close
హలో అనండి... ఒక్కసారి!

సాధారణంగా మనదేశంలో హెల్ప్‌లైన్‌లంటే- ఎక్కువగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకి ఫోన్‌ చేయాల్సినవీ, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆదుకునేవే ఉంటాయి. అలాంటివాటి నడుమ... మూడు హెల్ప్‌లైన్‌లు కొత్తదారి పట్టాయి. విజ్ఞానం పెంచడంలోనూ, ఉపాధి కల్పనలోనూ, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ తమదైన ముద్రవేస్తున్నాయి.

పిల్లల్లారా... ప్రశ్నల్లారా!

పిల్లలు ప్రశ్నల పుట్టలు. చూసే ప్రతి వస్తువూ, వినే ప్రతి కొత్తమాటా వాళ్ల బుర్రలో బోలెడన్ని సందేహాలు పుట్టిస్తుంటాయి. వాటన్నింటినీ మనమీద సంధించేస్తుంటారు. వాటికి జవాబు తెలియకుంటే మనం విసుక్కుంటూ ఉంటాం. ఆ విసుగూ, కోపం కారణంగా ఒకస్థాయిలో పిల్లలు ప్రశ్నలు అడగడం మానేస్తారు. ‘అలా మానేయడమంటే... వాళ్లలోని జిజ్ఞాసని అణచివేయడమే. అది జరగకూడదనే మా ప్రయత్నం!’ అంటున్నారు కేరళ ఫారెస్ట్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(కేఎఫ్‌ఆర్‌ఐ) పరిశోధకులు. ఏమిటా ప్రయత్నమంటే... పిల్లలందరి కోసం ఇటీవల 0487-2690222 నెంబరుతో ‘ఫస్ట్‌ క్వశ్చన్‌’ అనే హెల్ప్‌లైన్‌ ప్రారంభించారు వాళ్లు. ప్రకృతీ, సైన్సూ, లెక్కలూ, చరిత్రా... ఇలా దేని గురించైనా ఈ నెంబర్‌కి ఫోన్‌ చేసి పిల్లలు ప్రశ్నలు వేయొచ్చు. ఆ ప్రశ్నలకి కేఎఫ్‌ఆర్‌ఐలో ఉన్న 20 మంది పరిశోధకులు సమాధానమిస్తారు. వాళ్లకి తెలియకపోతే దేశవ్యాప్తంగా ఉన్న మరో 150 మంది ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకుని మరీ వివరిస్తారు. సోమవారం నుంచీ శుక్రవారం దాకా ఉదయం 10 నుంచి 5.30 వరకూ ఈ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేయొచ్చు. ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు! ఫిబ్రవరి 28న ‘సైన్స్‌ డే’ రోజు మొదలైన ఈ హెల్ప్‌లైన్‌కి తొలి మూడురోజులు ముప్పై కాల్సే వచ్చాయట. ఇప్పుడా సంఖ్య 150ని దాటుతోంది. మీ పిల్లలూ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా...? ఆలస్యం దేనికీ ‘ఫస్ట్‌ క్వశ్చన్‌’ నంబర్‌కి ఫోన్‌ చేయించండి! 


చూపు తగ్గిందా... ఫోన్‌ చేయండి!

ప్రపంచంలో అత్యధికంగా అంధులున్న దేశం మనదే. వీళ్లలో అత్యధికులు గ్రామీణ ప్రాంతానికి చెందినవాళ్లే. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా... మనదేశంలో కంటి వైద్య ఆసుపత్రులన్నీ ప్రధానంగా నగరాల్లోనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్వీ ప్రసాద్‌ వైద్యశాల, తమిళనాడులోని అరవింద్‌ ఆసుపత్రి వంటి సంస్థలు ఇందుకు కాస్త మినహాయింపు. ఈ సంస్థలు గ్రామీణ స్థాయుల్లోనూ ప్రత్యేక చికిత్సా కేంద్రాలని ఏర్పాటుచేసి సేవలందిస్తున్నాయి. ఎల్వీ ప్రసాద్‌ సంస్థ ఆ మధ్య మరో అడుగు ముందుకేసి పల్లెవాసుల కోసం 18002002211 నంబరుతో ‘కాల్‌ నేత్ర’ హెల్ప్‌లైన్‌నీ ప్రారంభించింది. ‘ఫోన్‌ కాల్‌తో కంటి వైద్యం ఏం చేస్తారో’ అనే సందేహం రావొచ్చు. ఈ ఫోన్‌ని కంటి వైద్య నిపుణులే అందుకుని సమస్యని అంచనా వేయగలుగుతారు. సమస్య చిన్నదే అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారు. పెద్దదైతే ఆ గ్రామానికి దగ్గర్లోని తమ ‘విజన్‌ సెంటర్‌’కి రమ్మని అక్కడ వైద్యం అందిస్తారు. జనవరిలో నెల్లూరు, ప్రకాశంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ‘కాల్‌ నేత్ర’ సేవల్ని ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాలకీ విస్తరించారు.


చదువు మానేయకుండా...

మేశ్‌ది మొగల్తూరు. పుట్టుకతోనే అంధుడు. స్థానిక బడిలోనే పదో తరగతిదాకా నెట్టుకురాగలిగాడు. తండ్రి మరణంతో ఆ తర్వాత చదవలేకపోయాడు. జీవితంలో తాను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే విద్యా హెల్ప్‌లైన్‌(18004252425) నంబర్‌కి ఫోన్‌ చేశాడు. వాళ్లు అతని పేరు నమోదుచేసుకుని... అర్హతని బట్టి ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో చెప్పడం మొదలుపెట్టారు. అతనికి దగ్గర్లో ప్రత్యేక శిక్షణ అందించగల సంస్థలనీ చూపించారు. వాళ్ల సూచనలూ, సలహాలతో రెండేళ్లు తిరగకుండానే ఓ బడిలో ఉపాధ్యాయుడిగా చేరాడు రమేశ్‌! ఇలా ఒకరూ ఇద్దరూ కాదు... ఏడులక్షలమందికి కెరీర్‌ గైడెన్స్‌ని అందించిన ఘనత విద్యా హెల్ప్‌లైన్‌ది. వీరిలో 98 శాతం గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేదలు... అందులోనూ లక్షన్నరమంది బడిస్థాయిలోనే చదువుమానేసినవాళ్లు. వీళ్లలో 30 శాతం మందికి ప్రత్యక్షంగానే ఉపాధి బాట చూపిందీ హెల్ప్‌లైన్‌. కేవలం ఫోన్‌ ద్వారానే కాకుండా నేరుగానూ వీళ్ల కోసం కార్యశాలలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటూ కర్ణాటక, ఒడిశా, అసోంలోనూ ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ని అందిస్తున్నారు. విద్యార్థుల కోసం ఎన్‌సీఆర్‌టీఐతోపాటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ హెల్ప్‌లైన్‌లెన్నో పెడుతున్నా... ఆ సంస్థలేవీ దృష్టిపెట్టలేని నిరుపేద ‘డ్రాప్‌ ఔట్స్‌’ని పట్టించుకోవడమే విద్యా హెల్ప్‌లైన్‌ ప్రత్యేకతని చెప్పాలి. హైదరాబాద్‌కి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నిర్మాణ్‌’ 2010లో దీన్ని ఏర్పాటుచేసింది.


(5  మే 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.