close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేపపువ్వు... తింటూనే ఉండండి!

వేపపువ్వు అంటే ఉగాది పచ్చడిలో వేసుకోవడానికేగా అనుకుంటాం. కానీ అందులోని చేదు... ఎన్నో రోగాలకీ సమస్యలకీ మందు. కాబట్టి ఈ కాలంలో వచ్చే వేపపువ్వుని ఎండబెట్టి నిల్వ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

* వేపపువ్వు సహజ యాంటీబయోటిక్‌. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ ఎక్కువే. ఎండబెట్టిన పొడిని కషాయం లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల కామెర్లు, మధుమేహం, ఊబకాయం, అజీర్తి, వికారం, గ్యాస్‌ సమస్యలు, క్షయ, దగ్గు, జలుబు, జ్వరం, నోటిపుండ్లు... ఇలా ఎన్నో వ్యాధుల్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలనీ నులిపురుగుల్నీ కూడా తొలగిస్తుంది. క్యాన్సర్లు రాకుండానూ చేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. వేపపువ్వుకి కొవ్వునీ పొట్టనీ కరిగించే గుణం కూడా ఉంది. ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. కళ్లసమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకునో లేదా చారుల్లో కూరల్లో వేసుకునో... ఎలా తిన్నా మేలేనట.
* ఈ పొడిని పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ తొలిగిపోవడంతోబాటు కాలేయం శుభ్రపడుతుంది. రక్త ప్రసరణ బాగుంటుంది. వేపపువ్వు సహజ కాంట్రాసెప్టివ్‌. ఇందులోని ఆల్కహాలిక్‌ గుణాలు అండం విడుదలను అడ్డుకుంటాయి. 
* ఈ పొడిని తేనెలో కలిపి గాయాలూ పొక్కులమీద రాసినా, నూనెలో కలిపి బ్లాక్‌హెడ్స్‌మీద రాసినా అవి క్రమంగా తగ్గిపోతాయి. చర్మంమీద దద్దుర్లు, పొక్కుల్లాంటివి వస్తే కాసిని వేపాకుల్లో పూలు కలిపి మెత్తగా నూరి రాస్తే ఇన్ఫెక్షన్లు క్రమంగా తగ్గుతాయి. 
ఈ పేస్టుని క్రమం తప్పకుండా తలకి పట్టించి తలస్నానం చేయడం వల్ల దురద, చుండ్రు తగ్గుతాయి. 

* ఈ పూల పొడిని ఏదైనా నూనెల్లోనో లేదా క్రీముల్లోనో కలిపి రాసుకుంటే ఆ వాసనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వేపపువ్వుని ఏడాది పొడవునా తింటూనే ఉండండి!


నిద్ర... 8 గంటలు ఎందుకు? 

రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు- తక్కువలో తక్కువ ఆరు గంటలైనా నిద్రపోవాలని అంటుంటారు. కానీ ఎనిమిదికీ ఆరు గంటల నిద్రకీ చాలా తేడా ఉంటుందట. ఎందుకంటే శరీరంలో తేమశాతాన్ని నియంత్రించే హార్మోన్‌ విడుదలకీ నిద్రకీ సంబంధం ఉందని పెన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆరు గంటలే నిద్రపోయే వాళ్లలో జీవగడియారం దెబ్బతినడంతో వాసోప్రెసీన్‌ అనే హార్మోన్‌ విడుదల సరిగ్గా ఉండదు. దాంతో వీళ్లు 8 గంటలపాటు నిద్రపోయేవాళ్లకన్నా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడంతో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. అదే ఎనిమిది గంటలపాటు నిద్రపోయేవాళ్లలో వాసోప్రెసీన్‌ విడుదల సరిగ్గా ఉండటంతో- శరీరం నీటిని నిల్వచేసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా వీళ్లు మధ్యలో ఎక్కువగా లేవాల్సిన అవసరమూ ఉండదు. శరీరమూ డీహైడ్రేషన్‌కి గురికాకుండానూ ఉంటుంది. 



 సైక్లింగ్‌ ఎంతో మేలు! 

బరువు తగ్గడం కోసం నడక, పరుగు, ఏరోబిక్స్‌... ఇంకా ఇతరత్రా జిమ్‌ వ్యాయామాలు ఎన్నో చేస్తోంది నేటి తరం. కానీ ఊబకాయాన్ని తగ్గించడంతోబాటు శారీరకంగానూ మానసికంగానూ ఫిట్‌గా ఉంచే సైక్లింగ్‌ని మాత్రం మరిచిపోయింది అంటున్నారు టెక్సాస్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. పైగా సైకిల్‌ తొక్కడాన్ని పిల్లలూ పెద్దలూ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి చేత్తో తీసినట్లుగా పోవడంతోబాటు క్యాలరీలూ తగ్గిపోతాయి. అదేసమయంలో గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటి జబ్బుల్నీ దూరంగా ఉంచుతుంది. పైగా స్నేహితులతో కలిసి సరదాగా రైడ్‌కి వెళ్లినట్లూ ఉంటుంది. అయితే రోడ్డుమీద సైక్లింగ్‌ చేసినదానికీ కొండల్లో తొక్కినదానికీ తేడా ఉంటుంది. కొండల్లో తొక్కినప్పుడు కాళ్లే కాదు, మొత్తం శరీరం కదులుతుంటుంది కాబట్టి త్వరగా బరువు తగ్గుతారట. అదీగాక చుట్టూ చెట్లు ఉండే ప్రదేశాల్లో తొక్కడం వల్ల మానసికంగానూ ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు సదరు నిపుణులు. 


ప్రేమతో సాధ్యమే! 

తాగేవాళ్లచేత ఆ అలవాటును మాన్పించడం ఓ పట్టాన సాధ్యం కాదు. అయితే రకరకాల మందులూ, చికిత్సల వల్ల కాని పని ప్రేమకు కారణమైన ఆక్సీటోసిన్‌ హార్మోన్‌తో సాధ్యమవుతుంది అంటున్నారు అమెరికాలోనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కి చెందిన పరిశోధకులు. ప్రేమకీ ఆనందానికీ కారణమైన ఆక్సీటోసిన్‌ సామాజిక బంధానికీ ప్రత్యుత్పత్తికీ కూడా తోడ్పడుతుందని గుర్తించారు. దాంతో నేసల్‌ స్ప్రే రూపంలో ఆక్సీటోసిన్‌ను ఇవ్వడం వల్ల అది ఓ మత్తులా పనిచేస్తుందట. ఫలితంగా మత్తుమందులూ ఆల్కహాల్‌ జోలికి వెళ్లరని సదరు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరిని ఎంపికచేసి వాళ్లు ప్రతిరోజూ ఆక్సీటోసిన్‌ నేసల్‌ స్ప్రేను పీల్చేలా చేశారట. దీనివల్ల వాళ్లలో ఆల్కహాల్‌ తాగాలన్న కోరిక క్రమేణా తగ్గిపోయినట్లు గుర్తించారు. దీన్నిబట్టి- తాగుడు వ్యసనానికి గురయిన వాళ్లు  ప్రేమలో పడటం లేదా ఆటలాడటం వంటివి అలవాటు చేసుకోగలిగితే అందులో వచ్చే కిక్‌తో ఆనందాన్ని పొందగలుగుతారు, తద్వారా తాగాలన్న కోరికా క్రమంగా పోతుంది అంటున్నారు పరిశోధకులు. 


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.