close
వివాహబంధం

- అప్పరాజు నాగజ్యోతి

అమ్మకి సీరియస్‌గా ఉందని అన్నయ్య నుండి ఫోన్‌ రాగానే హుటాహుటిన ప్రయాణమైంది మనస్విని.
దాదాపు ఏడేళ్ళ తర్వాత ఇండియాకి... అదీ ఒంటరిగా వెళ్తుంటే ఆమె మనసంతా వ్యాకులతతో నిండిపోయింది.
అయినవాళ్ళందరినీ వదిలేసి కెనడాలో ప్రశాంతంగా జీవిస్తున్న మనస్వినికి దగ్గర బంధువులనుండి ఎన్నో శుభకార్యాలకి ఆహ్వానం అందినా, ఇండియాకి వెళ్లి మనసుని గాయపరిచే చేదుజ్ఞాపకాలని తిరగతోడటం ఇష్టంలేక ఆఫీసులో సెలవు దొరకలేదనో పిల్లల పరీక్షలనో ఒంట్లో నలతగా ఉందనో ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది.
తేనెతుట్టెపై రాయి విసిరితే చెల్లాచెదరైన తేనెటీగల్లా మనసులో తిరుగాడుతున్న జ్ఞాపకాల ఉధృతికి ఉక్కిరిబిక్కిరవుతున్న ఆమె మనసు ఆమె ప్రమేయం లేకుండానే పదేళ్ళ వెనక్కి ప్రయాణం చేసింది.

* * * * *

మనస్విని, భువన్‌లది పెద్దలు కుదిర్చిన వివాహం. దాదాపు అన్ని విషయాల్లోనూ వాళ్ళిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉండేవాళ్ళు. మనస్వినిది ముక్కుసూటి ధోరణి. ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. పొరపాటునైనా అబద్ధం చెప్పదు. మాయామర్మాలు లేని మనిషి. మనసులో ఒకటీ పైకొకటీ అన్నట్లుండదు. అలాగే మనిషినిబట్టి మాట మార్చదామె. తనవాళ్ళయినా పరాయివాళ్ళయినా ఒకేవిధంగా ప్రవర్తిస్తుంది. ద్వంద్వ ప్రవృత్తిని ఎంత మాత్రమూ సహించలేని మనస్తత్వం ఆమెది.
భువన్‌ విషయానికొస్తే మనస్వినికి పూర్తి వ్యతిరేకమైన స్వభావం. ఎవరితోనూ మనసువిప్పి మాట్లాడలేడు. అతని మనసులో ఏముందో ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు. అంతా దాపరికమే. పొరపాటున నోరు తెరిచి నాలుగుమాటలు మాట్లాడాడంటే అందులో మూడు అబద్ధాలే వుంటాయి. అతనిలో ఉన్న మరోలక్షణం... తనని అందరూ మంచివాడనుకోవాలన్న పిచ్చి తాపత్రయం.
ఇక డబల్‌స్టాండర్డ్స్‌ విషయానికొస్తే భువన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! మచ్చుకి రెండుమూడు సంఘటనలు...

* * * * *

మల్టీనేషనల్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజరుగా పనిచేస్తోంది కాబట్టి కంపెనీ ఉద్యోగులకి రెగ్యులర్‌గా ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లూ వర్క్‌షాప్‌లూ నిర్వహించడం మనస్వినికి కొట్టిన పిండి.
ఆ అనుభవంతోనే తమ పాప భవ్య మొదటి పుట్టినరోజు వేడుకని ఎలా చేస్తే, ఎక్కడ చేస్తే బావుంటుందోనంటూ భర్త పక్కనే కూర్చుని చర్చించబోయిన మనస్వినిని సగంలోనే ఆపేశాడు భువన్‌.
‘‘చూడు మనూ, ఫంక్షన్‌ ఎలా జరపాలో నేను నిర్ణయిస్తాను. ఆడవాళ్ళ ప్లానింగ్‌ మీద నాకు నమ్మకం లేదు’’ అంటున్న భువన్‌ మాటలకు హతాశురాలైంది మనస్విని. ‘మా అక్కయ్యది చక్కటి ప్లానింగ్‌. టూర్‌కైనా సరే, ఊళ్ళోని రెస్టారెంటుకైనా సరే అక్కయ్య పకడ్బందీగా ప్లాన్‌ చేస్తుంది’ అంటూ వాళ్ళ అక్కయ్య కమలని ఎప్పుడూ మెచ్చుకుంటుండే భర్త ఇప్పుడిలా మాట్లాడుతుంటే ఆమెకి కొత్తగా ఉంది. అదేమాటని రెట్టించి అడిగింది.
‘‘తను వేరు, నువ్వు వేరు’’ సంభాషణని అక్కడితో తుంచేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు భువన్‌.
భర్త ధోరణికి ఆమె మనసు తీవ్రంగా గాయపడింది.
మరోరోజు... చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంటే కొంత డబ్బు సర్దుబాటు చేసింది మనస్విని. ఆ విషయం తెలిసి పెద్ద రాద్ధాంతం చేశాడు భువన్‌.
‘‘దగ్గర బంధువులతోనూ ప్రాణస్నేహితులతోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవడంవల్ల మనుషుల మధ్యన పొరపొచ్చాలు ఏర్పడి బద్ధశత్రువులుగా మారే ప్రమాదం ఉంటుంది. మరోసారి దగ్గర వాళ్లెవరైనా ధనసాయమడిగితే కుదరదని వెంటనే చెప్పేసెయ్‌. అంత్య నిష్టూరంకంటే ఆది నిష్టూరం మేలు. ముందు నువ్వు ఇచ్చిన డబ్బులకి నీ స్నేహితురాలి దగ్గర ప్రామిసరీ నోట్‌ తీసుకో.’’
భర్త భావాలతో మనస్విని ఏకీభవించలేదు. ప్రామిసరీనోటు అడిగి ప్రాణ స్నేహితురాలి మనసు నొప్పించలేనని ఖండితంగా చెప్పింది. ఆమె ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసే స్థితిలో ఉంటే తప్పకుండా ఇస్తుందన్న నమ్మకం తనకుందనీ, ఒకవేళ ఆమె వాపసు ఇవ్వకపోయినా తను ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వననీ, ఎందుకంటే అవసరంలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం మనిషిగా తన ధర్మమని భావించి ఆ డబ్బుని ఆమెకి ఇచ్చాననీ గట్టిగా చెప్పడంతో అప్పటికి ఆ వాదన ఆగిపోయింది.
ఆ తర్వాత రెండురోజులకి భువన్‌ ఆఫీస్‌ పనిమీద ముంబైకి వెళ్ళిన మరుసటిరోజే అతని స్నేహితుడు సతీష్‌- భువన్‌ ఇంటికి వచ్చాడు.
‘‘రండి అన్నయ్యా’’ అంటూ సాదరంగా ఆహ్వానించింది మనస్విని.
అతనితో మనస్వినికి బాగానే పరిచయం ఉండటం వలన టీ తాగుతూ ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు.
‘‘ఆయనతో ఏదైనా చెప్పాలా అన్నయ్యా?’’ టీ తాగడం పూర్తయ్యాక సతీష్‌ వెళ్లబోతుంటే అడిగింది మనస్విని.

‘‘అయ్యో మర్చేపోయాను చెల్లెమ్మా! పదిరోజులకిందట అవసరమై వాడి దగ్గర పాతికవేలు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడా డబ్బుల్ని ఇచ్చేందుకే వచ్చాను’’ పర్సులో నుండి డబ్బులుతీసి మనస్వినికిచ్చాడు సతీష్‌.
‘‘సమయానికి సాయం చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పమ్మా వాడికి. భువన్‌ని ఎన్నో ఏళ్లుగా ఎరుగుదును నేను. ఎప్పుడడిగినా కాదనకుండా డబ్బులిస్తాడు. తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వకుండా ఎంతోమంది ఎగ్గొట్టేసినా వాడి అలవాటు వాడిదే! వాడిలాంటి వాళ్ళు చాలా అరుదమ్మా. వాడి మనసు బంగారం చెల్లెమ్మా.’’
సతీష్‌ వెళ్ళిపోయినా చాలాసేపు ఆలోచిస్తూ అలాగే హాల్లో కూర్చుండిపోయింది మనస్విని. భర్తలోని ద్వంద్వ ప్రవృత్తిని స్పష్టం చేసిన అటువంటి సంఘటనలు ఆ తరువాతా ఎన్నో జరగడంతో అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మనస్విని ఆపైన చాలా విషయాల్లో మౌనంగా ఉండిపోవడాన్ని అలవాటు చేసుకుంది.

* * * * *

పిల్లల పెంపకం విషయంలోనూ భార్యాభర్తల మధ్య సయోధ్య ఉండేది కాదు. పిల్లలకి మంచీ చెడూ వివరించి చెప్పాలనీ నీతినిజాయితీలని ఉగ్గుపాలతో నేర్పించాలనీ తాపత్రయపడేది మనస్విని. వాళ్ళకి పంచతంత్రంలాంటి నీతి కథలు చెబుతుండేది. పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నది ఆమె అభిప్రాయం.
అవన్నీ ట్రాష్‌ అని తీసిపారేస్తుండేవాడు భువన్‌. మనం పైకి వచ్చేందుకు పక్కవాళ్ళని తొక్కేసినా ఫరవాలేదనే ధోరణి భువన్‌ది. పిల్లలకి మాతృభాషలోనూ పట్టుండాలని ఆరాటపడేది మనస్విని. అదేం అవసరం లేదు, ఇంట్లో కూడా పిల్లలు ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలి, అదే ఇప్పటి కల్చర్‌. అలా ఉంటేనే మనుషులు మనల్ని ధనవంతులుగా, చదువుకున్నవాళ్ళుగా గుర్తిస్తారన్నది భువన్‌ అభిప్రాయం.
చివరకి పిల్లల చదువుల విషయంలోనూ భార్యాభర్తలకి చుక్కెదురే!
చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం భువన్‌కి ఇష్టముండేది కాదు. ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి పెద్దపెద్ద చదువులు చదివించక్కర్లేదు, మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపిస్తే చాలనేవాడు.
చదువులకి ఆడా మగా అన్న తేడాలుండకూడదు. ఎవ్వరైనా సరే వారివారి శక్తిసామర్థ్యాల కనుగుణంగా కష్టపడి విజయశిఖరాలని అధిరోహించాలనేది మనస్విని అభిప్రాయం. అందుకే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని శ్రద్ధగా చదివించేది. తను చెప్పలేని సబ్జెక్టులకి ట్యూషన్స్‌ పెట్టించింది.
ఆ విషయంమీదా భువన్‌ పెద్ద రాద్ధాంతమే చేశాడు. పిల్లల్ని ఫ్రీగా వదిలేయక ఈ ట్యూషన్స్‌ అవీ ఎందుకంటూ భార్యతో గొడవపడేవాడు. తన అభీష్టానికి వ్యతిరేకంగా ట్యూషన్స్‌లో చేర్పించింది కాబట్టి పిల్లల ఫీజులు కట్టడంలోగానీ ట్యూషన్స్‌కి వాళ్ళని డ్రాప్‌ చేయడంలో కానీ తను సాయం చేయనని ఖచ్చితంగా చెప్పేవాడు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో!
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఎవరైనా అతన్ని పొగుడుతూ మాట్లాడితే చాలు... పొంగిపోయి వాళ్ళకోసమేదైనాసరే చేసేసేందుకు సిద్ధపడే భువన్‌ మనస్తత్వం మరో ఎత్తు. అతనికున్న ఈ గుణం వలన మనస్విని ఎన్నో ఇబ్బందులకి గురయింది. చివరికి ఆ గుణమే వాళ్ళిద్దరినీ విడదీసింది.
‘‘మేడమ్‌... ఉడ్‌ యు లైక్‌ టు హావ్‌ టీ ఆర్‌ కాఫీ’’ అన్న ఎయిర్‌హోస్టెస్‌ మాటలకి గతం నుండి బైటపడ్డ మనస్విని... ‘‘వన్‌ కప్‌ టీ విత్‌ లెమన్‌ ప్లీజ్‌’’ అని చెప్పి మళ్ళీ ఆలోచనల్లోకి జారుకుంది.

* * * * *

మనస్విని వాళ్ళ ఎదురు ఫ్లాట్‌లో ఉండే రోహిణి చెల్లి రంజని ఎక్కువ సమయం మనస్వినివాళ్ళ ఫ్లాట్‌లోనే గడిపేది.
‘అక్కా , ఏం చేస్తున్నావు?’ అంటూ నేరుగా వంటింట్లోకైనా బెడ్రూమ్‌లోకైనా చొరవగా వచ్చేసి ఆపకుండా కబుర్లు చెబుతుండేది రంజని. మొదట్లో బాగానే అనిపించినా పోనుపోనూ ఆమె మాటల్లో దొర్లేవన్నీ అబద్ధాలూ అతిశయోక్తులేనన్న విషయాన్ని గమనించిన మనస్విని- రంజనికి దూరంగా మసలుకోవడం మొదలెట్టింది.
భువన్‌ మాత్రం రంజని కబుర్లంటే చెవి కోసుకునేవాడు. రంజని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు కూడా! భువన్‌ వైపు అడ్మైరింగ్‌గా చూసేది రంజని. రోజుకొక్కసారైనా ‘వావ్‌, యు ఆర్‌ ఎ జీనియస్‌’ అంటుండేది. వెంటనే తనంత గొప్పవాడు లేనట్టుగా కాలర్‌ ఎగరేసేవాడు భువన్‌. భువన్‌ వేసుకున్న ప్రతీ డ్రెస్‌నీ అదే పనిగా పొగిడేది రంజని. ‘భువన్‌జీ, మీకీ గ్రేషర్టు బాగా సూట్‌ అయిందండీ’ అనేది ఒకసారి. ‘ఈ బ్లూ సూట్‌లో అచ్చం మహేష్‌బాబులా ఉన్నారండీ’ అనేది ఇంకోసారి. రంజని అలా తనని పొగిడినప్పుడల్లా భువన్‌ ఛాతీ పెద్దదయేది, అతని మొహమంతా విశాలంగా నవ్వు పరుచుకునేది. ఒకరోజు రాత్రి పిల్లలతో కలిసి భోంచేస్తుండగా- ‘నీకు రంజనిలా చక్కగా మాట్లాడడం, ఎదుటి మనిషికి నచ్చేట్టుగా ప్రవర్తించడం చాతకావు. తనని చూసైనా నేర్చుకోకూడదూ?’ అన్నాడు భువన్‌. విస్మయంగా చూసింది మనస్విని. కార్పొరేట్‌ సెక్టర్లో హెచ్‌ఆర్‌ మేనేజరుగా పనిచేస్తున్న తనకి మాట్లాడటం చాతకాదనడమే కాకుండా, అయిదేళ్ళు చదివినా డిగ్రీ పాసవలేక చదువుకి స్వస్తి చెప్పేసి టీవీలో సీరియల్స్‌ చూస్తూ, పోచికోలు కబుర్లు చెబుతూ బతికేస్తున్న రంజనిలాంటి అమ్మాయితో తనని పోల్చడం బొత్తిగా నచ్చలేదు మనస్వినికి. అయినా తిరిగి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది.

* * * * *

ఆవేళ రెండు మీటింగ్‌లు పోస్ట్‌పోన్‌ అవడంతో పిల్లలు స్కూల్‌నుండి తిరిగొచ్చేలోపే తను ఇంటికి చేరుకొని వాళ్ళని సర్‌ప్రైజ్‌ చేద్దామన్న ఆలోచనతో ఆఫీస్‌ నుండి త్వరగా బయల్దేరింది మనస్విని. దారిలో పిల్లలకిష్టమైన చాక్లెట్‌ కేకు, సమోసాలని కొనుక్కుని ఫ్లాట్‌కి చేరుకుని తనవద్దనున్న కీస్‌తో తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళింది. హాల్లో కిటికీల కర్టెన్లని పక్కకి జరిపి, డ్రెస్‌ మార్చుకునేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్ళబోయేంతలో లోపలనుండి కిలకిలమంటూ నవ్వులూ గుసగుసలూ వెనువెంటనే వేడి నిట్టూర్పులూ వినిపించడంతో ఉలిక్కిపడి ఒకడుగు వెనక్కి వేసిన మనస్విని... లోపల ఏం జరుగుతోందో అర్థంకాగా నీరసంగా నిస్సత్తువగా వచ్చి హాల్లోని సోఫాలో కూలబడింది. దాదాపు ఇరవై నిమిషాలు దాటాక నలిగిపోయిన చీరని సర్దుకుంటూ ముందుగా రంజని, ఆమె వెనకే హుషారుగా ఈల వేసుకుంటూ భువన్‌ హాల్లోకి వచ్చారు.
సోఫాలో కూర్చుని ఉన్న మనస్వినిని చూసి వాళ్లిద్దరూ కంగారుపడ్డారు. తలొంచుకుని గబగబా వెళ్ళిపోయింది రంజని.
‘‘అసలేం జరిగిందంటే మనూ...’’ సంజాయిషీ ఇవ్వబోతున్న భర్తవైపు ఏహ్యంగా చూసింది మనస్విని.
గిర్రున వెనక్కి తిరిగి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి షర్టు మార్చుకుని బైటకి వెళ్ళిపోయాడు భువన్‌. కడుపులోంచి దుఃఖం తన్నుకునిరాగా రెండుచేతుల్లోనూ మొహాన్ని దాచుకుని వెక్కిళ్ళు పెట్టిన మనస్విని కొంతసేపటికి తనని తనే ఓదార్చుకుని మనసుని స్థిరం చేసుకుంది. పిల్లలు స్కూల్‌నుండి వచ్చే సమయానికి మొహం కడుక్కుని ఫ్రెష్‌గా తయారై కూర్చుంది. తల్లి ఇంట్లోనే ఉండటం చూసి స్కూల్‌ నుండి వచ్చిన పిల్లల మొహాలు వెలిగిపోయాయి. కేకూ సమోసాలూ వాళ్లకి పెట్టి అవి తింటూ వాళ్ళు స్కూల్లో జరిగినవన్నీ చెబుతుంటే వింటూ కూర్చుంది.
ఆ తర్వాత పిల్లలు హోమ్‌వర్క్‌ చేసుకుంటుండగా వంటింట్లోకి వెళ్లిన మనస్విని యాంత్రికంగా వంట చేస్తోందే కానీ ఆమె మనసు కుతకుతా ఉడికిపోతోంది. నిన్నటిరాత్రి ఆనందపుటంచులని చేరుకుంటున్న క్షణాల్లో భర్త పెదవులు ‘రంజనీ, రంజనీ’ అని ఉచ్చరించడం మనస్విని స్పష్టంగా వింది. బాల్యం నుండీ శ్రీరాముడినే ఆరాధ్యదైవంగా కొలిచిన మనస్విని కలలోనైనా పరాయిపురుషుడిని ఊహించుకోలేదెన్నడూ! అలాంటిది- భర్త తన కౌగిట్లో ఉంటూ వేరే స్త్రీని తలుచుకోవడమన్నదే ఆమె ఇంకా జీర్ణించుకోలేదు. అంతలోనే ఈవేళ కళ్ళముందు జరిగినదానితో ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది.
ఎప్పుడో అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్న భువన్‌, పిల్లల గదిలో పడుకున్న మనస్వినిని లేపి మాట్లాడే సాహసం చేయలేక చడీచప్పుడు చేయకుండా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. తప్పు చేసిన వ్యక్తి- చాలా అర్హతలనీ మరెన్నో హక్కులనీ కోల్పోతాడు.

* * * * *

ఆరోజు నుండీ భార్యాభర్తల మధ్యన మాటలు లేవు.
‘‘నీకు విడాకులిచ్చి రంజనిని రెండోపెళ్లి చేసుకుందామనుకుంటున్నాను’’ నాలుగు రోజుల మౌనాన్ని బద్దలు చేస్తూ చెప్పాడు భువన్‌.
మానసికంగానూ పవిత్రంగా ఉండాలనుకునే మనస్వినికి భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న భర్తతో కలిసి ఒకే ఇంట్లో జీవించడమన్నది భరించలేని నరకమే!
అందుకే భర్త చెప్పినదానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే రెండు షరతులను మాత్రం విధించింది. ఒకటి... పిల్లలిద్దరూ ఆమెతోనే ఉంటారు. తనతోగానీ పిల్లలతోగానీ ఏ విధమైన సంబంధాలనీ పెట్టుకునే ప్రయత్నాల్ని అతను చేయకూడదు. రెండు... ఈ పదేళ్ళలో తామిద్దరూ కలిసి జాయింటుగా కొన్న ఇళ్ళస్థలాలతోపాటు, ఈమధ్యే కొనుక్కున్న రెండో ఇంటినీ తన పేరిట మార్పించాలి. సింగిల్‌ పేరెంట్‌గా పిల్లలని పెంచవలసి వచ్చినప్పుడు వెనకాల ఉండే ఆస్తిపాస్తులు మనిషికి చాలా ధైర్యాన్నిస్తాయి. భవిష్యత్తులో తనకిగానీ పిల్లలకిగానీ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా తనకేమైనా జరిగినా తమపేరిట ఆస్తి ఉండటం మంచిదన్న ముందుచూపుతో ఆ షరతుని విధించింది మనస్విని. మొదటి షరతుకి సంతోషంగా సరేనన్నా రెండోదానికి మాత్రం అయిష్టంగానే ఒప్పుకున్నాడు భువన్‌. అయితే రంజని మోజులో ఉన్న భువన్‌కి భార్య ఎక్కువ రాద్ధాంతం చేయకుండా విడాకులకి ఒప్పుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందనే చెప్పొచ్చు. అందుకే భార్య ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని గబగబా విడాకులకి కావలసిన కాగితాలన్నీ సిద్ధంచేసి తెచ్చి, వాటి మీద భార్య సంతకాలని తీసుకున్నాడు. మ్యూచువల్‌ కేసు కాబట్టి త్వరగానే విడాకులు మంజూరయ్యాయి. ఇవన్నీ జరుగుతుండగానే ఆఫీసులో ట్రాన్స్‌ఫర్‌కి అప్లికేషను పెట్టింది మనస్విని. ఎటువంటి పరిస్థితుల్లో బదిలీని కోరుకుంటోందో దాచకుండా అప్లికేషనులో స్పష్టంగా రాసింది. యాజమాన్యం ఆమె అభ్యర్థనని అంగీకరించి ఆమె కోరుకున్నట్లుగానే కెనడాలో ఉన్న బ్రాంచికి ఆమెని బదిలీ చేశారు. జరిగినదంతా తెలుసుకున్న మనస్విని తల్లిదండ్రులూ అన్నావదినలూ చాలా బాధపడ్డారు. తమతో ముందుగా ఒక్కమాటన్నా చెప్పనందుకు నొచ్చుకున్నా ఆమె నిర్ణయాన్ని మాత్రం వాళ్ళెవరూ తప్పుపట్టలేదు. అలా పిల్లలని తీసుకుని కెనడాలో స్థిరపడిపోయిన మనస్విని తిరిగి ఇండియా మొహం చూడలేదు.

* * * * *

‘లంచ్‌ విల్‌ బి సర్వ్‌డ్‌  షార్ట్‌లీ’ అన్న అనౌన్స్‌మెంట్‌తో గత స్మృతుల నుండి బైటికొచ్చిన మనస్విని భోజనం చేసి ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో మనస్వినిని రిసీవ్‌ చేసుకునేందుకు ఆమె అన్నావదినలు పిల్లల్ని తీసుకుని వచ్చారు. చాలా ఏళ్ళకి తన వాళ్ళందరినీ చూసిన మనస్వినికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఓదార్పుగా మనస్వినిని దగ్గరకి తీసుకుంది ఆమె వదిన శ్రీలత. వయసులో వాళ్ళిద్దరికీ తేడా రెండేళ్ళే కావడంవల్ల ఇద్దరిమధ్యా మంచి స్నేహముంది. ఇంట్లోకి వెళ్తూనే పరిగెత్తినట్టుగా అమ్మ గదిలోకి వెళ్ళి మంచంమీద నీరసంగా పడుకున్న తల్లిని వాటేసుకుంది మనస్విని.
‘‘నీమీద బెంగతోనే మీ అమ్మ ఇలా చిక్కిపోయి ప్రాణం మీదకి తెచ్చుకుందిరా. ప్రస్తుతానికి ప్రాణాపాయమేమీ లేదుగానీ సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని చెప్పారు డాక్టర్లు. అన్నింటికంటే ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోమన్నారు. అందుకే నిన్ను చూడాలని తను పదేపదే కలవరిస్తుంటే ఉండబట్టలేక నిన్ను పిలిపించాము’’ ప్రేమగా కూతురి తల నిమిరి చెప్పాడు తల్లి ప్రక్కనే కూర్చున్న తండ్రి.

‘‘అమ్మా, అక్కడ నేనూ పిల్లలూ చాలా సంతోషంగా ఉన్నాం. నిజం చెబుతున్నానమ్మా... నన్ను నమ్ము. నీతినియమాలని నాకు ఉగ్గుపాలతో నేర్పించావు నువ్వు. వాటన్నింటినీ గాలికొదిలేసిన వ్యక్తితో విడిపోయాక నేనిప్పుడు హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నువ్వు అనవసరంగా నాపై బెంగపెట్టుకుని నీ ఆరోగ్యం పాడుచేసుకున్నావంటే నామీద ఒట్టే’’ తల్లి చేతులు పట్టుకుని ఆర్ద్రంగా చెప్పింది మనస్విని.
ఆ తల్లి హృదయం కూతురి మాటలకి కాస్త తేటపడింది.

* * * * *

ఆత్మీయుల సమక్షంలో వారంరోజులు ఇట్టే గడిచిపోయాయి. వాళ్ళ మాటల్లో వద్దన్నా మనస్వినికి భువన్‌ గురించిన వివరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘వాడి రెండో పెళ్ళాం వాడ్ని కూర్చోనివ్వదూ నుంచోనివ్వదట.
దానిది పెద్ద నోరట! నీకింత అన్యాయం చేసినందుకు వాడికి తగిన శాస్తి జరిగిందిలే. ఇప్పుడు రెండో పెళ్ళాం నోటికి జడిసి కుక్కిన పేనల్లే పడుంటున్నాడట. వాళ్ళ వ్యవహారాన్ని మీ అన్నయ్య ఒకమారు స్వయంగా చూశాడట- ఏదో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో...’ తల్లి మాటలకి ఔనన్నట్టుగా తలూపాడు మనస్విని అన్నయ్య.
భువన్‌ గురించిన విషయాలపై మనస్విని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఒకసారి వద్దనుకుని విడిపోయిన తర్వాత ఆ మనిషిని తలుచుకోవడంలో అర్థంలేదన్నది ఆమె ఉద్దేశ్యం.

* * * * *

తిరుగు ప్రయాణం రెండురోజుల్లోకి వచ్చేసింది. పిల్లలకోసం బట్టలు కొనాలని మనస్వినిని తీసుకుని ఆమె అన్నావదినలు మాల్‌కి వెళ్ళారు. ఎస్కలేటర్‌ మీద మూడో ఫ్లోర్‌కి చేరుకుంటుండగా పైనుండి పెద్దగా మాటలు వినిపిస్తుంటే పైకి చూశారంతా. ‘‘మిమ్మల్నే, అలా దిక్కులు చూడకపోతే ఈ చంటిదాన్ని చేయి పట్టుకోకూడదూ! ఆ పిల్లగానీ కింద పడిందంటే మీ వీపు చీరేస్తా, ఏమనుకుంటున్నారో! ఎరక్క చేసుకున్నాను బాబూ... ఈ దేభ్యం మొహాన్ని’’ నలిగిపోయిన ప్యాంటూ షర్టూ వేసుకున్న ఆ వ్యక్తి రెండు చేతుల్లోనూ షాపింగ్‌ చేసిన సంచులున్నాయి. ఆవిడ చేతులు ఖాళీగా ఉంచుకుని అప్పుడప్పుడూ సుతారంగా పైట సర్దుకోవడం, లేదా మెళ్ళో గొలుసుల్ని సవరించుకోవడం చేస్తూ మధ్యమధ్యలో అతన్ని గదమాయిస్తోంది. భువన్‌ని అక్కడ అలా చూసి నివ్వెరబోయింది మనస్విని!
ఎవరో చెబుతుండగా వినడం వేరు, స్వయంగా చూడడం వేరు. టిప్‌టాప్‌గా ఇస్త్రీ చేసిన ప్యాంటూ షర్టూ వాటిమీద మ్యాచింగ్‌ బ్లేజర్‌ వేసుకుని టై కట్టుకుని ఠీవిగా ఉండే భువన్‌ ఇలా సాదాసీదాగా తలొంచుకుని నిలబడి భార్య తిట్లని మౌనంగా భరిస్తుంటే మనసంతా కలిచివేసినట్లయిందామెకి. షాపింగ్‌ పూర్తి చేసుకుని లిఫ్ట్‌ ఎక్కబోతుండగా ‘మనూ’ అన్న పిలుపుకి వెనక్కి తిరిగింది మనస్విని. ఎదురుగా భువన్‌! పరిస్థితిని అర్థం చేసుకుని కార్‌ పార్కింగ్‌ వద్ద ఉంటామని చెప్పి వెళ్ళారు మనస్విని అన్నావదినలు. ఏం మాట్లాడాలో అతన్నెలా పలకరించాలో అర్థంకాక మౌనంగా నిలబడింది మనస్విని.
‘‘మనూ, నన్ను క్షమించు. నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షనే అనుభవిస్తున్నాను. రంజనితో పెళ్లి జరిగిన పదిరోజులకే తనకీ నీకూ మధ్య తేడా నాకు స్పష్టంగా తెలిసొచ్చింది. తాగుబోతు తండ్రి తనకి పెళ్లి చేయలేడనీ స్వయంగా తనే రంగంలోకి దిగితే కానీ తన పెళ్లి జరగదనీ తెలివిగా నన్ను ట్రాప్‌ చేసిన రంజనికి నా చేతిలోని అధికారాలన్నింటినీ లాక్కోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మనమధ్య కేవలం అభిప్రాయభేదాలు మాత్రమే ఉండేవి. కానీ రంజని నా జీవితంలోకి వచ్చాక నాకంటూ అభిప్రాయాలే లేకుండా పోయాయి. చావలేక బతకలేక ఇలా ఈడుస్తున్నాను.’’
నిరాసక్తిగా వింటూండిపోయింది మనస్విని.
‘‘ఏమండోయ్‌, ఎక్కడ చచ్చారు? ఈ పిల్లదానికి తినేందుకేవో కావాలట, కొనిచ్చి చావండి’’ దూరంనుండి ఉరుములా వినిపించిన భార్య కేకకి ఉలిక్కిపడిన భువన్‌- ‘‘ఇదిగో వస్తున్నా’’ అంటూ పరిగెత్తుకుని వెళ్ళాడు.
‘‘రంజనితో ఎన్నో విధాలుగా సర్దుకుపోతున్న నేను... ఆనాడు నీతో ఒకటి రెండు విషయాల్లోనైనా సర్దుకుని ఉంటే మన వివాహబంధం అంత సులభంగా తెగిపోయేది కాదేమో మనూ’’ వెళ్తూవెళ్తూ అతనన్న మాటలు చెవుల్లో గింగురుమంటుంటే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనమేముంటుంది’ అనుకుంది మనస్విని నిర్వేదంగా.

(5  మే 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.