close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెల్ఫీ శోభనం

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌

‘‘పేరు...’’ అడిగాడు శ్రీపతి.
‘‘పేరు కూడా తెలీకుండా పెళ్ళిచూపులకొచ్చారా?’’ ఆ మాట పైకి అనలేదు. కానీ, చిన్నగా నవ్వింది తను.
‘‘అందమైన మీ గొంతు వినాలనీ...’’ ఆమె డౌట్‌ తీరుస్తూ అన్నాడతడు.
‘‘శోభన...’’ చెప్తుండగానే ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ కువకువలాడింది. ‘ఇన్‌బాక్స్‌’లోకి మెసేజ్‌ వచ్చిందంటూ మొబైల్‌ చేసిన సందడి అది.
‘‘జస్టేమినిట్‌...’’ అంటూ సెల్‌ఫోన్‌లోకి తల దూర్చేసింది. ఆ వెంటనే ‘వావ్‌..!’ అంటూ ఎంచక్కని ఓ ఎక్స్‌ప్రెషనిస్తూ తనకొచ్చిన మెసేజ్‌కి చకచకా ఆన్సరిచ్చింది. అలా మొదలైన ఆ తంతు ఆ ఒక్క మెసేజ్‌తో ఆగలేదు. అటూ ఇటూ వరుస ‘సంక్షిప్త సందేశాలు’ ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. తనని చూసేందుకు వచ్చిన పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్నాడనే కనీస స్పృహ ఏమాత్రం లేకుండా సెల్‌ఫోన్‌లో ఎవరో ఫ్రెండ్‌తో చిట్‌చాట్‌ చేస్తోంది శోభన.
అరగంటక్రితం శోభనని చూసీ చూడగానే ఫిదా అయిపోయాడు శ్రీపతి. సన్నజాజి తీగలా సన్నగా నాజూగ్గా తెల్లగా ఉన్న ఈ అమ్మాయిని రెడ్‌కార్పెట్‌ పరిచి మరీ తన జీవితంలోకి ఆహ్వానించాలని ఆమెను చూసిన మొదటి
క్షణంలోనే డిసైడైపోయాడు.
ఎన్నెన్ని అందాలూ ఎన్నెన్ని వయ్యారాలూ... చూసేందుకు మాత్రం తనకు రెండే కళ్ళు. ఓ క్షణం పరవశం, మరుక్షణం నైరాశ్యం. కనురెప్పలైనా వేయకుండా ఎంత చూస్తున్నా తనివితీరని వైనం. ఈ ఆడోళ్ళలో ఏముంది? ఒక్క చూపుతో రూపుతో మగాళ్ళని ఇట్టే పిచ్చోళ్ళని చేసేస్తారు. ఫొటోలో కనిపించని సమ్మోహనత్వం ఎదురుగా కనిపించి కవ్విస్తుంటే కుదురుగా కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు శ్రీపతి. కాలమిలాగే ఇక్కడే ఈ క్షణంలోనే ఆగిపోతే ఎంతో బాగుణ్ణనిపిస్తోందతడికి. ఆమెతో మాటామాటా కలపాలని మనసెంతగానో కోరుకుంటుండగా-
‘‘అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా?’’ సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి అడిగాడు శ్రీపతిని.
‘‘మాట్లాడతాను...’’ అంటూ లేచాడతడు.
అతడితోపాటు ఆమె కూడా కుర్చీలోంచి లేచి మేడమీదికి నడిచింది. పేరు అడిగాడు...
వీణ మీటినంత మధురంగా చెప్పింది. అంతే! ఆ తర్వాత సెల్‌ఫోన్‌లోకి ముఖం దూర్చేసి కబుర్లలో పడిపోయింది. కొంతసేపటి క్రితమే జీవితంలో మొట్టమొదటిసారి పరిచయమైన వ్యక్తి ఎదురుగా ఉన్నాడన్న సంగతిని కూడా ఆమె విస్మరించినట్లుంది.
‘‘ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌... మీకు సెల్‌ఫోనే అనుకుంటాను’’ అన్నాడు శ్రీపతి ఆమె దృష్టి తనవైపు మళ్ళేలా చేసుకునే ప్రయత్నంలో భాగంగా.
‘‘ఓ... సారీ, నా డియరెస్ట్‌ ఫ్రెండ్‌ కార్తీక. అమెరికా నుంచి వచ్చి రెండు రోజులైంది. ఒట్టి కబుర్లపోగు. సెల్‌ఫోనే ఆమె హస్తభూషణం. అరచేతుల్లో అది లేకపోతే ఆమెకసలు తోచదు...’’ చెపుతూనే ఫ్రెండ్‌కి మరో మెసేజ్‌ పంపించేసింది.
‘‘మీ ఫ్రెండ్‌ గురించి చెప్పినట్లు లేదు.
మీ గురించే చెబుతున్నట్లుంది’’ అన్నాడు శ్రీపతి నెమ్మదిగా.
‘‘ఏమన్నారు?’’
అడిగింది అతడేమన్నాడో స్పష్టంగా వినిపించనందువల్ల.
‘‘అదే... అంత మంచి ఫ్రెండ్‌ దొరకడం మీ అదృష్టం అంటున్నాను’’ అన్నాడతడు.
‘‘ఎస్‌... కార్తీక దొరకడం నిజంగా నా అదృష్టమే’’ అని చెప్పి, ‘వన్‌ మినిట్‌’ అంటూ చొరవగా ఆమె శ్రీపతి పక్కకొచ్చి నిల్చుంది. ఆమె ఒంటికి పూసుకున్న అత్తరు పరిమళం అతడి నాసికాపుటల్ని తాకి సరికొత్త మత్తుని అనుభవంలోకి తీసుకొచ్చింది. అతి దగ్గరగా ఉన్న ఆమె శరీరం మెత్తగా అతడ్ని తాకుతూ పరవశానికి లోను చేస్తోంది.
‘‘ఇంకాస్త దగ్గరగా రండి. ఓ సెల్ఫీ...
కార్తీక కూడా మిమ్మల్ని చూస్తుందట. చూసి... మనం ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అవునో కాదో మార్కులు వేస్తుంది’’ గలగలా నవ్వింది శోభన.
‘‘ఇంకో ఎగ్జామా?’’ అడిగాడు శ్రీపతి.
అర్థంకాక అయోమయంగా చూస్తోంది శోభన.
‘‘పెళ్ళిచూపులంటేనే పాఠం చదవని పరీక్షలంటారు కదా.
ఆ పరీక్షను ఇప్పుడిద్దరం కలిసి రాస్తున్నాం. ఇంతలో కార్తీక అనే మరో క్యారెక్టర్‌ కూడా మన జంటకు మార్కులేస్తుందంటే... ఆ ఎగ్జామ్‌లో అసలు పాసవుతామో లేదోనని డౌట్‌ పడుతున్నాను’’ వివరించి మరీ చెప్పాడు శ్రీపతి.
‘‘పాసవ్వాలని ఉందా?’’ కవ్విస్తూ అడిగింది శోభన.
‘‘మిమ్మల్ని మిస్‌ కాకూడదని ఉంది. నాకే మీరు ‘మిసెస్‌’ కావాలనుంది’’ మనసులో మాట బయటపెట్టాడతడు. కానీ, ఆ మాటల్ని ఆమె వినిపించుకోలేదు. శ్రీపతితో కలిసి తీసుకున్న సెల్ఫీని కార్తీక సెల్‌కి సెండ్‌ చేసే పనిలో బిజీగా ఉంది.
‘‘ప్చ్‌...’’ నిట్టూర్చాడు శ్రీపతి.
‘‘ఎస్‌... ఇప్పుడు చెప్పండి. మీరేదో అంటున్నారు’’ అడిగింది శోభన.
‘‘చాలా అన్నాను... చాలా విన్నాను - మీతో ప్రమేయం లేకుండానే’’ అన్నాడు శ్రీపతి.
‘‘మన సెల్ఫీ బాగా వచ్చింది. కార్తీక ఒపీనియన్‌ కూడా తెలుసుకుంటే ముందుకు ప్రొసీడవొచ్చు.’’
కొద్ది నిమిషాల మౌనం తర్వాత సెల్‌ఫోన్‌ చూస్తూ ఆమె ఎగిరి గంతేసింది. ఉలిక్కిపడ్డాడు శ్రీపతి.
‘‘ఏం జరిగిందండీ... అలా అరిచారు’’ అన్నాడు కంగారుగా.
‘‘కార్తీక మెసేజ్‌ పెట్టింది. స్టేట్‌ లెవల్‌ సెల్ఫీ కాంపిటీషన్‌కి పంపిస్తే ‘సూపర్‌ జోడీ’ విజేతలమంటూ కితాబిచ్చింది. వన్‌ సెకన్‌... కార్తీకకి ‘థ్యాంక్స్‌’ చెప్పాలి’’ అంటూ మళ్ళీ సెల్‌ఫోన్‌లో తల దూర్చేసింది శోభన.
‘‘నన్నే కాదు... నా వీక్‌నెస్‌నీ భరిస్తానంటేనే మీతో నేను జీవితాన్ని పంచుకోగలను.

నా వీక్‌నెస్‌ ఏంటో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. సెల్ఫీలంటే నాకు పిచ్చి. ఈ పిచ్చిని మీరు భరించగలరా?’’ అడిగింది సూటిగా.
‘‘నువ్వు నచ్చావు. నువ్వు తీసిన సెల్ఫీ నచ్చింది. నా సెల్‌కీ సెండ్‌ చెయ్యి’’ అన్నాడు ఆమె చేతిని చొరవగా అందుకుంటూ.
నెల్లాళ్ళ తర్వాత అదే ‘పాణిగ్రహణ’మైంది.
** *
‘‘కంగ్రాట్స్‌ శ్రీపతీ... ఫస్ట్‌నైట్‌ సెలబ్రేషన్స్‌ని లైవ్‌ అప్‌డేట్స్‌గా ఇవ్వడం రియల్లీ గ్రేట్‌.
వండర్‌ఫుల్‌ థాట్‌. తెల్లచీరా మల్లెపూలతో గదిలోకి ఎంటరైన నీ శ్రీమతి చేతుల్లోంచి పాలగ్లాసు తీసుకుని, నువ్వు తాగి సగం పాలు ఆమెకివ్వడం దగ్గర్నుంచీ ప్రతి సెల్ఫీ అమేజింగ్‌. అదుర్స్‌. ఆ సెల్ఫీలతో బ్యూటిఫుల్‌ ఆల్బమ్‌ చేసుకోవచ్చు...’’ మ్యారేజ్‌ లీవ్‌ కంప్లీట్‌ కావడంతో ఆఫీసులోకి అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచే కొలీగ్స్‌ నుంచి గ్రీటింగ్స్‌ వెల్లువ చూస్తుంటే అవాక్కయిపోయాడు శ్రీపతి.
‘‘సెల్ఫీలా?’’ అడిగాడు అయోమయంగా.
ఎస్‌... మొబైల్‌ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తమ క్రియేటివిటీ జోడించి ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లవుతున్నారు. అంతెందుకు సెల్ఫీలతో షార్ట్‌ఫిల్మ్స్‌ తీసిన కొంతమంది షార్ట్‌ రూట్‌లో ఇండస్ట్రీలోకి ఎంటరైపోవడం మనం చూస్తున్నదే. ఇంతకీ... ఈ ‘సెల్ఫీ శోభనం’ ఇన్నోవేటివ్‌ థాట్‌ ఎవరిది... నీదా నీ శ్రీమతిదా? ఎవరిదైతేనేం... ది గ్రేట్‌ డైరెక్టర్స్‌ రాజ్‌కపూర్‌, రాఘవేంద్రరావుల్లా ఫస్ట్‌నైట్‌ రొమాన్స్‌ని కలర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేశారిద్దరూ. అంతలోనే... సీన్‌ కట్‌ చేస్తూ ‘అసలుకి మోసం చేశారేం భయ్యా?’ అనడిగాడు ఓ కొలీగ్‌ - శ్రీపతి ఒళ్ళు మండిపోయేలా.
‘‘అంటే..?’’ మరొక కొలీగ్‌ ధర్మసందేహం.
‘‘ఇంకా రిలీజ్‌ కాని కొత్త సినిమా టీజర్‌లా కాన్సెప్ట్‌ అర్థమైందే తప్ప కంటెంట్‌ మిస్‌ బాస్‌’’ అన్నాడొకడు అనూహ్యంగా చుట్టుముట్టిన పెను సునామీలో ఇల్లూ వాకిలితో సహా సర్వస్వం పోగొట్టుకున్న బాధితుడిలా ఫోజిస్తూ.
‘‘ఇంత వయసొచ్చి ఆ కంటెంటేంటో నీకు తెలీదంటే నమ్మేదెలా?’’ మరొకడి సెటైర్‌.
‘‘తెలిసిన కంటెంటే అయినా... ఒక్కో హీరో స్టార్‌డమ్‌ ఒక్కోలా ఉంటుంది కదా! అందుకే, తీసిన కథలతో సినిమాలు తీసి కూడా హిట్‌ కొడుతుంటారు డైరెక్టర్స్‌. అసలు ఆ కంటెంట్‌లో మత్తూ మహత్తూ అంతే. ఎప్పుడు, ఎలా
ఎన్నిసార్లు చూసినా మనసు జివ్వుమంటుంది’’ అన్నాడు ఇంకొకడు.
‘‘మొత్తానికి శ్రీపతి చాలా అదృష్టవంతుడు. లైఫ్‌లో ప్రతి మూమెంట్‌నీ రికార్డు చేసే శ్రీమతి దొరికింది. కొన్నేళ్ళ తర్వాత ఒక్క క్షణం ఆగి ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే...
ఈ ‘సెల్ఫీ’ జ్ఞాపకాలే మళ్ళీ మరింత ముందుకు నడిపించే ఇంధనంగా పనిచేస్తాయి. అవి చిత్తరువులా... రేపటి జీవితానికి కొత్త రుతువులు’’ అన్నాడో కొలీగ్‌ కించిత్‌ భావుకతతో.
‘‘మల్లెపూలతో అలంకరించిన పట్టెమంచమూ అగరొత్తుల ధూపమూ పక్కనే టీపాయ్‌ మీద పెద్ద పళ్ళెం నిండుగా ఫ్రూట్సూ స్వీట్సూ. అంతేనా, ఒకే మాట ఒకే బాట ఒకే గమ్యంగా సాగిపోతూ ఒకరిపై ఒకరు పరవశంతో
ఒరిగిపోతున్న ఒక్కో ‘సెల్ఫీ స్టిల్‌’ అదరహో... ఖజురహో అనిపించింది... వావ్‌..?’’
అలా... కొలీగ్సంతా సామూహికంగా అభినందనలు కురిపిస్తుంటే మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాడు శ్రీపతి. కారణం... తొలిరాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే మధురమైన రాత్రి.
పెళ్ళికాకముందు అద్దంలాంటి మనసు... పెళ్ళయిన వెంటనే నచ్చిన వ్యక్తి కొలువుతీరే చిత్రపటంగా మారిపోతుంది. పుట్టినరోజులూ పండగరోజుల్లాంటి సంబరాలెన్నింటినో బంధుమిత్ర సపరివార సమేతంగా సందడి సందడిగా చేసుకోవచ్చు కానీ... పెళ్ళి తర్వాత జరిగే ‘తొలిరేయి తంతు’ మాత్రం కేవలం జీవిత భాగస్వాములైన ఇద్దరికి మాత్రమే పరిమితం.
గుండెల్లోతుల్లో కుండపోతగా కురిసే పున్నమి వెన్నెల హాయి కూడా మనసా వాచా కర్మణా ఆ ఇద్దరూ ఒకరికొకరు అంకితం చేసుకునే అనిర్వచనీయమైన వేడుక. పెళ్ళి తర్వాత గదిలోకి వెళ్ళిన జంట ఏం చేస్తారో... యావత్‌ ప్రపంచానికీ తెలిసినా ఎవరికీ తెలీనట్లు గుట్టుగా వ్యవహరించడంలోనే అనంతానంత ఆనందం నిండి ఉంది.
అలాంటిది... ఆధునిక సాంకేతికత అన్ని రంగాల్లోకీ దురుసుగా దూకుడుగా ప్రవేశించినట్లు శోభనరాత్రుల్లోకి కూడా చొరబడితే... వ్యక్తిగత ప్రైవసీ ఇంకెక్కడిది?
ఎవరూలేని ఏకాంతంలోకి ఏతెంచిన ‘సెల్ఫీ’లు చిత్రవిచిత్రాలు చేస్తుంటే, ఆడా మగా దగ్గరితనానికి అవకాశమేది? పెళ్ళి మంటపంలోకి వచ్చిన కెమెరాలు పడకటింట్లోకి కూడా ప్రవేశిస్తే ఎలా?
శ్రీపతికి శ్రీమతిమీద పీకల్లోతు కోపమొచ్చింది. తనకు ‘సెల్ఫీ’మానియా ఉందని పెళ్ళిచూపులరోజే గమనించాడు కానీ... పడగ్గది ఏకాంతాన్ని కూడా సెల్‌ కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌తోపాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరితోనూ షేర్‌ చేసుకుంటూ ‘లైక్‌’లూ ‘కామెంట్‌’ల కోసం వెయిట్‌ చేస్తుందంటే తన పిచ్చి పీక్స్‌లోకి వెళ్ళిందన్నమాటే.
నాలుగ్గోడల మధ్య జరగాల్సిన ‘శోభనరాత్రి’ని ‘బొమ్మలు చెప్పిన కమ్మని కబుర్లు’గా మార్చేసిందంటే ఇంటికి వెళ్ళగానే తనకు క్లాస్‌ పీకాల్సిందే. ఉదయాన లేస్తూనే సెల్‌ చేతుల్లోకి తీసుకోవడం... ‘ఇప్పుడే నిద్ర లేచా’నంటూ ఓ ‘సెల్ఫీ’
తీసుకుని అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమంలోకి అప్‌లోడ్‌ చేసేయడం... బ్రష్‌ చేస్తూ ఓసారి, ముఖం కడుగుతూ ఓసారి, నుదుట స్టిక్కర్‌ బొట్టు పెడుతూ ఓసారి, స్నానం చేసిన తర్వాత మార్చిన దుస్తుల్లో మరోసారి, పొగలు కక్కుతున్న వేడివేడి ఇడ్లీలను కారప్పొడీ నెయ్యిలో నంజుకుంటూ ఇంకోసారి... ఇలా ఇరవైనాలుగ్గంటలూ- రోజులో నిద్రపోయే కొద్ది గంటలు మినహాయిస్తే- మెలకువలో ఉన్న ప్రతి కదలికనూ ‘కెమెరా’లో బంధిస్తూ ఆధునిక ప్రపంచంతో అనుసంధానమవుతున్నామనడం... ఇదే రకమైన జాడ్యం? ఆలోచిస్తుంటే శ్రీపతి బుర్ర వేడెక్కిపోతోంది.
కొలీగ్స్‌ ముందు తనలోని అసహనాన్ని ప్రదర్శించలేక పైకి చిరునవ్వులు చిందిస్తూ లోన కుమిలిపోతున్నాడతడు.
‘‘మన ఫస్ట్‌నైట్‌ సెల్ఫీలకి మంచి రెస్పాన్స్‌ వచ్చిందండీ. అప్‌లోడ్‌ చేసిన వన్‌వీక్‌లోనే వేలల్లో ‘లైక్స్‌’, ‘షేర్స్‌’, ‘కామెంట్స్‌’. సోషల్‌ మీడియాలో మనం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోహీరోయిన్లమయ్యాం కదండీ’’ చెప్తోంది శోభన.
‘‘ఈ సెల్ఫీ పిచ్చి మానవా?’’ అడిగాడు శ్రీపతి కాస్త కటువుగా.
‘‘ఎందుకు మానాలి?’’
‘‘ప్రతి ఒక్కరి చేతుల్లోనూ సెల్‌ఫోన్‌ ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది. ఆ వ్యక్తిగతాన్నెవరూ వీధుల్లోకి లాగి రచ్చరచ్చ చేసుకోరు. అర్థంచేసుకో’’ బతిమాలుతూ అన్నాడతడు.
‘‘ఆఫీసు కొలీగ్సంతా ఈ సెల్ఫీల గురించే మాట్లాడుకుంటున్నారు. శోభనం రాత్రి ఓ చేత్తో పాలగ్లాసూ మరోచేత్తో సెల్‌ఫోన్‌తో వచ్చినప్పుడే నిన్ను కంట్రోల్‌ చేయాల్సింది. కొత్త పెళ్ళాంతో మొదలయ్యే కొత్త జీవితంలోని తొలితొలి క్షణాలు కోపాలూ అలకలతో మొదలుపెట్టకూడదనే ఇంగితంతో ఆరోజు అంత సహనంగా ఉన్నాను. పెళ్ళిచూపుల్లోనే ఫ్రెండ్‌తో చిట్‌చాట్‌ చేస్తూ మధ్యమధ్య నాతో మాట కలిపినప్పుడే... కాస్త ఆలోచించాల్సింది. కానీ...’’ అతడు కోపంగా చెప్తుంటే పక్కకొచ్చి భుజమ్మీద చేయి వేసి మరీ ఓ సెల్ఫీ ఫోజిచ్చింది శోభన.
‘కొత్త భార్యతో... కోపంతో నా మొగుడు’ అంటూ ఆ సెల్ఫీకింద ఓ కామెంట్‌ పెట్టి మరీ క్షణాల్లో ప్రతి ఒక్కరికీ పంపించేసింది.
‘‘నువ్వు మారవు’’ అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు శ్రీపతి.
‘‘ఎందుకు మారాలి? పెళ్ళిచూపులనాడే ‘సెల్ఫీలంటే నాకు పిచ్చి. ఈ పిచ్చిని మీరు భరించగలరా?’ అనడిగితే... ‘ఓకే’ అన్నది మీరే. పెళ్ళయిన వెంటనే ఇప్పుడు కాదంటున్నదీ మీరే... నేను చచ్చినా మారను. ఒకవేళ
మారాలనుకుంటే మీరే మారండి’’ అంది శోభన.
వాష్‌రూమ్‌లోకి వెళ్ళి వచ్చేలోపల శ్రీపతి సెల్‌ఫోన్‌లో లెక్కకు మిక్కిలి మిస్డ్‌ కాల్సూ మెసేజ్‌లూ ఉన్నాయి.
‘మైండ్‌ దొబ్బిందిరా? పెళ్ళయిన కొత్తలోనే భార్యని ఏడిపిస్తున్నావు, వేధిస్తున్నావు. తను తనలాగే ఉంటుంది. మగాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడానికి తను ‘రోబో సుందరి’ కాదు... ఆధునిక మహిళ. ఆమెకీ ఇష్టాయిష్టాలుంటాయి, వ్యక్తిగత అభిరుచులుంటాయి. ఎంత మగాడివైనా మొగుడివైనా అర్ధాంగి పర్సనల్‌ స్పేస్‌లోకి వెళ్తే... ఖబడ్దార్‌. మహిళా సంఘాలవాళ్ళు చూస్తూ ఊరుకోరు. నిన్ను బొక్కలో తోసేదాకా నీ ఇంటిముందు నిరసనకు దిగుతారు. ఆందోళన చేస్తారు. జాగ్రత్తగా ఉండు. లేకుంటే, నీకు శంకరగిరి మాన్యాలే’ మెసేజ్‌ల్లో హెచ్చరికలున్నాయి.
కట్‌ చేస్తే- కొద్దిరోజులకే శ్రీపతిలో కొట్టొచ్చినట్లు మార్పొచ్చింది. ఇప్పుడు శ్రీపతికి కూడా సెల్ఫీల పిచ్చి పీక్స్‌కి చేరింది.
శవం పక్కనా రైలు బోగీలెక్కీ అంతెత్తు కొండపైకెక్కీ... ఇలా ఎన్నో ఎన్నెన్నో సెల్ఫీలు పిచ్చపిచ్చగా దిగుతూ భార్యతో పోటాపోటీగా అప్‌లోడ్‌ చేస్తున్నాడు.
పాపం... శ్రీపతి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.