక. 
‘‘అడిగినంత కట్నం ఇవ్వటానికి చాలామంది ముందుకొచ్చారు. కానీ, నేనే పెళ్ళికి ఒప్పుకోలేదు. నిన్నుకాదని ఇంకొకరి మెడలో తాళి కట్టడం ఇష్టంలేక వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరించాను. రెండు నెలల క్రితం హఠాత్తుగా నాన్నగారు పోయారు. ఇప్పుడు నాకెవరూ అడ్డులేరు. నువ్వు తొందరపడి పెళ్ళి చేసుకున్నావ్‌. కొన్నాళ్ళు నాకోసం వేచి ఉంటే ఇప్పుడు ఇద్దరం హాయిగా పెళ్ళిచేసుకునేవాళ్ళం’’ అన్నాడు. 
‘‘ఇప్పుడు గతాన్ని తవ్వి ప్రయోజనమేమిటి? నా దారి నేను చూసుకున్నాను. నీ దారి నువ్వు చూసుకో’’ అంటూ రాధిక ముందుకు కదలబోయింది. కిషన్‌ చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. 
‘‘ఒక్క నిమిషం నేను చెప్పేది విను రాధికా. నీ పెళ్ళి జరిగినా నేనింకా నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా అయిష్టంగానే ఈ పెళ్ళి చేసుకున్నావని నాకు తెలుసు. అందువల్ల నీ భర్తకు విడాకులిచ్చెయ్‌, మనం పెళ్ళి చేసుకుందాం. కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ పొందుదాం’’ ఆవేశంగా అన్నాడు కిషన్‌. ఆ మాటలకు రాధిక ముఖం కోపంతో ఎరుపెక్కింది. 
‘‘ఛీ, ఛీ... అలాంటి పిచ్చిపని నేను 
కలలో కూడా చెయ్యను. మరోసారి నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యకు’’ అంటూ అతని చెయ్యి విదిలించి వడివడిగా ఆటోస్టాండు వైపు వెళ్ళిపోయింది. 
కిషన్‌ని ఎలాగోలా వదిలించుకున్నా కిషన్‌ ఆలోచనలు రాధికను వదల్లేదు. మరోసారి కిషన్‌ గురించిన పాత జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టసాగాయి. కిషన్‌తో కలిసి పార్కులకూ షాపింగులకూ తిరిగిన రోజులు గుర్తొచ్చేవి. అతని మాటలూ చిలిపి చేష్టలూ గుర్తొచ్చి మనసులో అలజడి రేపేవి. కిషన్‌ ఆలోచనలతో రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. దాంతో నిద్రమాత్ర వేసుకుని పడుకునేది. అయినా కిషన్‌ కలలో కనిపించి కలవరపెట్టేవాడు. 
వారాంతంలో మోహన్‌ ఇంటికి రావటంతో రాధిక కిషన్‌ గురించి తాత్కాలికంగా మర్చిపోయింది. రెండ్రోజులయ్యాక సోమవారం ఉదయం రాధిక ఎప్పటిలాగే భర్తవెంట స్టేషన్‌కి వెళ్ళలేదు. అక్కడికి కిషన్‌ రావచ్చనే భయంతో తనకు తలనొప్పిగా ఉందని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది. 
ఓ గంట తర్వాత రాధిక సెల్‌ మోగింది. కిషన్‌ మాట్లాడాడు. ‘‘నీకోసం స్టేషన్‌వద్ద చాలాసేపు ఎదురుచూశాను. నీ భర్త ఒక్కడే స్టేషన్‌కి వచ్చాడు. నువ్వు రాలేదు. నీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్‌ చేశాను’’ అన్నాడు. 
‘‘నా ఆరోగ్యం గురించి నీకెందుకు బెంగ?’’ రాధిక చిరాగ్గా అంది.

‘‘అలా అనకు రాధికా, నీ భర్త నిన్ను పట్టించుకోవటం లేదు. అతనికి నీపైన ప్రేమ లేదు. నీ ఆరోగ్యంకన్నా అతనికి తన పనే ముఖ్యం. అలాంటి వ్యక్తి నిన్నేం సుఖపెడతాడు? అతన్ని వదిలెయ్‌. నన్ను పెళ్ళి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను’’ ఆవేశంగా అన్నాడు కిషన్‌. ‘‘నోర్ముయ్‌. ఇలా పిచ్చిపిచ్చిగా వాగావంటే మర్యాద దక్కదు. నేను మా ఆయనకి ద్రోహం చెయ్యను. ఇదే నా ఆఖరి నిర్ణయం. మరోసారి ఫోన్‌ చెయ్యకు’’ కోపంగా ఫోన్‌ కట్‌ చేసింది రాధిక. 
అయినా కిషన్‌ మరుసటిరోజు మళ్ళీ ఫోన్‌ చేశాడు. రాధిక అతన్ని చెడామడా తిట్టి ఫోన్‌ పెట్టేసింది. అయినా కిషన్‌ ఫోన్లు చెయ్యటం మానలేదు. దాంతో ఫోన్‌ స్క్రీన్‌పైన కిషన్‌ నంబరు కనపడగానే రాధిక ఫోన్‌ కట్‌ చెయ్యసాగింది. అప్పుడు కిషన్‌ వేరే నంబర్లతో ఫోన్లు చెయ్యసాగాడు. ఫోన్‌లో కిషన్‌ గొంతు వినపడగానే రాధిక ఫోన్‌ కట్‌ చేసేది. అయినా కిషన్‌ ఫోన్లు చెయ్యటం మానలేదు. చివరికి రాధిక ఫోన్‌ను స్విచాఫ్‌ చేసేసింది. ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే స్విచాన్‌ చేసి మాట్లాడాక స్విచాఫ్‌ చెయ్యసాగింది. 
ఇక కిషన్‌ పీడ వదిలిందనుకుంది. కొద్దిరోజులు ప్రశాంతంగా గడిచాయి. ఓరోజు కాలింగ్‌బెల్‌ మోగితే ఎవరొచ్చారో అనుకుని తలుపు తెరిచింది. కిషన్‌ నేరుగా ఇంట్లోకి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చున్నాడు. ‘‘ఎందుకొచ్చావ్‌, వెళ్ళిపో’’ రాధిక కోపంగా అరిచింది.
‘‘ప్లీజ్‌ రాధికా, నా బాధని అర్థంచేసుకో. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నాకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటాను’’ బేలగా అన్నాడు కిషన్‌. 
అతని పరిస్థితి చూసి రాధికకి ఏం చెప్పాలో అర్థంకాలేదు. ‘‘చూడు కిషన్‌, జరిగినదాన్ని మార్చటం అసాధ్యం. నాకు పెళ్ళయింది. నన్ను మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్ళిచేసుకో’’ శాంతంగా చెప్పింది.‘‘నిన్ను మర్చిపోవటం అసాధ్యం. అందువల్ల మరో అమ్మాయిని పెళ్ళాడి ఆమె జీవితం నాశనం చెయ్యలేను. నాకు నువ్వే దారిచూపించు’’ అన్నాడు.

‘‘నువ్వు పెళ్ళి చేసుకుంటావో లేదో అది నీ ఇష్టం. కానీ, నా దగ్గరికి మాత్రం రావద్దు. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే మా కాపురంలో కలతలు రేగుతాయి’’ నచ్చచెబుతూ అంది రాధిక. ‘‘ఆ సంగతి నాకూ తెలుసు రాధికా. అందుకే నీ భర్తలేని సమయంలో వచ్చాను. మోహన్‌ వారంలో అయిదు రోజులు టూర్లకు తిరుగుతాడని నాకు తెలుసు. ఇన్ని రోజులు నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావ్‌? మోహన్‌కి నీ సుఖంకన్నా డబ్బు సంపాదనే ముఖ్యం. అంతగా డబ్బుపిచ్చి ఉన్న వ్యక్తి నిన్ను సుఖపెట్టలేడు. అందుకే అతన్ని వదిలేసి నన్ను పెళ్ళి చేసుకోమంటున్నాను. నాకు నాన్నగారి ఆస్తి దండిగా ఉంది. మోహన్‌లాగా నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. రాత్రీ పగలూ నీతోనే ఉంటాను. నిన్ను అపురూపంగా చూసుకుంటాను’’ అంటూ కిషన్‌ లేచి నిల్చొని ఆవేశంగా రాధిక భుజంపైన చెయ్యి వేశాడు. 
రాధిక అతని చేతిని విదిలించి కొట్టి కోపంగా అతని చెంప ఛెళ్ళుమనిపించింది. ఆమె కొట్టిన దెబ్బకి కిషన్‌ చెంప ఎర్రగా కందిపోయింది. అయినా అతను కోప్పడలేదు. చెంపను చేత్తో తడుముకుంటూ చిరునవ్వు నవ్వాడు. 
‘‘రాధికా, నువ్వు కొట్టినా నేను బాధపడను. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావ్‌. కోపం తగ్గాక నేను చెప్పిన విషయం గురించి ప్రశాంతంగా ఆలోచించు. ఇప్పుడు కాలం మారింది. పెళ్ళయ్యాక అంతా మన తలరాత అనుకుని ఇష్టంలేని భర్తతో బలవంతంగా కాపురం చెయ్యాల్సిన అవసరం లేదు. ధైర్యంగా విడాకులు తీసుకుని నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవచ్చు. మనకున్నది ఒక్కటే జీవితం. దాన్ని సంప్రదాయాల పేరుతో నాశనం చేసుకోకు. నీ యవ్వనాన్ని పాడుచేసుకోకు. 
నా ప్రపోజల్‌ నీకిష్టమైతే నాకు ఒక్క ఫోన్‌ కొట్టు చాలు. లాయరుతో మాట్లాడి వెంటనే నీకు విడాకులు ఇప్పించి పెళ్ళి చేసుకుంటాను’’ అంటూ కిషన్‌ చేత్తో రాధిక బుగ్గపై ప్రేమగా నిమిరి ఇంట్లోంచి బయటికెళ్ళిపోయాడు. రాధిక చేష్టలుడిగి అతను వెళ్ళినవైపే చూస్తూండిపోయింది.

 *  *  *

ఆవేశంలో రాధిక కిషన్‌ని తిట్టినా తర్వాత కిషన్‌ అన్న మాటలు మెల్లగా ఆమెపైన ప్రభావం చూపసాగాయి. రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. తను నిజంగానే తన యవ్వనాన్ని వృథా చేసుకుంటోందా? మోహన్‌ ద్వారా లభించని సుఖాల్ని కిషన్‌ ద్వారా పొందే అవకాశాన్ని జారవిడుస్తోందా? 
కాలం మారినప్పుడు తనెందుకు మారకూడదు? తన సుఖం కోసం ఆలోచించని మోహన్‌ని వదిలేసి తనకోసం తపించే కిషన్‌ని ఎందుకు పెళ్ళాడకూడదు? 
ఇలాంటి ఆలోచనలతో ఆమెకు మెల్లగా కిషన్‌పైన సదభిప్రాయం కలగసాగింది. తన ప్రమేయం లేకుండానే అతని గురించి ఆలోచించసాగింది. అవును, కిషన్‌ చెప్పింది అక్షరాలా నిజం. ఈ జీవితం తనది. తన మంచిచెడుల్ని తనే నిర్ణయించుకోవాలి. 
ఇంటర్నెట్‌లో ఆ వీడియో చూశాకే సుఖమంటే ఏమిటో తనకు బోధపడింది. అలాంటి సుఖం మోహన్‌ వల్ల లభించనప్పుడు తను కిషన్‌ని పెళ్ళాడటంలో తప్పులేదు. ...ఇలా ఓ నిర్ధారణకొచ్చాక ఆమె నిద్రలోకి జారుకుంది. 
 

 *  *  *

ఉదయం చాలాసేపు బెల్‌ మోగాక రాధికకి మెలకువ వచ్చింది. అప్పటికే బాగా పొద్దెక్కింది. ఇంటికి ఎవరొచ్చారో అర్థంకాలేదు. బహుశా మళ్ళీ కిషన్‌ వచ్చినట్టున్నాడు అనుకుంటూ రాధిక ఉత్సాహంగా లేచి తలుపు తెరిచింది. 
కానీ, ఎదురుగా కిషన్‌కి బదులు సరళ కనిపించింది. సరళ- రాధిక స్నేహితురాలు. ఆమె సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది. సరళ భర్త కూడా సైకియాట్రిస్టే! 
‘‘అదేమిటే, ఫోన్‌ కూడా చెయ్యకుండా వచ్చేశావ్‌?’’ రాధిక స్వరంలో విసుగు ధ్వనించింది. 
‘‘నీ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తుంటే ఫోనెలా చేసేది? అన్నట్టు నువ్వు ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నావా?’’ రాధిక ధోరణి చూసి అడిగింది సరళ. 
‘‘అదేం లేదులే. ఇంత పొద్దునే వచ్చావ్‌, అంతా కుశలమే కదా?’’ సరళను ఆహ్వానిస్తూ అంది రాధిక. 
‘‘మీ కాలనీలో నా పేషెంట్‌ ఒకామె ఉంది. ఆమె తనతో పోట్లాడుతోందని ఆమె భర్త ఫోన్‌ చేసి నన్ను పిలిస్తే మాట్లాడటానికి వెళ్ళాను. పనయ్యాక నువ్వు గుర్తొచ్చావ్‌. నీతో మాట్లాడదామని ఫోన్‌ చేస్తే నీ ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. ఫోనెందుకు స్విచాఫ్‌ చేశావ్‌?’’ సోఫాలో కూర్చుని అడిగింది సరళ. 
జవాబు చెప్పటానికి రాధిక ఓ క్షణం తటపటాయించింది. ఇక దాచి లాభంలేదనుకుని జరిగినదంతా పూసగుచ్చినట్టు స్నేహితురాలికి చెప్పేసింది. 
‘‘నా భర్త వల్ల నాకు సుఖం లేదు. అతనిలో ఏదో లోపం ఉందని నా అనుమానం. అందుకే కట్నం అడక్కుండా నన్ను పెళ్ళి చేసుకున్నాడు. ఇది మోసం కాదా? అందుకే మోహన్‌కి విడాకులిచ్చి కిషన్‌ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నీ సలహా ఏమిటి?’’ అనడిగింది. 
రాధిక చెప్పినదంతా సావధానంగా విన్న సరళ దీర్ఘంగా నిట్టూర్చింది. ‘‘నీ పరిస్థితి చూస్తుంటే నువ్వు పెనంమీంచి జారి పొయ్యిలో పడుతున్నావనిపిస్తోంది’’ అంది. 
‘‘నా పరిస్థితి నీకెలా అర్థమవుతుంది? మోహన్‌ వల్ల నాకు సుఖం లేదు’’ చిరాగ్గా అంది రాధిక. 
‘‘అది వేరే సమస్య. దానికి విడాకులు 
పరిష్కారం కాదు. కంటినొప్పి తగ్గటానికి పంటినొప్పి మాత్ర పనిచేస్తుందా? నీ సమస్యకూ నువ్వు ఆలోచిస్తున్న పరిష్కారానికీ సంబంధమే లేదు. నీ భర్తలో మార్పు తీసుకొచ్చే బదులు నువ్వు భర్తనే మార్చాలనుకుంటున్నావ్‌. నీ సమస్య పరిష్కారం కావాలంటే నీ భర్తతోపాటు నీకూ కౌన్సెలింగ్‌ అవసరమన్పిస్తోంది.’’ 
‘‘నాకేమైంది? నాలో ఎలాంటి లోపం లేదు’’ రోషంగా అంది రాధిక.

‘‘నీలో లోపం లేదుగానీ కొన్ని అపోహలున్నాయి. కిషన్‌ మాత్రమే నీకు సరైన జోడీ అని భ్రమపడుతున్నావ్‌. ఎందుకంటే, స్త్రీ తన తొలిప్రేమని అంత తేలిగ్గా మర్చిపోదు. తన జీవితంలో ప్రవేశించిన తొలి మగాడే సరైన భర్త కాగలడనే ఫీలింగ్‌ చాలామంది స్త్రీలలో ఉంటుంది. నీలోనూ అలాంటి ఫీలింగ్‌ ఉంది. పైగా మోహన్‌ నిన్ను కట్నం లేకుండా పెళ్ళాడినందుకు నువ్వతన్ని చులకనగా చూస్తున్నావ్‌. అతని మంచితనాన్ని అతని లోపంగా భావిస్తున్నావ్‌. మోహన్‌ గురించి నాకు బాగా తెలుసు. అతనికి కిషన్‌లాగా ఆస్తిపాస్తులు లేవు. అందుకే బాగా డబ్బు సంపాదించి నిన్ను సంతోషపెట్టాలని కష్టపడి పనిచేస్తున్నాడు. వారంలో అయిదు రోజులు విశ్రాంతి లేకుండా ఊళ్ళు తిరుగుతూ బాగా అలసిపోయి ఇంటికొస్తున్నాడు. తీవ్రమైన అలసటా ఒత్తిడీ ఉన్నప్పుడు మనిషిలో సహజంగానే కోరికలు తగ్గిపోతాయి. అందుకే మోహన్‌ నిన్ను తృప్తిపరచలేకపోతున్నాడు. ఈ విషయం గురించి నువ్వతనితో ప్రేమగా మాట్లాడి ఉంటే అతనికి తన తప్పు తెలిసేది. భర్తను మార్చటం భార్య చేతిలోనే ఉంటుంది. ఒకవేళ నువ్వా విషయం భర్తతో మాట్లాడటానికి మొహమాటపడుతుంటే మా ఆయనచేత మోహన్‌కి కౌన్సెలింగ్‌ 
ఇప్పిస్తాను. అప్పుడు మోహన్‌లో కచ్చితంగా మార్పు వస్తుంది.’’ 
‘‘కానీ, కిషన్‌ ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు కదా?’’ అంటూ రాధిక ఏదో చెప్పబోయింది.

‘‘కిషన్‌ నిన్ను ప్రేమించటం లేదు. అతను నిజంగా నిన్ను ప్రేమిస్తుంటే ఆనాడే తండ్రిని ఎదిరించి నీ మెడలో తాళి కట్టేవాడు. అలా చెయ్యలేదంటే అతనిది ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. అతనితో నీ పెళ్ళి జరక్కపోవటమే మంచిదైంది. ఇలాంటి నిలకడలేని మనస్తత్వం గలవారు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో చెప్పటం కష్టం. మోహన్‌ని వదిలేసి అతన్ని పెళ్ళి చేసుకున్న తర్వాత నిన్ను అతను చిన్నచూపు చూస్తే అప్పుడు నీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారవుతుంది. నన్నడిగితే నీ పెళ్ళి సరైన వ్యక్తితోనే జరిగింది. మోహన్‌లో ఉన్న లోపం సాధారణమైనది. ఇది చాలామందిలో ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మొహమాటం పనికిరాదు. తనకేం కావాలో చెప్పటమే కాదు, భాగస్వామికి ఏం కావాలో అడిగి మరీ తెలుసుకోవాలి. దాపరికంలేని సంసారమే సాఫీగా సంతోషంగా సాగుతుంది’’ అంది సరళ. స్నేహితురాలి మాటలు రాధికను ఆలోచనల్లో పడేశాయి. కాసేపటి తర్వాత సరళ లేచి నిల్చొని స్నేహితురాలివద్ద సెలవు తీసుకుంటూ అంది- ‘‘రాధికా, ఓ విషయం మర్చిపోవద్దు. మన కోరికల్ని మన అదుపులో ఉంచుకోవాలిగానీ, కోరికల అదుపులో మనం ఉండకూడదు. లేకపోతే ఆ కోరికలే గుర్రాల్లా పరుగెత్తి మనల్ని గమ్యం వైపు కాకుండా ఏ అగాధంవైపో తీసుకెళతాయి. అందుకే బాగా 
ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో.’’

*  *  *

సరళ వెళ్ళిపోయాక రాధిక చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళముందు భర్త అమాయకమైన ముఖం కదలాడింది. నిజమే, మోహన్‌ కష్టపడేది తనకోసమే. 
పెళ్ళయిన కొత్తలోనే తనకు విలాస జీవితం ఇష్టమని మోహన్‌ గ్రహించాడు. అందుకే రాత్రీ పగలూ కష్టపడి పనిచేస్తున్నాడు. వారాంతంలో ఇంటికొచ్చినప్పుడు తనకోసం ఏదో ఒక కానుక తీసుకొస్తాడు. ఇల్లంతా సర్దుతాడు. తనకు వంటపనిలో సాయం చేస్తాడు. వారానికి  అవసరమైన సరుకులన్నీ తీసుకొస్తాడు. అందుకే బాగా అలసిపోయి పడకగదిలో తనతో ఎక్కువసేపు గడపకుండా నిద్రలోకి జారుకుంటాడు. తన అసంతృప్తి గురించి తానెప్పుడూ మోహన్‌కి చెప్పలేదు. అడక్కపోతే అమ్మయినా పెట్టదంటారు. అలాంటప్పుడు తన బాధ గురించి మోహన్‌కి ఎలా తెలుస్తుంది? తప్పు తనదే. ఈసారి తన తప్పును దిద్దుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది రాధిక.

వారాంతంలో మోహన్‌ ఇంటికొచ్చాక రాధిక అతన్ని ఇంటిపనులేవీ చెయ్యనివ్వలేదు. అన్ని పనులూ తానే చేస్తూ మోహన్‌ రోజంతా విశ్రాంతి తీసుకునేలా చేసింది. రాత్రి భర్తతో ప్రేమగా మాట్లాడుతూ మాటల మధ్య తన మనసులోని మాట బయటపెట్టింది. ఫలితం వెంటనే కన్పించింది. ఎన్నడూలేని విధంగా మోహన్‌ పడకగదిలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపాడు. రాధికకి ఎంతో సంతృప్తి కలిగింది. భర్తలో వచ్చిన మార్పు చూసి ఆనందంతో పొంగిపోయింది. మోహన్‌ ఇంట్లో ఉన్న రెండ్రోజులూ రెండు క్షణాల్లా గడిచిపోయాయి. 
సోమవారం ఉదయం మోహన్‌ టూర్‌కి వెళ్ళిపోయాక రాధిక సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది. అంతలో కాలింగ్‌బెల్‌ మోగింది. రాధిక లేచివెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా కిషన్‌ కన్పించాడు. 
‘‘ఎవరు కావాలి?’’ రాధిక ఘాటుగా అడిగింది. 
‘‘అదేమిటి రాధికా, అలా అడుగుతున్నావ్‌? నువ్వు...’’ అంటూ కిషన్‌ ఏదో చెప్పబోయాడు. 
‘‘సారీ, నేను రాధికను కాను. నా పేరు మిసెస్‌ మోహన్‌ కుమార్‌’’ అంటూ దఢాల్న తలుపు మూసేసింది రాధిక.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.