close
డబ్బుంది డాబు లేదు!
వీళ్లంతా ఆస్తుల్లో కుబేరులు. అపార సంపదలతో అందనంత ఎత్తుకెళ్లినా ఆలోచనలు మాత్రం భూమ్మీదే. సామాన్యుల్లా జీవనం సాగించడమే అందుకు నిదర్శనం. వీరి జీవితంలో ఎవరూ నమ్మలేని, అందరూ నేర్చుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

బఫెట్‌ ఫోన్‌ ధర ఎంతంటే...

గంటలు గంటలు విలువైన సమయాన్ని తినేస్తున్న స్మార్ట్‌ఫోన్‌... మనల్ని శాసించే స్థాయికి చేరుకుంది. దాని మాయలో పడిపోయామా... ఇక బయటకు రాలేం. అలాంటిది ప్రముఖ ఐఫోన్‌ సంస్థ యాపిల్‌లో 5.5% పెట్టుబడులు పెట్టిన కుబేరుడు వారెన్‌ బఫెట్‌ స్మార్ట్‌ ఫోన్‌కి దూరం. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న బఫెట్‌ వాడేది వింటేజ్‌ శాంసంగ్‌ ఫ్లిప్‌ ఫోన్‌. ఈబే సైట్‌లో దీని ధర రెండువేల రూపాయలు. ఆ విషయాన్ని ఈ మధ్య సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో బయట పెట్టారు బఫెట్‌. అంతేకాదు ఎవరైనా తన ఫోన్‌ ప్రస్తావన తెస్తే ‘అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌ నాకు ఈ ఫోన్‌ ఇచ్చి.. తిరిగి తీసుకోవడం మర్చిపోయారు’ అంటూ సరదాగా చమత్కరిస్తుంటారు.బఫెట్‌ సర్‌, మీరు నిజంగా గ్రేట్‌!


బిల్‌ గేట్స్‌ ఒత్తిడికి మందేమిటంటే...

సంపన్నులకు తమ పని తాము చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది. పిలిస్తే పలికే పనివాళ్లూ అడక్కుండా అవసరాలు చూసుకునే సహాయకులూ బోలెడంత మంది ఉంటారు. అయితే మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ మాత్రం తను వాడిన ప్లేట్లూ, గ్లాసుల్ని తానే కడిగేస్తారు. ఇతరులెవ్వర్నీ ఆ పని చేయనివ్వరు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న గేట్స్‌కు గిన్నెలు కడగడం చాలా ఇష్టమట. రోజూ రాత్రిపూట డిన్నర్‌ అయ్యాక అలా చేస్తే ఒత్తిడి పోతుందని చెబుతారు. సమయం ఉంటే ఇంట్లో మిగతా పనులూ చేస్తానని చెప్పడానికి అస్సలు మొహమాట పడరు. తన ఉద్యోగులకూ ఈ విధంగా ఒత్తిడిని దూరం చేసుకోమని సలహాలు ఇస్తుంటారు. హ్యాట్సాఫ్‌ గేట్స్‌!


అజీమ్‌ ప్రేమ్‌జీకీ నచ్చనిదేంటంటే...

నం తెలియకుండానే చాలా వనరుల్ని దుర్వినియోగం చేస్తుంటాం. నీళ్లూ, విద్యుత్తూ, కాగితాల వంటివన్నమాట. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా వీటిని అవసరానికి మాత్రమే వాడాలంటారు విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ. వృథా అన్న పదానికి తన డిక్షనరీలో చోటు ఉండకూడదన్నది ప్రేమ్‌జీ పాలసీ. ఆఫీసులో వృథాగా ఫ్యాన్లు తిరుగుతూ, లైట్లు వెలుగుతూ కనిపిస్తే ఆయనకు చాలా చిరాకు. వెంటనే వెళ్లి వాటిని ఆపేస్తారు. విమానంలో విలాసాల గురించి ఆలోచించకుండా ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి ఆటో రిక్షాలో వెళ్లిన సందర్భాలెన్నో. భారతదేశ అపరకుబేరుల్లో నంబర్‌ టూ అయిన ప్రేమ్‌జీ ఇప్పటికీ సెకండ్‌ హ్యాండ్‌ కార్లనే వాడుతుంటారు. డ్రైవర్‌ అందుబాటులో లేకపోతే తానే స్టీరింగ్‌ పట్టుకుంటారు. ప్రేమ్‌జీ సంపదలో కుబేరుడు... దానంలో కర్ణుడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రేమ్‌జీ మీకు సలామ్‌జీ!


టిమ్‌ కుక్‌ భోంచేసేది ఎక్కడంటే...

రీదైన జీవితం... విలాసవంతమైన సదుపాయాలుంటే కోరికలు ఆకాశంలో ఉండటం సహజం. ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ఎన్ని సౌకర్యాలున్నా సామాన్యుడిలా జీవించడానికే ఇష్టపడతారు. ఆఫీసు పరిధిలో, ఇంటి వద్ద చిన్న చిన్న పనులుంటే సైకిల్‌ మీదే తిరిగి పనులు పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఆఫీసులో సాధారణ ఉద్యోగులతో కలిసే భోజనం కానిచ్చేస్తారు. ఆ సమయంలో తాను ఇంటి నుంచి తీసుకొచ్చినవి ఉద్యోగులతో పంచుకుంటారు. వాళ్ల దగ్గరున్నవి చొరవగా తీసుకొని తినడమూ టిమ్‌కుక్‌కి అలవాటు. ఎన్ని సాధించినా సాధారణ జీవితంలోనే ఓ కిక్‌ ఉందంటారు కుక్‌!


మార్క్‌ జుకెర్‌బర్గ్‌ మార్కేంటంటే...

చాలామంది ఖరీదైన దుస్తుల్ని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తారు. ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌, సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోరు. తన సంపదలో అధికభాగం సేవా కార్యక్రమాలకు కేటాయించిన జుకెర్‌బర్గ్‌ మానవత్వానికి మించిన స్టేటస్‌ సింబల్‌ లేదంటారు. తనెప్పుడూ తక్కువ ఖరీదున్న బూడిదరంగు టీషర్టు, బ్లూ జీన్స్‌, స్నీకర్స్‌ వేసుకుంటారు. ఆఫీసులో ముఖ్యమైన సమావేశాలకి మాత్రమే సూట్‌ ఎంచుకుంటారు. సింపుల్‌గా కనిపిస్తూ... కలుపుగోలుగా మాట్లాడటంలో జుకెర్‌బర్గ్‌ మార్క్‌ కనిపిస్తుంది. తనకోసం ప్రత్యేకంగా గది ఉన్నా ఉద్యోగులతోనే కలిసి కూర్చుని పని చేస్తూ.. వారిలో ఉత్సాహం నింపుతారు. గతేడాది ఇరవై మంది ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించుకున్న జుకెర్‌బర్గ్‌ ఫోక్స్‌ వ్యాగన్‌ కారు వాడతారు. మనదేశంలో దీని ఖరీదు ఐదులక్షల రూపాయలు. ఇంట్లోనూ పిల్లల పనుల్లో పాలుపంచుకోవడంలో ముందుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, మార్క్‌ జుకెర్‌బర్గ్‌ హోమ్లీ మ్యాన్‌!


(5  మే 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.