close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పండ్లు... ట్యాబ్లెట్ల రూపంలో..!

 

సపోటా వాసన నచ్చదనో, సీతాఫలం గింజలు చిరాకనో, పైనాపిల్‌ కోయడం కష్టమనో, స్ట్రాబెర్రీలోని పులుపు ఇష్టంలేకనో... ఇలా రకరకాల కారణాలతో పండ్లు తినడానికి బద్ధకించేవాళ్లు కొందరయితే; సమయాభావంతో తినడం మర్చిపోయేవాళ్లు మరికొందరు. అన్ని రకాల పండ్లూ దొరకక తినలేనివాళ్లు ఇంకొందరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాబోలు... ఇప్పుడు ఏకంగా ఆ పండ్లలోని సారాన్నంతటినీ పిండేసి ట్యాబ్లెట్‌ రూపంలో తీసుకొచ్చేస్తున్నారు!

న్ని రకాల పండ్లూ మామిడి అంత మధురంగా ఉండకపోవచ్చు. కానీ వేటి రుచి వాటిదే. అలాంటి పండ్లను హాయిగా కోసుకునో కొరుక్కునో తినకుండా ఈ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవడం ఏమిటీ అనిపించడం సహజమే. కానీ కొందరు ఎంత చెప్పినా పండ్లు తినడానికి ఓ పట్టాన ఇష్టపడరు. బలవంతంగా అలవాటు చేయాలని చూసినా చేసుకోరు. మరికొందరికేమో తిందామనుకున్నా తెచ్చుకోవడానికి బద్ధకిచ్చో లేదా గుర్తులేకో తినడం మానేస్తుంటారు. ఇంకొందరికి అన్ని రకాల పండ్లూ అందుబాటులో లేకపోవచ్చు. దాంతో శరీరానికి అవసరమైన విటమిన్లు సరిగ్గా అందవు. అదీగాక, అన్ని పండ్లలోనూ ఒకే రకమైన పోషకాలూ ఉండవు. ఉదాహరణకు వృద్ధాప్యాన్ని మీదపడనీయని బ్రొమిలీన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ పైనాపిల్‌లో ఎక్కువగా ఉంటే, గుండెను కాపాడే రెస్‌వెరాట్రల్‌ ద్రాక్షలో పుష్కలం. మంటను తగ్గించి, జీర్ణశక్తిని పెంచే యాక్టివేటెడ్‌ ఫినాలిక్‌ యాంటీఆక్సిడెంట్ల శాతం ఆపిల్‌లో చాలా ఎక్కువ. రోగనిరోధకశక్తిని పెంచే సి-విటమిన్‌ నారింజ, కమలాపండ్లలో సమృద్ధిగా లభిస్తుంది. ఈ పోషకాలన్నీ శరీరానికి అవసరమే. అదీగాక పండ్లూ కూరగాయలు ఎక్కువగా తినేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అలాగని రోజూ అన్నిరకాల పండ్లూ అందరికీ అందుబాటులోనూ ఉండవు. తినే సమయమూ ఉండకపోవచ్చు. పైగా కొన్ని పండ్లంటే కొందరికి ఇష్టమూ ఉండదు. అన్ని రకాల పండ్లూ అన్నిచోట్లా పండవు కూడా. అందుకే పండ్లన్నింటినీ ట్యాబ్లెట్‌ రూపంలోకి మార్చేస్తున్నారు ఉత్పత్తిదారులు.

అంతేకాదు, వ్యాయామం చేసేటప్పుడూ ఆటలు ఆడేటప్పుడూ చెమట రూపంలో శరీరంలోని నీరూ ఖనిజాలన్నీ బయటకు వెళ్లిపోతుంటాయి. కానీ జీవక్రియలో ఖనిజాలది కీలకపాత్ర. అలాంటి సమయంలో అవి వెంటనే శరీరానికి అందాలంటే పండ్లు తినాలి, నీరు తాగాలి. కానీ అప్పుడవి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పండ్ల ట్యాబ్లెట్‌ ఒకటి నీళ్లలో వేసుకుంటే చాలు. క్షణంలో కరిగిపోతుంది. వాటిని తాగితే నీటితోబాటు పండ్లలోని ఎలక్ట్రోలైట్లన్నీ శరీరానికి అందుతాయి. ఆ విధంగా చూసుకున్నా ఈ పండ్ల ట్యాబ్లెట్లు ఆరోగ్యానికి మంచివే అంటున్నారు ఆహార నిపుణులు. అందుకే అనేక కంపెనీలు వీటి తయారీమీద దృష్టి పెడుతున్నాయి. అయితే పండయినా కాయైనా... దాన్ని సహజంగా తినగలిగితేనే మంచిది. ఎందుకంటే పోషకాలూ ఖనిజాలతోబాటు కొలెస్ట్రాల్‌ని నియంత్రించే పీచూ పండ్లలోనే సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వాటిని తినలేని పక్షంలో కనీసం ఓ ట్యాబ్లెట్‌  తీసుకున్నా మేలే. ఆయా పండులోని పోషకాలు కొంతయినా శరీరానికి అందుతాయనేది సదరు నిపుణుల వివరణ. దాంతో కొన్ని కంపెనీలు పిల్లలు కూడా ఇష్టంగా చప్పరించేలా ఆయా పండ్లలోని పోషకాలకి కొంత చక్కెరనీ జోడించి క్యాండీల్లా తయారుచేస్తున్నాయి. సో... ఇష్టంలేని పండ్లనీ, అందుబాటులో లేని పండ్లనీ పిల్స్‌ రూపంలో అయినా చప్పరించేయండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.