close
తీర్పులు చెప్పే అభయాంజనేయుడు!

ఏ కులం వారికైనా ఏ మతం వారికైనా ఇక్కడి దేవుడే న్యాయం చేస్తాడని నమ్మకం. పేదా గొప్పా తేడా లేకుండా మూడు వారాల్లో తీర్పు వస్తుందనీ, స్వామే తప్పు చేసిన వాళ్ల భరతం పడతాడనీ విశ్వాసం. అందుకే వాళ్లు న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్లూ, కోర్టులకెళ్లరు. రాజనాలబండ ఆంజనేయుడి ముందు ప్రమాణం చేయడమే తమ సమస్యకు పరిష్కారంగా భావిస్తారు.

వందల ఏళ్లుగా ఇక్కడి అభయాంజనేయ స్వామి తీర్పులు చెప్పే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు.
త్య ప్రమాణాల దేవుడిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి పేరు ఉంది. చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని రాజనాలబండలో వెలసిన అభయాంజనేయుడినీ ఇదే రీతిలో శరణు వేడతారు భక్తులు. ఆంజనేయ స్వామి రూపమే ఇక్కడి వారికి తీర్పులు చెప్పి, శిక్షలు వేసే న్యాయమూర్తి. చిత్తూరు జిల్లా వారే కాదు, బెంగళూరు, చెన్నైల నుంచి కూడా వచ్చి ఆయన ముందు న్యాయం కోరతారు. ప్రతి శనివారం జరిగే తగాదాల పరిష్కారాల తంతు కోసం స్వామి దగ్గరికి హిందువులతో పాటు, ముస్లింలు, క్రైస్తవులు కూడా వస్తారు.

ఇదీ పద్ధతి...
అయితే రాజీ... లేదూ అంటే దేవుడి ముందు న్యాయం కోరే బండ మీద నిలబడటం... అదే రాజీన్యాయాల బండ... ఆ పేరు మీదుగానే ఈ ఊరికి రాజనాలబండగా పేరొచ్చింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో ఎన్నో వాదోపవాదాలు, రాజీలు జరుగుతుంటాయి. అక్కడ వాదన తెగితే సరి, లేకపోతే న్యాయం కోరుకునే వాళ్లు స్వామిని ఆశ్రయిస్తారు. తగాదాల పరిష్కారానికి ఆలయంలో ఒక పద్ధతి పాటిస్తారు.
స్వామి వారి ముందుకు సమస్యను తీసుకెళ్లాలంటే రూ.1116లను ఆలయంలో కట్టి, రసీదును తీసుకుంటారు. ఫలానా వారి తగాదా రాజనాలబండకు వచ్చిందని ఊళ్లో చాటింపు వేయిస్తారు. తర్వాత ఇరుపక్షాలతో మాట్లాడి అసలు ఏం జరిగిందో ఆలయ ప్రధాన అర్చకుడు తెలుసుకుంటారు. ఫలానా పక్షం వాళ్ల తరఫున తప్పు ఉందనిగానీ, ఏదైనా చేయడం వల్ల సమస్య పరిష్కారమవుతుందని కానీ అనుకుంటే ఆలయం తరఫున ఆ ప్రతిపాదనను వాళ్ల ముందు ఉంచుతారు - అంటే రాజీ ప్రయత్నం చేస్తారు.

తప్పు చేసిన వ్యక్తి మీద స్వామి ఆగ్రహం ఎలా ఉంటుందో కూడా గత ఉదాహరణలతో వివరిస్తారు. ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి బయటపడితే... దాన్ని ఒప్పుకోవాలనీ, అందరికీ సర్ది చెబుతామనీ ఆలయం వారు భరోసానిస్తారు. ఇక్కడే 80 శాతం గొడవలు పరిష్కారం అవుతాయి. అలాకాని పక్షంలో పరిష్కారానికి వారం సమయం ఇస్తారు. ఆ వారంలోనే కొన్నిసార్లు పోయిన సొమ్ము దొరుకుతుంది, గొడవల్లో రాజీమార్గాలు పుడతాయి, భూ సమస్యలూ పరిష్కారమవుతాయి... అప్పుడు అర్చకుడికి చెప్పి కేసును విరమించుకుంటారు. రాజీలు కుదరకపోతే స్వామి ముందు ప్రమాణం చేయడమే చివరి పని.

ప్రమాణం ఇలా...
ఇక్కడ ప్రమాణం చేసేందుకు ఇరుపక్షాల వారు ఆలయ కోనేరులో స్నానం చేసి, చేతిలో పసుపూ, కుంకుమా, పూలూ పట్టుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి స్వామికి ఎదురుగా ఉండే సత్యప్రమాణాల బండ మీద నిలుచుని, తాము ఎలాంటి తప్పూ చేయలేదని - స్వామి మీదా, పంచభూతాల మీదా ప్రమాణం చేసి చెప్పాలి. ఇలా చెప్పిస్తే తప్పు ఎవరు చేశారో వారికి, లేదా తప్పు చేసిన వారి కుటుంబసభ్యులకు మూడువారాల్లో స్వామి శిక్ష వేస్తాడని ఇక్కడ విశ్వాసం. ఈ మూడు వారాల్లో ఎవరికైనా, లేదా దగ్గరి బంధువులకైనా ఏదైనా విపత్తు జరిగితే దాన్ని కచ్చితంగా స్వామి శిక్షగానే భావిస్తారు. అప్పటి వరకూ తాము తప్పు చేయలేదని బుకాయించిన వారు సైతం, స్వామి వారి ముందు ప్రమాణం చేసేటప్పుడు తప్పును ఒప్పుకుంటుంటారు.

పదిహేడో శతాబ్దం నుంచీ...
ఇక్కడ పెద్ద బండ మీద వెలసిన స్వామికి పదిహేడో శతాబ్దంలో పుంగనూరు జమీందార్లు ఆలయాన్ని నిర్మించి, నిత్య ధూపదీప నైవేద్యాలను సమర్పించడం మొదలుపెట్టారు. శ్రావణ మాసం చివరి శనివారం నుంచి ఏడు రోజుల పాటు స్వామి వారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. చిత్తూరు నుంచి పుంగనూరు బస్సులో వెళితే మధ్యలో వచ్చే చౌడేపల్లిలో దిగిపోవచ్చు. చౌడేపల్లి కూడలి నుంచి ఆలయానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

- శివ మావూరి, ఈనాడు, తిరుపతి
ఫొటోలు: పి. సింహాచలం

(28 ఏప్రిల్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.