close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆప్‌లో ఆటాడుకుందాం!

అక్కడ తమ అభిమాన ఆటగాళ్లు మైదానంలో చెమట చిందిస్తుంటే, ఇక్కడ తమ బుర్రకు పదునుపెట్టి ఫోన్లలో ఫాంటసీ గేమ్స్‌ ఆడేస్తున్నారు యువత. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ... ఆట ఏదైనా... దేశం ఏదైనా ఫాంటసీ గేమ్స్‌తో ఆ ఆటలో వారూ మునిగిపోతున్నారు!

ప్రస్తుతం మనదేశంలోని కుర్రకారు ఫోన్లలో ఎక్కువగా కనిపిస్తోన్న ఆప్‌ ‘డ్రీమ్‌ 11’. ఫాంటసీ గేమ్స్‌ విభాగంలో మనదేశంలో యూనికార్న్‌ (బిలియన్‌ డాలర్‌) కంపెనీగా ఎదిగిన మొదటి సంస్థ ఇదే. ముంబయి కేంద్రంగా పనిచేసే ‘డ్రీమ్‌ 11’ వ్యవస్థాపకులు హర్ష్‌ జైన్‌, భవిత్‌ సేఠ్‌. ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌ ఫాంటసీ లీగ్స్‌కి అభిమాని అయిన హర్ష్‌... 2008లో ఐపీఎల్‌ మొదలైనపుడు అదే తరహాలో ఫాంటసీ క్రికెట్‌ ఆడే వెబ్‌సైట్‌లూ ఆప్‌లూ మనదగ్గరా ఉన్నాయేమో చూశాడు. కానీ అతడికి అలాంటివి కనిపించలేదు. దాంతో కుటుంబ వ్యాపారాన్ని వదిలి తానే ఒక ఆప్‌ని తేవాలనుకున్నాడు. మిత్రుడు భవిత్‌కి హర్ష్‌ ఐడియా నచ్చి చేయి కలిపాడు. ఇద్దరూ కలిసి 2009లో ‘డ్రీమ్‌ 11’ని రూపొందించే ప్రయత్నం చేశారు. వివిధ ప్రయత్నాల తర్వాత ప్రస్తుతం ఉన్న మోడల్‌ని 2012లో తీసుకురాగా, అది విజయవంతమైంది. ఈ ఆప్‌లో క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌కు సంబంధించిన ఫాంటసీ గేమ్స్‌ ఆడుకోవచ్చు. ప్రఖ్యాత దేశాల అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లూ, ప్రముఖ లీగ్‌లకు సంబంధించిన మ్యాచ్‌లూ జరిగేటపుడు ఈ ఆప్‌లో ఫాంటసీ గేమ్స్‌ ఉంటాయి. దీన్లో నిబంధనల ప్రకారం నిజంగా జరుగుతున్న ఒక మ్యాచ్‌లో తలపడే రెండు జట్లలోంచి ఆటగాళ్లను ఎంపికచేసి ఒక టీమ్‌ని తయారుచేయాలి. అలా మనం ఎంపికచేసిన ఆటగాళ్లు ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శనను బట్టి పాయింట్స్‌ వస్తాయి. క్రికెట్‌ మ్యాచ్‌ జరిగితే రెండు జట్ల నుంచీ 11 మందిని ఎంపికచేయాలి. అలాగే కబడ్డీ మ్యాచ్‌ అయితే రెండు జట్ల నుంచీ ఏడుగురిని ఎంపికచేయాలి. నిజమైన మ్యాచ్‌ ప్రారంభానికి అరగంట ముందే ఈ ఫాంటసీ గేమ్‌లో తుదిజట్టును ఎంపికచేసుకోవాలి. దీన్లో డబ్బుకట్టీ లేదంటే ఉచితంగా ఆడొచ్చు. డబ్బుకట్టి ఆడి పాయింట్లు సాధిస్తే ప్రైజ్‌మనీ వస్తుంది. అది లక్షల్లోనూ ఉంటుంది. ఇదంతా మన కుర్రకారుకి భలే నచ్చేసింది. దాంతో డ్రీమ్‌ 11 విజయవంతమైంది.

బుర్రపెట్టి ఆడాల్సిందే!
ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమ్స్‌ లేదా ఇ-స్పోర్ట్స్‌గా పిలిచే ఈ ఆటల్ని ఆడటం ఆషామాషీ ఏం కాదు. డ్రీమ్‌ 11 ప్రకటనలో ధోని చెప్పినట్టు ‘ఇది బుర్ర పెట్టి ఆడాల్సిన ఆట’. కెప్టెన్‌, కోచ్‌, సెలక్టర్‌ ఇలా అందరి పాత్రలూ పోషించి జాగ్రత్తగా తుది జట్టుని ఎంపికచేసుకోవాలి. అదీ రెండు జట్ల నుంచి... ఇందులో ఉన్న ఆ కిక్కే యూత్‌కి తెగ నచ్చింది. కొన్ని వెబ్‌సైట్లు ఈ జట్ల కూర్పు గురించి సలహాలిచ్చే కథనాలనూ రాస్తున్నాయంటే వీటికున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మనదగ్గర స్మార్ట్‌ఫోన్లూ, 4జీ సేవలూ పెరిగాక ఫాంటసీ గేమ్స్‌కి ఆదరణ పెరిగింది. డ్రీమ్‌ 11 విజయవంతమైన తర్వాత ఫ్యాన్‌టైన్‌, హలాప్లే, క్రిక్‌ప్లే, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌, మై11 సర్కిల్‌, గేమింగ్‌ మాంక్‌... ఇలా చాలా ఫాంటసీ గేమ్స్‌ ఆప్‌లు వచ్చాయి. వీటిలో హాకీ, క్యారమ్స్‌, పూల్‌, బ్మాడ్మింటన్‌ లాంటి క్రీడలకూ చోటుంది. మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018లో ప్రారంభమైంది. శ్రీనివాస్‌ గరిమెళ్ల, శుభమ్‌ మల్హోత్ర దీని వ్యవస్థాపకులు. విరాట్‌కోహ్లీ ప్రచారకర్తగా ఉన్న ఈ ఆప్‌... ప్రారంభించిన ఎనిమిది నెలల్లో కోటిమంది వినియోగదారుల్ని సంపాదించుకుంది.

ఆడేది యువతే...
ఈ తరహా ఆటలు ఆడేవారి సంఖ్య మనదేశంలో సుమారుగా ఏడు కోట్లు ఉండగా, ఒక్క డ్రీమ్‌ 11కి 5 కోట్ల వినియోగదారులున్నారు! ఈ ఏడాది చివర నాటికి మొత్తంగా ఈ గేమ్‌లు ఆడేవారి సంఖ్య 10 కోట్లకు చేరుతుందని అంచనా. కొన్ని ఆప్‌లు ఫాంటసీ గేమ్‌ని జట్టు ఎంపికకే పరిమితం చేయకుండా మైదానంలోని ఆటతో వివిధ రకాలుగా ముడిపెడుతూ డిజైన్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఉచితంగానే కాకుండా గేమ్స్‌ని కనీసం రూ.10 చెల్లించి ఆడటం మొదలుపెట్టొచ్చు. ఈ గేమ్‌లు ఆడేవారిలో 10 శాతం మాత్రమే డబ్బు కట్టి ఆడతున్నారు. వీటిని ఆడేది ఎక్కువగా యువతే. వీరిని మరింతగా ఆకర్షిస్తే డబ్బుకట్టి ఆడేవారి సంఖ్య పెరుగుతుందని వీరి నమ్మకం. ఈ ఆప్‌ సంస్థలకు ప్రకటనల ద్వారా డబ్బు వస్తుంది. దాంతోపాటు విజేతలకు వచ్చే మొత్తంలో 15-20 శాతం సంస్థ ఖాతాలోకి వెళ్తుంది. భవిష్యత్తులో ఆ ఆప్‌లలో మ్యాచ్‌ టికెట్లూ, క్రీడా పరికరాల అమ్మకాలూ జరగొచ్చన్నది విశ్లేషకుల మాట.

ఇండియాలో క్రీడలకు ఆదరణ పెరగడం, ఇంటర్నెట్‌ డేటా ఛార్జీలు తగ్గడం, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎక్కువకావడం... ఇవన్నీ చూస్తుంటే ఆటలకే కాదు, ఫాంటసీ గేమ్స్‌కీ మంచి భవిష్యత్తు ఉందన్నది సుస్పష్టం!

(28 ఏప్రిల్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.