close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎలగిరి... ఏడాదిపొడవునా చల్లదనమే!

‘పచ్చని కొండలూ వాటి మధ్యలో నీలి సరస్సులూ ఉరికే జలపాతాలూ అందాల ఉద్యానవనాలూ... ఎటు చూసినా ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలే. అందుకే ఒకసారి ఎలగిరి వెళ్లినవాళ్లు మళ్లీ మళ్లీ అక్కడికి వెళుతూనే ఉంటారు’ అంటూ అక్కడి అందచందాలను వర్ణిస్తున్నారు కడపకు చెందిన రాచపూటి రమేష్‌.

మిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉంది ఎలగిరి. కొండలూ కోనల మధ్యలో గులాబీ తోటలూ పండ్లతోటలతో అందానికి చిరునామాగా విలసిల్లుతోంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఊటీ, కొడైకెనాల్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. మా స్కూలు బ్యాచ్‌ ఈసారి సమావేశాన్ని అక్కడ ఏర్పాటుచేయడంతో నేను కడప నుంచి జయంతి- జనతా ఎక్స్‌ప్రెస్‌లో ఎలగిరికి బయల్దేరాను. వనియంబాడి-తిరుపత్తూరు రహదారిలో జోలార్‌పేట జంక్షన్‌కి 20 కి.మీ. దూరంలో ఉంది ఎలగిరి. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం రెడ్డియూర్‌ జమీందార్ల ఆస్తిగానే ఉండేది. అయితే 1950లో భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. నాటి జమీందార్ల బంగ్లా ఒకటి రెడ్డియూర్‌లో
ఇప్పటికీ ఉంది. వెల్లూరుకి 94 కి.మీ., చెన్నై నుంచి 230 కి.మీ. దూరంలో ఉన్న ఎలగిరిలో మలయాలి, వెల్లాల తెగల గిరిజనులు అనాదిగా నివసిస్తున్నారు. కొండల్లో నివసించడం వల్లే మలయాలి అనే పేరు వచ్చిందట. వీళ్లనే కారాలార్లు అనీ అంటారు. అంటే మబ్బుల్ని పాలించేవాళ్లు అని అర్థమట. తమ పూర్వికులు కాంచీపురం నుంచి వచ్చినట్లుగా వాళ్లు చెప్పుకుంటే, 17వ శతాబ్దంలో టిప్పుసుల్తాన్‌ సైన్యమే తమ పూర్వికులని వెల్లాల తెగవాళ్లు అంటుంటారు. ఈ రెండూగాక ఇరులార్‌ అనే మరో తెగ కూడా అక్కడ ఎప్పటినుంచో నివసిస్తోంది.

స్వామిమలై!
మొత్తం 14 గ్రామాలతో ఉన్న ఎలగిరి కొండల్లో ఆలయాలకు లెక్కలేదు. ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైబింగ్‌, పారాగ్లైడింగ్‌ చేసేవారికి ఎలగిరి అన్నివిధాలా అనుకూలం. చిన్న చిన్న కొండల్లా పరచుకున్న ఇక్కడి
పర్వతశ్రేణిలో ఎత్తైనది స్వామిమలై. ఇది 4,338 అడుగుల ఎత్తులో ఉంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ కొండ ఎక్కాలని ట్రెక్కర్లు కలలు కంటుంటారు. ఈ కొండ పాదంలో ఉన్న గ్రామమే మంగళం. ఇక్కడి నుంచే అందరూ స్వామిమలైని అధిరోహిస్తుంటారు. ఎలగిరిలోని పాలమర్తి, జావడి కొండల్లో కూడా కొందరు ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. ట్రంపోలిన్‌, ఆర్చరీ, షూటింగ్‌... వంటి క్రీడల్నీ ఏర్పాటుచేశారిక్కడ. అయితే ఎలగిరి కొండలు పాములకు ఆవాసాలు. ట్రెక్కింగ్‌ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలి.

ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా చల్లగానే ఉంటుంది. ముందుగా మేం అక్కడి బోట్‌ క్లబ్‌, నేచర్‌ పార్కు... వంటి దర్శనీయ స్థలాలు సందర్శించి రిసార్ట్స్‌ క్యాంపు దగ్గర ఆటపాటలతో హాయిగా గడిపాం. మర్నాడు ఉదయాన్నే బయలుదేరి మంగళం గ్రామం దగ్గర నుంచే ఎలగిరి కొండను ఎక్కడం ప్రారంభించాం. చుట్టూ ఉన్న చెట్ల కారణంగా దాదాపు రెండువేల మెట్లు ఎక్కినా అలసట తెలియలేదు. దారిలో కొండల్లో పండే సీతాఫలాలూ జామకాయలతోపాటు మజ్జిగనూ స్థానిక మహిళలు గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు. అవి తింటూ దాదాపు రెండు గంటల తరవాత కొండ కొనకు చేరుకున్నాం. అక్కడ ఇనుప మెట్ల నిచ్చెన ఒకటి ఉంది. అది ఎక్కి బల్లలా ఉన్న కొండ పై అంచుకి చేరుకుని అందరం ఆనందంగా కేకలు పెట్టాం. అక్కడి నుంచి చూస్తే కొండలూ అడవులూ ఇళ్లూ చెట్లూ సెలయేర్లూ జలపాతాలూ అన్నీ చిన్నగా కనిపించసాగాయి. కాసేపు ఆ శిఖరాగ్రంమీదే సేదతీరి, మళ్లీ నిచ్చెన దిగి, అక్కడ కొండమీద ఉన్న గుడిలోని శివుణ్ణి దర్శించుకుని వెనుతిరిగాం. వాతావరణం చల్లగా ఉండటంతో మా ట్రెక్కింగ్‌ ఆహ్లాదకరంగా సాగింది.

మధ్యాహ్నం భోజనం తరవాత కాసేపు సేదతీరి, మిత్రబృందం నిర్వహించిన క్విజ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని, సాయంత్రానికి పుంగనూరు సరస్సు వద్ద ఉన్న బోట్‌హౌస్‌కు చేరుకున్నాం. కృత్రిమంగా ఏర్పాటుచేసిన ఆ సరస్సులోని పడవల్లో కాసేపు షికార్లు చేశాం. అక్కడ మోటార్‌బోట్లూ పెడల్‌ బోట్లూ తెడ్డు వేసేవి కూడా ఉన్నాయి. సరస్సు చుట్టూ నేచర్‌ పార్క్‌ పేరుతో ఓ పండ్ల తోట ఉంది. అక్కడ ఓ కృత్రిమ జలపాతాన్నీ పాటలకు అనుగుణంగా నృత్యం చేసే మ్యూజిక్‌ ఫౌంటెయిన్‌నీ కూడా ఏర్పాటుచేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న వెదురు ఇల్లూ ఆక్వేరియం పిల్లలను ఆకర్షిస్తాయి. ఆ సాయంత్రం క్యాంప్‌ఫైర్‌ వేసుకుని అందరం సరదాగా గడిపాం.

వేలవన్‌ దేవాలయం!
మర్నాడు ఉదయం ఎలగిరికి 5 కి.మీ. దూరంలోని అత్తారు నదినీ, 14 కి.మీ. దూరంలో తిరుపత్తూరు దారిలోని జలగంవరై జలపాతాన్నీ సందర్శించాం. ఇక్కడికి సమీపంలోనే వైనబప్పు అబ్జర్వేటరీ ఉంది. దీన్ని కవలూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ నిర్వహిస్తోంది. అందులో ఆసియాలోనే అతి పెద్ద టెలీస్కోప్‌ ఉంది. ఇక్కడి నుంచి సమీపంలోనే నిలవూర్‌ వెళ్ళే దారిలో సత్యాశ్రమం ఉంది. కానీ అక్కడికి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే అనుమతిస్తారు.
తరవాత ఇక్కడి కొండల్లోని వేలవన్‌ దేవాలయానికి వెళ్లాం. ఇక్కడ మురుగన్‌ని కువన్‌గానూ వల్లీదేవిని కురతిగానూ కొలుస్తారు. జూలై-ఆగస్టుల్లో ఈ గుడిలో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తారు. అత్నవూర్‌ బస్టాండు నుంచి మూడు కి.మీ. దూరంలో ఉన్న ఈ గుడి పక్కనే ఘటోత్కచ విగ్రహం ఉంటుంది. అక్కడే ఉన్న నిలవూరు సరస్సు వద్ద మోక్షవిమోచన, దేవీ కోవెలలు ఉన్నాయి. అత్నవూరు బస్టాండు నుంచి 4 కి.మీ. దూరంలో ఉన్న ప్రభుత్వ సిల్క్‌ ఫామ్‌లో మల్బరీ చెట్ల మధ్య నడక ఆహ్లాదభరితంగా సాగింది.

ఎలగిరి వెళ్లినవాళ్లు ఆ చుట్టుపక్కల ఉన్న కాంచీపురం, రత్నగిరి, వెల్లూరు... వంటి ప్రదేశాలన్నీ కూడా చుట్టి రావచ్చు. అయితే మేం వెల్లూరు మాత్రమే వెళ్లాం. ఎలగిరికి 71 కి.మీ. దూరంలో ఉంది వెల్లూరు.
16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజులే ఇక్కడి కోటను నిర్మించారు. దీన్ని జలదుర్గం అనీ పిలుస్తారు. తరవాత ఈ ప్రాంతాన్ని ఆరవీడు వంశస్తులూ బీజాపూర్‌ సుల్తానులూ మరాఠాలు కూడా పరిపాలించారు. టిప్పుసుల్తాన్‌, శ్రీలంక చివరి చక్రవర్తి విక్రమ రాజసింహలను ఈ వెల్లూరు కోటలోనే బంధించారు. ఈ కోటలోనే జలకంఠేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయంలో అడుగడుగునా ప్రాచీన శిల్పకళ ఉట్టిపడుతుంటుంది. చాలా సంవత్సరాలు దేవాలయాన్ని ఆయుధాగారంగా వాడినందువల్ల ఇక్కడ మూలవిరాట్టు లేదట. కొంతకాలం క్రితమే శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ప్రస్తుతం కోటలో ప్రభుత్వ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. పురాతన వస్తువులూ అరుదైన చిత్రపటాలూ ప్రాచీన ఆయుధాలూ నాణేలూ ఇక్కడ భద్రపరిచారు. కోటలోనే 150 సంవత్సరాల క్రితం కట్టిన సెయింట్‌ జాన్స్‌ చర్చి కూడా ఉంది.

లక్ష్మీదేవి స్వర్ణ దేవాలయం!
వెల్లూరులోనే తప్పక చూడదగ్గ మరో ప్రదేశం శ్రీనారాయణీ పీఠం. వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మలైకోడి ప్రాంతంలో ఈ పీఠం విలసిల్లుతోంది. ఇందులోనే లక్ష్మీదేవి స్వర్ణదేవాలయం ఉంది. శ్రీచక్రం ఆకారంలో ఉన్న ఈ గుడికి వెళ్లే దారిలో గోడలమీద భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ నుంచి తీసుకున్న సూక్తులు కనిపిస్తాయి. ఇవన్నీ చదువుకుంటూ వెళుతుంటే సర్వమత సారం ఒకటే అనిపించక మానదు. తరవాత చూడదగ్గది సీయమ్‌సీ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌. నగరం నడిబొడ్డున ఉన్న మసీదులో దేశంలోకెల్లా అతిపెద్ద అరబిక్‌ కాలేజీ కూడా ఉంది. తరవాత సైన్స్‌ పార్కుని కూడా సందర్శించాం. అక్కడున్న టెలీస్కోప్‌ ద్వారా ఇసాన్‌ అనే తోకచుక్కను చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులకోసం వేసవిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు.

తరవాత వెల్లూరుకు 25 కి.మీ. దూరంలోని వల్లిమలైకి వెళ్లాం. ఈ కొండకి దిగువ భాగంలో తెన్‌వెంకటాచలపతి ఆలయం ఉంటుంది. అక్కడ విష్ణుమూర్తి సాధు రూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూగా చెప్పే ఈ విగ్రహం పెరుగుతూ ఉంటుందని ప్రతీతి. పిల్లలు లేనివాళ్లు ఆయన్ని ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడే కొండపైన ఉన్న వల్లిమలై మురుగన్‌ ఆలయంలో వల్లీసమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు.
తరవాత వెల్లూరుకి 30 కి.మీ. దూరంలోని వాలాజాపేటకి సమీపంలోని కీజుపుడుప్పేటలోని ధన్వంతరీ ఆరోగ్య పీఠానికి వెళ్లాం. ఇక్కడ ధన్వంతరి 75 భిన్న రూపాల్లో కనిపిస్తాడు. ఈ పీఠానికి అడుగున 54 కోట్ల మంత్రాలను రాసిన రేకుల్ని ఏడు అంగుళాల వెడల్పు గల రాగి పైపు చుట్టూ కట్టి నిక్షిప్తం చేశారట. ఆ మంత్రాల శబ్దతరంగాల ద్వారా శక్తి వెలువడుతుందనీ అందువల్ల అక్కడికి వెళ్లినవాళ్లకి మొండి వ్యాధులు నయమవుతాయనీ భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, అక్కడ లోక క్షేమం కోసం హోమాలు జరుగుతుంటాయి. వెల్లూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్న అమృతి జూలాజికల్‌ పార్కులో మచ్చలజింక, మొసళ్లు, ముంగిస, ఎర్రమూతి చిలకలు, లిక్‌ బర్డ్స్‌, తాబేళ్లు, గుర్రాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుని ఆనందంగా వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.