close

నలభై ఎకరాలు దానమిచ్చేశాడు!

స్థిరాస్తికి రెక్కలొచ్చేస్తున్నాయి. నగరాల పక్కన ఎకరం కాదుకదా రెండు మూడు సెంట్లున్నవాళ్లు కూడా లక్షాధికారులైపోతున్నారు. అలాంటిది ఎకరాలకెకరాలు గంపగుత్తగా దానమివ్వడమంటే ఈరోజుల్లో ఊహించగలమా? కోలా వేంకటసుబ్బారావు అదే చేశారు. నెల్లూరు శ్రీసిటీకి అతి సమీపాన, చెన్నై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 40 ఎకరాల స్థలాన్ని ‘అడయారు క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌’కి రాసిచ్చేశారు. ‘క్యాన్సర్‌పైన పోరాటానికి నా వంతుగా చేస్తున్న చిన్న ఉడతసాయం ఇది’ అని చెబుతారాయన.

సుబ్బారావు స్వస్థలం గుంటూరు జిల్లాలోని వెనిజెల. తండ్రి కృష్ణయ్య ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. చీరాల్లో బీకామ్‌ చదివి చెన్నైలోని ఎయిర్‌పోర్టులో ట్రాన్స్‌పోర్టు అసిస్టెంట్‌గా 1963లో చిన్న ఉద్యోగంలో చేరారు సుబ్బారావు. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన తండ్రి కృష్ణయ్య పెనైల్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. గుంటూరులో దాన్ని సరిగ్గా గుర్తించలేక ఏదో కండ పెరిగిందని శస్త్రచికిత్స చేశారట. ఆపరేషన్‌ జరిగిన కొన్నాళ్లకే మళ్లీ సమస్య తిరగబెట్టింది. అప్పుడు చేసిన పరీక్షల్లో క్యాన్సర్‌ అని తేలిందట... అదీ ప్రమాదకర దశకి చేరిందనీ చెప్పారట. కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. ఆ మరణం సుబ్బారావుని బాగా కలచివేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాలకి చెందిన చాలామంది
కాస్త పెద్దస్థాయి వైద్యచికిత్స కోసం చెన్నైకే వస్తుండేవారు. అలా తన ఊరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరు వచ్చినా వాళ్లకి దగ్గరుండి అన్ని రకాలుగా సాయం చేయడం మొదలుపెట్టారు సుబ్బారావు. పేదరోగులకయ్యే ఖర్చులన్నీ తానే భరించేవారు.

రెండురూపాయల ఆసుపత్రి
‘1990లలో ఈ ఉడతాభక్తి సాయాలు కాకుండా ఇంకా పెద్ద ఎత్తున చేయాలనిపించింది. ఉద్యోగంలో కుదురుకున్నాక నెల్లూరు శివారులో ఉండే రాజుపాళెం దగ్గర మా మావయ్య నా చేత కొంత స్థలం కొనుగోలుచేయించాడు. ఆ స్థలంలో ఉచిత క్లినిక్‌ ఏర్పాటుచేయాలని అనుకున్నాను. కానీ... నెల్లూరు నగరంలో ఉండే వైద్యులు కూడా అంత దూరం రాలేమని చెప్పేశారు. అప్పుడే నా స్నేహితుడొకడు రామచంద్రాపురంలో భూములు కొనమని చెప్పాడు. నెల్లూరు దగ్గరున్న స్థలాన్ని అమ్మేసి ఇక్కడ మొదట పద్నాలుగు ఎకరాలు కొన్నాను. వాటిని కొనేకొద్దీ నా కలలు పెద్దవయ్యాయి. చిన్న క్లినిక్‌ కాకుండా నాన్న పేరు మీద ఓ పెద్ద ధర్మాసుపత్రి కట్టాలనిపించింది. నాకు ఇద్దరు పిల్లలు... పాప, బాబు. పాపని ఎంబీబీఎస్‌ చదివించి, ఓ వైద్యుడికే ఇచ్చి పెళ్లిచేసి ఇద్దరూ ఆ ఆసుపత్రి నడిపేలా చూడాలని పగటి కలలు కనడం మొదలుపెట్టాను! చేతిలో డబ్బున్నప్పుడల్లా నాపేరుమీదా, భార్యాపిల్లల పేరుమీద భూములు కొంటూ వచ్చాను. అలా ఒకే బిట్‌ కింద నలభై ఎకరాలయ్యాయి. నేను కలలుకన్నట్లే పాపని ఎంబీబీఎస్‌లో చేర్చాను. ఓ క్లినిక్‌తో మొదటి అడుగువేయాలని అనుకున్నాను. చెన్నైలో నాకు తెలిసిన కరుప్పయ్య అనే వైద్యుడు... ప్రతి రోజూ ఇక్కడికి వచ్చి వైద్యసేవలు అందిస్తాననాన్నడు. అలా 1997లో ‘కోలా కృష్ణయ్య క్లినిక్‌’ను ప్రారంభించాను. చుట్టుపక్కలున్న పల్లెటూరి ప్రజలందరికీ రూ.2 ఫీజుతో చికిత్స అందించడం మొదలుపెట్టాం. మందులు కూడా ఉచితమే. ఓ దశలో రోజుకి రెండొందల మంది రోగులు వస్తుండేవారు...’ అని గుర్తుచేసుకుంటారు కేవీ సుబ్బారావు.

ఓ కుదుపు...
కానీ అన్నీ సాఫీగా సాగిపోలేదు. ‘లక్ష్యాలు ఉన్నతమైనవైనా జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా! మా క్లినిక్‌లో చికిత్స అందిస్తూ వచ్చిన డాక్టర్‌ కరుప్పయ్య రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆరునెలల తర్వాత కోలుకున్నా... రోజూ అంతంత దూరం ప్రయాణం చేయలేనన్నారు. మరి ఆ స్థాయి వైద్యులెవరూ ఇంతదూరం వచ్చి పనిచేయడానికి ఒప్పుకోలేదు. నా కూతురు ఎంబీబీఎస్‌ చేసిందికానీ ఓ ఇంజినీర్‌ని పెళ్లి చేసుకుని యూఎస్‌కి వెళ్లిపోయింది. మా అబ్బాయీ ఇంజినీరే... తనూ అమెరికా వెళ్లాడు. నా కూతురి చేత ధర్మాసుపత్రి పెట్టించాలనే ఆశలు అలా అడియాసలయ్యాయి. పదమూడేళ్లపాటు నడిపిన క్లినిక్‌ నా కళ్లెదుటే మూతపడింది. అప్పుడే నా దృష్టి అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌పైన పడింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న... ఇప్పటికీ అరవై శాతం మంది నిరుపేద రోగులకి ఉచిత చికిత్స అందించే ఏకైక ప్రయివేటు సంస్థ అది! దానికే నా భూమి మొత్తాన్నీ ఇచ్చేయాలనిపించింది. దాంతో గత అక్టోబరులో నా నలభై ఎకరాల భూమిని ఆ సంస్థకి అప్పగిస్తూ రిజిస్టర్‌ చేయించాను’ అంటారు సుబ్బారావు.

వాళ్లే నా ఆస్తి
‘మరి కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అలా అప్పగిస్తానంటే మీ పిల్లలు ఏమీ అనలేదా’ అని అడిగితే ‘లేదండీ. నా భార్యా, పిల్లలూ వాళ్ల జీవిత భాగస్వాములూ చిన్న అభ్యంతరం కూడా చెప్పలేదు! అడిగిందే తడవుగా తమ అంగీకారాన్ని అమెరికా నుంచి పంపించేశారు. అది చేతికి అందిన రోజు ఆనందంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. భూములు కాదు, వీళ్లే నా అసలైన ఆస్తి అనిపించింది...!’ అంటారు గాద్గదిక స్వరంతో సుబ్బారావు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.