close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడవి బిడ్డల ఆత్మబంధువు!

వాళ్లంతా ఒకప్పుడు అడవిలోనూ దాని చుట్టుపక్కలా బతికేవారు. చిరుధాన్యాలు పండించుకుని, వాటికి అడవుల్లో దొరికే ఆకులూ దుంపలూ చేర్చి వండుకు తింటూ ప్రశాంతంగా గడిపేవారు. నాగరికత పెరిగినకొద్దీ అడవులు చిక్కిపోయాయి. వానలు ముఖం చాటేశాయి. దాంతో అడవి దూరమై, పొలం బీడై, బతుకుతెరువుకి వలసబాట పట్టిన అడవిబిడ్డలు నగరాల్లో కూలీలయ్యారు. వారి భార్యాబిడ్డలు పల్లెల్లో జీవచ్ఛవాల్లా బతుకులీడుస్తున్నారు. ఆ పరిస్థితి చూసి చలించిన ఓ యువకుడు వారి సంక్షేమమే లక్ష్యంగా ‘సంపర్క్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. మూడు దశాబ్దాల ‘సంపర్క్‌’ ప్రయాణమూ దాని సారథిగా నీలేష్‌ రగిల్చిన స్ఫూర్తీ ఆ ఆదివాసీ సమాజంలో తెచ్చిన మార్పులు అభినందనీయం.

‘నేను ఝాబువాలో పనిచేస్తా...’ నీలేష్‌ ఆ మాట చెప్పగానే తండ్రి ఉలిక్కిపడ్డాడు. కొడుక్కి ఎవరూ పిల్లనివ్వరేమోనని తల్లి భయపడింది. ఝాబువా అంటే ఆరోజుల్లో పేదరికానికి చిరునామా. దొంగలూ, నేరస్థులకు కేరాఫ్‌ అడ్రసు. ఎవరైనా వెళ్లాలంటేనే భయపడే ఆ ప్రాంతాన్ని తన కార్యస్థలంగా ఎంచుకున్నాడు ఆ యువకుడు. అందుకు కారణమూ ఆ తల్లిదండ్రుల పెంపకమే.

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే క్లర్కుగా పనిచేస్తున్న దినకర్‌ దేశాయ్‌ కార్మికనాయకుడు కావడంతో రైల్వే సిబ్బంది ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరకే వచ్చేవారు. కొడుకులిద్దరిలో చిన్నవాడైన నీలేష్‌కి తండ్రితో అనుబంధం ఎక్కువ. పెద్ద పెద్ద ట్రేడ్‌ యూనియన్‌ నేతలతో తండ్రి మాట్లాడడమూ, ఆయన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే కార్మికులకు తల్లి వంట చేసి పెట్టడమూ చూస్తూ పెరిగిన నీలేష్‌ తానూ పెద్దయ్యాక తండ్రిలాగా అందరికీ ఉపయోగపడే పనిచేయాలనుకునేవాడు. సోషల్‌ వర్‌్్కలో కార్మికసంక్షేమం గురించి ఉంటుందనీ అది చదవమనీ తండ్రి చెబితే పీజీలో చేరాడు కానీ ఫీల్డ్‌వర్కులో భాగంగా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు చలించి గ్రామీణాభివృధ్ధి ప్రధానాంశంగా పీజీ పూర్తిచేశాడు. ఓరోజు పత్రిక తిరగేస్తున్న నీలేష్‌ని అందులోని ఓ వ్యాసం ఆకట్టుకుంది. రాజస్థాన్‌లోని టిలోనియాలో బేర్‌ఫుట్‌ కాలేజీ నెలకొల్పిన బంకర్‌ రాయ్‌ రాసిన వ్యాసం అది. వెంటనే టిలోనియా వెళ్లి రాయ్‌ని కలిశాడు. వారి కార్యక్రమాలు బాగా నచ్చి తానూ అక్కడే పనిలో చేరిపోయాడు. బంకర్‌ రాయ్‌ మార్గదర్శకత్వంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓసారి మాటల సందర్భంలో ఝాబువాలో ఆదివాసీల ప్రస్తావన వచ్చింది. తమ పొరుగు జిల్లాయే అయినా ఝాబువా అంటేనే జనాలు భయపడతారనీ, అక్కడి వారంతా దొంగలూ, నేరస్థులని ముద్రపడిపోయిందనీ తనకి వారితో పనిచేసి మార్పు తేవాలనుందనీ చెప్పాడు నీలేష్‌. రాయ్‌ ప్రోత్సాహంతో నీలేష్‌ ఝాబువా వెళ్లి ‘సంపర్క్‌ సేవా సంస్థ’ని ప్రారంభించాడు.

అప్పు చేసి రాఖీ బహుమతి
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తాగునీటి పైలట్‌ ప్రాజెక్టులో ఝాబువా కూడా ఉండడంతో నీలేష్‌ని కమిటీ సభ్యుడిగా చేర్చారు రాయ్‌. మూడేళ్లు ఆ ప్రాజెక్టులో పనిచేసిన అనుభవం నీలేష్‌కి బాగా
ఉపయోగపడింది. మధ్యప్రదేశ్‌లోని ఈ జిల్లా జనాభాలో 90శాతం భిల్లులుగా పేర్కొనే ఆదివాసీలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ వారిని చేరకపోవడంతో వారి కుటుంబాలు దారిద్య్రానికి చిరునామాగా ఉండేవి. అలాంటి చోట సంస్థను ప్రారంభించిన నీలేష్‌ మొదట తన ఈడువారితో స్నేహం చేసి భిల్లుల కుటుంబ, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకున్నాడు. తరతరాల సంప్రదాయాలు వారిపాలిట గుదిబండలవుతున్న వైనాన్ని అర్థం చేసుకున్నాడు. కన్యాశుల్కమూ, చావు విందులూ తలకుమించిన భారాలై కుటుంబాలను అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నాయి. ఆఖరికి రాఖీ బహుమతి కోసం కూడా అప్పుచేస్తారని తెలిసి ఆశ్చర్యపోయాడు నీలేష్‌. ఆ పరిస్థితులే వారిని చెడుదారులు పట్టిస్తున్నాయని అర్థం చేసుకున్న నీలేష్‌ రోజూ వారితో గంటల తరబడి మాట్లాడేవాడు. తమకు నష్టం కలిగించే సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు కానీ నిజానికి మేలు చేసే కొన్ని సంప్రదాయాలూ ఆదివాసీ సమాజంలో ఉన్నాయని గుర్తుచేశాడు. పదిహేను కుటుంబాలను ఒక బృందంగా చేసి అందరూ అందరి పొలాల్లో కలిసి పనిచేసేలా ఒకప్పటి సంప్రదాయాన్ని ఆచరణలోకి తెచ్చాడు. కూలీల కోసం డబ్బు ఖర్చుపెట్టనక్కరలేకుండా అందరి పనులూ జరిగిపోవడం వారికి నచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకుని నీలేష్‌ తన అభివృద్ధి పథకాలకు రూపం ఇచ్చాడు. ముఖ్యంగా పిల్లల చదువు, పెద్దల ఆర్థిక సాధికారత, వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి నీటి సంరక్షణ చర్యలు... ఈ మూడు రంగాలనూ ఎంచుకున్నాడు. అయితే నేరుగా పనిలోకి దిగకుండా ముందుగా ప్రజలతో మమేకం కావడానికీ పరిస్థితుల పట్ల వారిలో అవగాహన కల్పించడానికీ కొంత సమయం తీసుకోవాలనుకున్నాడు.

ముందు చెప్పాలి..!
మార్పుని ఎవరిమీదా బలవంతంగా రుద్దలేం, మారాలన్న కోరిక వాళ్లలోనే రావాలి... అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని టిలోనియాలో నేర్చుకున్న పాఠాన్ని ఆచరణలో పెట్టాడు నీలేష్‌. అందుకని ముందుగా ‘లోక్‌ జాగృతి మంచ్‌’ నెలకొల్పి వీధి నాటకాలూ రచ్చబండ చర్చల ద్వారా తాను చెప్పాలనుకున్నది చెబుతూ ప్రజల్ని సంఘటితం చేసేవాడు. అప్పుడు మెల్లగా యువతనీ, పెద్దలనీ, స్త్రీలనీ వేర్వేరు బృందాలుగా ఏర్పాటుచేసి మంచ్‌ ఆధ్వర్యంలో వారికి వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీలూ, వైద్య ఆరోగ్య కమిటీలూ, కోళ్లపెంపకం కమిటీలూ... ఇలాంటివన్నీ ఈ జనచైతన్య వేదిక కింద పనిచేస్తాయి. ఒకప్పుడు ఝాబువాలో ప్రజలు ఏ అవసరానికైనా డబ్బు కావాలంటే వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవారు. స్త్రీపురుషులకు వేర్వేరుగా పొదుపు బృందాలు ఏర్పాటుచేసి నామమాత్రపు వడ్డీతో అవసరాలకు రుణాలు అందజేస్తూ వారికి చేరువైంది సంపర్క్‌. మార్పు దిశగా పడిన తొలి అడుగు అది. వ్యక్తి, కుటుంబం, గ్రామం... ఇలా ప్రతి స్థాయిలోనూ స్వావలంబన ఎంత ముఖ్యమో వారి మనసుల్లో పాతుకుపోయేలా చెప్పేవాడు నీలేష్‌. దాన్ని త్వరగానే అర్థం చేసుకున్న ప్రజలు నిస్సంకోచంగా ‘సంపర్క్‌’ బాట పట్టారు.  అప్పుడిక కార్యాచరణ ప్రారంభించి మొట్టమొదట నీటిసంరక్షణ మీద దృష్టి పెట్టాడు నీలేష్‌.

కలిసి కదిలారు!
ఒకటీ రెండెకరాల చొప్పున పొలం ఉన్నవాళ్లు కూడా నీళ్లు లేక సాగుచేయకపోవడంతో పొలాలన్నీ బీడుబారిపోయాయి. నీటి సంరక్షణకు ఒకప్పుడు ఏం చేసేవారో అక్కడి ఆదివాసీ పెద్దలతోనే చెప్పించాడు నీలేష్‌. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు కూడా నీటిని పొందవచ్చని చెప్పి సంపర్క్‌ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకుని శ్రమదానం ప్రారంభించారు. చెక్‌డ్యాములు కట్టారు. చెరువులూ కుంటలూ తవ్వారు. వందలాది బావుల పూడిక తీశారు. వాన నీటిని వృథాగా పోనీయకుండా ఏం చేయొచ్చో అన్నీ వారితో కలిసి చేసి చూపించాడు నీలేష్‌. ఆఖరికి స్కూలు భవనాల మీద పడే వాన నీటిని ట్యాంకులో సేకరించి తాగునీరుగా వాడుకోవడమూ మొదలెట్టారు. రెండు మూడేళ్లు క్రమం తప్పకుండా చేపట్టిన చర్యలు ఫలితాన్నివ్వడంతో చెరువులు నిండాయి. రైతులంతా నాగలి పట్టారు. అలా నీటి సంరక్షణకు వీరు చేపట్టిన చర్యలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలందుకున్నాయి. ‘మేం చేపట్టిన చర్యలన్నీ కూడా ఎక్కడైనా ఎవరైనా చేయగలిగినవే’ అనే నీలేష్‌ నీటి సమస్య తీరగానే చదువు మీద దృష్టిపెట్టాడు.

టీచర్లూ ఆదివాసీలే...
బడి అంటే పిల్లల్ని ఆకట్టుకునేలా ఉండాలి. వారు మాట్లాడే భాషలోనే ఆటాపాటలతో చదువు చెప్పాలి. ఆదివాసీల భాష వేరు. కానీ అక్కడ బడుల్లో హిందీ మాధ్యమం ఉంటుంది. దాంతో పిల్లలు బడి ముఖం చూడకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ‘సంపర్క్‌’ కలుగజేసుకుని అక్షరజ్ఞానం లేని పెద్దలూ పిల్లలకోసం రాత్రి పాఠశాలలను ప్రారంభించింది. కాస్త చదువుకున్న ఆదివాసీ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి టీచర్లుగా నియమించడంతో భాష సమస్య కాలేదు. ఆ తర్వాత మెల్లగా ప్రభుత్వమే ప్రాథమిక పాఠశాలల్నీ వయోజన విద్యాకేంద్రాల్నీ నెలకొల్పింది. రాత్రి పాఠశాలల అవసరం తీరిపోవడంతో వాటిని విద్యావికాస కేంద్రాలుగా మార్చి పిల్లలకు సైన్సు, గణితం, ఆంగ్లం లాంటివి నేర్పిస్తున్నారు. వందలాది పిల్లలు ఈ కేంద్రాల ద్వారా బడిలో తాము నేర్చుకునే పాఠాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. బడికి వెళ్లని పిల్లలంటూ ఎవరూ లేకుండా చూడడానికి గ్రామాల్లోని ‘సంపర్క్‌’ కార్యకర్తలు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. ఎవరైనా బడి మానేసినట్లు తెలియగానే వెళ్లి పెద్దలకు నచ్చజెప్పి మళ్లీ పంపించేలా చూస్తారు. 30 గ్రామాల్లోని పిల్లలు క్రమం తప్పకుండా ‘బాలపంచాయతీ’లు నిర్వహిస్తారు. స్కూల్‌ క్యాంటీన్లో మెనూ ఏం ఉండాలన్న విషయం నుంచి ఆడుకునే ఆటలవరకూ అన్నీ మాట్లాడుకుంటారు. దీని వల్ల పిల్లలకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ, నాయకత్వ లక్షణాలూ అలవడతాయంటాడు నీలేష్‌. గ్రామాల్లో తిరుగుతూ పిల్లలకు అవసరమయ్యే పుస్తకాలను అందించడానికి మొబైల్‌ లైబ్రరీనీ, పిల్లలూ టీచర్లూ ఉపయోగించుకునేందుకు వీలుగా ఓ సైన్స్‌ సెంటర్‌నీ ఏర్పాటు చేశారు.

బునియాదీ శాలా
తల్లిదండ్రులు వలసవెళ్లడం వల్ల చదువూ సంధ్యా లేకుండా తిరుగుతున్న పిల్లలకోసం ఆశ్రమ పాఠశాల పెట్టాలని భావించిన నీలేష్‌ భార్య ప్రక్షాళితో కలిసి ‘బునియాదీ శాలా’ పేరుతో పాఠశాలను ప్రారంభించారు. చదువూ పనీ రెండూ కలిపి నేర్చుకున్నప్పుడే విద్యార్థుల్లో పరిపూర్ణ వ్యక్తిత్వవికాసం సాధ్యమని నమ్మిన ఈ భార్యాభర్తలు బునియాదీ శాలా విద్యార్థులకు మామూలు చదువుతో పాటు వ్యవసాయమూ వృత్తివిద్యలూ కూడా నేర్పించడం మొదలెట్టారు. 350 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూనే కూరగాయలు పండిస్తారు. పాడిపశువుల్ని చూసుకుంటారు. చెత్తను కంపోస్టు ఎరువుగా తయారుచేసి విక్రయిస్తారు. కొవ్వొత్తులూ, పలురకాల ఆయుర్వేద ఉత్పత్తులూ తయారుచేస్తారు. పదో తరగతి అయ్యేసరికల్లా పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి ఈ పనులు తోడ్పడతాయంటాడు నీలేష్‌.

ఇంటి వద్దే ఉండి...
వలసల్ని ఆపడానికి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించిన నీలేష్‌ స్త్రీల అజమాయిషీలోనే ఆ పని ఉండాలని కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. అందులో మహిళలకు శిక్షణ ఇవ్వడానికి వ్యవసాయ విజ్ఞానకేంద్రం అధికారుల సాయంతో వర్కుషాపులు నిర్వహించారు. శుభ్రమైన పరిసరాలూ, సరైన ఆహారమూ, సమయానికి వ్యాక్సిన్లు వేయడమూ... లాంటి జాగ్రత్తలతో కోళ్ల పెంపకాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకోవడమెలాగో చూపించారు. కోళ్లను పెంచేవారికి మార్గదర్శకత్వం వహించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన మహిళలను ‘ముర్గీ సఖీ’లుగా నియమించారు. నామమాత్రపు ఫీజుతోనే వీళ్లు గ్రామాలకు వెళ్లి కోళ్లకు వ్యాక్సిన్లు, నట్టల మందులు ఇస్తారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చింది. ఇప్పుడు ఝాబువాలోని 352 గ్రామాల్లో 35వేల కుటుంబాలు కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. చూడడానికి మామూలు విషయంలా ఉన్న ఈ పని మొత్తంగా ఆ ఆదివాసీ సమాజం మీద చూపిస్తున్న ప్రభావం చెప్పుకోదగ్గది. ఒక్కో కుటుంబానికీ ఎంత లేదన్నా ఏడాది తిరిగేసరికి లక్ష రూపాయల ఆదాయం కోళ్ల వల్లే లభిస్తోంది. ఒకప్పుడు పూర్తిగా పురుషుల మీద ఆధారపడి బానిసల్లా బతికిన మహిళలు ఇప్పుడు స్వయంగా సంపాదిస్తుండడంతో కుటుంబ ప్రాధాన్యాలు మారిపోయాయి. ఇంటిల్లిపాదీ మంచి ఆహారం తీసుకోగలుగుతున్నారు. వలసలు తగ్గి కుటుంబాలు ఒకేచోట స్థిరంగా ఉండటం వల్ల పిల్లల చదువులు గాడినపడ్డాయి. నాలుగైదేళ్లుగా ఈ పనిలో ఉన్నవారు ఇప్పటికే కాస్త డబ్బు వెనకేసుకుని వ్యవసాయం మీద దృష్టిపెడుతున్నారు.

విత్తన నిధి
నీటి సంరక్షణ చర్యల వల్ల సమస్య తీరడంతో వ్యవసాయం మొదలెట్టిన రైతులకు కొత్త సమస్య వచ్చింది. అప్పు చేసి విత్తనాలూ ఎరువులూ కొని వేస్తే పంట ఏపుగా పెరుగుతోంది కానీ ధాన్యం కంకి బోలుగా తయారవుతోంది. విత్తనాలు మంచివి కాకపోవడమే దానికి కారణమని తెలుసుకున్న నీలేష్‌ దేశంలోని వివిధ ప్రాంతాలనుంచీ పాత విత్తనాలను సేకరించి విత్తన బ్యాంకును ఏర్పాటుచేశాడు. రైతులు ఎవరైనా సరే తమకు కావలసిన విత్తనాలను అక్కడ ఉచితంగా తీసుకోవచ్చు. పంట బాగా పండితే అప్పుడు తీసుకున్న ధాన్యానికి రెట్టింపు ఇవ్వాలి. జన్యుపరంగా బలంగా ఉండే నాటు విత్తనాలు మంచి దిగుబడి ఇవ్వడంతో అవి తీసుకుని రైతులు ఉత్సాహంగా సాగుచేస్తున్నారు. అలాంటి రైతుల్ని ప్రోత్సహిస్తూ ‘బీజ్‌ స్వరాజ్‌ అభియాన్‌’ అనే రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్‌ని ప్రారంభించాడు నీలేష్‌. ఇప్పటికే మూడు జిల్లాల్లో సంపర్క్‌ ఏర్పాటు చేసిన నాలుగు సీడ్‌ బ్యాంకుల్లో గోధుమా, వరీ, కూరగాయల విత్తనాలూ రైతులకు అందుబాటులో ఉన్నాయి.

అలా మెల్లగా ఒక్కో అడుగూ వేస్తూ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి విస్తరిస్తూ ‘సంపర్క్‌’ ఇప్పుడు నాలుగు జిల్లాల్లో 717 గ్రామాల్లో మార్పు దిశగా బలమైన పునాది వేసింది. 55వేల కుటుంబాలు లబ్ధిపొందాయి.
50 మంది సిబ్బంది కాకుండా 75 మంది పూర్తిస్థాయి కార్యకర్తలూ మరో 300 మంది పార్ట్‌టైమ్‌ కార్యకర్తలూ సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఝాబువాలోని పలు గ్రామాల్లో కిరోసిన్‌ దీపాల స్థానంలో సౌరశక్తి వచ్చింది. కట్టెల పొయ్యిలు పొగలేని పొయ్యిలయ్యాయి. ఊరిలో ఉంటూనే ఈ ఆదివాసీలు అడవుల్నీ సంరక్షించుకుంటున్నారు. గ్రామసభల్లో మహిళల గొంతు వినపడుతోంది. మహిళలే ఆరోగ్యకార్యకర్తలుగా శిక్షణ పొంది ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట వేశారు. ముప్పైఏళ్ల ఈ ప్రయాణంలో సంపర్‌్్క మూడోతరం భిల్లులతో కలిసి పనిచేస్తోంది.

* * * * *

నీలేష్‌కన్నా ముందు ఝాబువాని సంస్కరించాలని చాలామంది ప్రయత్నించారు. వారంతా దూరంగా నగరాల్లో ఉంటూ వీలైనప్పుడు వెళ్లి చేతనైనది చేసొచ్చేవారు. వారు
భిల్లులకోసం పనిచేయాలనుకున్నారు కానీ, భిల్లులతో కలిసి పనిచేయాలనుకోలేదు. అదే వారికీ, నీలేష్‌కీ మధ్య తేడా.
భిల్లుల సమాజంతో మమేకమైన నీలేష్‌ ముందు వారి ప్రేమనీ నమ్మకాన్నీ గెలుచుకున్నాడు. వాటిని పునాదిగా చేసుకుని మార్పుకి దారి వేశాడు.
ఆ దారిలో తాను వెంట ఉండి భిల్లుల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఝాబువా మార్పుకి కేరాఫ్‌ అడ్రస్‌. స్వావలంబనకి చిరునామా. అందుకే ఇప్పుడెవరూ అక్కడికి వెళ్లడానికి భయపడరు!


ఇద్దరిదీ... ఒకటే దారి!

ల్లెల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేనసలు పెళ్లే చేసుకోవద్దనుకున్నా. బంధువుల ద్వారా ప్రక్షాళి సంబంధం వచ్చినప్పుడు తనకి నేను ఝాబువాలో పనిచేస్తాననీ, జీతం రూ.500 మాత్రమేననీ చెప్పా. కళాకారిణీ, రచయిత్రీ అయిన ప్రక్షాళి తనకూ గాంధీజీ ఆశయాలంటే ఇష్టమనీ నాతో కలిసి పనిచేస్తాననీ తన అమ్మానాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అలా మొదటి నుంచీ మా ఇద్దరిదీ ఒకటే బాట. సమాజం కోసం కాదు, సమాజంతో కలిసి పనిచేయడం, పనిచేస్తున్న చోట వారితో కలిసి ఉండడం, కొన్నాళ్లు పనిచేసి తిరిగి వెళ్లిపోకుండా చివరిదాకా అక్కడే ఉండటం... ఇదీ మేం నమ్మిన బాట. ఆ బాటలోనే నడుస్తున్నాం. స్కూలు, చదువుకు సంబంధించిన పనులన్నీ ప్రక్షాళి చూసుకుంటుంది. మాకు ఒక్కతే అమ్మాయి. తను కూడా పదో తరగతి వరకూ ఇక్కడే చదువుకుంది. వివిధ సంస్థల ఆర్థిక చేయూతా, గ్రామస్థుల సహకారమూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి.


(28 ఏప్రిల్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.