close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరమనిషి కాదు... మరో మనిషి!

మరమనిషి కాదు... మరో మనిషి! 

సృష్టి ఆరంభానికి ముందు బ్రహ్మ దేవుడు... ఓ బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి మనిషి అని పేరుపెట్టాడు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి ఆ మనిషికి మెదడిచ్చాడు. వైద్యుడిగా మారి ప్రాణాల్ని కాపాడమని దీవించాడు. ఇంజినీర్‌గా ఎదిగి భవనాల్ని నిర్మించి, వాహనాల్ని తయారు చేసి జీవితాల్ని సౌకర్యవంతంగా మార్చే శక్తినిచ్చాడు. రుచికరమైన ఆహారాన్ని వండి వడ్డించే నైపుణ్యాన్ని ప్రసాదించాడు. ఉపాధ్యాయుడిగా మారి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యతని అప్పగించాడు. కొన్ని వందల సంవత్సరాల తరవాత ఇప్పుడదే మనిషి... బ్రహ్మ అవతారమెత్తాడు. తాను చేయగలిగే అన్ని పనులతో పాటు, చేయలేని పనుల్నీ చేసేందుకు ఓ కొత్త శక్తికి ప్రాణం పోశాడు. దానికి అతడు పెట్టిన పేరు... రోబో. పేరుకే అది మరమనిషి. పనితీరులో అదీ మరో మనిషే!

2025లో ఓ రోజు...
దిల్లీలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి... లోపల గుండె మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. సాధారణంగా ఐదారు గంటలు పట్టే ఆ ఆపరేషన్‌ అరగంటలో విజయవంతంగా పూర్తయిపోయింది. ఆపరేషన్‌ థియేటర్‌ బయట వేచి ఉన్న రోగి భార్య, ‘దేవుడిలా నా భర్త ప్రాణాలు కాపాడారు’ అంటూ వైద్యుడి కాళ్లమీద పడింది. కానీ ఆ వైద్యుడు దేవుడు కాదు... ఓ రోబో.

భారత సరిహద్దులోని మిలటరీ క్యాంప్‌... ఎదురుగా శత్రువులు అమర్చిన మందుపాతర్లు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా శిబిరంలోని జవాన్లతో పాటు సరిహద్దు గ్రామాలూ బూడిదవ్వడం ఖాయం. ఈలోగా ఎవరో వచ్చి సూదిలో దారం ఎక్కించినంత సులువుగా ఆ పేలుడు పదార్థాల్ని నిర్వీర్యం చేశారు. ఆ వచ్చింది ఎవరో కాదు... ఓ రోబో.

హైదరాబాద్‌ నడిబొడ్డులోని ఓ షాపింగ్‌ మాల్‌... అగ్నిప్రమాదం జరిగి దుకాణాలన్నీ తగలబడుతున్నాయి.లోపల చాలామంది ఆడవాళ్లూ, పిల్లలూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతలో వచ్చాయి మనుషుల్ని పోలిన యంత్రాలు కొన్ని. మంటల్ని ఆర్పుతూనే లోపలున్న వాళ్లని సురక్షితంగా బయటికి లాగేశాయి. అ యంత్రాలేవో కాదు... రోబోలే.

అవును... పైన చెప్పిన పనులన్నీ రోబోలు విజయవంతంగా చేయగలవని ఇప్పటికే నిరూపించుకున్నాయి. ఎంబీబీఎస్‌ చదవకుండానే నిష్ణాతుడైన సర్జన్‌లా శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. బీటెక్‌ పట్టా అందుకోకుండానే నిపుణుడైన ఇంజినీర్‌లా బైకులూ, కార్లూ, విమానాలను తయారు చేస్తున్నాయి. ఆర్మీలో అనుభవం సంపాదించకుండానే అత్యాధునిక ఆయుధాలని నియంత్రిస్తున్నాయి. ఒకప్పుడు ప్రయోగశాలలకే పరిమితమైన ఈ మరమనిషి ఇప్పుడు మన వూరొచ్చాడు. మన ఇంటికొచ్చాడు. మన నట్టింటికొచ్చాడు. మనం చేసే అన్ని పనుల్నీ మనకంటే వేగంగా, కచ్చితంగా, అలవోకగా చేసేస్తున్నాడు. విద్య, వైద్యం, బ్యాంకింగ్‌, పరిశ్రమలూ, దేశ భద్రత, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన... ఇలా ప్రతి రంగంలో తనదైన ముద్రవేస్తూ, ఓ కొత్త సాంకేతిక విప్లవానికి తెరతీస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృతంగా రోబోలపైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేలాది రోబోలు పారిశ్రామిక కార్మికులూ, డాక్టర్లూ, నర్సులూ, స్కూల్‌ టీచర్లూ, రిసెప్షనిస్టులూ, పోలీసులూ తదితరుల స్థానాల్ని భర్తీ చేస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్నాయి. మున్ముందు దాదాపు అన్ని రంగాల్లో మనుషుల ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా అడుగేస్తున్నాయి.

మనిషి సృష్టించిన రోబోలు, శక్తియుక్తుల విషయంలో మనిషిని ఎప్పుడో దాటేశాయి. ఇప్పుడిప్పుడే సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటున్నాయి. పాడైపోయిన తమ శరీర భాగాలను స్వయంగా మరమ్మతు చేసుకునే దిశగా అడుగేస్తున్నాయి. కానీ వాటికి మితిమీరిన శక్తులను కల్పిస్తే భవిష్యత్తులో అది మనుషులకే నష్టం కలిగిస్తుందన్నది కొందరి వాదన. రోబోలనీ మిగతా ఆవిష్కరణల్లానే చూడాలనీ, వాటి వల్ల ముంచుకొచ్చే ప్రమాదమేం ఉండదన్నది చాలామంది మాట. ‘రోబోలూ మన పిల్లల్లాంటివే. మనమేది నేర్పిస్తే అదే నేర్చుకుంటాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలంతా వాటికి మంచి పనులే నేర్పిస్తున్నారు. జీవితాల్ని మరింత సౌకర్యంగా మార్చే దిశగానే శిక్షణ ఇస్తున్నారు’ అన్నది రోబోటిక్స్‌ నిపుణుల ఉవాచ. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటిదాకా రోబోలు మనిషికి మంచే చేస్తూ వచ్చాయి. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతి కొనసాగితే మరమనిషితో మనకేం ముప్పు రాకపోవచ్చు. మహా అయితే ప్రపంచం ఇంకాస్త వేగంగా అభివృద్ధి చెందుతుందంతే..!


అశోకుడి కాలంలోనే... 

ప్పుడెప్పుడో ‘ఘటోత్కచుడు’ సినిమాలో మంచి ఒడ్డూ పొడవున్న రోబో, మొన్నీమధ్య రజనీకాంత్‌ సినిమాలో హీరోయిన్‌తో ప్రేమలో పడే రోబో, షారుక్‌ఖాన్‌ నటించిన రా.వన్‌లో విలన్‌గా కనిపించే రోబో... ఇలా మనకి తెలిసిన రోబోలంటే రెండు చేతులూ, రెండు కాళ్లతో అచ్చం మనుషుల్ని పోలిన మరమనుషులే. కానీ ప్రాణులన్నింట్లో భిన్న జాతులున్నట్లే, రోబోల్లోనూ అనేక రకాలున్నాయి. వాటిలో రెండు కాళ్లూ, రెండు చేతులతో మనుషుల్లా కనిపించేవి ‘హ్యూమనాయిడ్‌ రోబట్స్‌’. దాదాపు ఐదొందల ఏళ్ల క్రితం కనిపెట్టిన రోబోలివి. కానీ అంతకు చాలాముందే, అంటే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలోనే ఆవిరి సాయంతో కదిలే ఓ లోహపు పక్షిని ‘ఆర్కిటిస్‌’ అనే గ్రీకు శాస్త్రవేత్త తయారు చేశాడు. మనుషుల సాయం లేకుండా కదుల్తుంది కాబట్టి అదే చరిత్రలో తొలి రోబో అని తేల్చారు. మన దేశంలోనూ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే రోబోల ప్రస్తావన కనిపించింది. పన్నెండో శతాబ్దంలో అజాత శత్రువు అనే రాజు బుద్ధుడికి సంబంధించిన కొన్ని కీలక వస్తువుల్ని ఓ స్తూపం కింద దాచిపెట్టి, వాటికి బాణాలు విసిరే లోహపు యంత్రాలను కాపలాగా పెట్టాడట. ఆ తరవాత అశోకుడు వాటిని ధ్వంసం చేశాడని చరిత్ర చెబుతోంది. భారత్‌కు పరిచయమైన తొలి రోబోలు ఆ యంత్రాలే! ఇలా మనుషుల సాయం లేకుండా, మనుషులు చేయగలిగే పనులు చేసే యంత్రాలన్నీ రోబోలే.

మోనాలిసా లాంటి అద్భుత చిత్రరాజాన్ని ప్రపంచానికి అందించిన డావిన్సీనే, తొలిసారి మనిషిని పోలిన రోబోనీ తయారు చేశాడు. లోపల చిన్న చిన్న చక్రాలూ, తీగల సాయంతో ఆ రోబో కూర్చొని లేవడం, నోరు కదపడంతో పాటు కాళ్లూ చేతులూ ఆడించేలా ఏర్పాటు చేశాడు. వినోదం కోసం పదిహేనో శతాబ్దంలో అతడు తయారు చేసిన ఆ యంత్రమే మొదటి హ్యూమనాయిడ్‌ రోబో. పదిహేడో శతాబ్దం నాటికి రోబోల రంగంలో ప్రయోగాలు వేగవంతమయ్యాయి. ‘జపాన్స్‌ ఎడిసన్‌’గా పేరున్న హిసషిగే టనకా రోబోల ప్రస్థానంలో కొత్త చరిత్రకి తెరతీశాడు. బాణాలు వేసేవి, బొమ్మలు గీసేవి, టీ అందించేవి... ఇలా రకరకాల పనులు చేసే రోబోలను సృష్టించాడు. 1950నాటికి రోబోలు బ్యాటరీల శక్తితో కదలడం మొదలుపెట్టాయి. ఆ పైన కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ ఆధారంగా పనిచేసే దిశగా అడుగేశాయి. 1972 నాటికి వినడం, మాట్లాడటం, స్పందించడం, బరువుల్ని మోయడం... ఇలా మనుషులు చేసే పనుల్ని చేయగలిగే తొలి రోబో జపాన్‌లో ప్రాణం పోసుకుంది. అప్పట్నుంచీ ఆ రంగం రాకెట్‌లా దూసుకెళ్లింది. మనుషులు పనిచేసే అన్ని రంగాల్లోకి రోబోలూ ప్రవేశించి సాయం చేయడం మొదలుపెట్టాయి. ఆపైన మనుషులు చేయలేని ఎన్నో పనులనూ చేయసాగాయి. సొంతంగా ఆలోచించడం, స్పందించడం, పనిచేయడం నేర్చుకున్నాయి. క్రమంగా 21వ శతాబ్దం రోబోలకు స్వర్ణయుగంలా మారిపోయింది.


డాక్టర్‌ రోబో! 

సృష్టిలోని అత్యుత్తమ వృత్తుల్లో వైద్యం ఒకటి. ఆరోగ్య సమస్యల్ని తొలగించి ప్రాణాల్ని నిలబెట్టే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంది. కానీ అతనికీ కొన్ని పరిమితులుంటాయి. చర్మాన్ని కోసేప్పుడు చేతులు వణకొచ్చు. చాకు కాస్త అదుపుతప్పి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. లేదా ఆపరేషన్‌ చేయడం ఆలస్యం కావడం వల్ల రోగి ప్రాణాలే ప్రమాదంలో పడొచ్చు. కానీ ‘డాక్టర్‌ రోబో’లకు ఈ సమస్యలేవీ ఉండవు. వైద్యులకంటే ఎన్నో రెట్లు వేగంగా, కచ్చితత్వంతో అవి ఆపరేషన్లు చేయగలవని నిరూపించుకున్నాయి. సరిగ్గా పాతికేళ్ల క్రితం తొలి ‘రోబోటిక్‌ సర్జరీ’కి పునాది పడింది. ఓ వ్యక్తి మూత్రనాళంలో పేరుకున్న వ్యర్థాల్ని ఓ రోబో ఆపరేషన్‌ చేసి తొలగించింది. ఆ తరవాత మనుషుల నియంత్రణలో రోబోలు అనేక సర్జరీల్లో భాగమయ్యాయి. పదేళ్ల క్రితం ఓ రోబో సొంతంగా గుండె ఆపరేషన్‌ చేసి, తనకు మనుషుల సాయం కూడా అక్కర్లేదని నిరూపించింది. కృత్రిమ మేధస్సు సాయంతో పనిచేసే ఆ రోబో డేటా బేస్‌లో దాదాపు పదివేల గుండె ఆపరేషన్లు చేసిన విధానాలను ప్రోగ్రామింగ్‌ ద్వారా నిక్షిప్తం చేశారు. అంటే ఆ రోబో పదివేల ఆపరేషన్లు చేసిన అనుభవం ఉన్న వైద్యుడితో సమానం. అందుకే ఆ శస్త్ర చికిత్సను అవలీలగా పూర్తిచేసింది. ఆ తరవాత రెండేళ్లకు మోహన్‌ గుండేటి అనే తెలుగు వైద్యుడు అమెరికాలో రోబో సాయంతో తొలిసారి ఓ చిన్న పిల్లాడి మూత్రనాళానికి శస్త్రచికిత్స చేశారు. ఇక అప్పట్నుంచీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సర్జరీల్లో రోబోలు భాగమయ్యాయి.

రోబోలు నిర్వహించే శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం ఎక్కువ. వాటి వేళ్లే కత్తుల్లా పనిచేస్తూ, 360డిగ్రీల కోణంలో తిరుగుతూ, వైద్యుడి వేళ్లు ప్రవేశించలేని భాగాలకూ సులువుగా ప్రవేశిస్తాయి. ఎలాంటి తడబాటుకూ అవకాశం ఉండదు కాబట్టి చాలా వేగంగా పని పూర్తిచేస్తాయి. అందుకే వైద్యులు చేసిన శస్త్రచికిత్సల్లో కంటే రోబోలు చేసిన వాటిలో రోగులు త్వరగా కోలుకున్నట్లు తేలింది.

‘రోబేర్‌’ పేరుతో ఉన్న రోబోలు రోగుల్ని ఎత్తుకొని మంచాలపైకి చేర్చడానికి సాయపడుతున్నాయి. ‘టగ్‌’ రోబోలు ఔషధాల్ని నింపుకొని ఆస్పత్రిలో ఒక్కో రోగి గదికీ అందిస్తున్నాయి. ‘జీనెక్స్‌’ రోబోలు ఆస్పత్రి అంతా కలియ తిరుగుతూ వ్యాధికారక సూక్షజీవుల్ని నాశనం చేస్తున్నాయి. ఇలా శస్త్రచికిత్సల నుంచి ఆస్పత్రి నిర్వహణ వరకూ అన్ని పనుల్లో రోబోలు మనుషుల బాధ్యతల్ని పంచుకుంటున్నాయి. ఈ వేగం ఇలానే కొనసాగితే, రాబోయే రోజుల్లో రోబోలే సొంతంగా ఆస్పత్రులను నిర్వహించే అవకాశం లేకపోలేదు!


పరిశ్రమలకు పెద్దదిక్కు

న చుట్టూ తిరిగే కార్లూ, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలూ, రోజూ ధరించే రెడీమేడ్‌ దుస్తులూ... ఇవన్నీ ఈ స్థాయిలో మార్కెట్‌ని ముంచెత్తడానికి కారణం రోబోలే. వాటిని నమ్ముకునే భారీ పరిశ్రమలన్నీ పని చేస్తున్నాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమనే తీసుకుంటే... వందల నట్లూ, బోల్టులను బిగించి, విడిభాగాలను కచ్చితత్వంతో అమర్చి, అంగుళం కూడా ఖాళీ లేకుండా రంగులేస్తేనే ఓ కారు ఫ్యాక్టరీ నుంచి బయటికొస్తుంది. ఎవరి సాయం లేకుండా ఓ మనిషి ఈ పనులన్నీ చేయాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. కానీ రోబోలు గంటల వ్యవధిలోనే వాటిని పూర్తి చేస్తాయి. ఒక కారు తయారీకి వందకు పైగా వెల్డింగులు అవసరమవుతాయి. రోజంతా ఏకాగ్రత కోల్పోకుండా మనుషులు ఆ పని చేయడం అసాధ్యం. కానీ రోబోలకు ఆ సమస్యలేదు. నిప్పురవ్వలు మీద పడతాయన్న భయం లేదు. అందుకే వెల్డింగ్‌ వాటికి చాలా చిన్న విషయం. బరువైన విడిభాగాలను కచ్చితత్వంతో అమర్చడం మనుషులకు తలకు మించిన భారమే. రోబోలు ఆ పనిని ఆడుతూపాడుతూ చేసేస్తాయి. కారుకి వేసే రంగుల్లోని రసాయనాలు రోజూ శరీరంలోకి చేరితే ప్రాణాలకు ప్రమాదం. అందుకే ఆ పనుల్నీ రోబోలే భుజానేసుకున్నాయి. అంటే... ముడిసరకు లోపలికి వెళ్తే చాలు, కారు బయటికొచ్చే వరకూ బాధ్యతంతా రోబోలదే.

కార్ల పరిశ్రమలో చేసే పనుల్నే దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ రోబోలు అందుకుంటున్నాయి. దాని వల్ల పారిశ్రామిక ప్రమాదాలు తగ్గిపోయాయి. వస్తువుల తయారీలో వేగం, కచ్చితత్వం పెరిగి ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... మనం తిరిగే కారు, చూసే టీవీ, వాడే వాషింగ్‌ మెషీన్‌ లాంటి ఉపకరణాలన్నీ రోబోల చలవే.


సైన్యానికి సాయం

విష్యత్తులో యుద్ధాలు జరిగితే వాటిలో పాల్గొనేదీ, పోరాడేదీ ఆఖరికి నాశనమయ్యేదీ రోబోలే! ప్రస్తుతం మిలటరీ రోబోల రంగ అభివృద్ధి ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలోనే రిమోట్‌తో పనిచేసే రోబో ట్యాంకర్లను జర్మనీ ఉపయోగించింది. మన శాస్త్రవేత్తలు మాత్రం విధ్వంసం కంటే భద్రతకే ప్రాధాన్యమిచ్చారు. ‘దక్ష్‌’ పేరుతో అత్యాధునిక రోబోని రూపొందించారు. లోయలూ, పర్వతాలూ అన్న తేడా లేకుండా ఎలాంటి ప్రాంతానికైనా ఇది వెళ్తుంది. పేలుడు పదార్థాల్ని గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. మూసి ఉన్న గది తాళాల్ని బద్దలు కొట్టి తన పనిచేసుకుపోతుంది. అంటే... మన భద్రతా దళానికి ఇదో సూపర్‌ హీరో.

‘సెంట్రీ గన్‌’ పేరుతో అమెరికా అభివృద్ధి చేసిన రోబో, తమ గగనతలంలోకి వచ్చే శత్రు విమానాలూ, మిసైళ్లనూ దూరం నుంచే డేగలా గుర్తించి నాశనం చేస్తుంది. ‘మిడార్స్‌’... సరిహద్దులో గస్తీ తిరుగుతూ చొరబాటు దార్లపైన తూటాల వర్షం కురిపిస్తుంది. ‘గోల్‌ కీపర్‌’... నౌకలపైన పహారా కాస్తూ, రాడార్ల సాయంతో లక్ష్యాల్ని గుర్తించి దాడులు చేస్తుంది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లనీ, బంకర్లలో దాక్కున్న వాళ్లనీ ‘ప్యాక్‌బోట్‌’ అనే రోబో కనిపెట్టేస్తుంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో దేశాల సైన్యానికి సాయంగా ఉంటోన్న రోబోలు కోకొల్లలు. 


అంతా రోబోమయం...

వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలూ, గృహావసరాలూ, రెస్టరెంట్లూ లాంటి ఇతర రంగాలకూ రోబోలు వేగంగా విస్తరిస్తున్నాయి. పొలాల్లో విత్తులు నాటడం, ఎరువులు చల్లడం, పంట కోయడం లాంటివన్నీ శ్రమతో కూడిన పనులు. అందుకే ఆ పనుల్ని చేసే రోబో ట్రాక్టర్లూ, యంత్రాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ఎక్కడో భూగ్రహానికి వేలకిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుడి గురించి మనకు అన్ని విషయాలు తెలిసినా, చంద్రమండలం మీద భారీ స్థాయిలో ప్రయోగాలు జరుగుతున్నా, భూమి చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నా అదంతా రోబోల ఘనతే. భూ కక్ష్యలో తిరిగే ప్రతి ఉపగ్రహం ఓ రోబోనే. రాకెట్‌ నుంచి సమర్థంగా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి వదిలేవి రోబోటిక్‌ చేతులే. అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్లను నిర్మిస్తున్నదీ రోబోలే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలీని ఇతర గ్రహాలపైన మనుషులు కాలుమోపడం ప్రమాదకరం. అందుకే ఆ బాధ్యతను రోబోలే తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆస్ట్రోనాట్‌లకు బదులుగా పూర్తిగా ‘రోబోనాట్‌’లతోనే (రోబో వ్యోమగామి) అన్ని అంతరిక్ష పరిశోధనలూ జరపడానికి నాసా ప్రయత్నిస్తోంది.

గత పదేళ్ల నుంచి పాశ్చాత్య దేశాల్లో ‘రూంబా’ పేరుతో ఓ రోబో ఇళ్లల్లో సేవలందిస్తోంది. ఒక బటన్‌ నొక్కితే చాలు ఇంట్లో ప్రతి మూలనీ ఇది శుభ్రం చేసి పెడుతుంది. మన దేశంలోనూ అమెజాన్‌ లాంటి వెబ్‌సైట్లలో ఇది అందుబాటులో ఉంది. జపాన్‌లో వృద్ధులకు ఉపయోగపడేలా ‘కేర్‌బోట్‌’ అనే రోబోని తయారు చేశారు. కిందపడ్డ వస్తువుల్ని తీయడం, బల్లలూ అద్దాల్ని శుభ్రం చేయడం, వృద్ధుల్ని కూర్చోబెట్టుకొని మెట్లెక్కించడం లాంటి పనులన్నీ ఇది చేస్తుంది. గిన్నెలు తోమడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడం లాంటి పనుల కోసం డొమెస్టిక్‌ రోబోలు ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సముద్ర గర్భంలో పరిశోధన లాంటి ఎన్నో రంగాలకు రోబో సేవలు కీలకంగా మారుతున్నాయి.

ఈ రోబోలు సూపర్‌!

పొద్దంతా పనిచేసి అలసిపోయి ఇంటికెళ్లాక మళ్లీ వంట చేసుకోవాలంటే ఎవరికైనా కాస్త కష్టమే. అందుకే ఆ బాధ్యతని భుజాన వేసుకోవడానికి రోబో షెఫ్‌ సిద్ధమైంది. ‘మోలే రోబోటిక్స్‌’ అనే లండన్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రోబో షెఫ్‌ వందకి పైగా వంటకాల్ని తయారు చేయగలదు. వంటకి అవసరమైన పదార్థాల్ని అందుబాటులో పెట్టి ‘స్టార్ట్‌’ బటన్‌ నొక్కితే చాలు, చక్కగా వండేసి, తరవాత స్టవ్‌ని కూడా అదే శుభ్రం చేస్తుంది.

దుబాయి వాసులు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌ దాకా వెళ్లాల్సిన పనిలేదు. ‘రోబో కాప్‌’ నేరుగా వాళ్ల దగ్గరికే వెళ్లి ఫిర్యాదులు తీసుకుంటుంది. ప్రపంచంలోని మొట్టమొదటి రోబో పోలీస్‌ ఇది. ప్రస్తుతం షాపింగ్‌ మాళ్లూ, మార్కెట్ల లాంటి రద్దీ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ చేస్తూ పరిసరాలను తన కెమెరా కళ్లతో గమనిస్తోంది. జనం గుంపుగా ఉన్నా, కాస్త అలజడిగా అనిపించినా తనంతట తానే వెళ్లి అక్కడి దృశ్యాలను రికార్డు చేసి కంట్రోల్‌ రూమ్‌కి చేరవేస్తుంది.

క్షిణ కొరియాను గతంలో ఇంగ్లిష్‌ టీచర్ల కొరత వేధించేది. దానికి పరిష్కారంగా వాళ్లు కనిపెట్టిందే ‘ఇంగ్‌కీ’ అనే రోబో టీచర్‌. ఇది పిల్లలకు ఇంగ్లిష్‌ వ్యాకరణం, రైమ్స్‌, ఉచ్చారణ లాంటి విషయాలన్నీ నేర్పిస్తుంది. అక్కడ ఇంగ్లిష్‌ టీచర్ల జీతాలతో పోలిస్తే వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువ కావడంతో చాలా స్కూళ్లలో వీటినే ఉపయోగిస్తున్నారు.

ఎంత దూరమైనా లగేజీని మోసుకుంటూ మన వెంటే వచ్చే అత్యాధునిక రోబో ‘స్పాట్‌’. దీన్ని దూరం నుంచి చూస్తే ఏ కుక్కో కదుల్తున్నట్లు ఉంటుంది. పర్వతాలూ, లోయలూ, ఎడారులన్న తేడా లేకుండా నడవడంతో పాటు వేగంగా పరిగెత్తే శక్తీ దీని సొంతం. బరువులు మోస్తూ ఎక్కువ దూరం నడవలేని వాళ్లని దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేసినా, సైనికులకే ఇది ఎక్కువగా ఉపయోగపడుతోంది.

పెప్పర్‌... ప్రపంచంలోని తెలివైన రోబోల్లో ఇదీ ఒకటి. పేరుకి రోబో అయినా, మనుషుల్లానే చూడటం, వినటం, మాట్లాడటం, స్పందించడం, నడవడం లాంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. 20 భాషలు మాట్లాడటంలో ఇది దిట్ట. ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకొని, దానికి తగ్గట్లు స్పందించడం దీని ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆస్పత్రుల్లో, మాల్స్‌లో, బ్యాంకుల్లో దీన్ని రిసెప్షనిస్టుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటిదాకా అత్యధికంగా పదివేలకుపైగా పెప్పర్లు అమ్ముడవడం విశేషం.

ఎన్నో లాభాలు-కొన్నే నష్టాలు!

శాస్త్రవేత్తల ప్రతి సృష్టీ లాభనష్టాల కలయికే. కాకపోతే రోబోల విషయంలో లాభాలెక్కువ, నష్టాలు తక్కువ. వందల మంది మనుషులు చేసే పనిని ఒక్క రోబో చేయగలదు. వాళ్లందరిపైనా పెట్టే ఖర్చుతో పోలిస్తే దీర్ఘకాలంలో వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు నామమాత్రమే. సముద్రగర్భాలూ, ఎడారులూ, అణువిద్యుత్‌ కేంద్రాలూ, డ్రైనేజీలూ, డంపింగ్‌ యార్డులూ... ఇలా మనుషులు పనిచేయడానికి కష్టతరమైన ప్రదేశాల్లో రోబోలు అద్భుత ప్రత్యామ్నాయం. ఎన్ని గంటలసేపు, ఎంత పని చేసినా అలసటకు అవకాశం లేదు. కాబట్టి ఉత్పత్తి దూసుకెళ్తుంది. సెలవులూ, ఆరోగ్య సమస్యలూ, మనుషులకుండే ఇతర బలహీనతలకు రోబోలు అతీతం. వేగం, కచ్చితత్వం, చేసే పనిపైన నియంత్రణ లాంటి అనేక అంశాల్లో వాటికవే సాటి. సామర్థ్యం విషయంలో ఒక రోబో ఎక్కువ, మరొకటి తక్కువ అన్న పరిమితులు ఉండవు. పరిశ్రమలు మనుషుల్ని తగ్గించి రోబోలని ఎక్కువగా ఆశ్రయించడానికి ఇలాంటి కారణాలెన్నో.

వంద మంది మనుషుల పని ఒక్క రోబో చేయడం ఒక విధంగా లాభమే. కానీ దాని వల్ల ఆ వంద మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతాయి. రోబోల వల్ల మనుషులకు జరిగే తొలి నష్టం అదే. ఇప్పటికే పరిశ్రమల్లో వాటి వినియోగం వల్ల వేలాది మంది చిన్నస్థాయి కార్మికులు ఉపాధి కోల్పోయారు. భవిష్యత్తులో ఆ సంఖ్య ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలున్నాయి. సొంతంగా ఆలోచించలేకపోవడం, సందర్భానికి తగ్గట్లు స్పందించలేకపోవడం వాటికున్న మరో ప్రతికూలత. కానీ కృత్రిమ మేధస్సు కలిగిన రోబోల అభివృద్ధి శరవేగంగా జరుగుతుండటంతో ఆ పరిమితిని త్వరలోనే అధిగమించొచ్చు. మనుషుల్లా సొంతంగా తమ సామర్థ్యాన్ని పెంచుకునే శక్తీ రోబోలకు లేదు. కానీ రోబోల వల్ల జరిగే అభివృద్ధితో పోలిస్తే ఈ నష్టాలు నామమాత్రమే అన్నది శాస్త్రవేత్తల మాట.

ఆడ రోబోలే ఎక్కువ!

ప్రపంచంలో ఉన్న రోబోల్లో సగానికి పైగా జపనీయులే వినియోగిస్తున్నారు. అక్కడ దాదాపు మూడు లక్షల రోబోలు వివిధ స్థాయుల్లో సేవలందిస్తున్నాయి. పూర్తిగా రోబోలే సిబ్బందిగా పనిచేసే తొలి హోటల్‌ కూడా అక్కడే ప్రారంభమైంది.
* గతంలో హ్యూమనాయిడ్‌ రోబోలంటే లోహపు చేతులూ, కాళ్లతో ఆకారంలో మాత్రమే మనిషిని పోలి ఉండేవి. కానీ ప్రస్తుతం జుట్టు నుంచి కాలి గోటి వరకూ అచ్చుగుద్దినట్లు మనిషిలానే ఉంటూ, రోబోలని పోల్చుకోలేని విధంగా హ్యూమనాయిడ్లు తయారవుతున్నాయి. చైనాలో జెంగ్‌ అనే ఓ బ్రహ్మచారి, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదని చివరికి అలాంటి ఓ రోబోనే సంప్రదాయబద్ధంగా తన భార్యని చేసుకున్నాడు.
* జర్మనీ, యూకే, నెదర్లాండ్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాల్లో రోబోలే డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నాయి. రెస్టరెంట్లకు రెండు మైళ్ల దూరంలోపు ఉన్నవాళ్లకి ఇవి ఆహారాన్ని అందించి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వందల డెలివరీలు జరిపినా, వీటి వల్ల ఒక్క ప్రమాదం కూడా తలెత్తకపోవడం విశేషం.
* మాట్లాడే సామర్థ్యం ఉన్న రోబోల్లో తొంభై శాతానికి ఆడవాళ్ల గొంతునే అమరుస్తున్నారు. సినిమాలూ, పాప్‌ వీడియోల్లో రోబోలను ఎక్కువగా నెగెటివ్‌ ఛాయలున్న పాత్రల్లో చూపించడంతో, వినియోగదార్లలో వాటిపైన ప్రతికూల భావన తలెత్తకుండా ఆ పనిచేస్తున్నారట.
* భారత్‌లో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ముంబయి శాఖలో తొలి రోబో అసిస్టెంట్‌ని నియమించింది. వినియోగదార్లకు ఏం కావాలో కనుక్కొని, సంబంధిత కౌంటర్ల దగ్గరకు వాళ్లని తీసుకెళ్లడమే దీని పని.
* 2040 నాటికి రోబోలు ఓ ప్రత్యేక జాతిగా అవతరిస్తాయన్నది శాస్త్రవేత్తల అంచనా. అంటే... రజనీకాంత్‌ ‘రోబో’ సినిమాలో చూపించినట్లు ఓ రోబో మరో రోబోని తయారు చేసే శక్తిని సాధించి, తమ సంఖ్యని పెంచుకుంటుందన్న మాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.