close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మలు... అలా... వ్యాపారవేత్తలయ్యారు!

విదేశీ విశ్వవిద్యాలయాల్లో పెద్ద చదువులూ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉన్నత హోదాలూ బోసినవ్వు ముందు బలాదూర్‌ అయ్యాయి. పిల్లలకోసం తీసుకున్న కెరీర్‌ బ్రేక్‌ కాస్తా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి కొత్త అవతారం ఎత్తేలా చేసింది. బిడ్డలకు దగ్గరగా ఉండాలని కొందరూ, పిల్లలను పెంచే క్రమంలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం మరి కొందరూ... కొత్తకోణంలో ఆలోచించారు. తమ చదువులతో సంబంధంలేని రంగాలవైపు అడుగులువేసి, వ్యాపారవేత్తలుగానూ శభాషనిపించుకుంటున్నారు.

కొడుకు కోసం కొత్త దారిలో... 


 

అభిమానికా తవి... అందరూ తండ్రి పేరునో, భర్త పేరునో తమ పేరు చివర పెట్టుకుంటారు. అభిమానిక తన కొడుకు తవీష్‌ పేరు కలిపి రాసుకుంటుంది. ‘అవును, ఇప్పుడు నేనిలా ఉన్నానంటే అందుకు వాడే కారణం. తండ్రిలా నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపాడు. మొదటిసారి వాడిని వదిలి పదిహేనురోజులు మిసెస్‌ ఇండియా పోటీలకు వెళ్లడానికి నేను బాధపడుతోంటే ‘నాకేం ఫర్వాలేదు, నువ్వు జాగ్రత్తగా వెళ్లిరా అమ్మా’ అని ధైర్యం చెప్పి పంపించాడు’ అని చెప్పే అభిమానిక జీవితాన్ని ఓ మలుపు తిప్పింది ఆమె కొడుకే. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన అభిమానిక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా పెళ్లయింది. కొడుకు పుట్టాక ఆ ఉద్యోగం మానేసింది. అయితే అప్పటివరకూ ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో కుదుపులు మొదలయ్యాయి. ఊహించని విధంగా బరువు పెరగడమూ, బాబు బాధ్యతలూ, ప్రసవానంతర కుంగుబాటుకు దారి తీయడంతో పాటు అదే సమయంలో విడాకుల పర్వాన్నీ ఎదుర్కొనవలసి వచ్చింది. తన బతుకు తాను బతుకుదామంటే ఉద్యోగమూ లేదు. కానీ, కొడుకు కోసమే బతకాలనుకుంది. పట్టుదలగా కృషిచేసి ఆరోగ్యాన్నీ ఆకృతినీ అదుపులోకి తెచ్చుకుంది. చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న శాస్త్రీయ నృత్యాన్నీ, తాను సరదాగా నేర్చుకున్న మోడ్రన్‌ డాన్సుల్నీ గుర్తుచేసుకుని ఓ డాన్స్‌ స్కూలుతో తనకాళ్ల మీద తాను నిలబడటం మొదలెట్టింది. ‘చక్కగా మోడల్‌లా ఉన్నావు మిసెస్‌ ఇండియా పోటీలో పాల్గొన’మని స్నేహితులు సలహా ఇస్తే ఫొటోలు పంపించింది. అలా మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి విజయాల వరకూ కొనసాగింది. ఆ విజయాలకు తోడు మోడలింగ్‌ అవకాశాలు అభిమానిక ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దాంతో తన పేరిట ఎంటర్‌టైన్‌మెంట్‌ కాన్‌సెప్ట్స్‌ కంపెనీని ప్రారంభించింది. పెళ్లి సంగీత్‌లకు డాన్స్‌ కొరియోగ్రఫీతో మొదలెట్టిన ఈ సంస్థ ఇప్పుడు పూర్తిస్థాయి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా విజయపథంలో దూసుకుపోతోంది. 


ఐబీఎంలో ఉద్యోగం వదిలి... 

దిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివిన మీతా శర్మా గుప్తా హార్వర్డ్‌లో పీహెచ్‌డీ చేసింది. బెల్‌ లేబొరేటరీస్‌లో, ఐబీఎంలో ఉద్యోగం చేసింది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయ్యేదాకా ఆమె ఉద్యోగం మానేస్తానని కానీ, వ్యాపారం చేస్తానని కానీ కలలో కూడా అనుకోలేదు. ఉద్యోగరీత్యా అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చేసరికి ఆమె రెండో కొడుక్కి ఏడాది వయసు. అక్కడ ఉండగా పెద్ద కొడుకు ఎక్కువగా కలపతో సహజ వర్ణాలతో తయారైన బొమ్మలతోనే ఆడుకునేవాడు. రెండో అబ్బాయికీ అలాంటి బొమ్మలే కొనాలని చూసిన మీతాకి అలాంటి సురక్షితమైన బొమ్మలు ఇక్కడ దొరకనేలేదు. దొరికేవన్నీ యాంత్రికంగా ఉన్నవీ, పిల్లల్లో సృజనకి ఏమాత్రం తోడ్పడనివీ కావడంతో ఆమెకు అవి కొనాలంటే చిరాకేసేది. దాంతో అమెరికా వెళ్లినప్పుడల్లా బొమ్మలు కొనుక్కొచ్చేది. అవి చూసిన సహోద్యోగులూ బంధువులూ ‘ఇవి బాగున్నాయి, ఎక్కడ దొరుకుతాయి, మాకూ తెచ్చిపెడతావా’ అని అడిగేవారు. ఉద్యోగం వల్ల పిల్లల్ని వదిలి తరచూ తిరగాల్సిరావడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఆటబొమ్మల గొడవ ఆమెలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఆ బొమ్మలేవో తానే తయారుచేయించి వ్యాపారం ప్రారంభిస్తే పిల్లల దగ్గరే ఉండొచ్చు కదా అనుకుంది. అంతే, ఉద్యోగం మానేసి ‘షుమీ టాయ్స్‌’ కంపెనీ పెట్టింది. 
ఒక ఏడాది పాటు పరిశోధన చేసి పిల్లలకీ, పర్యావరణానికీ ఏమాత్రం హాని చేయని బొమ్మల్ని తయారుచేయడం ప్రారంభించింది. తయారైన ప్రతి బొమ్మనీ ముందు తన పిల్లలకిచ్చి అది అన్ని విధాలుగానూ సురక్షితమేనని నమ్మకం కలిగాకే వ్యాపారరీత్యా ఉత్పత్తి చేసేది. సొంత నిధులతోనే సంస్థను ప్రారంభించిన మీతా వ్యాపారం కొద్ది కాలంలోనే నిధుల సేకరణకు వెళ్లే స్థాయికి విస్తరించడం విశేషం. 


తనలాంటి అమ్మల కోసం..! 

బెంగళూరులో పుట్టిపెరిగిన నేహా అమెరికాలోని ప్రఖ్యాత వార్టన్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. చదువైపోగానే బెంగళూరు వచ్చి అమెరికా వెళ్లే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థని పెట్టింది. అది బాగా నడుస్తుండగానే పెళ్లి చేసుకుని ముంబయి వెళ్లిన నేహా మెట్టినింటివారి బయోఫార్మా కంపెనీలో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ వ్యవహారాల బాధ్యత చూసుకునేది. మొదటి కాన్పు కోసం మూడు నెలలనుకున్న లీవు కాస్తా మలికాన్పు కారణంగా ఐదేళ్లయిపోయింది. రెండో కొడుక్కి కూడా ఆర్నెల్లు వచ్చాక ఓ రోజు తనని తాను పరిశీలనగా చూసుకున్న నేహా ఉలిక్కిపడింది. ‘ఇలా ఉన్నానేమిటి, నా గురించి నేనే నిర్లక్ష్యం వహిస్తే ఇక పిల్లల్ని ఎలా చూసుకోగలను’ అనుకున్న నేహా తాను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఉద్యోగంలో చేరడమే మార్గం అనుకుని ఆ మర్నాడే వెళ్లి పాత ఉద్యోగంలో చేరిపోయింది. సొంత కంపెనీ కాబట్టి చేరాలనుకోగానే ఉద్యోగమూ కావలసినప్పుడు ఇంటికెళ్లిపోయే వెసులుబాటూ తనకి ఉన్నాయి కానీ అందరికీ అలా కుదరదు కదా- అన్న ఆలోచన వచ్చింది ఒకరోజు నేహాకి. ఒకసారి బ్రేక్‌ తీసుకున్నాక మహిళలకు మళ్లీ ఉద్యోగం దొరుకుతుందా, అవసరమైనప్పుడు సెలవు దొరుకుతుందా- అన్న తన సందేహాల గురించి చాలామందితో మాట్లాడింది. అది ఎంత కష్టమో తెలియగానే నేహాలోని తల్లి మనసు సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ‘జాబ్స్‌ఫర్‌హర్‌’ పేరుతో ఆన్‌లైన్‌ వేదికను రూపొందించింది. కెరీర్‌ బ్రేక్‌ తీసుకుని మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్న మహిళలనూ, వారికి ఉద్యోగావకాశాలను ఇచ్చే కంపెనీలనూ కలుపుతుంది ఈ వేదిక. తనలాగే కెరీర్‌ని పునఃప్రారంభించిన మరో ఐదుగుర్ని కలుపుకుని ఒక చిన్న కార్యాలయం అద్దెకు తీసుకుని సొంత వ్యాపారం మొదలెట్టిన నేహా దగ్గర ఇప్పుడు 50 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఎన్నో కంపెనీలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా వచ్చిన మహిళలకు ఉద్యోగాలిస్తున్నాయి. ఏటా 10 రెట్ల చొప్పున తన ఆదాయం పెరుగుతోందంటే ఈ అవసరం ఎంతగా ఉందో చూడండంటున్న నేహా ఫోర్బ్స్‌ 2018 విమెన్‌ పవర్‌ ట్రెయిల్‌బ్లేజర్స్‌లో స్థానం పొందింది. 

 


తన పిల్లలకోసం మొదలెట్టి... 

పిల్లల్ని స్వదేశంలో బంధువుల మధ్య పెంచాలన్న కోరికతో అమెరికా నుంచి భారత్‌కి తిరిగివచ్చారు శాలిని విజ్‌ దంపతులు. ఇక్కడికి వచ్చాక ఆమె ఆరోగ్యం దెబ్బతింది. అదే సమయంలో చిన్న కొడుక్కీ ప్రవర్తనాపరమైన సమస్య ఉన్నట్లు తెలిసింది. దాంతో చుట్టుపక్కల పిల్లలతో కలిసి బయట ఆడుకోవడానికి వీలయ్యేది కాదు. అమెరికాలో పిల్లలు ఆడుకోవటానికి మంచి సౌకర్యాలుండేవి. దిల్లీలో అలాంటివి లేకపోవటంతో తల్లీ పిల్లలు కాసేపు సరదాగా గడిపేందుకు తగిన చోటు లేక ఇబ్బందిపడేవారు. ఆ పరిస్థితుల్లో పిల్లల కోసం ఏదైనా చేయడం తప్పనిసరి అనుకున్న శాలిని పార్కులకూ పాఠశాలలకూ వెళ్లి పలువురు తల్లులతో మాట్లాడింది. తనలాగే చాలామంది భావిస్తున్నారని తెలిశాక మనసులో ఉన్న ఆలోచనకు, అమెరికాలో చూసిన అనుభవం తోడు కాగా ‘హ్యాంగవుట్‌’కి పునాది వేసింది. విశాలమైన ఆవరణలో అన్ని సౌకర్యాలతో పిల్లలూ పెద్దలూ సరదాగా గడిపే చోటుగా దాన్ని తీర్చిదిద్దింది. అక్కడ పెద్దలు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకోవచ్చు. పిల్లలు ఆడుకోవచ్చు. రకరకాల థీమ్‌లతో పార్టీలు చేసుకోవచ్చు. దాన్ని వ్యాపారసంస్థ అనే కన్నా తన పిల్లలకోసం ఆమె స్వయంగా తీర్చిదిద్దుకున్న ఆటస్థలం అంటే సరిగ్గా సరిపోతుంది. దాంతో కొద్దిరోజుల్లోనే పిల్లల పుట్టినరోజు కార్యక్రమాల్లాంటివి నిర్వహించుకోవడానికి అందరూ ఇష్టపడే హాట్‌స్పాట్‌ అయిపోయింది ‘హ్యాంగవుట్‌’. అమెరికాలో ఎంబీఏ చేసిన శాలిని పిల్లలకోసం సైకాలజీ చదివింది. స్వయంగా శిక్షణ ఇచ్చి మరీ సిబ్బందిని నియమిస్తుంది. దిలీ,్ల గురుగ్రామ్‌లలో శాఖలున్న హ్యాంగవుట్‌ ఓ పక్క లాభాలు తెచ్చిపెడుతూ మరోపక్క దేశంలోనే బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌గా అవార్డులూ పొందింది. ‘దీని పుణ్యమా అని నా ఆరోగ్యమూ కుదుటపడింది. నేను కష్టపడినందుకు పిల్లలు చక్కగా ఆడుకుంటూ పెద్దవాళ్లవుతున్నారు, అదే చాలు’ అంటుంది శాలిని. 


అమ్మకు వచ్చిన ఆలోచన! 

బెంగాలీ అమ్మాయిలు సాధారణంగా వ్యాపారం జోలికి వెళ్లరు, తాను వెళ్తానని శుచి కూడా అనుకోలేదు. హరియాణాలో పుట్టి పెరిగిన శుచి కేంబ్రిడ్జి, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లలో చదువుకుంది. స్కైప్‌, ఈబే లాంటి పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేసింది. అలా కెరీర్లో పైపైకి ఎదుగుతుండగానే పెళ్లయింది. పిల్లల కోసం కెరీర్‌ బ్రేక్‌ తీసుకుంది. మొదట పాప పుట్టింది. తర్వాత బాబు కడుపులో ఉండగా ఓరోజు విశ్రాంతిగా కూర్చుని ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ తిరగేస్తున్న శుచికి ఓ ప్రకటనలోని నగ చాలా నచ్చింది. దాన్ని అప్పటికప్పుడు మెడలో పెట్టుకుని చూసుకోవాలనిపించింది. లండన్‌లో ఉంటున్నా భారతీయ డిజైన్లు ఇష్టపడే శుచి ఆన్‌లైన్‌లో ఆర్డరిద్దామని బ్రౌజ్‌ చేస్తుంటే మంచి దుస్తులూ కన్పించాయి. గర్భంతో ఉన్న తనకి అవి సరిపోతాయో లేదో తెలియలేదు. నగలైనా, దుస్తులైనా మన ఆకృతికి నప్పితేనే కదా అందం... ఇలా ఆలోచిస్తూ శుచి అందుబాటులో ఉన్న వెబ్‌సైట్లన్నీ చూసింది. అన్నిట్లోనూ ఏదో లోపం కన్పించడంతో ఆ లోపాల్ని భర్తీ చేస్తూ తానే ఒక ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ పెట్టాలన్న ఆలోచనకు వచ్చింది. ఈబేలో పనిచేసిన అనుభవంతో బాబు పుట్టేసరికల్లా స్పష్టమైన ప్రణాళిక సిద్ధంచేసుకుని, పిల్లలిద్దర్నీ తీసుకుని దిల్లీ వచ్చేసింది. తల్లిదండ్రులూ అత్తమామల సాయంతో పిల్లల్ని చూసుకుంటూనే ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ వస్తువుల ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ ‘లైమ్‌రోడ్‌’ని ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో వినియోగదారుల పాత్ర కీలకం. దుస్తుల డిజైనింగ్‌, మ్యాచింగ్‌లలో అభిరుచి ఉన్నవాళ్లు ఎవరైనా ఇందులో రిజిస్టర్‌ చేసుకుని స్క్రాప్‌బుక్‌లో తమ డిజైన్లను గీసుకోవచ్చు. రకరకాల యాక్సెసరీలను అసెంబుల్‌ చేయవచ్చు. వాటిని అమ్ముకోనూవచ్చు. ఆ డిజైన్ల ఆధారంగా తయారైన ఉత్పత్తులను వెబ్‌సైట్‌లో విక్రయిస్తారు. వినియోగదారులు కోరుకునే కొత్తదనం ఎప్పుడూ కన్పించేలా శుచి ఈ వెబ్‌సైట్‌ని రూపొందించింది. ‘చిన్నపిల్లల్ని చూసుకుంటూనే వ్యాపారాన్ని నిర్మించడం తేలికేమీ కాదు, పిల్లలు ఎలా మన సొంతమో, వ్యాపారమూ అంతే. అయినా పిల్లలతో ఎక్కువ సమయం గడపొచ్చనే వ్యాపారంలోకి వచ్చా’ అనే శుచి గ్లోబల్‌ లీడర్స్‌ అండర్‌ 40లో 
స్థానం పొందింది.


పాప పుట్టాకే తెలిసింది! 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివిన అర్పిత పెళ్లయ్యాక భర్తతో కలిసి యాడ్‌ ఏజెన్సీ నిర్వహించేది. స్వతహాగా కాస్త బొద్దుగా ఉండే ఆమె పాపాయి పుట్టాక బాగా బరువు పెరిగింది. దానికి తోడు బాలింతగా ఉన్నప్పుడు సరైన లోదుస్తుల్ని ఎంచుకోవటమెలాగో తెలియక చాలామంది మధ్య తరగతి అమ్మాయిల్లాగే ఇబ్బందిపడేది. వదులుగా ఉండే కుర్తాలూ టీషర్టులూ వేసుకుంటే ఇంకా లావుగా కన్పించేది. ఓసారి అమెరికాలో షాపింగ్‌కెళ్లినప్పుడు తమ దగ్గర అర్హత పొందిన బ్రాఫిట్టర్‌ ఉన్నారని లోదుస్తుల షాపులో ఉన్న బోర్డు చూసిందామె. ఆ బ్రా ఫిట్టర్‌ దుకాణానికి వచ్చిన మహిళలకు సరైన సైజు బ్రా ఎంచుకోవడమెలాగో చెబుతోంది. ఆమె సూచన మేరకు బ్రా ఎంచుకున్న అర్పిత అది వేసుకుని ఆశ్చర్యపోయింది. 
అప్పటివరకూ తాను ధరిస్తున్న బ్రా సైజుకీ దానికీ పొంతన లేకపోయినా సౌకర్యంగా ఉంది. అలాగే వేసుకున్నదానికన్నా తక్కువ సైజు షర్టు వేసుకోమని కూడా ఆమె సూచించింది. అలాగే వేసుకున్న అర్పిత అద్దంలో చూసుకుని నిర్ఘాంతపోయింది. ఇన్నాళ్లూ పైనుంచి కిందివరకూ ధాన్యం బస్తాలా కనిపించిన తనకు అకస్మాత్తుగా ఒక ఆకృతి వచ్చేసింది. దాంతోపాటే పోయిన ఆత్మవిశ్వాసమూ తిరిగొచ్చింది. పాపాయి తప్ప తనకిక మరో లోకం లేదనుకున్న అర్పిత ఇండియా తిరిగి రాగానే తానేం చేయాలనుకుంటున్నదీ భర్తకి చెప్పింది. లోదుస్తుల విషయంలో అవగాహనలేక ఇబ్బందిపడే తనలాంటి వారందరికీ సహాయపడాలని అమెరికా వెళ్లి బ్రాఫిట్టర్‌గానూ బ్రా తయారీలోనూ శిక్షణ పొందింది. వచ్చి సొంత వ్యాపారం ప్రారంభించింది. అయితే హైదరాబాద్‌లో ఆమె ప్రయత్నం సఫలం కాలేదు. దాంతో బెంగళూరు వెళ్లి స్నేహితులూ క్రౌడ్‌ ఫండింగ్‌ సాయంతో సొంతంగా లోదుస్తుల బ్రాండ్‌ ‘బటర్‌కప్స్‌’ని ప్రారంభించింది. పలు విదేశీ కంపెనీలకూ సరఫరా చేస్తూ ‘ద ఇండియన్‌ బ్రా లేడీ’ అన్న ప్రత్యేకత సాధించింది. మనదేశంలో శిక్షణ పొందిన ఏకైక బ్రా ఫిట్టర్‌ అర్పిత మాత్రమే. 


కూతురికోసం... 

యేల్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివిన అనూరాధారావ్‌ ఐబీఎం బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా పెళ్లయింది. తర్వాత పాపాయి పుట్టింది. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఇంటి బడ్జెట్‌ లెక్కలేయగా పాపకి వాడిన డిస్పోజబుల్‌ డైపర్ల ఖర్చే 30 వేలు తేలింది. నగరాల్లో, ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులందరూ ఇలాగే ఖర్చుపెడుతున్నారనీ అంత డబ్బూ కేవలం చెత్తబుట్టలో పడేయడమేననీ ఆలోచన వచ్చాక దాని గురించి శోధించడం మొదలెట్టింది అనూరాధ. 
డైపర్లు వందల ఏళ్లైనా భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి హాని చేస్తూ ఉంటాయని తెలిశాక ఆమెకు నిద్ర పట్టలేదు. వెంటనే ప్లాస్టిక్‌ డైపర్లు వాడడం మానేసి వస్త్రంతో చేసిన డైపర్లు దొరుకుతాయేమోనని వెతికింది. అమెరికాలో తయారైనవి ఖరీదెక్కువైతే ఇండియాలో అలాంటివి ఎవరూ తయారుచేయడమే లేదు. అవేవో తానే తయారుచేయాలనుకుంది అనూరాధ. ఉతుక్కుని మళ్లీ వాడడానికి పనికొచ్చేలా వస్త్రంతో తయారుచేసిన వాటర్‌ప్రూఫ్‌ డైపర్స్‌ అయితే పిల్లలకీ బాగుంటాయి, పర్యావరణానికీ మేలు చేసినవాళ్లమవుతామనుకున్న అనూరాధ రెండో ఆలోచన లేకుండా ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి దిగింది. అలా భారత్‌లో తొలి పర్యావరణ మిత్ర డైపర్‌ బ్రాండ్‌ ‘బంపడం’ ప్రారంభమైంది. ఒకసారి కొంటే మూడేళ్ల పాటు పనికొచ్చే వీటిని అనూరాధ అందమైన ప్రింట్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తోంది. తమ వెబ్‌సైట్‌ ద్వారానూ, ఇతర ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలోనూ వాటిని విక్రయిస్తోంది. ‘ఉద్యోగం ఇచ్చే సౌకర్యాలను వదిలి వ్యాపారంలో దిగడం కొత్తలో చాలా ఇబ్బందిగానే ఉండేది. అయితే మా పాప కోసం, ఇంకా తనలాంటి ఎందరో పాపాయిలకోసం, తల్లి భూదేవి కోసం ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాలనిపించింది’ అనే అనూరాధ తన తల్లి సహకారంతో తొలి దశ ఇబ్బందుల్ని అధిగమించింది. ఇప్పుడు పాప స్కూలుకు వెళ్లిపోతోంది కాబట్టి ఇబ్బంది లేకుండానే ఇంటినీ వ్యాపారాన్నీ నిర్వహించుకోగలుగుతున్నానంటుంది.

అమ్మ బాధ్యతలకీ, వ్యాపార బాధ్యతలకీ... ఎంతో సామ్యం.ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు. ఇరవైనాలుగ్గంటలూ కనిపెట్టుకుని ఉండాలి. ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి, తానూ ఇతరులకు సహకరించాలి. ఇవాళ్టి గురించే కాదు, రేపటి గురించీ ఆలోచించాలి. అందుకేనేమో ఈ అమ్మలందరూ వ్యాపారవేత్తలుగానూ రాణిస్తున్నారు. రెట్టింపు బాధ్యతల్ని చిరునవ్వుతో నిభాయిస్తూ కన్నబిడ్డల ఆనందంలోనూ వినియోగదారుల సంతృప్తిలోనూ... తమ కష్టాన్ని మర్చి పోగలుగుతున్నారు. ‘మామ్‌ప్రెన్యూర్స్‌’మని ప్రపంచానికి సగర్వంగా చాటుతున్నారు!  

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.