close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అరచేతిలో వేడుక చూద్దాం!

ఆ రెండు చేతుల్లోకీ తొంగి చూస్తే... పసిబిడ్డను ఉయ్యాల్లో వేసి ఊపుతున్న అమ్మ కనిపిస్తుంది. రాఖీ పండగను జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్లు దర్శనమిస్తారు. ఇంకా పెళ్లిలో దండలు మార్చుకుంటున్న వధూవరులూ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న చిన్నారీ... ఇలా ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. ఎలా అంటే... మనం ఏ వేడుక జరుపుకుంటే ఆ చిత్రాలు మెహందీగా చేతులమీదికెక్కడం ఇప్పటి ఫ్యాషన్‌ మరి.

ఆడపిల్లలదీ గోరింటాకుదీ విడదీయరాని బంధం. అటు అందం ఇటు సంప్రదాయం రెండూ కలగలిసిన ఆ గోరింటాకుకు పండగలూ పెళ్లి వేడుకల్లో విశిష్ట స్థానం ఉంది. ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. అట్లతద్దికీ గోరింటాకు పెట్టుకోవడం ఓ సంప్రదాయం. ఇక, పెళ్లిలో అయితే మెహందీ ఫంక్షన్‌ అంటూ పెళ్లి కూతురికీ ఇతర బంధువులకూ మెహందీ వెయ్యడాన్ని ప్రత్యేకమైన వేడుకగా చేస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎర్రగా పండి, చేతుల్ని ముస్తాబు చేసే మెహందీ ఈతరం అమ్మాయిలు ఎంతో ఇష్టంగా అనుసరిస్తున్న ఫ్యాషన్‌. ఒక్క పెళ్లికనే కాదు, చిన్నా పెద్దా వేడుకలన్నిటికీ ముద్దుగుమ్మలు చేతుల్ని గోరింటాకుతో అలంకరించేస్తున్నారంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే, దీన్లో రోజుకో కొత్త ట్రెండ్‌ పుట్టుకొస్తూనే ఉంది.

రకరకాల పూల డిజైన్లతో మొదలైన ఈ ఫ్యాషన్‌ అరచేతిని దాటి మోచేతి వరకూ పాకింది. తరవాత ఆ డిజైన్లు కాస్తా చూడచక్కని బొమ్మలు వేసే వరకూ వెళ్లింది. వధూవరుల ముఖాలను మెహందీగా వెయ్యడమూ అందులో భాగంగా వచ్చిందే. ఇప్పుడేమో ఏకంగా మనం చేసుకునే ఫంక్షన్‌ని ప్రతిబింబించేలా ఆ దృశ్యాలను డిజైన్లుగా చేతుల్లో దిద్దేస్తున్నారు.

ఉదాహరణకు ఇంట్లో బుజ్జిపాపకు ఉయ్యాల వేస్తున్నారనుకోండీ అమ్మ ఆ పాపను ఊయల్లో వేసి ఊపుతున్నట్లున్న దృశ్యాన్ని చేతుల్లో మెహందీ డిజైన్‌గా వేస్తున్నారు. అమ్మతోపాటు ఆ వేడుకలో పాల్గొనే దగ్గరి బంధువులూ ఈ డిజైన్లను చేసుకుంటున్నారు. అదే సీమంతం వేడుక జరుగుతుందనుకోండీ గర్భవతినీ పక్కనే ఆమె భర్తనీ మరో చేతిలో పుట్టబోయే చంటిబిడ్డ చిత్రాన్నీ ఆ పాపాయి దుస్తుల్నీ డిజైన్‌గా వేస్తారు. ఇలాగే రాఖీ పండగ కోసం వేడుక చేసుకుంటున్నట్లున్న అన్నాచెల్లెళ్ల బొమ్మల్నీ కర్వాచౌత్‌ పండగకు జల్లెడలోంచి చంద్రుడిని చూస్తున్న మగువల చిత్రాలనూ నిశ్చితార్థం, పెళ్లి వేడుకలకైతే అందుకు సంబంధించిన రకరకాల దృశ్యాలనూ అరచేతిలో పండేలా చేస్తున్నారు మెహందీ ఆర్టిస్టులు. అదండీ సంగతి... ఇంతకీ వీటిలో మీకే డిజైన్‌ నచ్చింది..?

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు