close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ధ్యానంతో లాభాలెన్నో..!

క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇంతవరకూ అందరికీ తెలిసిందే. అయితే అది శరీరంమీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సరిగ్గా తెలీకపోవచ్చు. అదెలానో తెలుసుకుందామా...ఒకే మంత్రాన్ని పదేపదే పలుకుతూ ధ్యానం చేయడం వల్ల మనసు మరే ఆలోచన మీదకీ వెళ్లకుండా దానిమీదే నిలకడగా ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి, క్యాన్సర్లు, డిప్రెషన్‌... వంటి శారీరక, మానసిక సమస్యలకు కారణమయ్యే సైటోకైన్‌ల విడుదల తగ్గినట్లు బ్రిటన్‌లోని కొవెంట్రీ విశ్వవిద్యాలయ పరిశీలనల్లో తేలింది. అంతేకాదు, ధ్యానంవల్ల మహిళల్లో మెనోపాజ్‌ సమయంలో చోటుచేసుకునే డిప్రెషన్‌, ఆందోళన, మూడ్‌ స్వింగ్స్‌ వంటివి తగ్గినట్లు ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ పరిశీలనల్లో తేలింది. స్వీయ నియంత్రణ శక్తి పెరగడంతో చెడు అలవాట్లను వదిలించుకోవడం కూడా తేలికవుతుంది. క్రేవింగ్‌ తగ్గడంతోబాటు తినే పదార్థాల్ని కూడా ఆచి తూచి తినడం అలవాటవుతుంది. దాంతో ఊబకాయం రాకుండా ఉంటుందనీ నిరూపితమైంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఓ ఇరవై నిమిషాలపాటు ధ్యానం చేయడం వల్ల మెదడు కణాల్లో కొత్త అనుసంధానాలు ఏర్పడి దాని పనితీరు మెరుగవుతుందనీ, ఫలితంగా వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌, మతిమరుపు రాకుండా ఉంటాయనేది మరో పరిశోధన. కాబట్టి చెప్పొచ్చేదేమంటే- ఏ రకంగా చూసుకున్నా క్రమం తప్పక ధ్యానం చేయడం వల్ల శరీరమూ మనసూ చెప్పినట్లు వింటాయి.


 కళ్లు చెబుతున్నాయీ... 


నీకళ్లు చెబుతున్నాయి నను ప్రేమించావని...’ అంటూ అబ్బాయిలు పాడేస్తుంటారుగానీ నిజానికి అమ్మాయిల కళ్లలోకి చూసి వాళ్లు నిజం చెబుతున్నారా... అబద్ధం చెబుతున్నారా... అన్న విషయాన్ని కనిపెట్టే శక్తి అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ఎక్కువని యూనివర్సిటీ ఆప్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా పరిశోధనలో తేలింది. మగవాళ్లు అబద్ధం చెబితే ఆ విషయాన్ని ఆడవాళ్లు చాలా సులభంగా కనుక్కోగలరు. కానీ ఆడవాళ్లు చెప్పే అబద్ధాలని మాత్రం మగవాళ్లు అసలు కనిపెట్టలేరట. కొన్నిసార్లు తోటి స్త్రీలూ కనిపెట్టలేరట. ఇందుకోసం వీళ్లు విభిన్న సంస్కృతులకు చెందిన స్త్రీ, పురుషుల్ని ఎంపికచేసి పరీక్షించగా అబద్ధం చెప్పే మగవాళ్లను సులభంగా కనుక్కోగలిగారట. కానీ స్త్రీలను మాత్రం వాళ్లంతట వాళ్లు చెబితే తప్ప ఎవరూ కనిపెట్టలేకపోయారట. అందుకేనేమో అంటారు... ఆడవాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదని. 


మెదడుకి మేత! 

ఆధునిక జీవనశైలిలో మానసికంగానే ఎక్కువగా అలసిపోతున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించి మెదడుని చురుకుగా ఉంచే ఈ పదార్థాలను తినండి అంటున్నారు ఆహార నిపుణులు. 
* దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడేవాళ్లకి అశ్వగంధ మంచి మందు. టీస్పూను పొడిని గోరువెచ్చని పాలల్లో కలిపి పడుకోవడానికి అరగంట ముందు తాగితే నిద్ర పట్టడంతోబాటు ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ శాతం తగ్గుతుంది. 
* నాడీకణాల పనితీరుకీ మెదడు చురుకుదనాన్ని పెంచడానికీ వాల్‌నట్స్‌ని మించినవి లేవు. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు మెదడు పనితీరు తగ్గకుండా చేస్తాయి. ఇందులోని బి-విటమిన్లూ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ కేంద్ర నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. ఇందులోని విటమిన్‌-ఇ మనసుని హాయిగా ఆనందంగా ఉంచుతుంది. అందుకే రోజూ ఓ మూడు వాల్‌నట్స్‌ని తీసుకుంటే మంచిది. అయితే వీటిమీద ఉండే ఫైటిక్‌ ఆమ్లం, ఇతరత్రా పదార్థాలు జీర్ణాశయంలోని ఎంజైమ్స్‌ విడుదలని అడ్డుకుంటాయి కాబట్టి నానబెట్టి తింటే మేలు. 
* ఒత్తిడిని తిప్పికొట్టడంలో పసుపూ మంచిదే. అందులోని కుర్‌క్యుమిన్‌ ఆనందంగా ఉంచే డోపమైన్‌, సెరటోనిన్‌ హార్మోన్ల స్రావాలను పెంచడం ద్వారా డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని పాలల్లో వేసి మరిగించి పడుకునేముందు తాగితే ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర పడుతుంది. 


గుండెజబ్బుకి రక్తపరీక్ష! 

భవిష్యత్తులో హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎప్పటికప్పుడు అన్ని రకాల పరీక్షలూ చేయించుకోవాలి. అయితే టెక్సాస్‌లోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి చెందిన పరిశోధకులు రక్తపరీక్ష ద్వారా గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల రక్తంలో ట్రోపోనిన్స్‌ కనిపిస్తే వాళ్లకి భవిష్యత్తులో హృద్రోగాలు వచ్చే అవకాశం ఉందట. ఇందుకోసం వీళ్లు హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న సుమారు పదివేలమందిని పరీక్షించగా వాళ్లందరి రక్తంలోనూ ట్రోపోనిన్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి రక్తపరీక్షలో వీటిశాతం ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో గుండెనొప్పి, గుండెపోటు వచ్చే అవకాశం ఉందనీ, కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెజబ్బు మరణాలను అడ్డుకోవచ్చనీ అంటున్నారు సదరు పరిశోధకులు.



 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.