close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ గోవా నౌక... కేక!

మనదేశానికి విలాసాల ఓడలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ ‘కర్ణిక’ వాటిలో రారాణి! దేశంలో ప్రీమియం తరహా నౌకా సేవలకి దీంతోనే బోణీ. ఒక్కమాటలో... ఇది సముద్రంపైన స్టార్‌ హోటల్‌ విలాసాల్ని అందించే ఇంద్రభవంతి. ఇటీవలే తన సేవల్ని మొదలుపెట్టిన కర్ణిక విశేషాలివి...

ర్ణిక పద్నాలుగు అంతస్తులున్న మేడ... కాదుకాదు ఓడ. డాక్‌ నుంచి నౌకకి వేసిన చిన్న వంతెన దాటి లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచే మనల్నో మహరాజూ, రాణీలా చూడటం మొదలుపెడతారు. సంప్రదాయబద్ధంగా తిలకం దిద్ది, దండవేసి మరీ స్వాగతిస్తారు. ఆ ఆహ్వానాన్ని అందుకుని రిసెప్షన్‌ దాటగానే మయసభలాంటి బాల్‌రూమ్‌ మనల్ని నోరెళ్లబెట్టిస్తుంది. ఇండో-యూరోపియన్‌ అలంకరణలతో అద్దంలా మెరిసిపోయే గోడలతో కట్టిపడేస్తుంది. బాల్‌రూమ్‌లో ఉన్నంత సేపు మనం ఓడలో ప్రయాణిస్తున్నట్టే ఉండదు... ఓడ ప్రయాణం మొదలుపెట్టాక రవ్వంత ఊగిసలాట తప్ప. అక్కడి నుంచి మెట్లు మొదలవుతాయి. అలా ఎక్కుతూ 14 అంతస్తులకీ చేరుకోవచ్చుకానీ... అంత బాధ అవసరం లేకుండా ఇరువైపులా లిఫ్ట్‌లూ ఉంటాయి. అన్ని అంతస్తులూ ప్రయాణికులకే కేటాయించారు కాబట్టి కర్ణికలో ఒకేసారి రెండువేల మంది ప్రయాణించవచ్చు. వివిధ స్థాయులకి చెందిన సుమారు 850 గదులున్నాయి ఇందులో. ఈ గదులు ఇంటీరియర్‌, ఓషన్‌ వ్యూ, బాల్కనీ, మినీ-షూట్‌ అని నాలుగు రకాలుగా ఉంటాయి. ఏ రకం గది నుంచి చూసినా సముద్రం కనిపిస్తుంది. ముఖ్యంగా, ఆ గదుల నుంచీ, డెక్‌ నుంచీ సూర్యోదయం, అస్తమయాలని చూడడం ఈ నౌకాయానంలో ప్రధాన ఘట్టం. ముంబయి-మార్మగోవా-ముంబయి, ముంబయి-అబుదాబి-ముంబయి అనే రెండు తరహా యాత్రలు నిర్వహిస్తున్నారు. ముంబయి నుంచి గోవాకి తక్కువలో తక్కువగా మూడురోజుల(రెండు రాత్రులతో) ప్రయాణం ఉంటుంది. అదే ముంబయి-అబుదాబి యాత్రకి నాలుగు నుంచి ఏడురోజులపాటు ప్రయాణించే ప్యాకేజీలున్నాయి. చుట్టూ కనుచూపు మేరా నీలి సముద్రం, దాని హోరు తప్ప ఏమీ కనిపించని వాతావరణంలో అన్నన్ని రోజుల్ని ఎలా గడపడం అంటారా... ఈ ఓడలో ఇరవై నాలుగు గంటలూ మనకి వినోదాన్ని పంచే అన్ని హంగులూ ఉన్నాయి. సంగీత కచేరీలూ, నాటకాలూ, సినిమాలూ చూసేందుకు సుమారు మూడొందల మంది కూర్చోగల పెద్ద థియేటర్‌ ఉందిక్కడ. చిన్నారులూ, టీనేజర్‌లూ ఆడుకునేందుకు ప్రత్యేక ఆటస్థలాలూ, క్యాసినోలూ ఉన్నాయి. ఓడ డెక్‌పైన ఈతకొలను మరో పెద్ద ఆకర్షణ. అవి పోగా, ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లూ, సేదదీరేందుకు స్పాలూ, కేవలం వాకింగ్‌ కోసమే ప్రత్యేక ట్రాక్‌లూ ఏర్పాటుచేశారు. షాపింగ్‌ చేయడానికి అన్ని బ్రాండ్‌ల ఔట్‌లెట్‌లూ ఇందులో ఉన్నాయి. మరి భోజనమో అంటారా... దేశంలోని అన్ని రాష్ట్రాలకీ చెందిన ఆహారంతోపాటూ మన నగరాల వీధుల్లో అమ్మే చిరుతిళ్లూ ఇక్కడి రెస్టరంట్‌లలో దొరుకుతాయి.

ఇంతకీ ఎవరీ ‘కర్ణిక’!
ముంబయి-గోవా మధ్య గత ఏడాది నుంచి ఆంగ్రియా అనే ఓడతో ఓ ప్రయివేటు సంస్థ విహార సేవలు మొదలుపెట్టింది. జపాన్‌కు చెందిన ఓ సరకు రవాణా ఓడకి మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. కర్ణిక అలా కాదు. దీన్ని విహారయాత్రల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. 1989లో ఇటలీలో తయారైన నౌక ఇది. అక్కడి జలాల్లోనే ‘క్రౌన్‌ ప్రిన్సెస్‌’ పేరుతో తొలిసారి సేవలందించింది. గత 30 ఏళ్లలో ఎన్నో సంస్థల చేతులు మారి చివరికి ఆస్ట్రేలియాలో ‘పసిఫిక్‌ జ్యువెల్‌’ పేరుతో నడుస్తుండేది. దాన్ని భారత్‌లోని ఎస్సెల్‌ గ్రూప్‌(జీ టీవీ మీడియా)కి చెందిన జలేష్‌ క్రూయిజ్‌ సంస్థ కొనుగోలు చేసి కర్ణిక అని నామకరణం చేసింది. ఆ నామకరణోత్సవం తర్వాత ఏప్రిల్‌ 22న భారత్‌లో తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది!

(5  మే 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.