close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నా!

ప్రపంచకప్‌లో ఆడటం ఏ ఆటగాడికైనా ఓ కల! తీవ్రపోటీ ఉండే భారత క్రికెట్‌ జట్టు తరఫున ఆడటమంటే అది అదృష్టమే. ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కి ఎంపికై అంతర్జాతీయస్థాయిలో స్వల్ప అనుభవంతోనే ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు విజయ్‌ శంకర్‌. కానీ ఇక్కడివరకూ రావడానికి అతడు సుదీర్ఘ ప్రయాణమే చేశాడు!


ఇంటిమీద ప్రాక్టీసు 

నాన్న శంకర్‌ క్లబ్‌ క్రికెట్‌ ఆడారు. అన్నయ్య అజయ్‌ లీగ్‌లు ఆడుతున్నాడు. చిన్నపుడు వాళ్లతోపాటు ఇంటి ప్రాంగణంలో సరదాగా క్రికెట్‌ ఆడేవాణ్ని. నాకు 13 ఏళ్లు వచ్చాక క్రికెట్‌ అకాడమీలో చేర్చారు నాన్న. కానీ వెళ్లిరావడానికే మూడునాలుగు గంటలు పట్టేది. దాంతో ఇంటి మిద్దెమీద నెట్స్‌ ఏర్పాటుచేసి టర్ఫ్‌ వేయించారు. బౌలింగ్‌ మెషీన్‌ కూడా కొన్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ ప్రాక్టీసు చేసేవాణ్ని. వదిన, అమ్మ, నాన్నమ్మ... అందరూ క్రికెట్‌ అభిమానులే కావడంతో నా ఆటను డిస్టబెన్స్‌ అనుకోలేదు. 


స్పిన్‌ నుంచి ఫాస్ట్‌కి... 

మంచి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకోవాలని చిన్నప్పట్నుంచీ అనుకునేవాణ్ని. అందుకే బ్యాటింగ్‌, బౌలింగ్‌... రెంటినీ సమపాళ్లలో ప్రాక్టీసు చేసేవాణ్ని. మొదట్లో స్పిన్నర్‌ని. కానీ తమిళనాడు జట్టులో అప్పటికే ఎక్కువమంది స్పిన్నర్లు ఉండటంతో మా కోచ్‌ బాలాజీ నన్ను ఫాస్ట్‌ బౌలింగ్‌కి మారమని సలహా ఇచ్చారు. అండర్‌-13 నుంచీ ఆయన నాకు శిక్షణ ఇస్తున్నారు. నాతోపాటు బాబా అపరిజిత్‌, ఇంద్రజిత్‌లకి కూడా. మేం ముగ్గురం ఒకేసారి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాం. 


జాతీయ జట్టులోకి... 

2012-13లో రంజీ ట్రోఫీకి మొదటిసారి ఎంపికయ్యాను. 2014-15 సీజన్లో ఏడు మ్యాచుల్లో 577 రన్స్‌ చేశాను. దాంతో ఇండియా-ఎ జట్టులోకి తీసుకున్నారు. అక్కడ ద్రవిడ్‌ శిష్యరికం నన్ను ఎంతో మెరుగుపర్చింది. నేను ఆడే క్లబ్‌, రాష్ట్ర స్థాయిలో టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తుంటాను. ఇండియా-ఎకి ఎంపికయ్యాక మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవంతో ఏ స్థానంలోనైనా ఆడగలుగుతున్నాను. పరిమిత ఓవర్ల విభాగంలో తమిళనాడు కెప్టెన్‌గా 2016-17 సీజన్లో విజయ్‌ హజారే, దేవ్‌ధార్‌ ట్రోఫీల్ని గెలిపించాను. 2017లో నవంబరులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి బౌలర్‌గా అవకాశం వచ్చింది. 


అందరికీ వందనాలు 

నా చిన్నప్పటి కోచ్‌ చక్రధర్‌ రావు, వ్యక్తిగత కోచ్‌ ఎస్‌ బాలాజీ, డబ్ల్యూవీ రామన్‌... వీళ్లంతా నన్ను తీర్చిదిద్దారు. ఓసారి గాయం కారణంగా నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో విశ్రాంతి తీసుకుంటున్నపుడు ఎల్‌.బాలాజీ కొన్ని సూచనలు చేశారు. తర్వాత నా రనప్‌లో మార్పుచేసుకుని బంతి వేగాన్ని మెరుగుపర్చుకోగలిగాను. మానసికంగా డీలాపడ్డపుడు అక్కడి ట్రైనర్‌ రజనీకాంత్‌ నాలో నూతనోత్తేజం నింపాడు. ఇలా నా ఎదుగుదల వెనక ఎందరో ఉన్నారు.


అదో పెద్ద పాఠం 

గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్స్‌ నాకు పెద్ద పాఠం. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 19 బంతుల్లో 17 పరుగులు చేశాను. దినేశ్‌ కార్తీక్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆ మ్యాచ్‌ గెలిచాం. కానీ నా బ్యాటింగ్‌ తీరుని అంతా విమర్శించారు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌, ద్రవిడ్‌ నాకు మద్దతుగా నిలిచి మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెప్పారు. ఎత్తుపల్లాలను సమానంగా స్వీకరించడం గురించి మొదటిసారి నేర్చుకున్నాను. 


స్టీలురాడ్డుతో ప్రాక్టీసు 

ప్రతి సిరీస్‌కి ముందూ ప్రత్యేకంగా సిద్ధమవుతాను. బ్యాట్‌ అంత పొడవూ, బరువూ ఉండే స్టీల్‌ రాడ్‌తో ప్రాక్టీసు చేస్తాను. సాధారణ బ్యాట్‌తోపోల్చితే మధ్యభాగం మాత్రమే ఉండే మిడ్లర్‌ బ్యాట్‌తో ప్రాక్టీసు చేస్తాను. దానివల్ల బంతిని బాగా మిడిల్‌ చేయడం అలవాటు అవుతుంది. మరోవైపు బౌలింగ్‌నీ మెరుగు పర్చుకుంటాను.


కల నిజమైంది! 

ప్రపంచకప్‌ జట్టుకి ఎంపిక గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. 15 మందిలో నా పేరు చూడగానే నా కల నిజమవుతున్నందుకు సంతోషపడ్డాను. ఎంపికయ్యానన్న నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా! 


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.