close
ప్రకృతి ప్రేమికులూ... వందనాలు!
మన కోసం, పిల్లల కోసం, వాళ్ల పిల్లల కోసం చాలా చేస్తాం... ఇంకెంతో దాచి పెడతాం. ఈరోజుల్లో స్వార్థం చూసుకోకుండా పనిచేసేవాళ్లు చాలా అరుదు.   అలాంటి అరుదైన వ్యక్తులే ఈ ముగ్గురూ!

చెరువుని డ్యామ్‌గా మార్చాడు!

బెంగళూరు...అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ ప్రకృతి విధ్వంసమూ అంతే వేగంగా జరుగుతోంది. ఆ మార్పుని గమనించిన యువకుడు ఆనంద్‌ మల్లిగవద్‌... ఆ నగరం చుట్టుపక్కల ఉన్న చెరువుల్ని సంరక్షించాలని నడుం బిగించాడు. ఓ కార్పొరేట్‌ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు ఆనంద్‌.

ఆ సంస్థ ఫౌండేషన్‌ సాయంతో నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఓ చెరువులోని పూడికను తీయించడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరగడంతోపాటు చెరువులోనూ నీరు నిలిచింది. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి చెరువుల సంరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అతడి రెండో ప్రాజెక్టు విస్తీర్ణం 10 ఎకరాల విస్తీర్ణంలోని ‘వబసంద్ర చెరువు’. పర్వత ప్రాంతంలో ఉండే ఈ చెరువులో పూడికతోపాటు చెత్తాచెదారమూ పెద్ద మొత్తంలో చేరింది. 50 వరకూ ఉన్న గొలుసు చెరువుల్లో ఇది పైనుండటంవల్ల దీనికున్న ప్రాధాన్యం ఎక్కువ. అందుకే దీన్ని రిజర్వాయర్‌గా మార్చి ఏడాది పొడుగునా నీటిని విడుదలచేయొచ్చు అనుకున్నాడు ఆనంద్‌. బహుళజాతి సంస్థ ‘హెచ్‌పీ’కి తన ప్రతిపాదనను పంపడంతో రూ.80లక్షలు కేటాయించింది. 

ఆ మొత్తంతో ఎనిమిది అడుగుల లోతున్న చెరువుని 30 అడుగుల లోతుగా తవ్వించాడు. మధ్యలో అయిదుచోట్ల చిన్న దీవుల్ని ఏర్పాటు చేశాడు. గట్టు చుట్టూ నడిచేందుకు వీలుండేలా చదును చేయడంతోపాటు, మొక్కల్నీ నాటించాడు. గతేడాది ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టుని చేపట్టిన ఆనంద్‌... 2025 నాటికి 45 చెరువుల్ని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

వేల మొక్కలు నాటాడు...

‘నీటినీ చెట్లనూ సంరక్షించండి’... శ్యామ్‌కుమార్‌ ఆటో వెనక ఈ మాటలు రాసి ఉంటాయి. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా, తేంకురిస్సి గ్రామానికి చెందిన శ్యామ్‌ కుటుంబ పోషణకోసం ఆటో నడుపుతాడు. కానీ అతడికి మొక్కలునాటే శ్యామ్‌గానే గుర్తింపు. ఎందుకంటే 25 వేలకుపైగా మొక్కలు నాటిన ఘనత ఆయన సొంతం. తన ఆటోలో ఎప్పుడూ కొన్ని మొక్కలూ... వాటిని నాటేందుకు అవసరమైన పరికరాలూ ఉంచుతాడు శ్యామ్‌. మొక్క నాటేందుకు అనువైన చోటు కనిపిస్తే అక్కడ ఆగి నాటడమే కాకుండా, దానికి పాదుచేసి, పక్కనే పెద్ద వాటర్‌ బాటిల్‌ పెడతాడు. దాన్నిండా నీళ్లు పోసి, అందులోంచి చుక్కచుక్కగా మొక్కకి నీరు అందేలా చేస్తాడు. ‘మొక్కలు నాటడంకంటే కూడా, వాటిని పెంచడమే గొప్ప విషయం’ అని చెప్పే శ్యామ్‌ పాఠశాలలూ, కళాశాలలూ, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ఖాళీ ప్రదేశాల్ని గుర్తించి యాజమాన్యాల సహకారంతో అక్కడ మొక్కలు నాటతాడు. వీలున్నప్పుడల్లా వాటిని చూసి వస్తాడు. రోడ్డు పక్కనా, హాస్పిటల్స్‌ దగ్గరా మొక్కలు నాటతాడు. వేప, గానుగ, రావి, నేరేడు, బాదం మొక్కల్ని ఎక్కువగా నాటతాడు. తన ఊరి సమీపంలోని వ్యవసాయ కాలువకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవున తాటి మొక్కలు నాటాడు శ్యామ్‌. అటవీ శాఖలో కొన్నాళ్లు వాచ్‌మేన్‌గా పనిచేసిన శ్యామ్‌కి అప్పుడే చెట్ల ప్రాధాన్యం గురించి బాగా తెలిసింది. గత 20 ఏళ్లుగా ఆటో నడుపుతూనే మొక్కల్ని నాటుతున్నాడు. వాటిలో చాలాభాగం పెద్ద వృక్షాలుగా ఎదిగాయిప్పుడు.

పక్షి ప్రేమికుడు...

వేసవి మొదలవ్వగానే చల్లని నీటికోసం, నీడకోసం ఏర్పాట్లు చేసుకుంటాం. కానీ మూగజీవాల పరిస్థితి ఏంటి? మండే ఎండల్లో పక్షులు నీటికోసం తిరుగుతుంటే వాటి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఇదంతా గమనిస్తూ వచ్చిన కేరళకు చెందిన 70 ఏళ్ల శ్రీమాన్‌ నారాయణన్‌ ఊరక ఉండలేకపోయాడు. రూ.6లక్షలు ఖర్చుపెట్టి పదివేల మట్టి పాత్రలు కొని తానుండే ఎర్నాకుళం జిల్లాలోని పలు గ్రామాలూ, పట్టణాల్లో పంచి పెట్టాడు. ‘వేసవి వస్తే చెరువులన్నీ ఎండిపోతాయి. జంతువులూ ఎండదెబ్బకు విలవిల్లాడిపోతాయి. ఇక పిచ్చుకల్లాంటి చిన్న పక్షుల పరిస్థితి మరీ ఘోరం. అందుకే ఈ మట్టి పాత్రలు పెడుతున్నాం. ఒక్కో పాత్రద్వారా 100 పక్షుల నీటి అవసరాలు తీరుతాయి’ అని చెబుతాడు శ్రీమాన్‌. ముప్పతాడం అనే గ్రామంలో చిన్న హోటల్‌ నడుపుతూ, మరోపక్క లాటరీ టికెట్లు అమ్ముతుంటాడీయన. భార్య 30 ఏళ్ల కిందటే చనిపోయింది. ముగ్గురు కూతుళ్లకీ పెళ్లిళ్లుచేసి తండ్రిగా బాధ్యతని పూర్తిచేశాడు. తన డబ్బుతో సమాజానికి సేవచేసే స్వేచ్ఛ తనకు వచ్చిందని చెబుతాడు ఈ గాంధేయవాది. గతంలో మొక్కల్ని పంచుతూ వచ్చిన శ్రీమాన్‌ కిందటేడాది నుంచి మట్టి పాత్రల్ని పంచడం మొదలుపెట్టాడు. వీటిని ఇళ్లల్లో, స్కూళ్లల్లో, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరా పెడతాడు. ఎవరో ఒకరు వాటిలో నీరుపోసే బాధ్యతను తీసుకుంటారు. గతేడాది కూడా 9000 పాత్రల్ని పంచిపెట్టారు శ్రీమాన్‌.

(28 ఏప్రిల్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.