close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దాత్రి... ఓ ప్రాణదాత!

ఓ అనుభవం... అతనికి ప్రాణం విలువ తెలిపింది. ఆలోచనలో పడేసింది. మంచి పనికి నాంది అయింది. దేశవ్యాప్తంగా మూలకణాల గ్రహీతలకు దాతలను అందిస్తోంది. ఇంతకీ ఏంటా అనుభవం, ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా... అయితే చదివేయండి!

అది 2003... 
‘ఒరేయ్‌... వెంటనే ఆసుపత్రికి వచ్చేయ్‌’ అంటూ రఘు రాజగోపాల్‌కి ఓ ఫోన్‌ వచ్చింది. ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్న రఘు అన్నీ పక్కనపెట్టి పరుగున ఆసుపత్రికి వెళ్లాడు. తనకు కాబోయే భార్యకు బ్లడ్‌ క్యాన్సర్‌ అనీ, మూలకణాల మార్పిడికి దాత కావాలనీ స్నేహితుడు బాధతో చెప్పాడు. ఇద్దరూ కలిసి అమెరికాలోని ఆసుపత్రులెన్ని గాలించినా ఆమెకి నప్పే మూలకణాలున్న దాత దొరకలేదు. ఓ వారం తరువాతలండన్‌లో దాత ఉన్నట్టు తెలియడంతో ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. ఆ సమయంలోనే  అభివృద్ధి చెందిన అమెరికాలోనే ఇలా ఉంటే భారతదేశంలో రోగుల పరిస్థితి ఎలా ఉందో అనిపించింది. 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు చెన్నైలో వాలిపోయాడు.  మూలకణాలిచ్చే దాతల్ని ఒక వేదికపైకి తెచ్చి రోగులకు సాయపడాలనుకున్నాడు.

ఆ వైద్యుల అండతో.... 
బిట్స్‌ పిలానీలో ఐటీ చదువుకున్న రఘు వైద్యుల్ని సంప్రదించి, నెట్‌ ద్వారా మూలకణాల గురించి తెలుసుకున్నాడు. హెచ్‌ఎల్‌ఏ(హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటీజెన్‌) రక్తంలో ఉండే ఓ ప్రొటీన్‌. లాలాజలాన్ని పరీక్షించి రోగుల రక్తంలోని హెచ్‌ఎల్‌ఏ ఇతరుల రక్తంలోని హెచ్‌ఎల్‌ఏతో మ్యాచ్‌ అవుతుందో లేదో చూస్తారు. అలా మ్యాచ్‌ అయిన వారి మూలకణాలు తీసి రోగులకు ఇస్తారు. ఈ పరీక్ష ఖరీదు 16 వేల రూపాయలు. ఈ క్రమంలో రఘుకి అమెరికాలో హెచ్‌ఎల్‌ఏకు సంబంధించి పరిశోధనలు చేసే ‘హిస్టోజెనిటిక్స్‌’ ల్యాబ్‌ గురించి తెలిసింది. దాని వ్యవస్థాపకులైన డాక్టర్‌ నెఝిహ్‌ సెరెబ్‌, డాక్టర్‌ సూ యంగ్‌ యాంగ్‌లను కలుసుకొని మూలకణాల దాతల్ని గుర్తించి, ఆ కణాలను సేకరించి అవసరమున్న వారికి అందించాలనుకుంటున్నట్టు చెప్పాడు రఘు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి పని మొదలుపెడితే, ఆర్థికంగా సాయం చేయడంతోపాటు ఉచితంగా హెచ్‌ఎల్‌ఏ పరీక్షలూ చేసి పంపుతామని నెఝిహ్‌, సూయంగ్‌లు హామీ ఇచ్చారు.

అపోహలు తొలగిస్తూ... 
2009లో ‘దాత్రి’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు రఘు. దాత్రి గురించి దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సమాచారమిచ్చి మూలకణాలు కావల్సిన వారిని సంప్రదించమని కోరాడు. అలా పలువురు రోగులు రిజిస్టర్‌ చేసుకున్నా తొలి రెండేళ్లలో దాతలు మాత్రం దొరకలేదు. 2011లో తొలిసారి మూలకణాల మార్పిడి జరిగింది. ఒకసారి పదేళ్ల బాలుడికి మూలకణాల మార్పిడి చేయాల్సొచ్చింది. ఒకమ్మాయి హెచ్‌ఎల్‌ఏ ఆ పిల్లాడికి నప్పుతుందని తెలిసి ఆమె కాలేజీ అడ్రస్‌కి వెళ్లాడు. తీరా వెళ్లాక ఆమె చదువు మానేసిందని ఇంటి అడ్రస్‌ ఇచ్చారు. ఇంటికి వెళితే ఆమెకి పెళ్లైందని తెలిసింది. ఆమె అడ్రస్‌ అడిగితే తల్లి చెప్పలేదు. చివరికి ఓ ఆటోడ్రైవర్‌ సాయంతో ఆ అమ్మాయి వివరాలు కనుక్కొని వెళితే అత్తారింట్లో అభ్యంతరం చెప్పారు. దాదాపు వారంపాటు రఘు వాళ్లింటి చుట్టూ తిరిగి ఆ అమ్మాయిని ఒప్పించి మూలకణాలు సేకరించి పసిపిల్లాడి ప్రాణాలు నిలబెట్టాడు. గత పదేళ్లలో రఘుకి ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. ఇప్పటి వరకూ దాత్రి ద్వారా 546 మూలకణ మార్పిడి చికిత్సలు జరిగాయి. నాలుగు లక్షల పైచిలుకు దాతలూ, రెండువేల మంది రోగులూ ఈ సంస్థలో నమోదై ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాత్రి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, నటులు సుహాసిని, ప్రసన్న, ఆర్య, దుల్కర్‌ సల్మాన్‌, అనుపమ పరమేశ్వరన్‌, అనన్య, గాయకుడు శంకర్‌మహదేవన్‌, మోడల్‌ మిలింద్‌సోమన్‌ వంటివారూ దాతలుగా చేరారు. ఈ మధ్య హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో 14వేలమంది విద్యార్థులు ఒకేరోజు దాతలుగా పేర్లు నమోదు చేసుకోవడం గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.

మూలకణాలు ఎవరికి అవసరం 
బ్లడ్‌ క్యాన్సర్‌, థలసీమియా, అప్లాస్టిక్‌ అనీమియా, ఇమ్యూనోడెఫిషియన్సీ, సికెల్‌ సెల్‌... వంటి రక్తానికి సంబంధించిన వందరకాల అనారోగ్యాలను మూలకణాల మార్పిడితో సమూలంగా దూరం చేసుకోవచ్చు. ‘పద్దెనిమిది నుంచి యాభైఏళ్ల లోపు వారి మూలకణాలను చేతి నుంచే తీస్తారు. ముందుగా దాతలకు మూలకణాల వృద్ధికోసం ప్రొటీన్‌ ఇంజెక్షన్‌ ఇస్తారు. ఐదు రోజుల తర్వాత ఎముక మజ్జలోని మూలకణాలు కూడా రక్తంలో కలిసిపోతాయి. అప్పుడు ఆధునిక టెక్నాలజీతో రక్తం నుంచి మూలకణాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన టెంపరేచర్‌ పౌచ్‌లో భద్రపరుస్తారు. మూడు రోజుల్లోపు రోగికి మార్పిడి చేయాల్సి ఉంటుంది’ అంటారు రఘు సంతృప్తితో కూడిన స్వరంతో. మూలకణ దాతలకోసం ఎదురుచూస్తున్న వారికి రఘు ఆత్మబంధువు. మరింత మందికి కొత్త జీవితమివ్వాలని అడుగులు వేస్తున్న రఘుని మనమూ అభినందిద్దామా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.