close
‘అమరచిత్ర కథ’ మలుపు తిరిగిందిలా!

ఒక తరం ముందు దాకా అంతోఇంతో ఇంగ్లిషు వచ్చిన పిల్లలందరికీ ‘టింకిల్‌’ పుస్తకంతో పరిచయం ఉండేది. అందులోని తంత్రి, షికారీ శంబు, సుపాండి పాత్రలూ మనసుకి దగ్గరగా అనిపించేవి. మరి నేటి ‘మొబైల్‌ గేమ్స్‌’ తరానికీ వాటిని దగ్గర చేయడమెలా? ఈ ప్రశ్నే వేసుకుంది ‘అమరచిత్ర కథ’ సంస్థ. మన భళ్లాల దేవుడు... అదేనండీ, రానాతో కలిసి సరికొత్త శిక్షణ కేంద్రాలని ఏర్పాటుచేస్తోంది.

తొలికేంద్రం హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది...!
అది 1967 ప్రాంతం. దూరదర్శన్‌ ఓసారి బడి పిల్లలతో క్విజ్‌ కార్యక్రమం నిర్వహించింది. ‘హెర్క్యులస్‌ తమ్ముడి పేరేమిటీ?’ ‘యులిసీస్‌ ఎవరితో యుద్ధం చేశాడు?’ - ఇలా గ్రీకు పురాణాలూ, కథల నుంచి అడుగుతున్న ప్రశ్నలకి టకటకా సమాధానం చెబుతున్నారా విద్యార్థులు. ‘శ్రీరాముడి తల్లిపేరేమిటీ?’ ‘అర్జునుడికి అన్నదమ్ములు ఎంతమంది?’ వంటివాటికి అస్సలు జవాబు చెప్పలేకపోయారు. అది చూసిన చిత్రకారుడు అనంత్‌పాయ్‌
ఆలోచనల్లో పడ్డారు. ‘భారతీయ ఇతిహాసాలూ, అవి చెప్పే మంచీచెడులూ తెలియకుండా పిల్లలు ఎదిగితే... వాళ్లు ఈ దేశానికి మానసికంగా పరాయివాళ్లు అవుతారు కదా!’ అనుకున్నారు.

అందుకే మతాలకతీతంగా మన పురాణేతిహాసాలూ, చరిత్రా, అలనాటి కథలని పిల్లలకి అద్భుతమైన చిత్రాలతో, సరళమైన భాషలో అందించాలనుకున్నారు. దాని ఫలితమే ‘టింకిల్‌’ పత్రిక, అమరచిత్ర కథల పుస్తకాలు. ఇప్పటిదాకా ఇరవై భాషల్లో నాలుగువందలకుపైగా పుస్తకాలను ప్రచురించారు వాళ్లు. అనంత్‌ ‘అంకుల్‌ పాయ్‌’గా లక్షలాదిమంది పిల్లల అభిమానం సొంతం చేసుకున్నారు. ఆ విజయాన్ని చూసి అనంత్‌పాయ్‌ సంతృప్తిపడ్డా ఆయనకో తీరని కల ఉండేదట. భారతీయ కళా, సంస్కృతీ, ప్రాచీన విజ్ఞానాన్ని పిల్లలకి నేరుగా నేర్పించే వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నారట. ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ఆ కలకే నేటితరం హంగులతో కొత్త రూపునిచ్చాడు హీరో దగ్గుబాటి రానా. ఆయన ‘అమరచిత్ర కథ’ సంస్థలో వ్యాపార భాగస్వామిగా ఉంటున్నారు. దాని నిర్వాహకులతో మాట్లాడి ‘ఏసీకే(అమరచిత్రకథ) అలైవ్‌’ పేరుతో వినూత్న శిక్షణా కేంద్రాలకి రూపకల్పన చేశారు. వీటిని దేశవ్యాప్తంగా పెద్ద నగరాలన్నింటా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి హైదరాబాద్‌తోనే శ్రీకారం చుట్టారు. రామానాయుడు స్టూడియో పక్కన పదివేల చదరపుటడుగుల్లో పె..ద్దగా తీర్చిదిద్దారు.

ఇదీ కొత్తదనం...
భరతనాట్యం, కూచిపూడి, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, ఫిల్మ్‌ మేకింగ్‌... వేసవి సెలవులనగానే పిల్లల కోసం ఇవన్నీ నేర్పించే సంస్థలెన్నో వస్తాయి. ‘ఏసీకే అలైవ్‌’ కేవలం వేసవి సెలవుల్లో మాత్రమే కాకుండా ఏడాదంతా ఇలాంటి కోర్సుల్ని అందిస్తుంది. కేవలం పిల్లలే కాదు, వాళ్ల తాతయ్యలూ నాన్నలూ అమ్మమ్మలూ అమ్మలూ... ఇలా అందరూ వచ్చి నేర్చుకునేలా ఇక్కడి కోర్సులూ, క్లాసుల్ని తీర్చిదిద్దడమే విశేషం. మూడేళ్ల చిన్నారి నుంచి యాభయ్యేళ్ల వయసున్నవాళ్ల దాకా ఎవరైనా నేర్చుకోవచ్చు. మనం ఎంచుకున్న కళని బట్టి ఫీజు ఉంటుంది. ఒక్కో కోర్సుని 50 గంటలపాటు నేర్పిస్తారు. ఆ యాభై గంటల్ని ఏడాదిలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు... మన ఇష్టం!

వైవిధ్యంగా...
ఈ శిక్షణా కేంద్రంలో ఎక్కడా ‘తరగతి గది’ వాతావరణం కనిపించకుండా... ఏ నియమాలూ విధించకుండా నిర్వహిస్తున్నారు. నేర్చుకుంటూ మీరే ఇక్కడ టీచర్‌గానూ మారొచ్చు. ప్రాంగణంలోని ప్రతి అడుగునీ టాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ భూపేష్‌  డిజైన్‌ చేశారు. గదులకి పేర్లని కూడా ‘అమరచిత్ర కథల’ని గుర్తుచేసేలాగే పెట్టడం విశేషం. ‘చిత్రలేఖ’ అనే గదిలో జానపద కథలూ, కళల్ని ఆయా పల్లెటూరి పెద్దల ద్వారానే చెప్పిస్తున్నారు. ‘పారిజాత వృక్షం’ కింద కుండలు చేయడం, వడ్రంగి పనీ నేర్చుకోవచ్చు. ఇలా ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, వేదిక్‌ సైన్స్‌ అండ్‌ ఎథిక్స్‌ అనే మూడు విభాగాల కింద 45 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ‘చతుష్షష్టి కళలు’ అనే భావనకి సరిపోయేలా ఆ సంఖ్యని 64కి చేరుస్తామని చెబుతున్నాడు రానా!

- మామిడి స్వామి, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

(28 ఏప్రిల్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.