close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మ మనసు 

- జ్యోతి సుంకరణం

‘‘టోకెన్‌ నంబర్‌ థర్టీన్‌, థర్టీన్‌...ఎవరండీ’’ అని గట్టిగా అరుస్తున్న రిసెప్షనిస్ట్‌ దగ్గరికి వెళ్ళి- 
‘‘మేడమ్‌, అర్జంటుగా ఆఫీసుకి వెళ్ళే పని ఉంది, కొంచెం తొందరగా లోపలికి పంపించగలరా’’ రిక్వెస్టింగ్‌గా అడిగాడు శ్రీనివాస్‌. 
‘‘సారీ సర్‌... రష్‌ ఎక్కువగా ఉన్నపుడు అలా పంపడం కుదరదు. మిమ్మల్ని పంపిస్తే మిగిలినవాళ్ళు ఊరుకోరు’’ నిర్మొహమాటంగా చెప్పేసింది రిసెప్షనిస్ట్‌. 
‘‘పోనీ మా నంబర్‌ వచ్చేసరికి ఇంకా ఎంత టైమ్‌ పట్టొచ్చు?’’ అదైనా చెప్పండి అన్నట్లు అడిగాడు. 
శ్రీనివాస్‌ చేతిలోని టోకెన్‌ తీసుకుని చూసి ‘‘మినిమం గంట పడుతుంది’’ అంటూ చెప్పేసి, మొహం తిప్పేసుకుంది రిసెప్షనిస్ట్‌ వెంటనే. 
చేసేదేంలేక తల్లి పార్వతమ్మ పక్కకు వచ్చి కూర్చున్నాడు. ‘‘డాక్టర్‌ దగ్గరకు వెళ్ళడానికి ఇంకా గంట పడుతుందట’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలోనే చేతిలో సెల్‌ మోగింది. దాన్ని అసహనంగా ఆపేసి ‘వీళ్ళొకళ్ళు... ఇప్పటికే ఓ యాభైసార్లు చేసి ఉంటారు’ అని విసుక్కుని, ‘‘అమ్మా, ఒక పనిచేస్తాను... ఎలాగూ మనం లోపలికి వెళ్ళడానికి గంట టైమ్‌ పడుతుంది కదా. ఆఫీసువాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు. నేను ఆఫీసుకి వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. నువ్వు కూర్చుని ఉండు’’ అంటూ తల్లికి చెప్పి వెళ్ళాడు శ్రీనివాస్‌. ‘సరే’నని బుర్ర ఊపి కూర్చుంది పార్వతమ్మ. అరగంట పైనే అయింది. ఉండీ ఉండీ పార్వతమ్మ, కొడుకు వస్తున్నాడేమోనని ఎం‌ట్రన్స్‌ వైపుకి చూస్తూనే ఉంది. దాదాపు గంట అయినా శ్రీనివాస్‌ రాలేదు. 
ఈలోగా ‘‘అమ్మా, మీ నంబర్‌ వచ్చింది... లోపలికి వెళ్ళండి’’ అంది రిసెప్షనిస్ట్‌. 
దానికి పార్వతమ్మ వెంటనే గాభరా పడిపోతూ ‘‘అయ్యో, మా అబ్బాయి ఇంకా రాలేదే’’ అంది బెదురు చూపులు చూస్తూ. 
‘‘అయితే, మీ తర్వాతవాళ్ళని పంపించెయ్యమంటారా?’’ అడిగింది రిసెప్షనిస్టు. ‘సరే’నని తలూపింది పార్వతమ్మ. 
పార్వతమ్మ తర్వాతవాళ్ళు, ఆ తర్వాతవాళ్ళు, ఆ తర్వాతవాళ్ళు కూడా డాక్టర్‌కి చూపించుకుని వెళ్ళిపోవడాలు అయిపోయాయి. మరికాసేపటికి మొహానికి చెమటలు తుడుచుకుంటూ కంగారుగా నడుచుకుంటూ వచ్చాడు శ్రీనివాస్‌. వస్తూనే ఖాళీగా ఉన్న హాల్లో తల్లి మాత్రమే కూర్చుని ఉండటం చూసి ‘‘ఏమ్మా, డాక్టర్‌కి చూపించుకోవడం అయిందా?’’ అని అడిగాడు. 
‘‘ఇంకా లేదు’’ అని తల్లి చెప్పడంతో- ‘‘సరే, రా’’ అని తల్లిని డాక్టర్‌ రూమ్‌లోకి తీసుకువెళ్ళబోయాడు. 
వాళ్ళని ఆపేస్తూ ‘‘సారీ సర్‌, డాక్టర్‌గారు వెళ్ళిపోయారు’’ చెప్పింది రిసెప్షనిస్ట్‌. 
‘‘అదేమిటి, ఎలా వెళ్ళిపోతారు. మాకు అపాయింట్‌మెంట్‌ ఉందిగా?’’ కాస్త విసురుగా అడిగాడు శ్రీనివాస్‌. 
‘‘మీ టోకెన్‌ నంబరు రాగానే ఆవిణ్ణి వెళ్ళమన్నాను. ఆవిడే వెళ్ళలేదు, నేనేం చేస్తాను’’ తను కూడా విసురు సమాధానమే చెప్పింది. 
అసలే ఆఫీసు టెన్షన్‌తో అసహనంగా ఉన్నాడేమో... వెంటనే చిర్రెత్తుకొచ్చింది శ్రీనివాస్‌కి. కోపంగా తల్లివైపు చూస్తూ ‘‘ఎందుకు వెళ్ళలేదూ’’ అంటూ అరిచాడు. 
‘‘అంటే... నువ్వు రాలేదనీ...’’ అంటూ నీళ్ళు నమిలింది పార్వతమ్మ. 
‘‘నేనెందుకు రావడం...నేనొచ్చేలోగా చూపించుకు ఉండాల్సింది కదా’’ అంటూ తల్లిమీద చికాకుపడి, రిసెప్షనిస్ట్‌ వైపు తిరిగి ‘‘మేడమ్‌, రేపుగానీ ఎల్లుండిగానీ ఇంకో అపాయింట్‌మెంట్‌ చూడండి’’ అంటూ అడిగాడు. 
‘‘సారీ అండీ, డాక్టర్‌గారు క్యాంపు వెళుతున్నారు. మరో నెలదాకా రారు’’ అని చెప్పేసి వెళ్ళిపోయింది. 
ఇక అంతే... పట్టరాని కోపం వచ్చేసింది శ్రీనివాస్‌కి. ఆ కోపమంతా తల్లిమీద చూపించేస్తూ ‘‘విన్నావుగా, మరో నెలదాకా రారట. అప్పటిదాకా ఈ మందులే కొనేస్తాను. అవి వాడుకో. ఇంకో నెల్లాళ్ళు నీకేమొచ్చినా నాతో చెప్పకు’’ అంటూ విసుక్కున్నాడు.

* * *  * *

‘‘డాక్టర్‌గారూ, ఎలా ఉంది మా అమ్మకి ఇప్పుడు?’’ ఐసీయూ నుంచి బయటికి వస్తున్న డాక్టర్ని ఆత్రుతగా అడిగాడు శ్రీనివాస్‌. ‘‘కొంచెం క్రిటికల్‌గానే ఉంది పొజిషన్‌. సర్జరీ ఎంత వీలైతే అంత తొందరగా చేసెయ్యాలి’’ చెప్పాడు డాక్టరు. ‘‘అయ్యో సర్జరీయా... మందులతో తగ్గదా..? 
ఈ వయసులో తట్టుకుంటుందో లేదో. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది డాక్టర్‌?’’ అన్నాడు శ్రీనివాస్‌ ఎంతో బాధగా. ‘‘అది నేను మిమ్మల్ని అడగాలి. ఇరవై రోజులుగా ఆవిడ ఇబ్బంది పడుతుంటే- ఇంత కొంపలంటుకుపోయే 
పరిస్థితి వచ్చేవరకూ తీసుకురాకుండా ఏం చేశారు’’ కాస్త అసహనంగా అడిగాడు డాక్టరు. ‘‘ఇరవైరోజులుగానా... లేదు డాక్టర్‌, నిన్నరాత్రి నుండే తనకి బాగోలేదు’’ చెప్పబోతున్న శ్రీనివాస్‌ని మధ్యలోనే ఆపేసి- 
‘‘ఇరవై రోజుల నుండీ తను బాగా ఇబ్బందిపడుతున్నట్లు ఆవిడే చెప్పింది. పైగా రిపోర్టులు అన్నీ కూడా చాలా హైరేంజ్‌లో ఉన్నాయి. ఏదో ఒక్క రోజుకి అలా పెరిగిపోవు. కొంచెం ప్రాబ్లమ్‌ అనిపించగానే తీసుకొచ్చి టెస్టులు చేయిస్తే ఇంత సీరియస్‌ అయిపోయేది కాదు. అసలు ముందే ఎందుకు తీసుకురాలేదు’’ కాసింత చికాగ్గా అడిగాడు డాక్టరు. దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక ‘‘ఏదో ఈమధ్య ఆఫీసులో బిజీగా ఉండి...’’ అంటూ బుర్ర దించుకున్నాడు శ్రీనివాస్‌. ‘‘చదువుకున్నవాళ్ళయి ఉండి మీరు కూడా ఇలా చేస్తే ఎలా? సర్లెండి, టూ త్రీ డేస్‌ అబ్జర్వేషన్‌లో పెట్టాంగా... చూద్దాం అన్నీ కంట్రోలుకి రాగానే సర్జరీ చేసేస్తాం’’ అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు

డాక్టరు.

* * *  * *

‘‘చూడండి... రోజురోజుకీ లోకం ఎలా తయారవుతుందో! వీకెండ్‌ పార్టీలకి టైమ్‌ ఉంటుందీ... పెళ్ళాం పిల్లలతో, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేసే టైమ్‌లు ఉంటాయిగానీ కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోవడానికి మాత్రం టైములుండవు. చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రం ఏం లాభం... ఇంగితజ్ఞానం లేకపోయాక. పాపం, ఆ పెద్దావిడ చూడండి... ఇరవై రోజులుగా ఊపిరి ఆడక, ఆయాసంతో అంత ఇబ్బందిపడుతుంటే, పట్టించుకోవడం మానేసి, ఇప్పుడొచ్చి ఆవిడ ఆపరేషన్‌కి తట్టుకుంటుందో లేదో అంటూ తెగ ఫీలైపోతున్నాడు. ఇంతకీ ఆ ఫీలింగ్‌ ఆవిడ ఆపరేషన్‌ తట్టుకోలేదనో ఈయనగారికి డబ్బు ఖర్చవుతుందనో’’ అంటూ ఆ డాక్టరు తన రూమ్‌లోని ఇంకో డాక్టరుతో అంటుండగా - ఆ మాటలు - కౌంటరులో బిల్లు కట్టి, ఏదో సందేహం వచ్చి డాక్టరు కోసం రూమ్‌లోకి వెళ్ళబోయిన శ్రీనివాస్‌ చెవిలోపడ్డాయి. అంతే, హతాశుడయ్యాడు. 
తను తల్లిని పట్టించుకోలేదా... ఏం అంటున్నాడీ డాక్టరు? అసలేం తెలుసు నా గురించి ఇతనికి. అవమానభారంతో ఒంట్లో రక్తం సలసల మరిగిపోగా, వెంటనే వెళ్ళి అతడిని కడిగెయ్యాలనుకున్నాడు. కానీ, వెంటనే సంస్కారం గుర్తొచ్చి, ఆ మాటలేం చెవిలో పడనట్లే ప్రవర్తించి, తను అడగాల్సిన సందేహాల్ని అడిగి బైటకి వచ్చేశాడు శ్రీనివాస్‌.

* * *  * *

రెండుమూడు రోజులకి బీపీ షుగరులన్నీ నార్మల్‌కి వచ్చేసరికి సర్జరీకి రెడీ చేశారు శ్రీనివాస్‌ తల్లి పార్వతమ్మని. థియేటర్‌లోకి తీసుకుపోబోతుంటే... అక్కడే దిగాలుపడ్డ మొహంతో నిలుచున్న కొడుకుని చూసి దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేసింది పార్వతమ్మ. తల్లి దగ్గరకు వెళ్ళాడు శ్రీనివాస్‌. కొడుకుని చూసి నీరసంగా ఓ నవ్వు నవ్వి ‘‘ఒరేయ్‌, వెర్రి నాగన్నా... నాకేం కాలేదురా. మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. అసలు తిన్నావా ఈ రెండు రోజులు. నాకోసం బెంగ పెట్టుకుని తిండీ తిప్పలు మానేశావా? నాకు బాగానే ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు’’ అని సగం సైగలతో సగం మాటలతో కొడుక్కి ధైర్యం చెప్పింది పార్వతమ్మ. ‘‘ఎందుకమ్మా, ఇరవై రోజులుగా ఇంత బాధపడుతూ నాతో చెప్పలేదు’’ దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే గద్గద స్వరంతో అడిగాడు శ్రీనివాస్‌. 
దానికి ఆవిడ ‘‘అదేంటి నాన్నా, నువ్వే కదా ఏమొచ్చినా నాకు చెప్పొద్దు, నెల్లాళ్ళు మందులు వాడు అన్నావు’’ అంది మాట కూడబలుక్కుంటూ. ‘‘అదేంటీ... నేనా, ఎప్పుడూ?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస్‌ అయోమయంగా తల్లిని చూస్తూ. ‘‘అదే... కిందటిసారి డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు’’ అంది ఆవిడ. 
‘‘ఎప్పుడూ... ఓ అదా... అప్పుడా’’ సడన్‌గా గుర్తొచ్చింది శ్రీనివాస్‌కి. తను తల్లిని డాక్టరు దగ్గరకి తీసుకువెళ్ళడం... డాక్టర్‌ అపాయింట్‌ మెంట్‌ మిస్‌ అయ్యిందన్న కోపంలో తల్లిమీద చికాకుపడటం. ‘‘అదేమిటమ్మా, నేనేదో టెన్షన్‌లో అలా అన్నంతమాత్రాన... నిజంగా చెప్పడం మానేస్తావా. ఇప్పుడు చూడు, అందరూ నన్నెలా అనుకుంటున్నారో. నిన్ను నేనేదో పట్టించుకోనట్లు’’ ఉక్రోషంగా అన్నాడు. 
కొడుకు మాటలకి పార్వతమ్మకి వెంటనే కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగిపోయాయి. ‘‘అయ్యో, అది కాదు నాన్నా...’’ అంటూ ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఏదో చెప్పబోయేలోగానే నర్సులు ఆవిడ స్ట్రెచర్‌ని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకువెళ్ళిపోయారు. 
ఆపరేషన్‌ స్టార్ట్‌ అయింది. అక్కడ కూర్చోకూడదనడంతో విజిటర్స్‌ లాంజ్‌లోకి వచ్చి కూర్చున్నాడు. ఎదురుగా బ్లడ్‌ టెస్టులు చేసే రూమ్‌ ఉంది. అక్కడ ఒక తల్లి- బ్లడ్‌ టెస్టు చేయించుకోకుండా మారాం చేసే తన కొడుకుని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. యథాలాపంగా అటు దృష్టిని సారించాడు శ్రీనివాస్‌. ‘‘మేడమ్‌, మీరు బైటకెళ్ళిపోతే మీ అబ్బాయి మా మాట వింటాడు’’ అంటున్నారు అక్కడి స్టాఫ్‌. 
వాళ్ళ మాటలు ఆ తల్లి వినలేదు. ‘‘మావాడసలే భయస్తుడు, నేనొదిలి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా?’’ అంటూ- నేనుండగా నీకేం ఫర్వాలేదు అన్నట్లు గట్టిగా ఆ పిల్లాడిని తన వైపుకి చుట్టేసుకునీ తన గుండెలకి అదిమేసుకునీ కళ్ళు మూసేసీ అతి సునాయాసంగా వాడికే మాత్రం నొప్పి తెలియనివ్వకుండా ఆ టెస్టు చేయించేసింది. ఎందుకో ఆ దృశ్యం చాలా అపురూపంగా అనిపించింది శ్రీనివాస్‌కి. అక్కడున్న వారంతా రాక్షసులే, తల్లి మాత్రమే వాళ్ళందరినీ ఎదుర్కొని తనని రక్షించగలదన్న భావన ఆ పిల్లాడి మొహంలో కనిపించి నవ్వొచ్చింది శ్రీనివాస్‌కి. అంతేకదా, ఆ వయసులో తల్లే అన్నీను. 
అంతలోనే వివేకం తట్టింది అతనికి. అంతర్మథనం మొదలైంది. మరి తనో... తను కూడా ఇలాగే తల్లిచాటు బిడ్డగా ఉండేవాడుగా... అలా అనుకోగానే తెరలుతెరలుగా తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి శ్రీనివాస్‌కి.

* * *  * *

అనుకోకుండా పార్వతి పుట్టింటి బంధువులెవరో చనిపోయారని కబురొస్తే, చిన్నపిల్లాడిని అటువంటి చోటుకి తీసుకువెళ్ళడం ఎందుకని తన ఏడేళ్ళ కొడుకు శ్రీనుని అత్తగారి దగ్గర ఉంచి వెళ్ళింది. తల్లి వెళుతున్నప్పుడు పెద్దగా పేచీ పెట్టని శ్రీను, ఆ రాత్రి మాత్రం ఇంట్లో వాళ్ళ నాన్ననీ నానమ్మనీ తాతనీ బాబాయ్‌నీ ఓ ఆట ఆడుకున్నాడు. రాత్రి తెల్లవార్లూ ఎవరెన్ని చెప్పినా వినకుండా ‘అమ్మా...అమ్మా...’ అంటూ ఒకటే ఏడుపు. విసిగి వేసారిపోయారంతా. ‘ఎప్పుడు తెల్లారుతుందా... ఎప్పుడు వాళ్ళమ్మని రమ్మని కబురు చేసేద్దామా’ అని ఎదురుచూశారు. తెల్లారగానే ఈ విషయం తెలిసి, పాపం పార్వతి - దొరికిన బస్‌ పట్టుకుని హుటాహుటిన వచ్చేసింది. అంతవరకూ చండప్రచండంగా టాప్‌ లేపేసిన శ్రీను, తల్లిని చూడగానే పరిగెట్టుకుని వెళ్ళి ఆర్తిగా చుట్టేసుకుని టక్కున ఏడుపు ఆపేశాడు. అది చూసి వాడి నాయనమ్మ ‘హమ్మయ్య, వచ్చావా తల్లీ... తెల్లవార్లూ వాడు ఏడ్చిన ఏడుపు చూసి ఏమైపోతాడోనని భయమేసిందనుకో. అయినా నువ్వు వాణ్ణి మరీ ముద్దుచేసేసి అమ్మకూచిలాగా తయారుచేస్తున్నావ్‌. ఇలా అయితే ఎలా? ఏడేళ్ళు వచ్చాయి, ఆ మాత్రం అమ్మని వదిలిపెట్టి ఓపూట ఉండలేడూ. మగపిల్లాడు రేపు చదువులకనీ ఉద్యోగాలకనీ ఊళ్ళు తిరగాల్సి వస్తుంది. రేపటినుండే వాడికి ఒక్కడూ పడుకోవడమదీ అలవాటు చెయ్యి’ అంటూ హుకుం జారీచేసింది. 
ఆ మాటలకి పార్వతి ప్రశాంతంగా నవ్వుతూ ‘నెమ్మదిగా వాడే అలవాటు చేసుకుంటాడులెండి అత్తయ్యా’ అంటూ మరింత ఆప్యాయంగా కొడుకుని దగ్గరికి తీసుకుంది. నాయనమ్మ మాట విని తల్లి తనని ఎక్కడ దూరం పెడుతుందోనని భయపడ్డ శ్రీనుకి ఈ మాటలు కొండంత బలాన్నిచ్చాయి. 

అలా... శ్రీనుకి తల్లితోడిదే లోకం, తల్లే తన ప్రపంచం. స్కూల్లోనూ ఆటలకి వెళ్ళినప్పుడూ- జరిగినదంతా ఇంటికి రాగానే పూస గుచ్చినట్లు అమ్మకి చెప్పాల్సిందే. తన ఘనకార్యాలకి అమ్మ మురిసిపోతూ ‘మా నాన్నే’ అంటూ బుగ్గలు పుణికిందంటే చాలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది వాడికి. 
ఒకరోజు స్కూలు నుండి వస్తూనే ఎప్పటిలా గలగలా మాట్లాడకుండా మౌనంగా ఓ మూల కూర్చున్న శ్రీనుని చూసి ‘ఏం నాన్నా... అలా ఉన్నావ్‌, ఏమయ్యిందీ’ అని అడిగింది పార్వతి. 
‘మా స్కూల్లో పద్యాల పోటీ పెట్టారు. అది కూడా స్కూలు యానివర్సరీలో స్టేజీమీద చెప్పాలట. అందరూ పేర్లు ఇచ్చారు కానీ నేనివ్వ లేదు’ అన్నాడు బుంగమూతి పెట్టుకుని శ్రీను. 
‘ఏం, ఎందుకివ్వలేదు. నీకు బోలెడన్ని పద్యాలు వచ్చు కదా. ఇంట్లో పెద్ద గొంతుతో అస్తమానూ పాడుతూనే ఉంటావ్‌. అందులోంచి మంచి పద్యం ఒకటి చెప్తే సరి’ అంది పార్వతి. 
వెంటనే వాడు ‘ఇంట్లో నీముందు చెప్తా కానీ... అమ్మో... స్కూల్లో అందరూ చూస్తుంటే నాకు ఏడుపొచ్చేస్తుందమ్మా. ఏడిస్తే అంతా నవ్వుతారు’ అన్నాడు ఏడుపు గొంతుతో. 
వాడి మాటలకి కాసేపు ఆలోచించిన పార్వతి ‘సరే, ముందు నీ పేరు కూడా ఇవ్వు. ఇంకా టైమ్‌ ఉంది కదా, అందరిముందూ నీకు ఏడుపు రాకుండా భయం వేయకుండా పద్యం పాడటం ఎలాగో నేర్పించే పూచీ నాది, సరేనా’ భరోసా ఇస్తూ అంది. 
ఎలాగో ఏమిటో తెలియకపోయినా తల్లి ఇచ్చిన భరోసాకి వాడి కళ్ళు వెలిగిపోయాయి. 
స్కూలు యానివర్సరీ రానే వచ్చింది. ఆరోజు ఉదయం శ్రీనుని స్కూలుకి పంపిస్తూ ‘చెప్పింది గుర్తుంది కదా నాన్నా, నువ్వు స్టేజీ మీదకు రాగానే నీ ఎదురుగా నేనే ఉంటాను. నన్నే చూస్తూ, ఇంట్లో నా ముందు ఎలా చెప్తావో అలాగే చెప్పేయ్‌. చుట్టూ ఎవరున్నా నీకనవసరం, నన్ను మాత్రమే చూడు’ అంటూ గత పదిరోజులుగా చెప్పుకొచ్చిందే మళ్ళీ చెప్పింది. ‘సరే’నంటూ వెళ్ళిపోయాడు వాడు. 
ఆ సాయంత్రం ఫంక్షన్‌ స్టార్ట్‌ అయ్యింది. పెద్దలెవరో మాట్లాడటాలు అయ్యాయి. పిల్లలు ప్రదర్శించిన ఒకటి రెండు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అయ్యాయి. ఈలోగా శ్రీను స్టేజీ మీదకు వెళ్ళే టైమ్‌ వచ్చింది. వాడి పేరు కూడా మైకులో అనౌన్స్‌ చేసేశారు. చుట్టూ ఉన్న టీచర్లూ పిల్లలూ ‘వెళ్ళు, వెళ్ళు’ అంటూ ముందుకు తోసేస్తున్నారు. వాడు మాత్రం నిలుచున్నచోటు నుండి కదలకుండా బిక్కమొహం వేసుకుని తల్లి కోసమే చుట్టూ చూస్తున్నాడు. అసలు ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుండీ వాడు తల్లి కోసమే చూస్తున్నాడు. తను ఎక్కడా కనపడకపోవడంతో స్టేజీ మీదకు ధైర్యంగా ఎలా వెళ్ళాలో తెలియక అయోమయంగా ఉంది వాడికి. ఈలోగా ఎవరో బలవంతంగా స్టేజీ ఎక్కించేశారు. భయంతో నోటమాట రాక బెదురుచూపులు చూస్తూ మైకు ముందు నిలుచుండిపోయాడు. ‘చెప్పు, చెప్పు’ అంటూ స్టేజీ పక్కనుండి టీచర్లు సైగ చేస్తున్నకొద్దీ భయం పెరిగిపోతోంది వాడికి. 
ఇక ఏం చెయ్యలేక స్టేజీ వదిలేసి కిందకు పారిపోదామనుకునే పరిస్థితిలో స్టేజీ ముందు తల్లి నిలబడి, ‘పాడు, పాడు’ అంటూ నవ్వుతూ సైగ చెయ్యడం కనిపించింది. కళ్ళలో నీళ్ళు తుడుచుకుని చూశాడు- అమ్మేనా అని. అమ్మే! ఇక అంతే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది వాడికి. మైక్‌ దగ్గరకు లాక్కుని గొంతెత్తి రాగయుక్తంగా- 
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ ...అంటూ పాడి, ఆ తర్వాత దాని భావాన్ని కూడా విడమర్చి స్పష్టంగా చెప్పాడు. అంతే!! అక్కడంతా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అదంతా చూసిన శ్రీనుకి భయంగియం ఎగిరిపోయాయి. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. స్టేజీ దిగగానే క్లాస్‌ టీచర్‌ వచ్చి ‘ఇంత బాగా చెప్పావ్‌, మరి ముందు ఎందుకు అంత భయపడిపోయావ్‌’ అంది. ఆవిడకి సమాధానమేమీ ఇవ్వకుండా తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి రెండు చేతులూ పట్టుకుని ‘ఎందుకమ్మా, అంత లేటుగా వచ్చావ్‌, 
నువ్వింక రావనుకుని పద్యం చెప్పకుండా కిందకి దిగిపోదామనుకున్నా’ అన్నాడు. 
దానికి పార్వతి ‘నానమ్మకి ఒంట్లో బాగోలేదు నాన్నా, అనుకోకుండా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. నాన్న కూడా ఊళ్ళో లేరుగా, ఆవిణ్ణి ఇంట్లో దింపి వచ్చేసరికి లేటయింది. సర్లేకానీ, భలే బ్రహ్మాండంగా చెప్పావ్‌ నాన్నా. చూశావా అందరూ నిన్ను ఎంత మెచ్చుకుంటున్నారో. మరి ఎప్పుడూ ఇలాగే మెచ్చుకోవాలంటే- నేను నీ ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే భయపడకూడదు. చక్కగా ధైర్యంగా నీకు వచ్చింది చెప్పెయ్యాలి. మొదలుపెట్టేదాకానే భయమనిపిస్తుంది. 
ఆ తర్వాతేం ఉండదు, సరేనా’ అంటూ కొడుకు ఆ విజయానందంలో ఉండగానే మాట తీసేసుకుంది. వాడు కూడా రెట్టించిన ఉత్సాహంతో ‘ఓ’ అనేశాడు. 
అలా ఎప్పటికప్పుడు తల్లి చెప్పే ధైర్య వచనాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడో స్థాయికి వచ్చాడు. 
‘‘సార్‌, ఈ మందులు తెచ్చిపెట్టండి’’  అని నర్సు పిలవడంతో ప్రస్తుతంలోకి వచ్చాడు శ్రీనివాస్‌. 
ఆపరేషన్‌ థియేటర్‌లో తల్లి ఉన్నదన్న సంగతి గుర్తొచ్చింది ‘‘ఎలా ఉంది ఆవిడకి?’’ గొంతు తడారిపోతుండగా అడిగాడు నర్సుని. ‘‘ఆపరేషన్‌ అయిపోయిందండీ. కాసేపటికి రూమ్‌కి షిఫ్ట్‌ చేస్తారు, బాగానే ఉన్నారు’’ అని చెప్పింది. ఆ మాటలు తేనె పలుకుల్లా అనిపించాయి శ్రీనివాస్‌కి. కావాల్సిన మందులు తెచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు శ్రీనివాస్‌. 
తను చిన్నప్పుడు ఎన్నోసార్లు అల్లర్లు చేసీ పేచీలు పెట్టీ తల్లిని సతాయిస్తూనే ఉండేవాడు. ఎన్నో పనులూ ఎన్నో బాధ్యతలూ ఉండి కూడా అమ్మ తనని ఏనాడూ విసుక్కోలేదు. మరి తనేం చేశాడు... ఆఫీసులోని టెన్షన్లన్నీ తల్లిమీద చూపించి విసుక్కున్నాడు. ఆ రోజు తను అలా మూర్ఖంగా మాట్లాడి ఉండబట్టే, తల్లి తన ఆరోగ్య పరిస్థితిని చెప్పలేదు. ఆఖరికి... ఆఖరికి... తన మూలంగా పరిస్థితి విషమించి, ఆపరేషన్‌దాకా వస్తే కూడా క్షీణించిన తల్లి ఆరోగ్యానికి బాధపడకుండా, ‘ఎవరో ఏదో అనేలా చేశావేంటమ్మా’ అంటూ తల్లిని నిలదీశాడే కానీ ధైర్యం చెప్పలేదు. పాపం, ఆ పిచ్చితల్లి మాత్రం ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్ళబోతూ కూడా ‘తింటున్నానా లేదా’ అని నా యోగక్షేమాలని అడిగింది. ఇదంతా ఆలోచించుకున్న శ్రీనివాస్‌కి తనమీద తనకే అసహ్యం వేసింది. ఆపరేషన్‌ పూర్తయి రూమ్‌కి తీసుకురాగానే, రాత్రీ పగలూ తల్లినే కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక నాలుగు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కాస్త లేచి కూర్చుంది పార్వతమ్మ. 
కాస్త ఓపిక రాగానే కొడుకుని దగ్గరికి పిలిచి ‘‘ఒరేయ్‌ బాబూ, నేను పూర్వంలాగా కాదు నాన్నా... అన్నీ మర్చిపోతున్నాను. నువ్వు పక్కన లేకుండా ఒక్కర్తినీ డాక్టరుగారితో ఏం మాట్లాడతానో ఏమిటోనని భయం. ఒకదానికొకటి చెప్తానేమోనని జంకూ... 
నీకు అన్నీ తెలుసు... నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యం. అందుకే, ఆరోజు నీకోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోయాను. తర్వాత ‘ఆ మందులే వాడుతూ ఉండు, ఓ నెలపాటు ఏమొచ్చినా చెప్పొద్దూ’ అన్నావు కదా... మందులు వేసుకుంటున్నాను కదా, ఏవో చిన్నచిన్నవి వస్తూనే ఉంటాయి. అసలే ఆఫీసు గొడవలతో పాపం పొద్దున పోయి రాత్రి వస్తున్నావు. కోడలు కూడా ప్రసవానికి పుట్టింటికి వెళ్ళడంతో ఇంటిపనులూ కొన్ని నీకు తప్పడం లేదు. అలాంటప్పుడు నిన్ను విసిగించకూడదనుకున్నాను. అంతేకానీ నాకింత సీరియస్‌ అయి, నిన్ను ఇబ్బందిపెడతానని కానీ, నలుగురూ నిన్ను ఆడిపోసుకుంటారని కానీ అసలు ఆలోచించక నిన్ను బాధపెట్టాను. మనసులో పెట్టుకోకు నాన్నా’’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తల్లి మాటలు విన్న శ్రీనివాస్‌ కరిగి నీరైపోయాడు. ఇక దుఃఖం ఆపుకోలేక తల్లి రెండు చేతులనూ తన మొహానికి అదుముకుని వెక్కివెక్కి ఏడ్చేశాడు. కాసేపటికి తేరుకుని ‘‘అమ్మా, నాకెక్కడిదమ్మా మనసు. ‘ఏరు దాటాక తెప్ప తగలేశానన్నట్టు’- నిన్నూ నీ ప్రేమనీ మర్చిపోయి, ఆఫీసు టెన్షన్‌ అనీ అదనీ ఇదనీ నీ అనారోగ్యాన్ని పట్టించుకోకుండా నీకీ పరిస్థితి తీసుకొచ్చాను. కానీ, అదేమీ పట్టించుకోకుండా ఇంకా నేనేదో నీ వలన బాధపడ్డాననీ నాకేదో కష్టం కలిగిందనీ నువ్వు బాధపడుతున్నావ్‌ చూడు... నీది అమ్మా మనసు, తల్లి మనసు. నువ్వే నన్ను క్షమించాలి’’ అన్నాడు. 
‘‘అంత పెద్ద మాటలెందుకు నాన్నా... చిన్నతనంలో నేను నీ తల్లినీ నువ్వు నా కొడుకువీ. నా ప్రేమ పరిమితం. 
అందులో ఎవరికీ భాగం లేదు. నేను అప్పటి తల్లిగానే ఉండిపోయాను. కానీ నువ్వు- కొడుకుగా, ఆ తర్వాత ఉద్యోగస్తుడిగా, నిన్ను నమ్ముకుని వచ్చిన ఓ స్త్రీకి భర్తగా, పిల్లల బాధ్యత వహించే తండ్రిగా... అంచెలంచెలుగా ఎదిగి అందరికీ నీ ప్రేమను సమపాళ్ళలో పంచి ఇస్తూ, అందరికీ సమన్యాయం చెయ్యాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించే స్థాయికి చేరుకున్నావ్‌. ఈ బాధ్యతను నిర్వర్తించటంలో నీకు ఎన్నో సవాళ్ళూ చికాకులూ ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో నేను ఏదైనా తెలిసో తెలియకో చేసే పొరపాట్ల వలన నీకు కష్టం కలగవచ్చు. నా చేతులతో పెంచినదాన్ని... నీ మనసు నాకు తెలియదా. నువ్వు చికాకులో ఏదన్నా అన్న మాటని నేను మనసులో పెట్టుకుని బాధపడతానని ఎందుకనుకున్నావు నాన్నా. అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు’’ అంటూ కొడుకు చెంపలు నిమిరింది ప్రేమగా. 
తల్లి మాటలు విన్న శ్రీనివాస్‌కి- ‘ఈ ఒక్క అనారోగ్యం అన్న మాటేమిటి, చాలాసార్లూ చాలా విషయాల్లో ఆఫీసుకి వెళ్ళే తొందరలో ఉన్నాననో, అటు ఆఫీసు నుంచి వచ్చిన అలసట అనో లేకపోతే టైమ్‌కి టిఫిన్‌ పెట్టలేదనో అమ్మకు ఆ విషయంలో సంబంధమున్నా లేకపోయినా కూడా ఎన్నోసార్లు తను అమ్మమీద చీటికీ మాటికీ విసుక్కోవడం గుర్తొచ్చింది. అంతే, తనలో తనే కుంచించుకుపోయాడు. ‘ఎన్నోసార్లు నిన్నూ నీ మనసునీ గుర్తించక, నా స్వార్థంతో నిన్ను నిర్లక్ష్యం చేసినా కూడా, తప్పెంచకుండా దానిలో కూడా ప్రేమని మాత్రమే వెతుక్కున్నావ్‌. తల్లి మనసుని నాకు తెలియ చేశావ్‌, నీ ప్రేమ పరిమితమంటావేంటమ్మా... అపరిమితం, నిష్కల్మషం. నాకు అంతులేని ప్రేమని ఇచ్చినదానివి, నేను నీకేం ఇచ్చుకోగలనమ్మా’ అని మనసులో అనుకుంటూ ఆప్యాయంగా తల్లి నుదుటిని ముద్దాడాడు. తర్వాత ‘నీకూ ఎంతో పని ఒత్తిడీ, ఎన్నో చికాకులూ ఉన్నా అన్నిటిమధ్యా కూడా నన్ను చిన్నప్పుడు కంటికిరెప్పలా ఎలా చూసుకున్నావో, ఇకనుంచైనా నేనూ నిన్ను అలాగే చూసుకోవడానికి ప్రయత్నిస్తానమ్మా’’ అంటూ తేలికైన మనసుతో చిన్నప్పటి శ్రీనులాగా ఆప్యాయంగా తల్లి చేతులను మొహానికి అదుముకున్నాడు శ్రీనివాస్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.