close

అన్నం తినే మొసలే అంగరక్షకుడు!

సంపన్న దేవుడు అనగానే అనంతపద్మనాభ స్వామి గుర్తొస్తాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో కొలువుదీరిన ఈ స్వామి మూలస్థానం కాసర్‌కోడు జిల్లాలోని అనంతపుర లేక్‌టెంపుల్‌లో దర్శనమిస్తోంది. సరస్సు మధ్యలో నిర్మితమైన ఆ ఆలయంలో విష్ణుమూర్తిగా కొలువుదీరిన ఈ స్వామివారికి మొసలే అంగరక్షకుడు. ఇలాంటి ప్రత్యేకతలెన్నింటికో నెలవైన ఆ దేవాలయాన్ని మనమూ చుట్టొద్దాం రండి...

మలబారు తీరంలో కొలువైన సిరిమంతుడు అనంతపద్మనాభుడు తిరువనంతపురంలో వెలసినా... మూలస్థానం మాత్రం కేరళకు ఉత్తరాన ఉన్న కాసర్‌కోడు జిల్లాలోని అనంతపుర లేక్‌ టెంపుల్‌లో ఉంది. ఈ ఆలయం రెండు ఎకరాల కోనేటిలో నిర్మితమై చూపరులకు ఓ దీవిలా కనిపిస్తుంది. అనంతపద్మనాభుడు ఐదుపడగల నాగరాజుపైన సేదతీరుతున్న విష్ణుమూర్తిలా సాక్షాత్కరిస్తాడు. తన ఒడిలో ఆలయాన్ని నిలుపుకున్న ఈ సరస్సుకు ఒకవైపు గుహ ఉంది. అనంతపద్మనాభుడు ఈ గుహ నుంచే తిరువనంతపురం క్షేత్రానికి చేరుకున్నాడని చెబుతుంటారు. అలానే సరస్సుకు మరోవైపు కొండలూ, గుట్టలూ ఉంటాయి. పచ్చని ప్రకృతి మధ్య అందంగా కొలువుదీరిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం అనంతపుర గ్రామంలో ఉండటం వల్ల దేవాలయానికీ అదే పేరు వచ్చింది. ఇది మంగళూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న సరస్సుకు మధ్యలో గుడి ఉంటుంది. గర్భగుడిలోని స్వామి భూదేవీ, శ్రీదేవీ సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. గరుత్మంతుడూ, హనుమంతుడూ నమస్కరిస్తూ నిల్చొని ఉంటారు. అలానే ఇక్కడ కడు షర్కర యోగం విగ్రహాలూ ఉన్నాయి. దేవదారు, చందనం, మట్టి, కాయగూరలు, వెదురుగుజ్జు, మాంసం వంటి 108 పదార్థాలతో చేసిన ఆ విగ్రహాలను కడు షర్కర ప్రతిమలు అంటారు. ఈ దేవాలయంలోకి నల్ల లుంగీలు ధరించి వెళ్లకూడదు. దర్శనానికి చొక్కా బనీనూ తీసి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. మూడు వేల మందికి ఏక కాలంలో వండి వార్చే వంటగదిని 1991లోనే నిర్మించారు.

చరిత్ర ఏం చెబుతుందంటే... 
తొమ్మిదో శతాబ్దానికి చెందిన దివాకర ముని విల్వమంగత్లు అనే స్వామీజీ ఓ సరస్సు వద్ద తపస్సు చేసేవాడు. అతను విష్ణుమూర్తికి మహా భక్తుడు. ఒకసారి ఆయన దగ్గరకు ఓ బాలుడు వచ్చాడు. ఆ బాలుడికి ఎవరూ లేరని తెలిసి స్వామీజీ ఆశ్రయమిచ్చాడు. ఆ సమయంలో ‘నన్ను అవమానించినా, ఇబ్బంది పెట్టినా ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని ఆ బాలుడు స్వామీజీకి చెప్పాడు. అలాగే అని చెప్పి ఆశ్రయమిచ్చాడు స్వామీజీ. అతను ఒకసారి తపస్సులో ఉండగా ఆ బాలుడు ఆటపట్టించాలని స్వామీజీని నీళ్లలోకి తోసే ప్రయత్నం చేశాడు. స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ బాలుడు సరస్సుకు ఒక వైపున్న గుహలోకి వెళ్లి మాయమయ్యాడు. అప్పటి వరకూ అక్కడ గుహ లేదు. దాని ద్వారం కనిపించడంతో బాలుణ్ని వెతుక్కుంటూ వెళ్లిన స్వామీజీ తిరువనంతపురం పద్మనాభుడి సన్నిధికి చేరుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆ విష్ణుమూర్తే బాలుడి రూపంలో తనని ఆటపట్టించాడని. దాంతో స్వామీజీ ఆ సరస్సులోనే గుడి కట్టాడు. అనంతపద్మనాభుడి మూలస్థానం కావడంతో గుడికీ, గ్రామానికీ అదే పేరు వచ్చింది.

బాబియా భలే... 
ఈ దేవాలయానికి మరో ప్రత్యేకతా ఉంది. అదే బాబియా. ఆ సరస్సులో ఉండే మొసలి పేరే బాబియా. ఈ మొసలే విష్ణుమూర్తికి అంగరక్షకుడు. డెబ్భై ఏళ్ల నుంచీ అక్కడే నివసిస్తోంది. కేవలం పరమాన్నం మాత్రమే తింటుంది. ఉదయం ఎనిమిదికీ, మధ్యాహ్నం పన్నెండు గంటలకీ మాత్రమే అన్నం తినడానికి సరస్సులోంచి గుడి వద్దకు వస్తుంది. ప్రధాన పూజారే స్వయంగా దీనికి అన్నం తినిపిస్తాడు. బాబియా రోజుకు రెండు కేజీల అన్నం తప్ప ఏమీ తినదు. నీళ్లలోని చేపల్ని తినదు. ఎవరికీ ప్రాణహాని తలపెట్టదు. ఈ సరస్సులో ఇది మూడో మొసలి. ఒక మొసలి చనిపోగానే మరొకటి వస్తుంది. చుట్టుపక్కల సముద్రంతోగానీ, నదులతోగానీ ఈ సరస్సుకు అనుసంధానం లేకపోయినా ఈ మొసలి ఎట్నుంచి వస్తుందన్నది ఎవరూ ఇప్పటి వరకూ గుర్తించలేకపోయారు. అందుకే బాబియానూ విష్ణుమూర్తికి మరోరూపంగా భావిస్తారు. దాన్ని చూడ్డానికి భక్తులు ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు. ఈ ప్రాంతం పర్యటకంగా అభివృద్ధి చెందడానికి బాబియా కూడా కారణమేనట.

 

ఎలా వెళ్లాలంటే... 
ఈ దేవాలయంలోకి అన్ని మతాల వారికీ ప్రవేశముంది. ఆ ఆలయానికి కాసర్‌కోడు రైల్వేస్టేషన్‌ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి రైల్లో వెళ్లాలనుకునేవారు సంత్రగంచి- మంగళూరు సెంట్రల్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌, నవయుగ ఎక్స్‌ప్రెస్‌లు ఎక్కొచ్చు. హైదరాబాద్‌ నుంచి కాచీగూడ మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినా సరిపోతుంది. ఈ ఆలయానికి మంగళూరు విమానాశ్రయం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి లోకల్‌ బస్సుల సౌకర్యం ఉంది. ఎలా వెళ్లి ఆ దేవుణ్ని దర్శించుకున్నా అక్కడి విశేషాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.