close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతిమ కోరిక

- సరస్వతుల విజయలక్ష్మి

సుందరంగారికి దాహం వేసింది- టేబుల్‌ మీద చూస్తే సీసా లేదు. ఫ్రిజ్‌లోంచి మంచినీళ్ళ సీసా తీసుకుని గదిలోకి వెళుతున్నారు. కొడుకుల మాటల్లో తమ పేర్లు వినిపించడంతో ఆగి విన్నారు. వాళ్ళ మాటలు వింటూంటే గుండెల్లో గునపాలు దించినట్లు బాధ కలిగింది. ఏమిటీ... వీళ్ళు ఇలా తయారయ్యారు? నా పిల్లలేనా అందరి పిల్లలూ ఇలాగే ఉన్నారా?
మా పెంపకం లోపమా? మేం వీళ్ళకి ఏం అన్యాయం చేశాం?

ప్రతీ తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని కంటిపాపల్లా పెంచుతారు. అలాంటి తల్లిదండ్రులకి కాస్త అన్నం పెట్టడానికి ఎంత ఆలోచిస్తున్నారు? తల్లీ తండ్రీ ఒకేచోట ఉంటే ఇద్దర్ని పోషించటం కష్టమట. తల్లి ఒకరి దగ్గరా తండ్రి ఒకరి దగ్గరా ఉండాలట. వాళ్ళు వంతులు వేసుకుని మమ్మల్ని పంచుకోవటం ఏమిటి? ఈ వయసులో పెద్దవాళ్ళం విడివిడిగా ఉండటం కష్టం కాదా? ఆ మాత్రం తెలియదా? ఇంతింత సంపాదిస్తున్నారు... తల్లిదండ్రులకు తిండి పెట్టలేరా... ఏం పిల్లలూ, ఏం అభిమానాలు..?

లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నారుగానీ కంటిమీద కునుకు లేదు. మనసు గతంలోకి వెళ్ళిపోయింది. సుందరంగారికి ఇద్దరే అబ్బాయిలు. బాగా చదివించారు. మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు చేశారు. ఉద్యోగరీత్యా భార్యలతో చెరో రాష్ట్రం వెళ్ళిపోయారు. సుందరంగారు ఈ మధ్యనే రిటైర్‌ అయ్యారు. సొంత ఇల్లు ఉంది. కాస్త పొలాలు ఉన్నాయి. పెన్షన్‌ వస్తోంది. చీకూచింతా లేకుండా రోజులు గడిపేస్తున్నారు. ఎవరన్నా వచ్చి ‘మీవల్ల ఈ సహాయం కావాలి’ అంటే భార్యాభర్తలు వెంటనే చేస్తారు. సుమతి కూడా చుట్టుపక్కల ఆడవారికి అన్నివిధాలా సహాయం చేస్తుంది. వాళ్ళని అందరూ ‘ఆదర్శ దంపతులు’ అంటారు.
పువ్వులన్నా ఆడపిల్లలన్నా సుమతికి చాలా ఇష్టం. అందుకే ఇంటిముందు గార్డెన్‌ పెంచింది. ఇరుగుపొరుగు పిల్లలకి పూలజడలు వేసి మురిసిపోతుంది. తనకి ఆడపిల్లలు లేరు కదా అని వారితో తన ముచ్చట తీర్చుకుంటుంది. రాత్రి ఎనిమిది గంటలు అయ్యేసరికి భార్యాభర్త లిద్దరూ భోజనాలు చేసి పూలమొక్కల మధ్య కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. పిల్లల కబుర్లూ పాత సినిమాలూ... అదీ ఇదీ అని లేదు... ఆవగింజ మొదలు అమెరికా వరకూ అన్ని విషయాలూ చర్చించుకుంటారు.

అడపాదడపా ఆ దారిన వెళ్ళేవాళ్ళు వచ్చి కూర్చుని భాగవతంలో పద్యాలు పాడమంటారు. ఆయన స్కూలు, కాలేజీ రోజుల్లో పౌరాణిక నాటకాలు వేస్తే వన్స్‌మోర్‌ అంటూ చప్పట్లు కొట్టేవారట అందరూ. ఆయన కమ్మగా పాడుతూ ఉంటే పరవశించిపోతారు శ్రోతలు. శివపార్వతుల్లాంటి ఆ దంపతులు అలా అందరితో కలిసిమెలిసి ఉండేవారు. పండగ వచ్చిందంటే పిల్లలు వస్తారు. వాళ్ళతో సరదాగా గడిచిపోతుంది. పిల్లలు వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళిద్దరే మిగులుతారు.

* * * * *

‘‘ఓ సుమతీ... సుమా... సుమ్మూ... అయిందా నీ పూజ? నీకో శుభవార్త.’’
‘‘ఏమిటండీ ఏమిటి... పెన్షన్‌ ఏమైనా పెరిగిందా?’’
‘‘అబ్బా, నీకు ఎప్పుడూ డబ్బు గోలేనా?’’
‘‘అంతకంటే ఇంకేమి ఉంటాయి శుభవార్తలు? అయినా ఆ పిలుపు ఏమిటండీ ‘సుమ్మూ, కుమ్మూ’ అంటూ- లక్షణంగా సుమతి అని పేరుంటే.’’
‘‘కొంపదీసి నన్ను కుమ్మేస్తావా ఏమిటే?’’
‘‘అయ్యో, ఎంతమాట. పతియే ప్రత్యక్షదైవం కదా. మిమ్మల్ని ఎలా కుమ్ముతాను చెప్పండి? ఇంతకీ ఏమిటి శుభవార్త?’’
‘‘రవి ఫోన్‌ చేశాడు. పిల్లలకి సెలవులట. మనల్ని చూడాలని ఉందిట మనవలకి. అందుకని వెంటనే రమ్మని చెప్పాడు.’’
‘‘మన పిల్లలకంటే మనవలే నయం, మనల్ని చూడాలనుకుంటున్నారు. మరింకేం, పదండి వెళ్ళివద్దాం. ముద్దువస్తే చంక ఎక్కాలి, పిలుపు వస్తే బండి ఎక్కాలి’’ అంది సుమతి.
‘‘నీకు ఎక్కడికీ వెళ్ళటం ఇష్టం ఉండదు కదా. ‘పైవాళ్ళ ఇంటికి వెళ్ళి పరమాణ్ణం తినేకంటే, మనింట్లో ఉండి మజ్జిగ తాగడం మంచిది’ అంటావు కదా.’’
‘‘చాల్లెండి సంబడం, ఎవరైనా వింటే నవ్విపోతారు. మన పిల్లలు పైవాళ్ళా? వాళ్ళ ఇల్లయితే ఒకటీ మన ఇల్లయితే ఒకటీనా? వెంటనే వెళ్ళి టిక్కెట్లు తెండి. మీతో తథా అంటే అరవైఏళ్ళు పడుతుంది.’’
‘‘బాగుంది, ‘లేడికి లేచిందే పరుగు’ అంటే ఎలాగే. కాసేపాగి వెళతాలే.’’

* * * * *

స్టేషన్‌కి కొడుకూ మనవలూ వచ్చారు. ‘‘నాన్నగారూ బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా అమ్మా?’’ అడిగాడు కొడుకు రవి.
సామాన్లు కారులో పెట్టి బయలుదేరారు. దార్లోనే అన్ని సంగతులూ నానమ్మతో చెప్పేశారు మనవలు.
ఇల్లు చేరుకునేసరికి కోడలు బయటికి వచ్చి ‘‘ప్రయాణం బాగా జరిగిందా? ఏమీ ఇబ్బంది పడలేదు కదా’’ అంది.
‘‘బాగానే జరిగిందమ్మా’’ అని చెప్పి, మనవలకి తెచ్చిన గిఫ్ట్‌లూ డ్రెస్సులూ స్వీట్సూ అన్నీ ఇచ్చేసింది.
‘‘థ్యాంక్స్‌ నాయనమ్మా’’ అని చెప్పి సంతోషంగా అవి పట్టుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు.
కొడుకు బయటికి వెళ్ళాడు. టిఫిన్లూ కాఫీలూ అయ్యాక కబుర్లలోపడ్డారు.
‘‘ఎలాగుందమ్మా నీ ఉద్యోగం’’ అని అడిగింది కోడల్ని.
‘‘ఏం చెప్పమంటారు... పొద్దున లేచింది మొదలు వంటలూ టిఫిన్లూ పిల్లల పనీ, మేం ఆఫీసుకి పరుగులూ. సాయంత్రం మళ్ళీ వచ్చింది మొదలు పనులు- మర్నాటికి కావలసినవి చూసుకోవటం. రాత్రి ఇలా కన్ను మూసి తెరిచేసరికి తెల్లారిపోతుంది. ఈ పరుగులతో ఏ పనిమీదా స్థిరం లేకపోతోంది. రెస్ట్‌ అన్నది లేదు. యంత్రాల్లా పనిచెయ్యటమే’’ అంది భారతి.
‘‘అంతేనమ్మా, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఈ బాధలు తప్పవు. పోనీలే రేపటి నుంచీ వంట నేను చేస్తాను, మిగతా పనులు నువ్వు చూసుకో’’ అంది సుమతి.
‘‘ఎంత మంచిమాట చెప్పారు అత్తయ్యా’’ అంది సంతోషంగా భారతి.

కోడలు ఉద్యోగం జాలిగాధ విని మర్నాటినుంచీ వంటింటి డ్యూటీలో చేరిపోయింది సుమతి. కొడుకూ కోడలూ వెళ్ళాక మనవలకి స్నానం చేయించి, అప్పుడు వాళ్ళతోపాటే ఆడుతూ పాడుతూ టిఫిన్లు తినేవారు. ‘‘నానమ్మా, నువ్వూ తాతగారూ వెళ్ళిపోతే మిమ్మల్ని మిస్‌ అయిపోతాం’’ అనేవాడు పెద్ద మనవడు నవీన్‌.
పిల్లలకి స్కూలు తెరిచారు.
‘‘చూడండి అత్తయ్యా, నేను నీళ్ళు పోస్తే- పనికిరాదుట వీళ్ళకి. నేను కొడతానట. మీరైతే బాగా పోస్తారట. ఆ పని మీరే చూసుకోండి, నాకు టైము అయిపోతోంది. ఇప్పుడంటే మీరు వచ్చారు, ఇంతకాలం ఎవరు పోశారు వీళ్ళకి నీళ్ళు? వెధవలకి పొగరు ఎక్కువైంది మీ గారాబంతో’’ అంది కోపంగా భారతి.
‘‘పోనీలేమ్మా, నేను చేయిస్తాలే స్నానం’’ అంది సుమతి.

మర్నాటి నుంచీ ఆ పని కూడా మీదపడింది. కోడలు మాటలతో బుట్టలో వేసుకుని వంటిల్లు పూర్తిగా అప్పచెప్పింది.
ఇక ఆ సామ్రాజ్యంలో పనిమనిషి రాకపోతే ఆ అవతారం, చాకలి రాకపోతే ఆ అవతారం ఎత్తుతోంది సుమతి.
మనవలు ప్రేమతోనూ కోడలు లౌక్యంతోనూ సకలోపచారాలూ చేయించుకుంటున్నారు.
సుందరంగారు ఏమన్నా అంటే గయ్‌మని మీద పడిపోతుంది. ‘ఏమిటండీ, మనం ఎవరికి చేస్తున్నాము... మన పిల్లలకే కదా! ఉన్న నాలుగు రోజులకి పనిలో వంతు ఏమిటండీ’ అంటుంది. ‘పోనీ, నేను నీకు సహాయం చేస్తానే’ అన్నా ఒప్పుకోదు. ‘మీరుమటుకు చేయటం లేదా? మీరు అసలు బరువులు మోయకూడదు కానీ... అంత బరువు సంచులు మోసుకుని వెళుతున్నారు. ... మరి ప్రేమ ఉండబట్టే కదా! ఇంకేమీ మాట్లాడకండి, నాలుగు రోజుల భాగ్యానికి’ అని గదమాయిస్తుంది.

కోడలు ఉచ్చు బాగానే బిగిస్తోంది. అన్ని పనులూ అత్తగారిచేత బాగానే చేయించుకుంటోంది. తను పొద్దున్న వెళితే రాత్రి తొమ్మిదికే రావటం. వచ్చినా మొగుడూ పెళ్ళాలిద్దరూ భోజనాలు చేసి లోపలికి వెళ్ళిపోతారు తప్ప అత్తమామల్నిగానీ పిల్లల్నిగానీ పట్టించుకోవటం మానేశారు. సుమతికి పని బాగా ఎక్కువయింది. దానితో నీరసం, అలసటా పెరిగాయి.
సుందరంగారికి కూడా పని ఎక్కువ అయిపోయింది. తొందరగా ఊరికి వెళ్ళిపోతేనే మంచిది అనిపిస్తోంది. అందులోనూ రాత్రి కొడుకుల మాటలు విన్నాక ముళ్ళమీద ఉన్నట్లే ఉంది. భార్యకి చెబితే తను బాధపడటం తప్ప ఏమి చెయ్యగలదు? వెంటనే వెళ్ళి జవాబు చెబుదామనుకున్నారుగానీ ‘తొందరెందుకు? వాళ్ళంతటవాళ్ళే చెబుతారు. అప్పుడే తను అనవలసిన నాలుగూ అనేసి వెళ్ళిపోవచ్చు’ అనుకున్నారు.

* * * * *

‘‘అయ్యో, ఏమిటండీ... అలా ఉన్నారు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపట్టలేదా, జ్వరంగానీ వచ్చిందా?’’ అంటూ ఒంటిమీద చెయ్యివేసి చూసింది సుమతి.
‘‘రాత్రి నిద్రపట్టక తలనొప్పిగా ఉంది.
నీ చేత్తో కాఫీ తాగితే అది పోతుంది’’ అన్నారు.

భార్య ఇచ్చిన కాఫీ తాగి గ్లాసు ఆమెకి ఇచ్చేసి, బయట వరండాలో పేపరు చదువుతూ కూర్చున్నారు. అక్కడే కాస్త దూరంలో కూర్చుని మనవలు మాట్లాడుకుంటున్నారు. ‘‘అన్నయ్యా, తాతగారిని మాతో తీసుకువెళతామని నాన్నగారు చెప్పారు. నానమ్మ మీ దగ్గరే ఉంటుందట. మీ అమ్మ జాబ్‌ చేస్తోంది కదా... అందుకని పని ఎక్కువట.

మా అమ్మ జాబ్‌ చెయ్యదు కదా... నన్ను స్కూలుకి దింపటానికీ ట్యూషన్‌కి తీసుకువెళ్ళటానికీ తాతగారు చాలట. నిజమా అన్నయ్యా!’’
‘‘అవునట. అమ్మ చెప్పింది. కానీ తాతగారూ నానమ్మా ఇద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుంది. నానమ్మ ఏది కావాలన్నా వెంటనే చేసి పెడుతుంది. మేం అలిగినా బతిమాలి తినిపిస్తుంది. తాతగారు మేం అడగకుండానే అన్నీ కొనిస్తారు. అయినా, మనం అందరం బయటికి వెళ్ళిపోతే... పాపం నానమ్మా తాతయ్యా ఇద్దరే ఎలా ఉంటారు... వాళ్ళకి జ్వరం వస్తే ఎవరు చూస్తారు? తలచుకుంటే నాకు ఏడుపు వస్తోంది’’ అన్నాడు తమ్ముడితో రాము.
అన్నీ వింటున్నారు సుందరంగారు. ‘ఆ చిన్నారులకున్న ప్రేమా అభిమానం పెద్దవాళ్ళకి లేకపోయాయి, ఏం చేస్తాం’ అనుకున్నారు మనసులో.

‘ఎంత స్వార్థం... ఇలా అని తెలిస్తే అసలు రాకపోదుము’ అనుకుని నొచ్చుకున్నారు.

* * * * *

ఎవరి మనసులో ఏమి ఉన్నా పండగ సరదాగా జరిగిపోయింది. మర్నాడు అందరూ డ్రాయింగ్‌ రూములో కూర్చున్నారు వార్తలు వింటూ. వార్తలు అయిపోగానే తండ్రి లోపలికి వెళ్ళిపోతుంటే ‘‘నాన్నగారూ, ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి’’ అన్నాడు రవి.
‘‘ఏమిటిరా, విషయం?’’
‘‘రమేష్‌ రేపు వెళ్ళిపోతున్నాడు. వాడితో మీరు కూడా వెళ్ళండి’’ అన్నాడు రవి.
‘‘దానికేముందిరా, అలాగే వెళతాం. పది రోజులు ఉండి అటునుంచి ఊరు వెళ్ళిపోతాం. వాడు దగ్గరుండి తీసుకువెళతాను అంటే అంతకంటే ఏం కావాలి?’’ అంది సుమతి.
‘‘అమ్మా, నువ్వెక్కడికి వెళతావు... నాన్నగారు ఒక్కరే వెళతారు. ఆయన ఇక్కడికి వచ్చాక నువ్వు వెళుదువుగానీ.’’

‘‘అదేమిటిరా రవీ, నేను లేకపోతే నాన్నగారు ఒక్కరూ వెళ్ళి ఎలా ఉంటారూ? ఆయనకి ఏం కావాలన్నా, ఎవరిని అడుగుతారు? ఇద్దరం వెళతాం. మళ్ళీ కావాలంటే ఇక్కడికి వస్తాం. ఒక్కరూ వెళ్ళరు సుమా’’ అంది సుమతి.
‘‘అలాగంటావేమిటీ, మేమేమన్నా ఆయన్ని అడవుల్లో వదిలేస్తున్నామా, లేక మేం పరాయివాళ్ళమా... కన్న కొడుకులం. మేం బాగానే చూసుకుంటాంలే. అయినా, ఆయనకి ఏం కావాలి చెప్పు... ఇంత అన్నం పెడితే సరిపోతుంది. ఎక్కడ పడుకున్నా తెల్లారిపోతుంది’’ అన్నాడు రవి.

‘‘నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. టైమ్‌ ప్రకారం మందులివ్వాలి. ఒక్కరూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రీ నొప్పివస్తే తలుపులు కొట్టి ఎవరిని పిలుస్తారు? అసలే ఆయన హార్ట్‌ పేషెంట్‌. ఇక్కడ నా పనీ అంతే కదా? అదే ఇద్దరం ఉంటే ఒకరికి ఒకరు తోడు. నాన్నగారిని తీసుకువెళ్ళవద్దని అనట్లేదు, నేను కూడా వస్తాను అంటున్నాను. ఇప్పటివరకూ ఏనాడూ ఆయన్ని విడిచి ఉండలేదురా. ఆయన ఎలా ఉన్నారో అని బెంగగా ఉంటుంది. ఇద్దరినీ తీసుకువెళ్ళు నువ్వు. నువ్వు ఉండమన్నంత కాలం ఉంటాం మీతో కలిసి’’ అంది సుమతి.

‘‘ఇద్దరినీ ఒక్కరే పోషించటం కష్టం. అందుకే ఇలా అనుకున్నాం’’ రవి అన్నాడు.
‘‘ఇద్దరం చెరోచోట అంటే ఎలారా? మాకూ వయసైపోతోంది. నేను లేకపోతే ఆయన ఉండలేర్రా’’ అంది తల్లి కళ్ళనీళ్ళతో.

‘‘అమ్మా, మీ ఇద్దరికీ మరీ ఇంత స్వార్థం పనికిరాదు. ఎంతసేపూ మా ఇంటికి పోతాం అంటారేగానీ- ఇల్లూ పొలం అమ్మేసి, ఆ డబ్బు మాకిస్తే మా పిల్లల చదువులకీ మా అవసరాలకీ పనికివస్తుందని ఆలోచించరేం’’ అన్నాడు చిన్నకొడుకు రమేష్‌.
‘‘ఉన్నదంతా మీకు ఇచ్చేస్తే మరి మా పరిస్థితేమిటి? మేం ఎంతకాలం బతుకుతామో, ఏ అవసరం వస్తుందో తెలియదుగా’’ అంది సుమతి.
‘‘ఏమిట్రా ఇద్దరూ మీ అమ్మ మీద తెగ ఎగురుతున్నారు? అసలు ఎవరికి పుట్టింది ఈ బుద్ధి? ఏమిటి ఈ పంపకాలు? ఎవర్ని అడిగి చేస్తున్నారు? మీరు రమ్మంటేనే వచ్చాం- శాశ్వతంగా ఉండిపోవటానికి కాదు. నాలుగు రోజుల భాగ్యానికి ఈ రభస ఏమిటి? ఇలా జరుగుతుంది అంటే అసలు రాకనేపోదుం. అయినా, ఇదంతా ఎందుకు... ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళూ మేం మన ఊళ్ళోనే ఉంటాం. మంచానపడే రోజొస్తే- అప్పుడు చూద్దాం’’ అన్నారు సుందరంగారు.

‘‘బాగుంది నాన్నగారూ, మీ ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం ఊరివారికి ఉపకారంచేసి, ఒంట్లో శక్తి తగ్గాక మామీద పడతాం అంటే మేము ఎందుకు చూస్తాం’’ అన్నాడు రవి ఉక్రోషంగా.
‘‘ఉన్నమాట అంటే ఉలుకుగానీ, మీకు మాత్రం స్వార్థంలేదా? ఇంతకాలానికి ఇప్పుడు ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని... మీ పిల్లలకి సెలవులు కాబట్టి క్రెచ్‌లో వేస్తే డబ్బు ఖర్చు అనే కదా. వచ్చిన మర్నాడే పని అంతా అమ్మ మీద పడేసి రాత్రి తొమ్మిది గంటలకి ఇంటికొస్తున్నారు. ఇంటికి వస్తే పనిచెయ్యాలి అని ఆఫీసులోనే ఉండి ఓవర్‌టైమ్‌ చేస్తున్నారు. కోడలు ఒక్కర్తీ ఉంటే సాయంత్రం వచ్చి పని చేసుకునేది కాదా? ఒక్కనాడైనా మా ఆరోగ్యం గురించిగానీ, ఎలా ఉన్నారు అనిగానీ అడిగారా? సెలవు రోజైనా ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళారా. చూడండీ, దేముడు పిండాన్ని తల్లి గర్భంలో అమరుస్తాడు. ఆ తల్లి నవమాసాలూ మోసి జన్మనిస్తుంది. తండ్రి కష్టపడి చదువు చెప్పించి, మంచి బాట వేస్తాడు. మిమ్మల్ని మేము కంటికి రెప్పలా పెంచాం. మీకు పక్కలు వెచ్చబడితే మొక్కని దేముడు లేడు, కట్టని ముడుపు లేదు. కళ్ళలో వత్తులు వేసుకుని తెల్లవార్లూ జాగారం చేసేవాళ్ళం. మీరు పత్యం తింటే మేము పంచభక్ష్యాలు తిన్నట్లు పొంగిపోయేవాళ్ళం.

మీ అమ్మ చాలా అమాయకురాలు. పెళ్ళి అయింది మొదలు ఏనాడూ నా చెయ్యి విడవలేదు. కష్టం అయినా, సుఖం అయినా నాతో పంచుకుంది. ఏనాడూ మా సంసారంలో కలతలు లేవు. హాయిగా గడిచింది. అమ్మకి షుగర్‌, బీపీ ఉన్నాయి. పని ఎక్కువైనా షుగర్‌ తగ్గినా పడిపోతుంది. వేళకి మందులు ఇవ్వాలి. అవి నేను చూసుకుంటాను. ఒక్కతే ఉంటే అవన్నీ ఎవరు చూస్తారు?’’ అన్నారు సుందరంగారు.
‘‘అవున్రా రవీ, మీ నాన్న కూడా హార్ట్‌ పేషెంట్‌. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. టైముకి మందులు వేసుకోమని చెప్పాలి. బరువులు మొయ్యవద్దన్నారు డాక్టర్‌. రోజూ పిల్లల బ్యాగులు పట్టుకుని ఆయన వెళ్తుంటే నాకు గుండెలు దడదడలాడుతుంటాయి- ఎక్కడ మళ్ళీ నొప్పి వస్తుందో అని’’ అంది సుమతి.

‘‘తల్లీ తండ్రీ పదిమంది పిల్లల్ని పెంచుతారుగానీ, ఆ పదిమందీ తల్లిదండ్రులకి ఇంత అన్నం పెట్టడానికి వంతులు పడిపోతారు. మీరు ఎలా ఉంటే రేపు మీ పిల్లలూ అలాగే ఉంటారు. పిల్లలకి అయితే అయిదేళ్ళకే చదువుకి వేరే గది. ఏసీలూ కంప్యూటర్లూ టీవీలూ సెల్‌ఫోన్లూ ల్యాప్‌టాప్‌లూ... ఇలా ఎంతో అపురూపంగా పెంచుతారు. నర్సరీ నుంచీ లక్షలు ఖర్చు పెడతారు. అదే అమ్మానాన్నలకి అయితే గదులెందుకు, వరండాలో పడుకున్నా తెల్లారిపోతుంది అంటారు. ఎక్కడ పడుకున్నా తెల్లవారుతుంది. నీళ్ళు తాగినా కడుపు నిండుతుంది. ఏదీ ఆగిపోదు.

పెద్దవాళ్ళకి గది అంటే అది శృంగారానికీ సుఖానికే కాదు. వయసు పెరిగేకొద్దీ అనేక సమస్యలు వస్తాయి. అవి చెప్పుకోవడానికి గది అవసరం. కాళ్ళూ చేతులూ నొప్పులొస్తే ఒకరికి ఒకరు మందులు రాసుకోవడానికి గది అవసరం. పెద్దవాళ్ళకి వయసు వచ్చేకొద్దీ నిద్రపట్టదు. మాటిమాటికీ బాత్‌రూమ్‌కు వెళ్ళవలసి వస్తుంది. ఘడియఘడియకీ తలుపులు వేస్తూ తీస్తూ ఉంటే మిగిలినవారికి నిద్రాభంగం అవుతుంది. అందుకని అటాచ్డ్‌ బాత్‌రూమ్‌తో గది అవసరం.

అయినా మీరు ప్రశ్నలు వెయ్యటం మేం జవాబులు చెప్పటం ఏమీ బాగోలేదు, సిగ్గుచేటు కూడా. మీరు వంతులుపడి మమ్మల్ని వేరు చెయ్యకండి, మీకు పుణ్యం ఉంటుంది. డబ్బు పడేస్తే మీ అవసరాలకి బోలెడుమంది పనివాళ్ళు దొరుకుతారు, మా మానాన మమ్మల్ని బతకనివ్వండి. మేము వేరుగా ఉండేది లేదు. ఆ మృత్యువే స్వయంగా వచ్చి తీసుకువెళ్ళే వరకూ మేము కలిసే ఉంటాం. అదే మా అంతిమ కోరిక. కొన్నాళ్ళు పోయాక అక్కడ భూములు అమ్మేసి వచ్చి, మీ దగ్గరే ఉందామనీ- ఇంటి అద్దె, పెన్షన్‌- మేము ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకిద్దామనీ అనుకున్నాం. అలా అన్నీ అమ్మేసుకుని కాకుండా కొన్నాళ్ళు ఇలా రావటం మంచిదైంది. మీ స్వభావాలూ స్వార్థాలూ తెలిశాయి’’ అన్నారు సుందరంగారు భుజం మీది తువ్వాలుతో కళ్ళు తుడుచుకుంటూ.

‘‘పద సుమతీ, తెల్లవారుజామున అయిదు గంటలకే బండి. సామాన్లు సర్దు’’ అని చెప్పారు, గది వైపు వెళుతూ.
సుమతి కూడా కారే కన్నీటిని పైటకొంగుతో తుడుచుకుంటూ భర్త వెనుకే వెళ్ళింది.
వ్యవహారం ఇలా బెడిసికొడుతుందని ఊహించని కొడుకులూ కోడళ్ళూ కొయ్యబారిపోయారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.